Sripada
-
మావోయిస్టు కీలక నేత రాజిరెడ్డి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత మల్లా రాజిరెడ్డి (71) అలియాస్ సాయన్న మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాడపడుతున్న ఆయన ఈ నెల 16న చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరణించినట్లు సమాచారం. తొలితరం మావోయిస్టు నేతలతో కీలక సంబంధాలున్న ఆయన మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అత్యంత కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి తదితరులతో కలిసి పనిచేశారు. అయితే రాజిరెడ్డి మరణవార్తను మావోయిస్టులు, ఆయ న కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. కొండపల్లి పరిచయంతో అడవిబాట... పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సంగ్రాం, సాగర్, అశోక్, దేశ్పాండేగా దళంలో ప్రసిద్ధుడు. 1975 నుంచి 1977 వరకు రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. ఇంటర్ చదివే రోజుల్లో ఎగ్లాస్పూర్లో ఓ కేసులో అరెస్టు అయి వరంగల్ జైలుకు వెళ్లారు. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న పీపుల్స్‌వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన పరిచయం రాజిరెడ్డిపై మరింత ప్రభావం చూపింది. జైలు నుంచి బయటకొచ్చాక రాజిరెడ్డి అడవిబాట పట్టారు. వాస్తవానికి రాజిరెడ్డితోపాటు ఆయన సోదరుడు బీమారెడ్డికి సైతం సింగరేణి నుంచి కాల్‌లెటర్లు వచ్చాయి. కానీ తన విప్లవభావాలకు ఉద్యోగం సరిపోదని భావించిన రాజిరెడ్డి దళంలో చేరారు. దళ సభ్యురాలితో వివాహం... రాజిరెడ్డి తన దళంలోనే రత్నం అనే సభ్యురాల్ని వివాహం చేసుకున్నాడు. వారికి స్నేహలతారెడ్డి అనే కుమార్తె ఉన్నారు. అయితే దళంలో కొనసాగుతున్నందున కూతురి ఆలానాపాలనను చిన్నప్పుడే తమ్ముడు భీమారెడ్డికి అప్పగించాడు. ఆమె హైదరాబాద్‌లో ఉన్నతవిద్య పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లాయర్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్ కాశిం. నెట్టింట వీడియో వైరల్... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మృతిపైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో రామచంద్రారెడ్డి మృతిచెందారంటూ ఓ మృతదేహం చుట్టూ పలువురు మావోయిస్టులు రోదిస్తున్నట్లున్న ఓ వీడియో గురువారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మల్లా రాజిరెడ్డి మృతి వార్తకు సైతం అదే వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం గమనార్హం. ఈ వీడియోను ఫ్యాక్ట్ చేయగా గురువారమే అది అప్లోడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. కట్టా రామచంద్రారెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా కొహెడ మండలం, తీగలకుంటపల్లి గ్రామం. వికల్ప్, విజయ్, రాజుదాదా, జురు, సునీల్, వాసు పేర్లతో ప్రచారంలో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్యం సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పలు రాష్ట్రాల్లో కేసులు... రాజిరెడ్డిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పోలీసులపై దాడి చేసిన ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో 1986లో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఎస్సై, 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. జన్నారం మండలం తపాపూర్ గ్రామంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు గ్రూప్ నలుగురిని హత్య చేసిన కేసులో ఏ1గా కొండపల్లి సీతారామయ్య ఉండగా ఏ2గా రాజిరెడ్డి పేరు నమోదైంది. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులోనూ రాజిరెడ్డి నిందితుడు. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కేరళ వెళ్లిని రాజిరెడ్డిని 2008 జనవరిలో అంగన్‌మలైలో ఎస్ఐబీ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కుట్ర కేసులో మెట్పల్లి కోర్టులో హాజరుపరిచి, కరీంనగర్ జైలుకు తరలించారు. రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత 2010లో బెయిల్‌పై బయటికి వచ్చాక రాజిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. రాజిరెడ్డిపై తెలంగాణలో రూ.25 లక్షల క్యాష్ రివార్డు ఉండగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్యాష్ రివార్డులన్నీ కలిపి రూ.కోటి వరకు ఉంటాయని అధికారిక సమాచారం. -
సింగర్ చిన్మయి శ్రీపాద కవలలను చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో! (ఫొటోలు)
-
మహోజ్వల భారతి: సవ్యసాచి శ్రీపాద
సంగీత, వైద్య సవ్యసాచి డాక్టర్ శ్రీపాద పినాక పాణి.. గురువులకే గురువు! నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని ఆ రోజు లలో, తమిళనాటలానే తెలుగునాట కూడా శాస్త్రీయ సంగీతం పరిమళించాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశగా ఎందరో సంగీత శిఖా మణులను తెలుగు రాష్ట్రానికి అందించారు. నేడు శ్రీపాద జయంతి. 1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో జన్మించారు. శ్రీపాద రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి వారి శిష్యరికం చేశారు. 1939లో విశాఖపట్నం ఆంధ్ర వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకున్నారు. 1957లో కర్నూలు వైద్యకళాశాలకు బదిలీ అయ్యారు. కర్నూలులోనే స్ధిర నివాసం ఏర్పర్చుకున్నారు. సంగీతం వింటూనే నొటేషన్స్ రాయగల నైపుణ్యం శ్రీపాదవారిది. పదవీ విరమణానంతరం త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరపల్లవులు, తాన పద వర్ణాలు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తక రచనకు శ్రీకారం చుట్టారు. సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ఆయనవి నాలుగు సంపుటాలు ప్రచురించింది. డా. నోరి దత్తాత్రేయుడు వైద్యరంగంలో శ్రీపాద వారి ప్రముఖ శిష్యులలో ఒకరు కాగా, నూకల చిన సత్య నారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామశర్మ సంగీతంలో వారి శిష్యులు. 1984 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో ఆయన్ని సత్కరించింది. శ్రీపాద తన 99 ఏళ్ల వయసులో 2013 మార్చి 11న కన్నుమూశారు. డాక్టర్ శ్రీపాద -
ఘనంగా శ్రీపాద సార్ధశత జయంతి
రాజమహేంద్రవరం కల్చరల్ : మహాకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్తి్ర తన ప్రతిభాపాటవాలలో మరో కవిసార్వభౌముడు శ్రీనాథునికి సరితూగుతారని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం త్యాగరాజ నారాయణదాస ప్రాంగణంలోని ఉపమందిరంలో శుక్రవారం జరిగిన శ్రీపాద సార్ధశతజయంతి (150వ జయంతి) ఉత్సవంలో ఆయన ప్రసంగించారు. వేదం, శ్రౌతం, స్మార్తం చదువుకున్న అరుదైన కవి శ్రీపాద అని కొనియాడారు. రామాయణ, భారత, భాగవతాలను ఒంటిచేత్తో రచించిన మహాకవి శ్రీపాద.. వేదవ్యాస భాగవతాన్ని కేవలం నాలుగు నెలల పరిధిలో ఆంధ్రీకరించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, విశ్రాంత ప్రిన్సిపాల్, మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ, సీనియర్ న్యాయవాది పోతుకూచి సూర్యనారాయణ మూర్తి ప్రసంగించారు. అనంతరం సార్థశతజయంతి ప్రత్యేక సంచి కను బేతవోలు రామబ్రహ్మం ఆవిష్కరించారు. శ్రీపాద మునిమనుమడు శ్రీరామ్ మాట్లాడుతూ తిధుల ప్రకారం రాజమహేంద్రవరంలో శ్రీపాద జయంతిని నిర్వహించినట్టే విశాఖలో ఈనెల 29న తేదీల ప్రకారం శ్రీపాద జయంతిని జరుపుతున్నారన్నారు. వీఎస్ఎస్ కృష్ణకుమార్ స్వాగత వచనాలు పలికారు. -
తెలుగు కథలో తాజాశ్వాస ప్రాతినిధ్య 2013
ఈ సంకలనం కోసం వస్తువును మాత్రమే పరిగణించకుండా కథను ‘మొత్తం కథ’గా చూడటం వల్ల కూడా మంచి కథలు దొరికాయనిపిస్తోంది. తెలుగు కథకు ఒక సంస్కారం ఉంది. అది గురజాడ నుంచి అందిన సంస్కారం. శ్రీపాద నుంచి, చలం నుంచి, చాసో నుంచి, కొ.కు, రావిశాస్త్రి, మధురాంతకం రాజారాం, రంగనాయకమ్మ... ఇంకా ఎందరెందరి నుంచో అందిన సంస్కారం. ఆ సంస్కారం- ప్రశ్నించడం కావచ్చు. ఘర్షణ పడటం కావచ్చు. తిరుగుబాటు చేయడం కావచ్చు. సరిదిద్దడం కావచ్చు. తప్పుని తప్పు అని, ఒప్పుని ఒప్పు అని చెప్పడం కావచ్చు. బాధితుల వైపు, పీడితుల వైపు, అల్పవర్గాల వైపు, ఆడవాళ్ల వైపు, అధికుల పడగ మీద కాలు పెట్టి అణచ ప్రయత్నించే వీరుల వైపు నిలబడటం కావచ్చు. నియంతల గండభేరుండాల ప్రేవులను పదునైన పాళీతో బయల్పడేలా చేయడానికి చూపే తెగువ కావచ్చు. తెలుగు కథకు ఒక సంస్కారం ఉంది. ఒక తరం వెళ్లింది మరో తరం వచ్చింది ఆ రోజులు ఇప్పుడెక్కడివి అనే వీలు లేకుండా ఆ సంస్కారం చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంది. ఆ కాగడాను ఎప్పటికప్పుడు ఉత్సాహంగా అందుకునే కథకులు వస్తూనే ఉన్నారు. అందుకు మరో తార్కాణం ‘ప్రాతినిధ్య - 2013’. పసునూరి రవీందర్, పి.వి.సునీల్ కుమార్, అల్లం వంశీ, కిన్నెర, ఉణుదుర్తి సుధాకర్, బెడదకోట సుజాత, దీపిక ఉప్పులూరి, వనజ తాతినేని, చింతకింది శ్రీనివాసరావు... ఎవరు వీరంతా? కొత్త కథకులు. తెలుగు కథావరణంలో ప్రవేశించిన తాజా కథకులు. తమ ఉనికి కోసం కథను వాడుకుంటున్న కథకులు కాదు. కథ వెలుగు కోసం తమ సృజనకు రాపిడి పెట్టడానికి వచ్చిన కథకులు. వినోదమా వీరి లక్ష్యం? కాదు. ప్రశ్నించడం. నిలదీయడం. తలపడటం. అవసరమైతే బుజ్జగించి చెప్తాం వింటే వినండి. లేకుంటే అక్షరాలను మండిస్తాం భస్మమయ్యి అడ్డు తొలగండి అని పంతం పట్టినట్టు కనిపిస్తున్న కథకులు. వస్తువును ఎంచుకోవడం, కుదురుగా చెప్పడం, దృక్పథాన్ని వెల్లడి చేయడం, పాఠకుణ్ణి నిద్ర లేపి వెలుగులోకి నడిపించడం... ఎవ్వరూ మానలేదు. ఈ కొత్త కథకులు ఈ పనిని ఇంత బాగా ఎలా చేయగలిగారు? బహుశా ఇది తెలుగు కథ అందించిన సంస్కారం. ఆ బాట ఏర్పరిచిన సంస్కారం. కులం- అవును నాది ఈ కులమే! మతం- అవునయ్యా నీది ఈ మతమే! వర్తమానం- ఇది ఆరోగ్యకరమైన సంఘం ప్రదర్శిస్తున్న వర్తమానం కాదు, మరబొమ్మలుగా మారిన మనుషుల విషాద విధ్వంసం! భాష- చూడు బాబూ తెలుగు కూడా భాషే. ఇంగ్లిష్ మాత్రమే కాదమ్మా! కుటుంబం- రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోతే కొమ్మలొచ్చిన చెట్లనే ఆసరా చేసుకోక తప్పదు. విప్లవం- ఏం.. ట్రిగ్గర్ నొక్కే వేళ్లు తెగిపడవలసిందేనా? వాటికి ఒక బుగ్గను తాకే అదృష్టం లేనట్టేనా? ఉగ్రవాదం- మిత్రమా... దాని రంగు ఆకుపచ్చ కాదు. చరిత్ర- రాళ్లెత్తిన కూలిలెవ్వరు? ఆహారం- ఏది నీచం? ఏది నీచు? ప్రవాసం- నిర్బంధ కొత్త బానిసత్వం... పదానికి ఒక కథ రాశారు. పరిపరి విధాలుగా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంకలనంలో రెండు ప్రేమ కథలున్నాయి. చిత్రంగా రెంటి మధ్యా సామ్యముంది. రెండూ విఫల ప్రేమకథలే. అనామక వీరుల జీవిత కథలే. రెంటినీ రచయితలు అద్భుతంగా నడిపారు. ఒకరు: ఉణుదుర్తి సుధాకర్. కథ పేరు వార్తాహరులు. స్వాతంత్య్రపోరాటంలో బ్రిటిష్‌వారు కొత్తగా టెలిగ్రాఫ్ యంత్రాలు పట్టుకొచ్చి ఉద్యమాన్ని అణిచివేసే ఎత్తుగడ పన్నుతున్న కాలంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు బ్రిటిష్ అధికారి దగ్గర పనివాళ్లుగా చేరి ఆ సంగతి తెలుసుకొని ఆ టెలిగ్రాఫ్ యంత్రాలను ధ్వంసం చేద్దామనుకుంటారు. ఎంతో భవిష్యత్తు, ఆయుష్షు, జీవితం ఉన్న ప్రేమికులు వాళ్లు. కాని దేశం ముందు వాటికి ఏం విలువ? ప్రయత్నించారు. విఫలమయ్యారు. ఆ తర్వాత ఏమయ్యారో? ఎవరికి తెలుసు. వారి త్యాగం? ఎవరికి తెలుసు. వారిద్దరూ హిందూ ముస్లింలు. ఈ సమష్టి శక్తిని చీల్చడానికి బ్రిటిష్‌వారు చేసిన పన్నాగంలో ఇంకా కునారిల్లడం లేదు మనం? ఇలాంటిదే మరో కథ. పేరు: మార్తా ప్రేమ కథ. రచయిత: విమల. విప్లవోద్యమంలో వారిరువురూ ప్రేమికులు. దంపతులు. అడవిని ఇల్లుగా చేసుకున్నవారు. ప్రజల్ని బంధువులుగా మార్చుకున్నవాళ్లు. కాని అలా అనుకుంటే ఇంకేమైనా ఉందా? స్టేట్‌కు భయం వేస్తుంది. నీ స్వార్థం నువ్వు చూసుకోవాలి. అంతే తప్ప నిస్వార్థంగా పని చేయాలనుకుంటే ప్రతిఘటించాలనుకుంటే ఏమవుతుందో తెలుసా? అతడు జైలు పాలయ్యాడు. ఆమె ఏకాకిగా బయట మిగిలిపోయింది. ఇలా ఎందరో ఎవరికి తెలుసు. జనం మీద సముద్రమంత ప్రేమ పెట్టుకున్నవారు తమ ప్రేమల్ని ఎలా బలిపెట్టారో ఎవరికి తెలుసు. కనిపించని కానలలోన వికసించిన పువ్వుల అందం- ఆ అందాన్ని చూపిన కథలు ఇవి. కులాన్ని చర్చించిన కథలు మూడు ఉన్నాయి. మీసాలోడు- పసునూరి రవీందర్, మీరెట్ల వెజ్జులు?- జూపాక సుభద్ర, దమయంతి- దీపికా ఉప్పులూరి. మొదటి కథలో పెళ్లి పంక్తిలో దళితుడికి అవమానం జరుగుతుంది. రెండవ కథలో ఆఫీసులో డైనింగ్ టేబుల్ వద్ద. దళితుడు మొదటి పంక్తిలో కూచుని తినేంత యోగ్యుడు ఇవాళ్టికీ కాని పరిస్థితి ఊళ్లలో. లే.. లే.. అని లేపేయడమే. ఏం తప్పు చేశాడని? ఈ వివక్ష నగరాల్లో ఇంకోలా సాగుతుంది. మీరూ మాతో సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారా... అయితే ఆహారం దగ్గర పైచేయి సాధిస్తాం అని శాకాహారాన్ని ఒక విలువగా ముందుకు తేవడం. అది సాకుగా తీసుకొని హింసించడం. శాకాహారం ఒక మంచి అలవాటు కావచ్చు. కాని విలువ మాత్రం కాదు. ముఖ్యంగా దాని ఆధారంగా ఎదుటి మనిషిని తక్కువ చేయదగ్గ విలువ ఎంత మాత్రం కాదు. అందుకే మూడో కథలో ముఖ్యపాత్ర ఇలా అంటుంది- అమ్మమ్మా... అంటరానిది అని ఆ పిల్లతో నన్ను చిన్నప్పుడు ఆడుకోనివ్వలేదు. శరీరం తాకితే కడిగావు. కాని ఆ పిల్ల నా మనసును తాకిందే... ఏం చేస్తావ్? మెలకువలోకి తీసుకురావడం ఇది. కొత్త సంస్కారాల త్రోవ. మతం ముఖ్యం. ఇప్పుడు మరీ ముఖ్యం. దానిని చర్చించిన కథలు మూడు ఉన్నాయి. అమ్మ బొమ్మ- వేంపల్లె షరీఫ్, సాహిల్ వస్తాడు- అఫ్సర్, సంస్కారం- వనజ తాతినేని. మూడూ సున్నితమైన కథలు. సున్నితమైన అంశాన్ని చాలా కన్విన్సింగ్‌గా ఓర్పుగా చెప్పే కథలు. ఈ దేశంలో పాఠ్యాంశాలకు మతం ఉంది. అది మెజారిటీలదైతే కనుక మైనారిటీలను అభద్రతలో నెట్టేస్తుంది. ఈ దేశంలో ‘అపవాదు నిర్మాణం’ ఉంది. అది మెజారిటీలు నిర్మించేదైతే గనక మైనారిటీలకు మృత్యుపాశం అవుతుంది. ఈ దేశంలో స్వేచ్ఛగా మతం ఎంచుకోవడంలో పురుషుల పెత్తనం ఉంది. అది మెజారిటీలదైతే గనుక మైనారిటీలకు పెనుగులాటగా మారుతుంది. ముగ్గురూ బాగా రాశారు. వనజ తాతినేని ఇంకా బాగా. ఈ సంకలనంలో ఉన్న మరో మంచి కథ సుజాత బెడదకోట రాసిన ‘అమ్మ- నాన్న- అమెరికా’. కాన్పులకీ, పెంపకాలకీ అమెరికాకు వెళ్లే అమ్మమ్మల, నాయనమ్మల అవస్థను చాలా చక్కగా- కొడుకులూ కోడళ్లూ సెన్సిటైజ్ అయ్యే స్థాయిలో- చెప్పిన కథ ఇది. ఈ కథ చదివినవారు వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను తమ అవసరాల కోసం అమెరికాకు పిలిచి హింసించడం ఆపేస్తారు. ఇక పి.వి.సునీల్ కుమార్, అల్లం వంశీ, ఎ.వి.రమణ ప్రసాద్‌ల కథలు, ఆ కథల్లోని ‘ఈజ్’ చూస్తే పాఠకులకు ఇక వీళ్లతో దిగులు లేదు అనే నిశ్చింత కలుగుతుంది. ముసునూరు ప్రమీలతో కలిసి ఈ సంకలనానికి సంపాదకత్వం వహించిన డా.సామాన్య స్వయంగా రచయిత. అయితే సంపాదకురాలిగా కూడా ఆమెకు తాను ఏ కథలను ఎంచుకుంటున్నదో ఎందుకు ఎంచుకుంటున్నదో స్పష్టత ఉందనిపిస్తుంది ఈ సంకలనం చూస్తే. వస్తువును మాత్రమే పరిగణించకుండా కథను ‘మొత్తం కథ’గా చూడటం వల్ల కూడా మంచి కథలు దొరికాయనిపిస్తోంది. ప్రయాణం మొదలయ్యింది. ఇక ఈ సంపాదకులుగాని, రచయితలుగాని చేయవలసిన గమనం చాలానే ఉంది. ఇరువురూ నిరాశ పరచరనీ మధ్యలోనే తప్పిపోరని ఆశిద్దాం. - నెటిజన్ కిశోర్ -
కథలలో అత్తరు, పత్రికతో పన్నీరు
శ్రీపాద పత్రికా సేవ వారి కథల మాదిరి గులాబీ అత్తరు వలె గుబాళించలేదు. వాస్తవానికి ఆయన పత్రికా రచన నిన్నటి పన్నీటి జల్లు. పత్రికా రచనలోని లోతును అర్థం చేసుకుంటూ శాస్త్రిగారు వెలుబుచ్చిన అభిప్రాయాలు చూడాలంటే ‘ప్రబుద్ధాంధ్ర’ను పలకరించాలి. తెలుగు పత్రికలు ఒక రూపం సంతరించుకోవడానికీ, అందరికి అందుబాటులోకి రావడానికీ జరిగిన కృషి చరిత్రాత్మకమైనది. తొలి పత్రిక ‘వృత్తాంతి’ (1838) నుంచి ఆ కృషి సుస్పష్టం. సంపాదకుడు, ఉప సంపాదకుడు, వీరికి ఉండవలసిన దృష్టి, ప్రచురించే అంశాలు, వాణిజ్య ప్రకటనలు, ఆఖరికి పాఠకుడు ఎలా ఉండాలో కొ క్కొండ వెంకటరత్నం పంతులు నడిపిన ‘ఆం ధ్రభాషా సంజీవని’ పత్రికలో పద్య రూపంలో వెల్లడించారు. తాపీ ధర్మారావు ‘ప్రజామిత్ర’ ను వ్యావహారిక భాషలో ప్రచురించి ఒక మలుపు తిప్పారు. కందుకూరి, ఏపీ పార్థసారథి నాయుడు, ముట్నూరి, కాశీనాథుని నాగేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, విశ్వనాథ, సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దెరాజు సోదరులు- వంటి ఎందరో తెలుగు పత్రికకు వన్నెలు కూర్చారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పేరు వినగానే ఒక అసాధారణ కథకుడు తలపునకు వస్తాడు. కానీ తెలుగు పత్రికా రంగ చరిత్రలోనూ ఆయనకు సముచిత స్థానం ఉంది. ఆయన సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ‘ప్రబుద్ధాంధ్ర’. పత్రిక అంటే, కొంత సమాచారాన్ని సేకరించి అచ్చువేయడం ఒక్కటే కాదు. పాఠకులకు ఆ సమాచారాన్ని చేర్చే క్రమం ఒక తాత్వికతతో, ప్రయోజనంతో సాగుతుంది. దానిని గ్రహించిన వారు శ్రీపాద. ‘రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని....ఆరోగ్యాన్ని, ధనాన్ని చివరికి జీవితాన్ని మానవ సేవ కోసం సంతోషంగా త్యా గం చేసే ప్రతికా సంపాదకుడి కంటె ఉత్తమ శ్రేణికి చెందినవారు మరొకరు లేరు...’ అని ఎవరనగలరు? పత్రికా సంపాదకుల మీద అంతటి సానుభూతే కాదు, పత్రికల చారిత్రక కర్తవ్యం మీద అంతకు మించి గౌరవ ప్రపత్తులను వెల్లడించారు, ఆయనే. ‘పాశ్చాత్య దేశాలలో పత్రికలు నేడు విప్లవాలను కలిగిస్తున్నాయి. శాంతిని నెలకొల్పుతున్నాయి. రాజుల్ని పదవీ భ్రష్టుల్ని చేస్తున్నాయి. మానవమాత్రుల్ని దేశాధ్యక్ష పీఠాలు యెక్కిస్తున్నాయి’ అని. ఈ మాటలు రాసినవారు శ్రీపాదవారే. కానీ శ్రీపాద పత్రికా సేవ వారి కథల మాదిరి గులాబీ అత్తరు వలె గుబాళించలేదు. వాస్తవం చెప్పాలంటే ఆయన పత్రికా రచన నిన్నటి పన్నీటి జల్లు. పత్రికా రచనలోని లోతును ఇంత బాగా అర్థం చేసుకుంటూ శాస్త్రిగారు వెలుబుచ్చిన ఆ అభిప్రాయాలు చూడాలంటే ‘ప్రబుద్ధాంధ్ర’ ను పలకరించాలి. ‘ప్రబుద్ధాంధ్ర’ను 1922లో తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం సమీపంలోని రాయవరంలో ఆరంభించారు. కొంతకాలం నడి చి, నిలిచిపోయినా, 1934లో మరో ప్రయాణం ప్రారంభించింది. అప్పటికే ‘కృష్ణాపత్రిక’(1902), ‘ఆంధ్రపత్రిక’(1914) తెలుగువారి మీద గట్టి ప్రభావం చూపుతున్నాయి. తాపీ ధర్మారావునాయుడు వ్యావహారికమా, గ్రాం థికమా అన్న మీమాంసలో ఉన్నారు. అలాంటి కాలంలో(1934, ఏప్రిల్) ‘తెనుగు పత్రికల సంపాదకులకు’ అన్న శీర్షికతో గిడుగు వెంకటరామమూర్తి రాసిన వ్యాసా న్ని శ్రీపాద ప్రచురించారు. ‘ఇంగ్లండు, ఫ్రా న్సు(ఫ్రాన్స్), జర్మనీ, రష్యా, టర్కీ, చీనా, జపా ను మొదలయిన దేశములలోని వార్తాపత్రికల సంపాదకులు తమ వాడుక భాషలోనే తమ వ్యాసములను రచిస్తున్నారని ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికల సంపాదకులకు తెలుసుననుకుంటాను. తెలిసిన్నీ ఆంధ్ర సా హిత్య పరిషత్ పత్రికా సంపాదకుల వలెనే వారున్నూ తమ వాడుక భాషను బహిష్కరించి, వ్యవహార భ్రష్టములయిన ప్రాచీనా ంధ్ర శబ్దములను ఎందుకు వాడుతున్నారో నాకు బోధపడదు....’ అని ప్రశ్నించారు. గిడుగు వ్యాసం మీద శ్రీపాద రాసిన వ్యాఖ్య ఇంకా ఆసక్తికరం. ‘పత్రికలు ప్రపం చ జ్ఞానాన్ని కలిగించేవిగానీ, పాఠ్య గ్రంథా లు కావు. అదలా వుండగా మేడితోక పట్టుకుని అరక సాగిస్తూనే రైతు పత్రిక విప్పవలసి వుంటుంది.... గోచి పాత పెట్టుకుని చెమట వోడుస్తూనే కార్మికుడు పత్రిక చదవలసి వుంటుంది....చాలా తరగతుల వారు ఏదో పనిలో మునిగి వుండే పత్రికలు చదవ్వలసి వుంటుంది. అలాంటప్పుడు పత్రిక లు అప్రయత్నంగా బోధపడే వాడుక భాష లో కాక, వొక పక్క వ్యాకరణమూ, మరో పక్క నిఘంటువూ, పైగా వొక పక్క పండితుణ్ణీ వుంచుకుంటాడని(భావిస్తూ) కొరకబడని భాషలో వుంటే యేం లాభమూ...?’ ఈ వ్యాఖ్య చదివిన తరువాత ‘ప్రజామిత్ర’ వాడుక భాషలోకి పరివర్తనం చెందుతున్నట్టు దాని అధిపతి గూడవల్లి రామబ్రహ్మం (సంపాదకుడు తాపీ ధర్మారావు) ప్రకటించారు. తెలుగు పత్రికలలో వాడుక భాష దేదీప్యమానంగా వెలిగిందంటే అందులో శ్రీపాద కృషి అనన్య సామాన్యమైనది. డా. నాగసూరి వేణుగోపాల్ (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త) ఏప్రిల్ 23 శ్రీపాద 123 జయంతి