విశ్లేషణ:
ఎన్నికలలో ఇచ్చిన 'ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి' హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటించిన 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' కేవలం నినాదప్రాయంగా మిగలనున్నదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలవని అనుకుంటున్న 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' పథకాలు కేవల నినాదాలుగానే మిగిలిపోతాయా? యువతలో నెలకొన్న ఈ భయాందోళనలను వెంటనే తొలగించాలి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకున్న చైనాలో ఇటీవల ఏర్పడిన ఆర్థిక మందగమనం భారత్‌కు అందివచ్చిన అవకాశం. ఈ ఏడాది చైనా ఆర్థిక రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో తన జీడీపీ వృద్ధిరేటు లక్ష్యాన్ని 7 నుంచి 6.5 శాతానికి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కిందటేడాది ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా గురించి దేశంలో ఆశలు చిగురించాయి. కొన్నేళ్లుగా దేశ స్థూల జాతీ యోత్పత్తిలో 15 శాతంకంటే మించలేకపోతున్న తయారీ రంగం (మాన్యు ఫాక్చరింగ్ సెక్టార్) వాటాను 2020 నాటికి 25 శాతానికి పెంచి, కనీసం 10 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించడానికి మోదీ మేక్ ఇన్ ఇండియా మిషన్ ఆరంభించారు.
ఒక అంచనా ప్రకారం దేశంలో దాదాపు 8 కోట్ల మంది నిరు ద్యోగులున్నారు. చదువుకు తగిన ఉద్యోగాలు లేక నిరాశానిస్పృహలకు లోన వుతున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 368 ప్యూన్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడగా 23 లక్షల దర ఖాస్తులు అందాయి. అందులో 255 మంది డాక్టరేట్లు. ఆంధ్రప్రదేశ్ విభజ నకు ముందు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అధిక సంఖ్యలో పోస్టు గ్రాడ్యు యేట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల తెలంగాణలో 856 విద్యుత్ ఇంజ నీర్ల ఖాళీలకు 1.09 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ దేశంలో ఉన్న నిరు ద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పట్టేవే. ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు ఆవశ్యకమే. 2025 నాటికి దేశ జనాభా ప్రస్తుతం ఉన్న 128 కోట్ల నుంచి దాదాపు 150 కోట్లకు చేరుకోబోతోందని అంచనా. ఉన్నత విద్యను అభ్యసించే యువత సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి కోట్లాది ఉద్యో గాలను సృష్టించుకోవాలి. ఉపాధి అవకాశాలు విస్తృతపరచాలి.
ఎగుమతుల స్థాయికి ఉత్పత్తులు
ఉద్యోగావకాశాల కల్పనకు ఉద్దేశించిన మేక్ ఇన్ ఇండియా మిషన్ 25 ప్రాధా న్యతా రంగాలను గుర్తించింది. వాటిని అభివృద్ధి చేసుకుని చైనాకు దీటుగా ఆసియాలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరించి దేశీయ అవసరాలను తీర్చుకుంటూ ఎగుమతులను కూడా చేపట్టే స్థాయిలో పారిశ్రామికోత్పత్తు లను అందించాలన్నది మిషన్ లక్ష్యం. ఇందుకు అనుకూల పరిస్థితులు కూడా భారత్‌కు ఉన్నాయి. దేశ జనాభాలో 65 శాతం 35 సంవత్సరాలలోపు యువతే కావడం గొప్ప మానవ వనరు. ఒకప్పుడు చైనాలో అధిక జనాభా సమస్య అనుకునేవారు. కానీ జనాభాయే అన్ని సమస్యలకు పరిష్కారమని చైనా నిరూపించింది. ఆ బాటలోనే భారత్ పయనించాలని అనుకుంటున్నది. కానీ ఈ అనుకూలతలతో పాటు, అనేక ప్రతికూలతలు కూడా వ్యవస్థీకృ తంగా మారిన విషయాన్ని విస్మరించలేం.
దేశంలో విద్యాసంస్థలు, విశ్వవిద్యా లయాలు ఆశించిన స్థాయిలో సాంకేతిక నిపుణులను అందించలేకపోతున్నాయి. దేశంలో వృత్తి నైపుణ్యతా శిక్షణ కలిగిన వారు 2.3 శాతమే. మేక్ ఇన్ ఇండియా ఆశిస్తున్న ఫలితాలు రావాలంటే, అందుకు సరిపడే నైపుణ్యం కలిగిన యువత భారత్‌లో ఉన్నదా? లేకుంటే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి చేపట్టవలసిన చర్యలు ఏమిటి? ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. మేక్ ఇన్ ఇండియా ఆలోచనకు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలైన రతన్ టాటా, ముకేశ్ అంబానీ, ఆజీమ్ ప్రేమ్‌జీ తదితరులు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని ముందుకు వచ్చారు. వివిధ రంగాలకు సంబంధించిన పారిశ్రా మికోత్పత్తులు దేశంలోనే తయారుకావాలన్న భావన మేక్ ఇన్ ఇండియాలో ప్రతిబింబించినప్పటికీ, అది ఆచరణాత్మకం కావడానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రావలసి ఉంది. అందుకే మోదీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ, 'స్కామ్‌ల ఇండియా కాదిప్పుడు, స్కీమ్‌ల ఇండియా' అంటూ ఇన్వె స్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు తెలియచేస్తున్నారు. నిజానికి ఎన్డీఏ అధికారం లోకి వచ్చాక స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ కూడా బలపడి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. అయితే దేశంలో సుస్థిర పారిశ్రామి కాభివృద్ధికి దోహదం చేసేవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే.
విదేశీ పెట్టుబడులే ప్రధానం
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి దేశీయంగా వివిధ రాష్ట్రాలు ఎలా పోటీ పడుతున్నాయో, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య కూడా అందుకు తీవ్ర పోటీ నెలకొని ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం అంత సుల భం కూడా కాదు. నిర్దిష్టమైన ప్రామాణికతలను పరిగణనలోనికి తీసుకున్న తరవాతే విదేశీ పెట్టుబడిదారులు ముందుకు వస్తారన్నది వాస్తవం. ప్రతిష్టా త్మకమైన వివిధ ఏజెన్సీలు ఇచ్చే నివేదికలను, రేటింగ్‌లను వారు ప్రామా ణికంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై 'రీజన బుల్ రిటర్న్స్' (సహేతుకమైన లాభాలు)ను ఆశిస్తారు. ప్రపంచ బ్యాంకు దాదాపు 190 దేశాల్లో నెలకొని ఉన్న పారిశ్రామిక వాతావరణంపై సర్వే చేసి అందించిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే సమగ్ర నివేదికలో తాజాగా భారత్‌కు లభించినది 130వ ర్యాంకు మాత్రమే.
ఆశ్చర్యమేమిటంటే, అఫ్ఘా నిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్‌లు పొం దాయి. ప్రపంచ మార్కెట్ల దృక్కోణం నుంచి చూసినప్పుడు భారతదేశంలో సంక్లిష్టమైన అధికార యంత్రాంగపు ప్రమేయం ఎక్కువ. అలాగే, సరుకులు చేరవేయడానికి వివిధ ప్రాంతాల మధ్య సరైన రవాణా సౌకర్యాలు లేకపోవ డం మరొక ప్రధాన లోపం. ప్రపంచీకరణకు అనువైన సంస్కరణలు చేపట్టక పోవడం, అన్నింటికీ మించి అడుగడుగునా 'అవినీతి' తాండవించడం లాంటి సమస్యలనేకం ఉన్నాయి. వ్యవస్థీకృతంగా మారిన ఈ సమస్యలు తొలగించా లంటే ఉక్కు సంకల్పం కావాలి. 'వ్యాపారం చేసుకోవడానికి అనువైన పరిస్థి తులు'కల్పించకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించడం ఆశించినంత సులభం కాదు.
ఇక, దేశంలోకి వెల్లువలా వచ్చిపడుతున్న నకిలీ వస్తువులు (కొన్ని రకాల ఉత్పత్తులు... దేశీయ ఉత్పత్తులకంటే నాణ్యమైనవి) తయారీ రంగం అభివృద్ధికి నిరోధకాలుగా తయారయ్యాయి. చైనా వస్తువులు భారత్ మార్కె ట్లను ముంచెత్తడంతో ఒక దశలో దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోతుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ ప్రమాదం ఇప్పటికీ తొలగిపోలేదు. 'ఇల్లిసెట్ మార్కెట్స్, ఎ థ్రెట్ టు అవర్ నేషనల్ ఇంట్రెస్ట్స్'(జాతీయ ప్రయోజనాలకు గండికొడుతున్న అక్రమ వ్యాపార సామ్రాజ్యాలు) అనే నివే దిక కొన్ని విభ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడించింది. కిందటేడాది... అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,381 కోట్ల మేర దేశంలో అక్రమ వ్యాపారం జరిగింది. లక్ష కోట్ల రూపాయల పైబడిన అమ్మకాల్ని దేశీయ ఉత్పత్తి కంపెనీలు నష్టపోయాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల పన్ను ఆదాయం నష్టం కలిగింది. 'ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్'(మేధోసంపత్తి హక్కులు) విషయంలో మనం తీసుకోవాల్సిన ఆవిష్కరణ లకు చొరవ చూపకపోవడం, సరిహద్దుల్ని దాటుకొని అక్రమంగా వస్తున్న వస్తువుల్ని నిరోధించలేకపోవడం లాంటి లోపాలతో దేశీయ ఉత్పత్తి దారులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు.
ఇబ్బందులూ ఉన్నాయి
'మేక్ ఇన్ ఇండియా మిషన్' పురోగతిని విశ్లేషిస్తే... ఈ ఏడాదిన్నర వ్యవ ధిలో సాధించిన ఫలితాలు కొంత మేరకు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో... గత ఏడాదితో పోలిస్తే 40 శాతం అభివృద్ధి కనిపిస్తుండగా, (23.7 బిలియన్ల డాలర్లు) భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ మదుపరుల రంగంలో కిందటేడాది కనిపించిన 0.6 శాతం అభివృద్ధి రేటును దాటుకొని 2.7 శాతం మేర వృద్ధి సాధించగలిగింది.
ఐతే, ఇది వచ్చే ఐదేళ్లలో ఏ మేరకు స్థిరమైన అభివృద్ధికి దారితీస్తుందో వేచిచూడాలి. మౌలికమైన పరి పాలనా సంస్కరణలు, ప్రజల ఆరోగ్యం, విద్య, సాంకేతిక పరిజ్ఞానం మొద లైన ఉత్పాదక పనిముట్ల (ప్రొడక్షన్ టూల్స్)ను మెరుగుపర్చకుండా కేవలం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తరచూ విదేశీ పర్యటనల మీదనే ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా... ఇప్పటికీ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న 60 శాతం పైగా ఉన్న ప్రజానీకానికి కావలసిన ఉపాధి అవకాశాలపై దృష్టి కేంద్రీకరించకుండా, మరోపక్క సత్వర పారిశ్రామికీకరణ పేరుతో వ్యవసాయం చేయడంతో రాజకీయ ప్రతిష్టం భన ఏర్పడి పెద్ద ఎత్తున వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవు తున్నది. భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనున్నదా అనే ఆందో ళనలు కలుగుతున్నాయి. దీంతో, పారిశ్రామికీకరణ ప్రతిపాదనల ఉద్దేశంపైనే నీలినీడలు కమ్ముకోనున్నాయా! అనే సందేహం కలుగుతుంది.
ఇక నరేంద్రమోదీ 'మేక్ ఇన్ ఇండియా' ప్రకటన చేయగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్'అంటూ వెనువెంటనే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తుల తయారీ మెరుగుపర్చాలన్నది బహుశా ఆయన ఆంతర్యం కావచ్చు. దానిని ప్రజలు ఆహ్వానిస్తారు. కాని, ఆచరణలో ఆ దిశగా అడుగులు పడటం లేదు. రాష్ట్ర రాజధాని 'అమరావతి' నిర్మాణం ఆలో చన ఆరంభంలోనే విదేశీ సాంకేతికత కోసం సింగపూర్, జపాన్, జర్మనీ లాంటి దేశాలవైపు పరుగులెత్తడం దేశీయ వనరుల పట్ల తనకున్న చిన్నచూపు బహిర్గతమవుతున్నది. కొసమెరుపు ఏమిటంటే- రూ.2,500 కోట్లతో గుజరాత్‌లో నిర్మించనున్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ పీస్’ విగ్రహం రూపకల్పన బాధ్యత చైనాలోని ఒక ప్రముఖ సంస్థకు అప్పజెప్పారు. అలాంటప్పుడు 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్'ల పరమార్ధం ఏమిటని ప్రజలు విస్తుపోతున్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతం కావాలంటే ఆకర్షణీయమైన పారిశ్రామిక వాతావరణం కల్పించాలి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనివార్యం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా కేంద్రం మీద ఒత్తిడి పెంచడంలేదు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తే తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కారణాలవల్ల ప్రత్యేకహోదా అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల మంది గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీచేయకపోవడం, డీయస్సీ నిర్వహించకపోవడం నిరుద్యోగ యువతలో నైరాశ్యం పెంచుతున్నది. ఎన్ని కలలో ఇచ్చిన 'ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగభృతి' హామీ కూడా అమలుకు నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటించిన మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కేవలం నినాదప్రాయంగా మిగలనున్నదా అన్న ప్రశ్న తలె త్తుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలవని అనుకుంటున్న మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పథకాలు కేవల నినాదాలుగానే మిగిలి పోతాయా? యువతలో నెలకొన్న భయాందోళనలను వెంటనే తొలగించాలి.
వ్యాసకర్త, ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మొబైల్: 99890 24579