అధికారమిస్తే ఏడాదిలో పరిష్కరిస్తా!
- రాష్ట్ర విభజనపై చంద్రబాబు
- విభజనపై ఎలాంటి టర్నింగ్ తీసుకోలేదు
- సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటా
- రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే విభజన
- సోనియా కుట్రను తెలుగుజాతి యావత్తూ తిప్పికొట్టాలి
సాక్షి, గుంటూరు: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను... రాష్ట్రప్రజల గురించి నాకంతా తెలుసు... ఒక్క ఏడాది నాకు అధికారమిస్తే, అన్నిప్రాంతాల సమస్యల్ని పరిష్కరిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. ‘విభజన’ అంశంపై తాను ఇప్పటికీ ఎటువంటి టర్నింగ్ తీసుకోలేదంటూనే సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటానని తెలిపారు. తెలుగు ఆత్మగౌరవయాత్రలో భాగంగా ఆయన సోమవారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల బస నుంచి రెండోరోజు బస్సుయాత్రను ప్రారంభించారు. కొండమోడు, పెదనెమలిపురి, శ్రీనివాసనగర్, త్రిపురాపురం మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు, చల్లగుండ్ల, చీమలమర్రి, కండ్లకుంట గ్రామాల్లో పర్యటించారు. ఇటలీ వనిత సోనియా తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ సోనియా ఆటలో భాగమయ్యాయని ధ్వజమెత్తారు.
ప్రధాని మన్మోహన్‌సింగ్ రబ్బర్‌స్టాంప్‌గా తయారయ్యారని.. వ్యక్తిత్వం కోల్పోయిన ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నందునే ‘విభజన’ అంశాన్ని తెరమీదికి తెచ్చారని చెప్పారు. పప్పుసుద్ద రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు ఓట్లు, సీట్లు రాబట్టేందుకే సోనియా తంటాలు పడుతోందని విమర్శించారు. ఈ వ్యూహంలో భాగంగానే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పావుగా మార్చుకుందని చెప్పారు. ఆ వసూళ్లరాయుడు ఎప్పుడూ ఫామ్‌హౌస్‌లోనే ఉండి ఈ రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేయాలని కుట్ర, కుతంత్రాలు పన్నుతుంటాడని విమర్శించారు.
సోనియా కుట్రను తెలుగుజాతి యావత్తూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆనాడు దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీపెట్టి ఇందిర మెడలు వంచిన సంగతిని చరిత్ర చ దివి తెలుసుకోవాలన్నారు. ‘విభజన’ అంశంపై తాను ఇప్పటికీ ఎటువంటి టర్నింగ్ తీసుకోలేదని మరోమారు స్పష్టంచేశారు. కానీ సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీనిచ్చారు. రెండో రోజు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోవడంతో చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరంలోనే ఉండిపోవడం గమనార్హం.
రెడ్డిగూడెంలో బాబుకు సమైక్య సెగ
టీడీపీ అధినేత చంద్రబాబుకు సమైక్య సెగ మొదలైంది. ఆయన సోమవారం రాత్రి రెడ్డిగూడెంలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు యువకులు ముందుకు దూసుకువచ్చి సమైక్యవాదానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. బాబు వ్యక్తిగత సిబ్బంది, రక్షణ వలయాన్ని దాటుకుంటూ బస్ వద్దకు చేరుకుని... సమైక్యవాదం వర్ధిల్లాలి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు ‘ఎవడ్రా మీకు ప్లకార్డులు ఇచ్చి పంపింది?’ అంటూ దుర్భాషలాడారు. వారిపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగింపజేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపివేసి సత్తెనపల్లికి వెళ్లిపోయారు.