కథలలో అత్తరు, పత్రికతో పన్నీరు
శ్రీపాద పత్రికా సేవ వారి కథల మాదిరి గులాబీ అత్తరు వలె గుబాళించలేదు. వాస్తవానికి ఆయన పత్రికా రచన నిన్నటి పన్నీటి జల్లు. పత్రికా రచనలోని లోతును అర్థం చేసుకుంటూ శాస్త్రిగారు వెలుబుచ్చిన అభిప్రాయాలు చూడాలంటే ‘ప్రబుద్ధాంధ్ర’ను పలకరించాలి.
తెలుగు పత్రికలు ఒక రూపం సంతరించుకోవడానికీ, అందరికి అందుబాటులోకి రావడానికీ జరిగిన కృషి చరిత్రాత్మకమైనది. తొలి పత్రిక ‘వృత్తాంతి’ (1838) నుంచి ఆ కృషి సుస్పష్టం. సంపాదకుడు, ఉప సంపాదకుడు, వీరికి ఉండవలసిన దృష్టి, ప్రచురించే అంశాలు, వాణిజ్య ప్రకటనలు, ఆఖరికి పాఠకుడు ఎలా ఉండాలో కొ క్కొండ వెంకటరత్నం పంతులు నడిపిన ‘ఆం ధ్రభాషా సంజీవని’ పత్రికలో పద్య రూపంలో వెల్లడించారు. తాపీ ధర్మారావు ‘ప్రజామిత్ర’ ను వ్యావహారిక భాషలో ప్రచురించి ఒక మలుపు తిప్పారు. కందుకూరి, ఏపీ పార్థసారథి నాయుడు, ముట్నూరి, కాశీనాథుని నాగేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, విశ్వనాథ, సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దెరాజు సోదరులు- వంటి ఎందరో తెలుగు పత్రికకు వన్నెలు కూర్చారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పేరు వినగానే ఒక అసాధారణ కథకుడు తలపునకు వస్తాడు. కానీ తెలుగు పత్రికా రంగ చరిత్రలోనూ ఆయనకు సముచిత స్థానం ఉంది. ఆయన సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ‘ప్రబుద్ధాంధ్ర’.
పత్రిక అంటే, కొంత సమాచారాన్ని సేకరించి అచ్చువేయడం ఒక్కటే కాదు. పాఠకులకు ఆ సమాచారాన్ని చేర్చే క్రమం ఒక తాత్వికతతో, ప్రయోజనంతో సాగుతుంది. దానిని గ్రహించిన వారు శ్రీపాద. ‘రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని....ఆరోగ్యాన్ని, ధనాన్ని చివరికి జీవితాన్ని మానవ సేవ కోసం సంతోషంగా త్యా గం చేసే ప్రతికా సంపాదకుడి కంటె ఉత్తమ శ్రేణికి చెందినవారు మరొకరు లేరు...’ అని ఎవరనగలరు? పత్రికా సంపాదకుల మీద అంతటి సానుభూతే కాదు, పత్రికల చారిత్రక కర్తవ్యం మీద అంతకు మించి గౌరవ ప్రపత్తులను వెల్లడించారు, ఆయనే. ‘పాశ్చాత్య దేశాలలో పత్రికలు నేడు విప్లవాలను కలిగిస్తున్నాయి. శాంతిని నెలకొల్పుతున్నాయి. రాజుల్ని పదవీ భ్రష్టుల్ని చేస్తున్నాయి. మానవమాత్రుల్ని దేశాధ్యక్ష పీఠాలు యెక్కిస్తున్నాయి’ అని. ఈ మాటలు రాసినవారు శ్రీపాదవారే. కానీ శ్రీపాద పత్రికా సేవ వారి కథల మాదిరి గులాబీ అత్తరు వలె గుబాళించలేదు. వాస్తవం చెప్పాలంటే ఆయన పత్రికా రచన నిన్నటి పన్నీటి జల్లు. పత్రికా రచనలోని లోతును ఇంత బాగా అర్థం చేసుకుంటూ శాస్త్రిగారు వెలుబుచ్చిన ఆ అభిప్రాయాలు చూడాలంటే ‘ప్రబుద్ధాంధ్ర’ ను పలకరించాలి.
‘ప్రబుద్ధాంధ్ర’ను 1922లో తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం సమీపంలోని రాయవరంలో ఆరంభించారు.
కొంతకాలం నడి చి, నిలిచిపోయినా, 1934లో మరో ప్రయాణం ప్రారంభించింది. అప్పటికే ‘కృష్ణాపత్రిక’(1902), ‘ఆంధ్రపత్రిక’(1914) తెలుగువారి మీద గట్టి ప్రభావం చూపుతున్నాయి. తాపీ ధర్మారావునాయుడు వ్యావహారికమా, గ్రాం థికమా అన్న మీమాంసలో ఉన్నారు. అలాంటి కాలంలో(1934, ఏప్రిల్) ‘తెనుగు పత్రికల సంపాదకులకు’ అన్న శీర్షికతో గిడుగు వెంకటరామమూర్తి రాసిన వ్యాసా న్ని శ్రీపాద ప్రచురించారు. ‘ఇంగ్లండు, ఫ్రా న్‌సు(ఫ్రాన్స్), జర్మనీ, రష్యా, టర్కీ, చీనా, జపా ను మొదలయిన దేశములలోని వార్తాపత్రికల సంపాదకులు తమ వాడుక భాషలోనే తమ వ్యాసములను రచిస్తున్నారని ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికల సంపాదకులకు తెలుసుననుకుంటాను. తెలిసిన్నీ ఆంధ్ర సా హిత్య పరిషత్ పత్రికా సంపాదకుల వలెనే వారున్నూ తమ వాడుక భాషను బహిష్కరించి, వ్యవహార భ్రష్టములయిన ప్రాచీనా ంధ్ర శబ్దములను ఎందుకు వాడుతున్నారో నాకు బోధపడదు....’ అని ప్రశ్నించారు.
గిడుగు వ్యాసం మీద శ్రీపాద రాసిన వ్యాఖ్య ఇంకా ఆసక్తికరం. ‘పత్రికలు ప్రపం చ జ్ఞానాన్ని కలిగించేవిగానీ, పాఠ్య గ్రంథా లు కావు. అదలా వుండగా మేడితోక పట్టుకుని అరక సాగిస్తూనే రైతు పత్రిక విప్పవలసి వుంటుంది.... గోచి పాత పెట్టుకుని చెమట వోడుస్తూనే కార్మికుడు పత్రిక చదవలసి వుంటుంది....చాలా తరగతుల వారు ఏదో పనిలో మునిగి వుండే పత్రికలు చదవ్వలసి వుంటుంది. అలాంటప్పుడు పత్రిక లు అప్రయత్నంగా బోధపడే వాడుక భాష లో కాక, వొక పక్క వ్యాకరణమూ, మరో పక్క నిఘంటువూ, పైగా వొక పక్క పండితుణ్ణీ వుంచుకుంటాడని(భావిస్తూ) కొరకబడని భాషలో వుంటే యేం లాభమూ...?’ ఈ వ్యాఖ్య చదివిన తరువాత ‘ప్రజామిత్ర’ వాడుక భాషలోకి పరివర్తనం చెందుతున్నట్టు దాని అధిపతి గూడవల్లి రామబ్రహ్మం (సంపాదకుడు తాపీ ధర్మారావు) ప్రకటించారు. తెలుగు పత్రికలలో వాడుక భాష దేదీప్యమానంగా వెలిగిందంటే అందులో శ్రీపాద కృషి అనన్య సామాన్యమైనది.
డా. నాగసూరి వేణుగోపాల్ (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త)
ఏప్రిల్ 23 శ్రీపాద 123 జయంతి