ఉత్పత్తి ఆధారిత ప్రోత్రాహకాల(పీఎల్‌ఐ) వల్ల మొబైల్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు. పీఎల్‌ఐ పథకం కింద ఈ రంగం ఇప్పటికే లక్ష్యాలను అధిగమించిందని చెప్పారు. 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం వాటా 17.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2024లో రూ.9.52 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ చూపినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు
‘పీఎల్‌ఐ పథకం వల్ల దేశీయంగా మొబైల్ ఉత్పత్తి రంగంలో ప్రాథమికంగా రూ.9,100 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వీటివల్ల రూ.6.61 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2014-15లో వీటి ఎగుమతులు కేవలం రూ.1,566 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం దాదాపు రూ.1.2 లక్షల కోట్లు విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ రంగం దాదాపు రూ.8.12 లక్షల కోట్లు ఉత్పత్తిని సాధిస్తుందని అంచనా. పీఎల్‌ఐ పథకం వల్ల మొబైల్ తయారీ రంగంలో దాదాపు లక్షకు పైగా యువతకు ఉపాధి లభించింది. ఈ వృద్ధికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో తోడ్పడింది’ అని కృష్ణన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment