ఆంటోనీ డ్రామా కమిటీ! | AK Antony Committee Drama: Charmila | Sakshi
Sakshi News home page

ఆంటోనీ డ్రామా కమిటీ!

Published Mon, Sep 9 2013 2:25 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

ఆంటోనీ డ్రామా కమిటీ! - Sakshi

ఆంటోనీ డ్రామా కమిటీ!

  • విభజనను కాంగ్రెస్ సొంత వ్యవహారంలా చూస్తోంది: షర్మిల
  •  ఆంటోనీ కమిటీలో తెలుగువారే లేరు.. అలాంటప్పుడు తెలుగువారి మనోభావాలు ఆ కమిటీకెలా తెలుస్తాయి?
  •  ఆ కమిటీతో సంబంధం లేకుండానే విభజన బిల్లు తయారైపోతోంది
  •  సాక్షాత్తూ హోం మంత్రి షిండేనే ఈ మాట చెప్పారు
  •  అంటే ఈ ఆంటోనీ కమిటీ ఓ పెద్ద డ్రామా కమిటీ అన్నమాట.. అందులో సీఎం, బొత్స, మంత్రులు క్యారెక్టర్ లేని యాక్టర్లు
  •  టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడే సీమాంధ్రులపై దాడులు చేస్తున్నారు
  •  ఇక విభజనంటూ జరిగితే హైదరాబాద్‌లో బతకనిస్తారా?
  •  ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ విభజనకు యత్నిస్తుంటే చంద్రబాబు వంతపాడుతున్నారు.. బాబు తన లేఖను వెనక్కు తీసుకుని రాజీనామాలు చేసేదాకా ప్రజలంతా నిలదీయండి
  •  టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు సై అంటున్నాయి
  •  వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం మాత్రమే సమైక్యంగా ఉండాలంటున్నాయి
  •  
     ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనను కాంగ్రెస్ సొంత వ్యవహారంలా భావిస్తోందని, సొంత పార్టీ నేతలతో ఆంటోనీ కమిటీ వేసి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘ఇక్కడ రాష్ట్రమంతా అట్టుడికిపోతుంటే, కోట్ల మంది గుండెలు రగిలిపోతుంటే.. అదేదో తమ సొంతపార్టీ వ్యవహారమన్నట్లు ఒక సొంత పార్టీ కమిటీని వేసింది కాంగ్రెస్. దాని పేరు ఆంటోనీ కమిటీ. ఆ కమిటీలో కేరళకు చెందిన ఆంటోనీ ఉన్నారు. కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీ ఉన్నారు. తమిళనాడుకు చెందిన చిదంబరం ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. 
     
     గుజరాత్‌కు చెందిన అహ్మద్ పటేల్ ఉన్నారు. కానీ ఈ కమిటీలో ఒక్క తెలుగువాడూ లేడు. తెలుగుజాతి గురించి తెలిసినవాడే లేడు. వీళ్లంతా తెలుగువాళ్ల మనోభావాలను అర్థం చేసుకుంటారా?’’ అని షర్మిల నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నడిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఏడో రోజు ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగింది. జిల్లాలో ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, కావలి సభలకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. రాష్ట్రంలో టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని ప్రకటిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
     
     వీళ్లంతా ఓవరాక్షన్ చేసే యాక్టర్లు..
     ‘‘సరే ఆంటోనీ కమిటీ అంతా ఒక తోలుబొమ్మ ఆట అనుకుందాం. ఈ కమిటీకి సంబంధం లేకుండా విభజన బిల్లు తయారైపోతోందని, కేబినెట్ ఆమోదం కూడా పొదుతుందని స్వయంగా హోం మంత్రి షిండే చెబుతున్నారు. అంటే ఈ కమిటీ ఒక పెద్ద డ్రామా అన్నమాట. ఈ కమిటీ అభిప్రాయలు సేకరించడం ఒక పెద్ద డ్రామా, వాటిని పరిశీలించడం ఒక పెద్ద డ్రామా.. పరిశీలించి ఒక నివేదిక తయారు చేయడమన్నది ఇంకా పెద్ద డ్రామా. ఈ డ్రామాలో మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఓవరాక్షన్ చేసే యాక్టర్లన్నమాట. ‘మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరిగినా ఫరవాలేదు.. మా పదవులు మాకుంటే చాల’నే క్యారెక్టర్‌లేని యాక్టర్లు వీళ్లంతా.
     
     చంద్రబాబు వల్లే విభజన..
     మన రాష్ట్రంలో 8 కోట్ల మంది ఉంటే.. అందులో 5 కోట్ల మంది సీమాంధ్రులే. ఇంత మందికి అన్యాయం జరుగుతుంటే.. కాంగ్రెస్ పార్టీ కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో మటుకు చలనం లేదు. అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు. తెలంగాణ ఇచ్చేయండి అని.. ఒక బ్లాంక్ చెక్‌లా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు చంద్రబాబు.. అసలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందీ అంటే దానికి కారణం చంద్రబాబు ఇచ్చిన మద్దతే. పట్టపగలే సీమాంధ్రుల గొంతుకోసి ఇంకా ఏ మొహం పెట్టుకుని యాత్రలు చేస్తున్నారని చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. ఇప్పటికీ ఎందుకు రాజీనామాలు చేయలేదని, ఎందుకు లేఖ వెనక్కు తీసుకోలేదని నిలదీయాలి.
     
     కాంగ్రెస్, టీడీపీ క్షమించలేని పాపం చేస్తున్నాయి..
     మన ఖర్మ ఏమిటంటే..  ఓట్ల కోసం, సీట్ల కోసం, తెలంగాణను తామే ఇచ్చామన్న క్రెడిట్ కోసం.. కాంగ్రెస్ పార్టీ కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తుంటే.. మరోవైపు కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని నోరు విప్పడం లేదు చంద్రబాబు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి, నాశనం చేయడానికి వెనుకాడడం లేదు. ఇద్దరూ కలిసి క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు.
     
     వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే.. వీరూ చేసుంటే...
     హఠాత్తుగా ఏ పరిష్కారమూ చూపించకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నామని సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన అంత మంది ఎమ్మెల్యేలు, అంత మంది నాయకులూ రాజీనామాలు చేసి తమ నిరసన తెలియజేశారు. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాజీనామాలు చేసి.. నిరాహార దీక్షలు చేశారు.. ఇది అన్యాయం.. రాష్ట్రాన్ని విడగొట్టొద్దంటూ లేఖలు రాస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసినప్పుడే అందరూ రాజీనామాలు చేసి ఉంటే దేశమంతా ఇటు తిరిగిచూసేది.. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. ఈ విభజన ప్రక్రియ నిలిచిపోయేది.
     
     ఈ కాంగ్రెస్ నాయకులకు పదవులే ముఖ్యం..: కానీ పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకటే మాట చెప్పింది.. ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఒక తండ్రిలా ఆలోచన చేయాలి.. ఆ ఆలోచన మీద మీ ఉద్దేశం ఏమిటో చెప్పండంటూ అందర్నీ పిలిచి చర్చలు జరపండి అని పదే పదే కోరింది. పదేపదే లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి.. వ్యవహరించింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ చెబుతోంది.. మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తోంది. అప్పటిదాకా జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిలబడి ఎందాకైనా పోరాటం చేస్తుందని ప్రజలకు మాటిస్తున్నాం.’’
     
     విభజిస్తే.. టీఆర్‌ఎస్ నేతలు పాస్‌పోర్టులు అడగరా?
     టీఆర్‌ఎస్ నాయకులు మొన్న మానవహారంగా ఏర్పాటు కావాలనుకున్న లాయర్లపై సాక్షాత్తూ హైకోర్టులోనే దాడి చేశారు. నిన్న ఎన్‌జీవోలు సమైక్యవాదాన్ని వినిపించడానికి సభ నిర్వహించుకుని వెనక్కు వస్తుంటే.. వాళ్ల మీదా ఈ నాయకులు దాడిచేశారు. సీమాంధ్రులు వాళ్ల గొంతువిప్పి.. మాకు అన్యాయం జరుగుతోందీ అని చెప్పాలనుకుంటుంటే.. పాపం విభజన జరక్కముందే వాళ్ల మీదా ఈ టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేయిస్తున్నారు. ఇక విభజన జరిగాక.. మాకు అన్యాయం జరుగుతోందీ అని.. వారు గొంతు విప్పితే.. ఈ నాయకులు వారి మీద కేసులు పెట్టరా? వారిని జైల్లో పెట్టరా? విభజన జరక్కముందే సీమాంధ్రులను ద్వితీయ శ్రేణి పౌరుల్లా(సెకండ్ క్లాస్ సిటిజన్స్‌లా) చూస్తున్నారే.. ఇక విభజన జరిగితే.. సీమాంధ్రులను టీఆర్‌ఎస్ నాయకులు పరదేశీయుల్లా చూడరా? హైదరాబాద్ రావాలంటే.. మా పర్మిషన్లు ఉండాలి.. మీరు పాస్‌పోర్టులు తీసుకొని రావాలి అని ఈ నాయకులు ఆంక్షలు పెట్టరా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజల ఆస్తులను లాగేసుకుంటామని టీఆర్‌ఎస్ నాయకులు అనడం వాస్తవం కాదా? సీమాంధ్ర ఉద్యోగస్తులను వెళ్లగొడతామని ఈ నాయకులు అనడం వాస్తవం కాదా? విభజన జరగకముందే వీరి మాటలు, వీరి వైఖరి ఇలా ఉంటే.. ఇక విభజన జరిగిన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్‌లో బతకడం అంటే.. భారతీయుడు పాకిస్థాన్‌లో బతికినంత కష్టమైపోదా?’’.
     
     నేడు యాత్రకు విరామం
     వినాయక చవితి సందర్భంగా షర్మిల యాత్రకు సోమవారం రోజు విరామం ఇస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. తిరిగి మంగళవారం యాత్ర పునఃప్రారంభమవుతుందని, అదే రోజు యాత్ర ప్రకాశంలో జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు.
     
     వీళ్లంతా రాజీనామాచేస్తేగాని విభజన ఆగదు..
     పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ నాయకులంతా ఎప్పుడు మేలుకుంటారో.. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ రాజీనామా చేస్తే తప్ప ఈ విభజన ఆగదని ఎప్పుడు అర్థం చేసుకుంటారో.. ఏమిటి మనకీ ఖర్మ! వీళ్లు పాలకులా లేక రాక్షసులా? పచ్చిగా ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక జాతినే చీల్చేస్తారా? ఒక్క ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక.. ఒక్క పాలనలో ప్రజలిచ్చే తీర్పును వినే ధైర్యం లేక ఒక కుటుంబంలోనే చిచ్చు పెడతారా? దానికి చంద్రబాబులాంటి దుర్మార్గులు మద్దతిస్తారా? ఏమిటీ అన్యాయం.. ఏమిటి మన రాష్ట్రానికి ఈ ఖర్మ? టీడీపీ అయితేనేమి, చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలైతేనేమి, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలైతేనేమి.. అసలు వీళ్లందరూ మనుషులేనా? లేక మానవ జాతికి మాయని మచ్చలా?
     - షర్మిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement