
హిట్లర్ ఐస్‌క్రీమ్!
నా అంతవాడు లేడని నియంతగా ప్రవర్తించే నేతలందరికీ ఇదొక హెచ్చరిక. పట్టపగ్గాల్లేని దురహంకారంతో ప్రవర్తించి, లక్షలమందిని ఊచకోత కోసిన జర్మనీ నియంత హిట్లర్ బతికుండగానే చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ‘గ్రేట్ డిక్టేటర్’లో జోకర్‌గా మిగిలిపోయి నవ్వులపాలయ్యాడు. ఈ నియంత పేరిట ఇప్పుడు యూపీలో ఒకరు ఐస్‌క్రీమ్ తయారుచేసి అమ్ముతున్నారు. ‘సరుకు అమ్ముకోవడానికి మీకు ఇంతకన్నా మంచి పేరు దొరకలేదా’ అని ప్రశ్నించినవారికి కంపెనీ యజమాని నీరజ్ కుమార్ ఓపిగ్గా జవాబిస్తున్నాడు. ‘ముక్కోపిగా... అయినదానికీ, కానిదానికీ కఠినంగా ప్రవర్తించేవారిని మా దగ్గర హిట్లర్ అనే అంటారు.
మా బంధువొకరిని మేం అలాగే పిలిచేవాళ్లం. అందుకే ఐస్‌క్రీమ్‌కు సరదాగా ఆ పేరే పెడదామనుకున్నాను...తప్పేంటి’ అంటున్నాడు. కానీ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మాత్రం తప్పే అంటున్నారు. నెటిజన్లలో చాలామంది కూడా అలాగే అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒకనాటికి తమకూ హిట్లర్ గతే పడుతుందని, ఇలా బజారున పడాల్సివస్తుందని నియంతలు తెలుసుకోవాలన్నది మరికొందరి అభిప్రాయం.