రిటైర్డ్ ఉద్యోగుల మీద ఎందుకీ వివక్ష? | discrimination on retired employees | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ ఉద్యోగుల మీద ఎందుకీ వివక్ష?

Published Thu, Jul 23 2015 12:08 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

discrimination on retired employees

ఆరు దశాబ్దాల కృషితో ఏర్పడింది ప్రత్యేక తెలంగాణ. ఇందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, రైతులు తమ వంతు కృషి చేశారు. రెండున్నర లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఈ ఉద్యమంలో భుజం భుజం కలిపారు. ఇందుకు వీరు ఎంతో ఆనందిస్తున్నారు. బంగారు తెలంగాణలో మిగిలిన అన్ని వర్గాలతో పాటు పదవీ విరమణ చేసిన వారి ఆకాంక్షలు కూడా నెరవేరతాయని ఆశించారు. కొన్ని వర్గాల ఉద్యోగులు, వర్గాల వారి కలలు నెరవేరాయి కూడా. కానీ రెండున్నర లక్షల మంది విశ్రాంత ఉద్యోగుల పట్ల మాత్రం కె. చంద్రశేఖరరావు ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించకపోవడం వీరిని హతాశులను చేసింది.

పదవీ విరమణ చేసిన నాటికి ఉద్యోగి తీసుకుంటున్న వేతనంలో సగం పింఛనుగా చెల్లించే విషయం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో మొదలైన వివాదం నేటికీ కొనసాగడం విశ్రాంత ఉద్యోగులను మరింత కుంగదీస్తోంది. మే 25, 1998 తరువాత పదవీ విరమణ చేసిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ తేదీకి ముందు పదవీ విరమణ చేసిన వారికీ ఆ నిబంధన వర్తింపచేయాలని పదవీ విరమణ ఉద్యోగులు కోరుతున్నారు. దీనిని కూడా అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. తరువాత విశ్రాంత ఉద్యోగులు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళితే, వీరి డిమాండ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం మళ్లీ ఈ తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పునే సమర్థించింది.

కానీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2004లో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్ల తరువాత 2014 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. అప్పటికే విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో గవర్నర్‌కు రిటైర్డ్ ఉద్యోగులు ఈ అంశం గురించి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుప్రీం తీర్పును వెంటనే అమలు చేయాలని కూడా కోరడం జరిగింది. ‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ తెలంగాణ ప్రభుత్వం’ ఎనిమిది మాసాలైనా ఇప్పటికీ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసే అంశం మీద జీవో జారీ చేయలేదు. సరికదా, సర్వీసు ఉద్యోగులకు ఇచ్చిన తెలంగాణ ఇంక్రిమెంట్‌ను రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఇది విశ్రాంత ఉద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నది.

దీనితో పాటు పన్నెండు మాసాలు గడచిపోయినప్పటికీ పదో పీఆర్‌సీ సిఫారసుల అమలు కోసం కూడా ఈ వర్గం ఇప్పటికీ ఎదురు చూడవలసి వస్తున్నది. ఆ పది మాసాల బకాయిల చెల్లింపు ఏ విధంగా జరుగుతుందో కూడా తెలియడం లేదు. అడిషినల్ క్వాంటమ్ మీద పీఆర్‌సీ సిఫారసులను ఆమోదించాలన్న తమ విన్నపం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా అర్థం కావడం లేదు. హెల్త్ కార్డుల విషయం కూడా ఇప్పటికీ తేలలేదు. ఈ సమస్యలను పరిష్కరించి రిటైర్డ్ ఉద్యోగుల క్షోభను నివారించాలని కేసీఆర్‌ను కోరుతున్నాం. పడాల రాములు  (జీటీఈఏ మాజీ ఉపాధ్యక్షులు) హైదరాబాద్
 
‘పోలీస్’ సంస్కరణలు ఎక్కడ?
మితిమీరిన రాజకీయ జోక్యం, పై అధికారుల ఇష్టా రాజ్య ధోరణి పోలీస్ వ్యవస్థను అభాసుపాలు చేస్తు న్నాయి. ప్రజలకూ, పోలీసులకూ మధ్య పెరుగు తున్న అంతరం మరింత విస్తరించకుండా 30 ఏళ్ల క్రితం తలపెట్టిన సంస్కరణలను అమలు చేయడం అవసరం. రెబీరో కమిషన్, మాలిమత్ కమిషన్, ధర్మ వీర్ కమిషన్, పద్మనాభయ్య కమిషన్ వంటివి అం దుకు సిఫారసులు చేశాయి. 2008లో పార్లమెంటు కూడా పోలీసు సంస్కరణల గురించి చర్చించింది. సుప్రీం కోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. అరెస్టు అధికారాన్ని పోలీసుల నుంచి నియంత్రించడం, కేసు లతో నష్టపోతే పరిహారం వంటివి ఇందులో ఉన్నా యి. వీడియో కాన్ఫరెన్స్‌తో కేసుల సత్వర పరిష్కారం కోసం కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. 1970లో ఏర్పాటైన జాతీయ పోలీస్ కమిషన్ అనేక నివేదికలు సమర్పించింది. అయినా ఇప్పటికీ ఈ వ్యవస్థను సం స్కరించవలసిన అవసరమే ఎక్కువ. పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేటట్టు చేయాలి. ఇది ప్రజాస్వామ్య విజయానికి అవసరం.  ముర్కి రామచంద్రం  కోహెడ, కరీంనగర్ జిల్లా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement