![దొంగ దేవుళ్లు మతానికి చేటు](/styles/webp/s3/article_images/2017/09/2/41416940493_625x300.jpg.webp?itok=dZm3mOOt)
దొంగ దేవుళ్లు మతానికి చేటు
మన దేశంలోని ప్రతి మతంలోనూ బూటకపు దేవుళ్లు, మోసగాళ్లు భక్తులకు తమను తాము హోల్ సేల్‌గా అమ్మేసుకుంటున్నారు. రామ్‌పాల్ లాంటి వ్యక్తి.. విశ్వాసపు ఫ్యాక్టరీనే పెట్టేసి, అసెంబ్లీ లైను మీద అతి సరళమైన పరిష్కారాలను తయారు చేసేసి, నగదు ధర వసూలు చేసి మరీ పేద ప్రజల చేత మింగించేస్తున్నప్పుడు... ఇది ఆందోళన చెందాల్సిన సమయమే. వంచన నీలినీడల్లో జరిగే ఈ భ్రమాత్మక వ్యాపారం భళ్లున బద్దలైనప్పుడు ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందే. కానీ పోలీసు అణచివేత సమాధానం కాదు, ఈ బూటకపు దేవతల నుండి భగవంతుడ్ని కాపాడటం కోసం మన నేతలు నోళ్లు విప్పి తీరాలి.
మతానికి ఉండే శక్తి అంతా ప్రశ్నలకు సమాధానాలను చెప్పే దాని సామర్థ్యంలోనే ఉంటుంది. అయినాగానీ అతితరచుగా, ఇప్పుడు హర్యానాలో జరిగినట్టుగా దేవతలమని చెప్పుకునే దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు, ప్రశ్నలను సంధిస్తూనే ఉంటారు. మతం హేతుబద్ధతకు విరుగుడు మందేమీ కాదని కనీసం నా అభిప్రాయం. అయినాగానీ ఆ విషయంలో ఏదో ఓ మూల అపనమ్మకం తొంగి చూస్తూనే ఉంటుంది. విశ్వాసం నుండే మతం పుడుతుంది. విశ్వాసం మానవ మస్తిష్కపు పరిధికి వెలుపల ఉంటుంది. అస్తిత్వ సృష్టిలో భాగమైన మానవుని మెదడు అస్తిత్వపు హేతుబద్ధతను లేదా మరణానికి అర్థాన్ని అవగతం చేసుకోలేనిదని బోధపడే వరకు విశ్వాసం అలా మస్తిష్కానికి వెలుపలే ఉంటుంది.
నాస్తికులు మాత్రమే మరణాన్ని విశ్వసిస్తారు. సంశయాత్ములకు మరణమంటే అంతుబట్టని దానిలోకి వేసే అడుగు. ఇక ఆస్తికులకైతే మరణమంటే పరలోకానికి సాగే పరివర్తన. భూమిపై బతికుండగా మనం ఏమి చేశామనే దానికి ఒక విధమైన జవాబుదారీతనం మనం వెళ్లే ఆ పరలోకపు పూర్తి స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఇహలోక, పరలోకాల మధ్య ఈ అనుసంధానానికి హామీ ఉండటమే స్థూలంగా నైతిక వ్యవస్థ అమరికకు దోహదపడుతుంది. అయినప్పటికీ దివ్యశక్తి మానవ స్వేచ్ఛాభీష్టానికి సందును కూడా విడుస్తుంది. అతి కటువైన సన్నటి రేఖ మీదుగా తర్కాన్ని సాగతీస్తే, పాశవికత నాస్తికత్వపు తీవ్ర వ్యక్తీకరణ అని సైతం మనం అనగలుగుతాం. ఎందుకంటే దివ్యశక్తి సృజనాత్మక, ప్రశాంత మేధస్సును తిరస్కరించేవారు మాత్రమే క్రూర చర్యలకు లేదా హత్యలకు లేదా అల్లర్లకు పాల్పడతారు. మరి మతం పేరిట నియంతలు పాశవికతను ప్రదర్శించిన ప్పుడో? అలాంటి నయవంచకుల కోసం ప్రతి మతమూ నరకం అనే ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం కాకతాళీయం కాదు.
నైతికతను ఆమోదనీయంగా నిర్వచించడమనేదే బహుశా అత్యంత చిక్కు సమస్య కావచ్చు. అతి తరచుగా అధికారంలోని ఉన్నత వర్గీయులు నైతికతను చెరపట్టి, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు దోహదపడే విధంగా దాన్ని తిరగరాయడం జరిగింది. అలాంటి దురన్యాయానికి ఆచరణాత్మక వాహిక మతమే. కాబట్టే 18వ శతాబ్దపు చివ ర్లో ఫ్రాన్స్ ప్రజలు తిరుగుబాటు చేసి బూర్బన్ రాజులు, రాణులు, ప్రభువుల తలలను ఎంత కసిగా నరికారో, అంతే కసిగా కేథలిక్కు చర్చినీ ధ్వంసం చేశారు. ఆ ఆలోచనను కార్ల్ మార్క్స్ మరొక సున్నితమైన మైలురాయిని దాటించి, మతం ప్రజల పాలిట మత్తుమందు అని నిర్వచించాడు. రెండు సువిశాల ఖండాల్లో, ప్రత్యేకించి తరతరాలుగా పేదలను మేధోపరమైన, ఆర్థికపరమైన మందకొడితనపు మత్తులో ముంచిన సమాజాల్లో మార్క్స్ ఆలోచన... సామాజిక నిర్వహణా చట్రం నుండి మతాన్ని నిషేధించే ప్రతిస్పందనను కలిగించింది.
ఫ్రెంచి విప్లవకారులు ఊహించినదాని కంటే చాలా త్వరితంగానే కేథలిక్కు మతం ఫ్రాన్స్‌లో పునఃప్రత్యక్షమైంది. హేతుబద్ధత ముఖ్య ప్రవక్తయైన రోబిస్పియర్ హెర్క్యులస్ తరహాలో ఆల్ఫా దేవతను ఏర్పరచి ఫ్రాన్స్ ప్రజల దేవుని అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆల్ఫా ఆయన తల నేల రాలకుండా కాపాడలేకపోయింది. రష్యాలోని ఆర్థడాక్స్ (సనాతన) క్రైస్తవం, చైనాలోని కన్‌ఫ్యూషియస్-బౌద్ధం- క్రైస్తవం సుదీర్ఘ మైన, బాధాకరమైన నడిమి వయసు సంక్షోభాలను తట్టుకుని నిలిచాయి. సోవియట్ యానియన్ కాలంలో విజయవంతమైన వ్లాదిమిర్ పుతిన్ నేడు ఆర్థడాక్స్ చర్చికి ప్రణమిల్లి ప్రార్థనలు చేస్తారు. రష్యన్లు రొట్టెతోనే బతకలేరని ఆయనకు తెలుసు.‘‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’’లో ఇటీవల వెలువడ్డ తాజా కథనాన్ని విశ్వసించేట్టయితే... నేటి కమ్యూనిస్టు చైనాలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుల కంటే క్రైస్తవ మతానుయాయులు ఎక్కువ మంది ఉన్నారు.
ఈ వైపరీత్యాన్ని పరిష్కరించడానికి చైనా ప్రభుత్వం ఆసక్తికరమైన డొంక తిరుగుడు దారిని ప్రయత్నిస్తోంది. చైనా, హాంకాంగ్‌లు ఒకే దేశమైనా రెండు రాజ్యాలు. చైనా నాస్తిక రాజ్యం, హాంకాంగ్ మత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు ఉన్న రాజ్యం. ప్రభుత్వ అధికార అంగాలనన్నిటినీ చైనా ప్రభుత్వం శాసిస్తుంది. ఇక హాంకాంగ్ నాటకీయమైన ప్రత్యామ్నాయాన్ని ప్రదర్శిస్తోంది. భావజాల రణరంగంలో భారీ శతఘు్నలను మోహరిస్తోంది. రాబోయే ఇరవై ఏళ్లలో ఈ రెంటిలో ఏది నెగ్గుతుంది? మీకు పందాలు కాసే అలవాటుంటే హాంకాంగ్ మీదే పందెం కట్టండి. మంచి ఫలితాలు లభిస్తాయి.
ఇక మన దేశానికే వస్తే, మతానికి ఎదురైన ప్రతి సవాలూ ఊపునందుకోకముందే వీగిపోయింది. బెంగాల్‌లోని మార్క్సిస్టులు రాజకీయ పార్టీలను పక్కకు తోసేయగలమేగానీ, మనగలగాలంటే మాత్రం దుర్గాదేవి, కాళికాదేవి ముందు, నమాజుకు పిలుపునిచ్చే మసీదుల హక్కుకు తలవొంచాల్సిందేనని త్వరగానే గుర్తించారు. హిందువులు స్వర్గసీమలోని అమృతం కోసం వేచి చూస్తుండటంతో, ముస్లింలు జన్నత్(స్వర్గం)లోని తస్నీమ్ (పవిత్ర నది)జలాల కోసం దప్పికగొని ఉండటంతో ‘‘మత్తు మందు’’ సిద్ధాంతం చతికిలబడింది.
మన దేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చలేకపోవడం వల్ల మన వాళ్లలో నయవంచనకు గురయ్యే అవివేకం పెరిగి ఉండాలి. వర్తమాన భారతావనికి నాస్తికత్వం నుంచి లేదా దాని బంధుగణం నుండి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ప్రతి మతంలోనూ బూటకపు దేవుళ్లు, మోసగాళ్లు మత విశ్వాసులకు హోల్‌సేల్‌గా తమను తాము మార్కెట్ చేసుకుంటున్నారు. దీనివల్ల మాత్రం మతానికి కొంత ముప్పు పొంచి ఉంది. సాధూలు, సావంత్‌లు, ఇమామ్‌లు అంతా అవినీతిపరులు కాని మాట నిజమే. అయినా ఈ ముప్పు గురించి నొక్కి చెప్పక తప్పదు. రామ్‌పాల్‌లాంటి వ్యక్తి ఒక విశ్వాసపు ఫ్యాక్టరీనే పెట్టేసి, అసెంబ్లీ లైను మీద అతి సరళమైన పరిష్కారాలను తయారు చేసేసి నగదు ధర వసూలు చేసి మరీ పేద ప్రజల చేత మింగించేస్తున్నప్పుడు.... ఇది ఆందోళన చెందాల్సిన సమయమే. వంచన నీలినీడల్లో జరిగే భ్రమాత్మక వ్యాపారం ఇది.
ఈ వ్యాపారం భళ్లున బద్దలైనప్పుడు ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడానికి తాను చేయాల్సినది చేయకతప్పదు. కానీ పోలీసు అణచివేత సమాధానం కాదు, రాజకీయ నాయకత్వపు ఒప్పించే శక్తి సామర్థ్యాలే పరిష్కారం. తమకు తామే దేవతలుగా ప్రకటించేసుకున్న ఈ బూటకపు దేవతల నుండి భగవంతుడ్ని కాపాడటం కోసం మన నేతలు నోళ్లు విప్పి తీరాలి.
ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు