అంతా ‘సొంత’ రాజకీయమే | Congress creates it's own divisional politics | Sakshi
Sakshi News home page

అంతా ‘సొంత’ రాజకీయమే

Published Tue, Aug 27 2013 12:26 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Congress creates it's own divisional politics

ఆంధ్రప్రదేశ్ ‘విభజన’ సమస్యను తనకు తానై సృష్టించుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి, దాని అధినాయకి, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆ సమస్య రోజుకొక తీరుగా ఏకుమేకై కూర్చుంటోంది! దారీతెన్నూ తెలియని కాలువలు ప్రవాహ వేగాన్ని మార్చుకుని వాగులు వంకలు, డొంకలు చూసుకున్నట్టుగానే ‘సమస్య’ పరిష్కా రానికి గాను తలాతోకాలేని ప్రతిపాదనలను ఆశ్రయిస్తోం ది! రాష్ట్ర సమస్యను ఓ ‘పాములబుట్ట’గా మార్చింది. మూడు ప్రాంతాల ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అభిప్రాయాలు తెలుసుకోకుండా, జనవాక్య సేకరణతో (ప్లెబిసైట్) నిమిత్తం లేకుండా గుప్పెడు మంది నాయకు లతో మంతనాలు జరిపి, కేవలం కాంగ్రెస్ పార్టీ అభిప్రా యంగా ఆ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయంగా తెలుగు జాతిని చీల్చడానికి సిద్ధమైంది.
 
 కేవలం ఎన్నికలు, ఓట్లు, సీట్ల మీదనే దృష్టి పెట్టి ప్రజల్ని విభజించి పాలించడానికి పార్టీ స్థాయిలో చేసిన నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటింపజేస్తే ఇతర ప్రధాన పార్టీలన్నీ కూడా ‘గుడ్డెద్దు చేలోపడినట్టు’ అవే ఎన్నికల ప్రయోజనాల కోసం తలకెత్తుకుని ఊరేగుతూ వచ్చాయి. ఈ లోపు పరిస్థితులు రాష్ట్ర వ్యాపితంగా చేయి దాటిపోతున్నందున కాంగ్రెస్ అధిష్టానం చిట్కాలకు దిగిం ది. ‘విభజన’ను రకరకాల రంగుల్లో ప్రజలకు చూపిం చడం ప్రారంభించింది. ఒకసారి రాష్ట్రాన్ని రెండుగా (ఆం ధ్ర, తెలంగాణ) చీల్చాలని, మరోసారి ‘రాయల-తెలం గాణ’ అనీ, ఇంకోసారి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్ని తెలంగాణకు జోడించాలనీ, మరొకసారి భద్రా చలం రాజధానిగా తెలంగాణలోని గిరిజన ప్రాంతాల న్నింటినీ కలిపి ‘మన్యసీమ’గా ఏర్పాటు చేస్తే ఎలా ఉం టుందనీ, అసలు అదీ ఇదీ కాదు రాష్ట్రాన్ని మూడు రాష్ట్రా లుగా (ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ) ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ‘తమాషా’ చూడాలనీ ఎవరో బయట వారు కాదు, ఆ పార్టీలోని వారి ద్వారానే ‘టుమ్రీలు’ జనంలోకి వదులుతూవచ్చింది!
 
 ఇంతకూ ఈ ‘సర్కస్’ అంతా  పేరుతో సోనియా ఎందుకు నడిపినట్టు? తెలుగుజాతిని చీల్చడం ద్వారా కేంద్రంలో తిరిగి కాంగ్రెస్‌ను అధికారం లోకి తేవాలన్నదే ఏకైక లక్ష్యమని ప్రజలకు అర్థమైపో యింది. ‘విభజన’ తంత్రాన్ని 2014 ఎన్నికల చివరికంటా ప్రయోగిస్తూ ఉండాలని నిర్ణయించుకున్న అధిష్టానం ముందు పార్టీ స్థాయిలో రక్షణమంత్రి ఆంటోనీ ఆధ్వర్యం లో ఒక కమిటీని వేసినట్టేవేసి, అంతలోనే దాన్ని వెనక్కి లాగింది. ఈ పరిస్థితుల్లో, రాష్ట్ర ‘విభజన’ సమస్యపై తానుగా కనబడకుండా ముఖం చాటేస్తూ వచ్చిన సోని యా ఉన్నట్టుండి మొట్టమొదటి సారిగా మూడు రోజుల నాడు ఢిల్లీలో నేషనల్ మీడియా సెంటర్‌ను ప్రారంభిస్తూ మరో కొత్త ప్రతిపాదన చేసింది. ‘ఆంటోనీ కమిటీ’ కేవలం కాంగ్రెస్ పార్టీపరంగా ఏర్పాటై నది మాత్రమేనని, కాని ఈ సారి ‘విభజన’ సమస్య పరిష్కారం కోసం సరాసరి ప్రభు త్వ కమిటీనే నియమిస్తామనీ ఆమె ప్రకటించారు!
 
 ఎందుకని? కాంగ్రెస్ అధిష్టానం కన్ను, సోనియా మనస్సూ తిరిగి తిరిగి రానున్న ఎన్నికల్లో దక్కించుకోగల లోక్‌సభ స్థానాల మీదనే లగ్నమై ఉంది. కాగా, వివిధ సర్వేక్షణల ప్రకారం తక్షణమే ఎన్నికలు నిర్వహించే పక్షం లో, తెలుగుజాతిని చీల్చు-చీల్చకపో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో రాగల మొత్తం లోక్‌సభ సీట్లు 7 లేదా 8 సంఖ్య దాటబో వనీ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడబోతోందని అంచనాలు వేశాయి! ఆ క్షణం నుంచి కాంగ్రెస్ అధిష్టానం చావు తెలివితేటలతో వ్యూహాన్ని మార్చి ‘ప్రభుత్వ కమిటీ’ పేర ‘కొత్తసీసాలో పాత సారా’ ను నింపి తీవ్ర అనిశ్చిత పరిస్థితులలో ఆందోళనలో ఉన్న రాష్ట్ర ప్రజల గొంతు తడపాలనే ప్రయత్నంలో ఉంది! ఆ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ పనికిమాలిన ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రజల్ని మరింత గందరగోళంలోకి నెట్టారు!
 ఎందుకీ తప్పుడు ‘విన్యాసాలు’? మళ్లీ అదే సమా ధానం - కిశోర్‌దేవ్ మాటల్లోనే చెప్పాలంటే రాష్ట్రాన్ని ముక్కలుచేసి, మూడు వేర్వేరు రాష్ట్రాలుగా (ఆంధ్ర, తెలం గాణ, రాయలసీమ) చేయడంవల్ల ఆంధ్రలో 17, తెలం గాణలో 17, రాయలసీమలో 8 లోక్‌సభ స్థానాలుగా విభ జితమై ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ ‘లబ్ధి’ పొందవచ్చు! ‘విభజన’ ప్రతిపాదనలో ఆదినుంచీ సమస్యను ఆ కోణం నుంచే అధిష్టానం ‘బుర్ర’లు కరిగించుకుంటోందే తప్ప తెలుగుజాతి  ఐక్యతను, గత ఘనకీర్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. వేల ఏళ్ల చరిత్ర కలిగి ఏక భాషా సంస్కృతులతో దీపించే తెలుగుజాతి భావిభాగ్యోన్నతి ప్రయోజనాలను పణంగా పెడుతోంది. విభజించి పాలిం చే కాంగ్రెస్ నీతికి ఈ తంతు అద్దంపడుతోంది.
 
 రాష్ట్ర సంక్షోభానికి నిందించాల్సిన అధిష్టానవర్గ కూట రాజకీ యాన్ని పక్కన పెట్టి కిశోర్‌చంద్రదేవ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య క్షుడు బొత్స, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీద విరు చుకుపడ్డారు. సందేహం లేదు, సమస్యను నానబెట్టడం లోనూ, సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా రహస్యంగా దాచి ఉంచడంలోనూ ఈ ఇరువురూ బాధ్యు లే. కానీ కిశోర్‌చంద్రదేవ్ కూడా అదే పనిచేశారు. వంది మాగధతత్వం, విధేయత వ్యక్తిగతస్థాయిలో పార్టీ వరకే పరిమితమైతే తప్పులేదు, కానీ ప్రజాబాహుళ్యం విశాల ప్రయోజనాలను, తెలుగుజాతి ఔన్నత్యాన్నీ దెబ్బతీసి కించపరుస్తున్న విషమ ఘడియలలో కూడా పదవులకు అంటకాగే మనస్తత్వం క్షమార్హం కాదు. యూపీ, మధ్య ప్రదేశ్‌ల తరువాత కేంద్రంలో ప్రభుత్వాల మనుగడకు మెజారిటీ సభ్యులను పంపించే ఏకైక దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే! 2004లోనూ, 2009లోనూ ఆ గౌర వాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి అప్పనంగా దక్కించిపెట్టిన పెద్ద రాష్ట్రం మనదే! రేపు పొరపాటున 2014లో కేంద్రం లో అధికారంలోకి రావాలన్నా కాంగ్రెస్ అధిష్టానానికి ఈ రాష్ట్రమే గతి. అయితే తెలుగుజాతి విభజనకు కాంగ్రెస్ పాల్పడేపక్షంలో అది ‘దింపుడు కల్లం’ ఆశే!
 
 కేంద్రంలో పాలకపక్షాల మనుగడకు సంఖ్యా పరంగా కీలకమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లు కనుకనే ఇప్పటిదాకా కాంగ్రెస్, బీజేపీ ఆ రెండు రాష్ట్రా లపైనే ఆశలు పెట్టుకుంటూ, ఆ రాష్ట్రాల ప్రజల ప్రయోజ నాలతో జూదమాడుతూవచ్చాయి. ఎవరి స్థానాలకు ఎసరువచ్చినా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు లేదా ప్రతి పక్షాలు సహకరించని ప్రతిసారీ ఢిల్లీలో చక్రం తిప్పే పాలక పక్షాలు ఆ రాష్ట్రాలను విభజించి, నియోజకవర్గాల పున ర్వ్యవస్థీకరణకు కూడా పాల్పడుతుంటాయి. అటుమొన్న యూపీలో మాయావతి ముఖ్యమంత్రిగా చేసిన పనీ అదే. నాలుగు రాష్ట్రాల కింద విడగొట్టేయడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి తూట్లుపొడవడం ఆమె లక్ష్యం! అలాగే మధ్యప్రదేశ్‌లో బీహార్‌లో, యూపీలో పాగావేయ డం ద్వారా కేంద్రంలో తన పాలనను సుస్థిరం చేసుకోవ డానికి బీజేపీ-ఎన్డీయే పరివార్ ప్రభుత్వం ఆ మూడు రాష్ట్రాలనూ చీల్చి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లను ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించి అవినీతిపరుల్ని అందలమె క్కించి అభాసుపాలవుతూవచ్చింది. ఇప్పుడు ఆ మూడు ప్రత్యేక రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఏం చెబుతున్నారు?
 
 రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న రాష్ట్రాలుగా విడ గొట్టరాదని ఒకరూ (రమణ్‌సింగ్), ఆర్థికంగా సౌష్టవంగా ఉం డి, కేంద్ర ప్రభుత్వంపైన ఆధారపడకుండా ఉండగల స్థితిలో ఉండాలని మరొకరూ (విజయ్ బహుగుణ) పద మూడేళ్ల తర్వాత కూడా తమ జార్ఖండ్ రాష్ట్ర ప్రజలు అభి వృద్ధి ఫలాలకు దూరంగానే ఉండిపోయారని ఇంకొకరూ (హేమంత్ సొరేన్) బాహాటంగానే ప్రకటిస్తున్నారు!!  విచిత్రమేమిటంటే తెలుగుజాతిని చీల్చడానికి ఒకరికి మిం చి ఒకరు పోటాపోటీల మీద అధిష్టానం తరఫున కాలు దువ్విన ముగ్గురూ... గులామ్ నబీ అజాద్, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ తమ సొంత రాష్ట్రాలైన కాశ్మీర్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ప్రజల నుంచి దూరమై ‘ఛీ’ కొట్టించుకున్న వాళ్లే!
 
 ఈ అనూహ్య పరిణామాలకు మూలమేమిటో కేంద్ర ప్రభుత్వ విదేశాంగశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన టి.ఎన్.కౌల్ ఇలా వివరించారు. ‘స్వతంత్ర భారతదేశం ఉత్తరప్రదేశ్‌ను కనీసం మూడు రాష్ట్రాలుగా విభజించకుం డా ఒక్క రాష్ట్రంగానే అట్టిపెట్టవలసి వచ్చింది? అంటే, ఉత్తరాన కొండ ప్రాంతాలను, తూర్పు ప్రాంతాన్ని (అవథ్), పశ్చిమ భాగాన్ని (పాత ఆగ్రా రాష్ట్రం) ఎందుకు యూపీ నుంచి వేరు చేయలేదు? జనాభా పెరుగుతోంది, ప్రజల్లో రాజకీయ చైతన్యమూ పెరుగుతోంది, ప్రజా స్వామ్య వ్యవస్థ రూపొందుతోంది, అలాగే అభివృద్ధి కార్య క్రమాలూ అమలులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పరి పాలనా సౌలభ్యం దృష్ట్యా యూపీని అలా విడగొట్టేయ వచ్చుగదా? కాని ఆ నాడు కాంగ్రెస్ పాలకులు రాజకీయ కారణాల వల్లనే విడగొట్టలేదు!
 
 ఎందుకని? లోక్‌సభలోని 543 సీట్లలో అత్యధిక సీట్లు (84) ఉన్న రాష్ట్రం యూపీ ఒక్కటే! అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులోనూ, ప్రధాన మంత్రి ఎంపికలోనూ ఈ సంఖ్య కీలకమవుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రధాను లుగా ఉన్న ముగ్గురూ - నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ - ఉత్తర ప్రదేశ్ వారే. దేశం స్వాతంత్య్రం పొందకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 1956లో ప్రధానంగా భాషా ప్రాతిపదికపైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ పరిస్థితుల్లో, మద్రాస్, బొంబాయి, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా యూపీని కూడా విభజించాలన్న పట్టుదల లేకపోవడానికి కారణం - మొత్తం యూపీ ప్రజలు హిందీ లోనే మాట్లాడతారు. కాబట్టి రాష్ట్రాన్ని విభజించాలనే డిమాండ్ లేదు. పరి పాలనా సౌలభ్యం ప్రాతిపదికపైన యూపీని ముక్కలు చేస్తే, వేర్పాటువాదం వ్యాప్తి చెంది పాలనా సౌలభ్యం పేరిట బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో కూడా ప్రత్యేక రాష్ర్ట వేర్పాటు కోర్కెలు మొలకెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాలు సంకోచించాయి. యూపీ అంటే ఏమిటని ప్రశ్నించే వారికి రాష్ట్రాల పునర్వ్య వస్థీకరణ కమిషన్ సభ్యులలో ఒకరైన కె.ఎం. ఫణిక్కర్ వ్యంగ్యంగా ‘ఇండియా అంటే భారత్, భారత్ అంటే యూపీ’ అన్నారు! ఆ మాట ఇప్పటికీ రాజకీయ వర్గాల బుర్రల్ని ఏలుతూనే ఉంది. ‘ప్రజాసేవ’ పేర ఆ ప్రజలకే తలపెట్టే ద్రోహం నుంచి నాయకులు విముక్తమైతే తప్ప ప్రజలకు సుఖశాంతులు కల్ల! ‘ప్రాచ్య ఖండపు ఇటలీ భాష’గా (ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్) ప్రపంచ ఖ్యాతి కెక్కిన తెలుగు భాషను, తెలుగుజాతినీ మన ఇటాలియన్ కోడలమ్మ అనాలోచిత నిర్ణయాలతో న్యూనపరచదనే విశ్వసిద్దాం!!  

ఏబీకే ప్రసాద్

సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement