సంగీత, వైద్య సవ్యసాచి డాక్టర్ శ్రీపాద పినాక పాణి.. గురువులకే గురువు! నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని ఆ రోజు లలో, తమిళనాటలానే తెలుగునాట కూడా శాస్త్రీయ సంగీతం పరిమళించాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశగా ఎందరో సంగీత శిఖా మణులను తెలుగు రాష్ట్రానికి అందించారు. నేడు శ్రీపాద జయంతి. 1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో జన్మించారు. శ్రీపాద రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి వారి శిష్యరికం చేశారు. 1939లో విశాఖపట్నం ఆంధ్ర వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకున్నారు. 1957లో కర్నూలు వైద్యకళాశాలకు బదిలీ అయ్యారు. కర్నూలులోనే స్ధిర నివాసం ఏర్పర్చుకున్నారు.
సంగీతం వింటూనే నొటేషన్స్ రాయగల నైపుణ్యం శ్రీపాదవారిది. పదవీ విరమణానంతరం త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరపల్లవులు, తాన పద వర్ణాలు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తక రచనకు శ్రీకారం చుట్టారు. సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ఆయనవి నాలుగు సంపుటాలు ప్రచురించింది. డా. నోరి దత్తాత్రేయుడు వైద్యరంగంలో శ్రీపాద వారి ప్రముఖ శిష్యులలో ఒకరు కాగా, నూకల చిన సత్య నారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామశర్మ సంగీతంలో వారి శిష్యులు. 1984 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో ఆయన్ని సత్కరించింది. శ్రీపాద తన 99 ఏళ్ల వయసులో 2013 మార్చి 11న కన్నుమూశారు.
డాక్టర్ శ్రీపాద
Comments
Please login to add a commentAdd a comment