-
చంద్రబాబు లేఖ వల్లే విభజనకు కాంగ్రెస్ సాహసం: షర్మిల
-
పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి ఇంకా ఏ మొహం పెట్టుకొని యాత్ర చేస్తున్నారు చంద్రబాబు?
-
నాడు ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు.. మొన్న ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో రైతులు, చిన్న వర్తకులకు వెన్నుపోటు..
-
ఇప్పుడు తాను పుట్టిన తెలుగుగడ్డకు, తెలుగుతల్లికి కూడా వెన్నుపోటు పొడిచారు
-
బాబు లేఖ వెనక్కు తీసుకొని, రాజీనామాలు చేసే దాకా సీమాంధ్రలో అడుగుపెట్టనీయకండి
-
ఓట్లు, సీట్ల కోసం, రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసమే కాంగ్రెస్ విభజనకు పూనుకొంది
-
టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు సరేనని చెబితే.. వైఎస్‌ఆర్‌సీపీ, ఎంఐఎం, సీపీఎం ఎన్నడూ అనుకూలమని చెప్పలేదు..
‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన పాపాలు చాలవన్నట్లు.. ఇప్పుడు విభజన పేరుతో అన్నదమ్ముల మధ్యే అగ్గిపెట్టి, ఆ అగ్గిలో చలి కాచుకుంటోంది. ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్‌ఎస్‌ను తమలో కలుపుకొనైనా సరే రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం కాంగ్రెస్ కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకొంది. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా.. మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో మటుకు ఏ చలనమూ లేదు. ఎలా ఉంటుంది? అసలు తెలంగాణ ఇచ్చేసుకోండి అంటూ ఒక బ్లాంక్ చెక్కు మీద సంతకం పెట్టినట్లు తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసిచ్చేసింది చంద్రబాబే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించే సాహసం చేస్తోందీ అంటే చంద్రబాబు ఆ విభజనకు పలికిన మద్దతే కారణం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు.
పట్టపగలే సీమాంధ్రుల గొంతుకోసి ఇంకా ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెట్టారని ప్రజలంతా నిలదీయాల్సిన అవసరముందన్నారు. ‘‘తెలంగాణకు అనుకూలంగా నువ్వు లేఖను ఎందుకిచ్చావు? ఎవర్నడిగి ఇచ్చావు?’ అని చంద్రబాబును ప్రజలంతా నిలదీయాలి. తను రాజీనామా చేసి.. తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించేవరకు, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకునే వరకు, తప్పయిపోయింది అని ఆయన చెంపలేసుకొనేవరకు ఆయన సీమాంధ్రలో అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబును ప్రజలంతా తరిమి తరిమి కొట్టాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదు కాబట్టి.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఆరో రోజు శనివారం వైఎస్సార్ జిల్లాలో సాగింది. మైదుకూరు, బద్వేలులలో నిర్వహించిన బహిరంగ సభలకు పోటెత్తిన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సభల్లో షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
వెన్నుపోటు చంద్రబాబు..
‘‘గతంలో ఎఫ్‌డీఐ ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి నిస్సిగ్గుగా తన ఎంపీలను గైర్హాజరు పరిచి కోట్ల మంది రైతులకు, కోట్ల మంది చిన్న వర్తకులకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏకంగా రూ.32 వేల కోట్ల భారాన్ని కరెంటు చార్జీల రూపంలో ప్రజల నెత్తిన వేస్తే.. అందుకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలూ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాయి. ఒక్క చంద్రబాబు మటుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్ జారీచేసి ఆ ప్రభుత్వాన్ని కాపాడి మరీ కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఒకప్పుడు సొంత మామకు వెన్నుపోటు పొడిచారు.. తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు తాను పుట్టిన తెలుగు గడ్డకు, తెలుగుతల్లికి కూడా వెన్నుపోటు పొడిచారు. పార్లమెంటు ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి కూడా వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. ఈయన్ను నారా చంద్రబాబు అనాలా? లేక వెన్నుపోటు చంద్రబాబు అనాలా?
ఆ చేతగాని అబ్బాయి కోసమే చంద్రబాబు యత్నాలు..
ఈ వెన్నుపోటు చంద్రబాబుకు ఒక తరంగాని(చేతగాని) అబ్బాయి ఉన్నాడు. చంద్రబాబు ఏం చేసినా తన అబ్బాయి కోసమే చేస్తారు.. అందుకే ఆయన ఇతరుల అబ్బాయిల గురించి మాట్లాడుతుంటారు. ఆ తరంగాని అబ్బాయిని ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వారసుడిగా చేయడానికి ఎన్‌టీఆర్ సొంత కొడుకుల్ని కూడా చంద్రబాబు తొక్కి పెడుతున్నారు. పార్టీలో ఎవరు పైకి వచ్చినా బాబు ఓర్వలేరు.. ఎన్‌టీఆర్ కొడుకుల్లో ఏ ఒక్కరికీ పార్టీలో పెద్ద స్థానాన్ని ఇచ్చేందుకు ఇష్టపడరు. చంద్రబాబు దృష్టిలో లోక కల్యాణం అంటే.. లోకేశ్ కల్యాణం అని అర్థం. ఈ చంద్రబాబు అంటారు.. హైదరాబాద్ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందీ అంటే అది తన వల్లేనట. ఆయన హైదరాబాద్‌ను సింగపూర్‌లా మార్చేశారట. చార్మినార్‌ను కట్టింది కూడా మీరేనా చంద్రబాబూ? హుస్సేన్ సాగర్‌ను వేయించింది కూడా మీరేనా? 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు మొత్తం తానే చేశానని చెప్పుకొంటున్నారంటే.. ఈయన దృష్టిలో ప్రజలు మనుషులు కారు.. గొర్రెలని అర్థమా? లేక ప్రజలు మనుషులేగాని పిచ్చివాళ్లని అభిప్రాయమా?
హైదరాబాద్‌కు మీరేం చేశారో ప్రజలకు తెలుసు..
అసలు హైదరాబాద్‌కు ఆయన ఏం చేశారో.. ఆయనకు హైదరాబాద్ ఏం చేసిందో ప్రజలకు గుర్తులేదని అనుకుంటున్నారు చంద్రబాబు. ఈయన తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని తన బినామీలకు రాసిచ్చేసుకున్నారు. తన భార్య స్థలాన్నేమో కోట్ల రూపాయలకు అమ్ముకున్న ఆయన.. ప్రభుత్వ స్థలాలనేమో.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కారుచౌకగా రాసిచ్చేశారు. ఒకే ఒక్క ఉదాహరణ చెబుతా.. ఐఎంజీ అనే తన బినామీ కంపెనీకి, కేవలం రూ.లక్షతో ఏర్పాటైన ఆ కంపెనీకి, అది ఏర్పాటైన మూడు రోజుల్లోనే.. హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాల భూముల్ని రాసిచ్చేశారు చంద్రబాబు. ఆ రోజుల్లోనే అది రూ.2,500 కోట్ల విలువ చేసే భూమి. ఈ రోజు అది 10 వేల కోట్ల కంటే ఎక్కువే చేస్తుంది. దాన్ని ఆయన రూ.3.5 కోట్లకు తన బినామీ సంస్థకు రాసిచ్చేశారు. ఈ రోజు బాబు హైదరాబాద్ మీద తనకే హక్కు ఉందంటున్నారు.. ఆ హక్కుతోనే రూ.4 లక్షల కోట్లకు రాజధానిని తెలంగాణకు అమ్మకానికి పెట్టేశారు.
పోలవరానికి నీళ్లెక్కడి నుంచి తెస్తారు?
ఏ పరిష్కారమూ చూపకుండా హఠాత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని విడగొడుతుందని సంకేతాలు అందగానే వైఎస్సార్ సీపీకి చెందిన అంత మంది నాయకులు ఒకేసారి తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తరువాత జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ రాజీనామా చేశారు. నిరాహార దీక్షలు చేశారు. లేఖలు రాసి ఈ రోజు వరకు ప్రజల మధ్య నిలబడి పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మటుకు గురకపెట్టి నిద్రపోతున్నారు. టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని కేంద్రానికి చెబితే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎం ఏనాడూ అనుకూలమని చెప్పలేదు. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు కృష్ణా నీళ్లను కిందకు వదలని పరిస్థితి చూస్తున్నాం. ఇప్పడు రాష్టాన్ని అడ్డగోలుగా విభజించేస్తే.. మధ్యలో వచ్చిన రాష్ట్రం కృష్ణా నీళ్లను అడ్డుకుంటే.. కింద ఉన్న ప్రాంతం మహా ఎడారి అయిపోదా? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇస్తామంటున్నారు... కానీ పోలవరం ప్రాజెక్టుకు, గోదావరికి మధ్య ఇంకో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే ఆ ప్రాజెక్టును ఏ నీళ్లతో నింపుతారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గోదావరి నీళ్లను కృష్ణా జలాలతో కలిపి వైఎస్సార్ రాయలసీమను సస్యశ్యామలం చేయాలనుకున్నారు. గోదావరి, కృష్ణా నీళ్లను ఒక రాష్ట్రమొచ్చి అడ్డుకుంటే సీమాంధ్ర ఎడారై పోదా? పదేళ్లలో కొత్త రాజధానిని నిర్మించుకోమంటున్నారు.. అభివృద్ధి చేయడానికి అరవయ్యేళ్లు పట్టిన హైదరాబాద్ లాంటి రాజధానిని పదేళ్లలో నిర్మించుకోవడం సాధ్యమా?’’
శనివారం షర్మిల వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ సురేశ్‌బాబు, కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, డీసీ గోవిందరెడ్డి, స్థానిక నాయకులు దేవిరెడ్డి శివశంక ర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, ఆర్. ప్రసాదరెడ్డి, మల్లికార్జునరెడ్డి, అంజద్ బాషా తదితరులున్నారు.
నేడు నెల్లూరు జిల్లాలో యాత్ర
షర్మిల బస్సు యాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉదయం ఆత్మకూరు, సాయంత్రం కావలి సభల్లో షర్మిల ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బుచ్చిరెడ్డిపాలెంలో కొద్ది సేపు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.