సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత మల్లా రాజిరెడ్డి (71) అలియాస్ సాయన్న మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాడపడుతున్న ఆయన ఈ నెల 16న చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరణించినట్లు సమాచారం. తొలితరం మావోయిస్టు నేతలతో కీలక సంబంధాలున్న ఆయన మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అత్యంత కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి తదితరులతో కలిసి పనిచేశారు. అయితే రాజిరెడ్డి మరణవార్తను మావోయిస్టులు, ఆయ న కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు.
కొండపల్లి పరిచయంతో అడవిబాట...
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సంగ్రాం, సాగర్, అశోక్, దేశ్‌పాండేగా దళంలో ప్రసిద్ధుడు. 1975 నుంచి 1977 వరకు రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. ఇంటర్ చదివే రోజుల్లో ఎగ్లాస్‌పూర్‌లో ఓ కేసులో అరెస్టు అయి వరంగల్ జైలుకు వెళ్లారు.
అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న పీపుల్స్‌వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన పరిచయం రాజిరెడ్డిపై మరింత ప్రభావం చూపింది. జైలు నుంచి బయటకొచ్చాక రాజిరెడ్డి అడవిబాట పట్టారు. వాస్తవానికి రాజిరెడ్డితోపాటు ఆయన సోదరుడు బీమారెడ్డికి సైతం సింగరేణి నుంచి కాల్‌లెటర్లు వచ్చాయి. కానీ తన విప్లవభావాలకు ఉద్యోగం సరిపోదని భావించిన రాజిరెడ్డి దళంలో చేరారు.
దళ సభ్యురాలితో వివాహం...
రాజిరెడ్డి తన దళంలోనే రత్నం అనే సభ్యురాల్ని వివాహం చేసుకున్నాడు. వారికి స్నేహలతారెడ్డి అనే కుమార్తె ఉన్నారు. అయితే దళంలో కొనసాగుతున్నందున కూతురి ఆలానాపాలనను చిన్నప్పుడే తమ్ముడు భీమారెడ్డికి అప్పగించాడు. ఆమె హైదరాబాద్‌లో ఉన్నతవిద్య పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లాయర్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్ కాశిం.
నెట్టింట వీడియో వైరల్...
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మృతిపైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో రామచంద్రారెడ్డి మృతిచెందారంటూ ఓ మృతదేహం చుట్టూ పలువురు మావోయిస్టులు రోదిస్తున్నట్లున్న ఓ వీడియో గురువారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే మల్లా రాజిరెడ్డి మృతి వార్తకు సైతం అదే వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం గమనార్హం. ఈ వీడియోను ఫ్యాక్ట్ చేయగా గురువారమే అది అప్‌లోడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. కట్టా రామచంద్రారెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా కొహెడ మండలం, తీగలకుంటపల్లి గ్రామం. వికల్ప్, విజయ్, రాజుదాదా, జురు, సునీల్, వాసు పేర్లతో ప్రచారంలో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్యం సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
పలు రాష్ట్రాల్లో కేసులు...
రాజిరెడ్డిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పోలీసులపై దాడి చేసిన ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో 1986లో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఎస్సై, 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. జన్నారం మండలం తపాపూర్ గ్రామంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు గ్రూప్ నలుగురిని హత్య చేసిన కేసులో ఏ1గా కొండపల్లి సీతారామయ్య ఉండగా ఏ2గా రాజిరెడ్డి పేరు నమోదైంది.
ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులోనూ రాజిరెడ్డి నిందితుడు. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కేరళ వెళ్లిని రాజిరెడ్డిని 2008 జనవరిలో అంగన్‌మలైలో ఎస్‌ఐబీ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కుట్ర కేసులో మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచి, కరీంనగర్ జైలుకు తరలించారు.
రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత 2010లో బెయిల్‌పై బయటికి వచ్చాక రాజిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. రాజిరెడ్డిపై తెలంగాణలో రూ.25 లక్షల క్యాష్ రివార్డు ఉండగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్యాష్ రివార్డులన్నీ కలిపి రూ.కోటి వరకు ఉంటాయని అధికారిక సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment