శత్రుఘ్న సిన్హా రాయని డైరీ
- మాధవ్ శింగరాజు
రాజకీయాల్లో కలకాల స్నేహితులు ఉండకపోతే పోయేరు! ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా లేకుండా పోతారా? ఒక పార్టీలోని వారికి ఇంకో పార్టీలోని వాళ్లతో స్నేహ సంబంధాలు లేకుండా పోతాయా? శత్రుత్వానిదేముంది? చిన్న మాటన్నా పుట్టుకొస్తుంది. బీజేపీకి అలాగే కదా శత్రువునయ్యాను. పార్టీలో ఉంటూ పార్టీకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదని మావాళ్ల కంప్లైంట్! ‘వాజ్1పేయి కేబినెట్‌లో మినిస్టర్‌గా ఉన్నారు కదా, మోదీ కేబినెట్‌లో ఎందుకు లేరు?’ అని నా నియోజకవర్గం ప్రజలు అడిగినప్పుడు మోదీజీ గురించి ఒక్క మాటైనా నెగిటివ్‌గా మాట్లాడానా? అది రెస్పెక్ట్ ఇవ్వడం కాదా?! ముజఫర్‌పూర్‌లో ర్యాలీ పెట్టారు. మోదీజీ వచ్చారు. మాట్లాడారు. వెళ్లిపోయారు. నన్ను పిలవలేదు. పాట్నాలో ర్యాలీ పెట్టారు. అమిత్‌జీ వచ్చారు. మాట్లాడారు. వెళ్లిపోయారు. నన్ను పిలవలేదు. అప్పుడూ నేనేం మాట్లాడలేదే. అది రెస్పెక్ట్ ఇవ్వడం కాదా? బీజేపీలోంచి వెళ్లిపోతారట కదా, బీజేపీలోంచి వెళ్లగొడతారట కదా అని ఎవరెన్ని కూపీలు లాగినా... ‘మోదీజీనే నా లీడర్, బీజేపీనే నా పారీ’్ట అనే కదా చెప్పుకున్నాను.
అది రెస్పెక్ట్ ఇవ్వడం కాదా?!
కాంగ్రెస్ వాళ్లను సపోర్ట్ చెయ్యకూడదు. నితీశ్ కుమార్ ఇంటికి వెళ్లకూడదు. ఇదీ వీళ్లు నా నుంచి ఆశించే రెస్పెక్ట్! కరెక్టేనా? నితీశ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సీయెం అయ్యాక నా ఫ్రెండ్ కాలేదు. పీయెంకు ఆయనంటే పడదని తెలిసాక నా ఫ్రెండ్ కాలేదు. ఎప్పుడు పాట్నా వచ్చినా పండ్లబుట్టతో వెళ్లి కలుస్తాను. కాంగ్రెస్‌లో కూడా నితీశ్ లాంటి ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు. సభలోంచి వాళ్లు సస్పెండ్ అవడం నాకు సంతోషం కలిగించే సంగతి ఎలా అవుతుంది? ‘అలా జరిగుండాల్సింది కాదు’ అన్నాను. ప్రతాప్ రూడీ విరుచుకుపడ్డాడు. ‘సినిమా మనిషికేం తెలుసు పార్లమెంటు పాలిటిక్సు’ అన్నాడు. నేను సినిమా మనిషినా! చాన్సులు లేక రాలేదే. వయసైపోయాక రాలేదే. నా అంతట నేను రాలేదే. జేపీ నన్ను లాగారు. బీజేపీ నన్ను లాక్కుంది.
నితీశ్‌తో మూడు గంటలసేపు మాట్లాడ్డానికి ఏముంటుందని బీజేపీ అనుమానం! చాలా మాట్లాడుకున్నాం. కళల గురించి, కవిత్వం గురించి. నాతో పాటు నితీశ్ ఇంటికి వచ్చిన పవన్ వర్మ కొన్ని గాలిబ్ గీతాలు కూడా పాడాడు. ‘నేను నిజం ఎందుకు మాట్లాడతానంటే, అబద్ధం చెప్పడం రాదు కాబట్టి. అలాంటప్పుడు నిన్ను ప్రేమించడం లేదని ఎలా చెప్పగలను’ అంటాడట మీర్జా గాలిబ్! నేను బీజేపీలో ఉన్నంత మాత్రాన, బీజేపీలో లేని నితీశ్ నా స్నేహితుడు కాదని ఎలా చెప్పగలను?