తెలుగు ప్రతిపత్తి: కొత్త తెగులు | Importance of Telugu | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రతిపత్తి: కొత్త తెగులు

Published Tue, Mar 17 2015 3:02 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు - Sakshi

ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు

రెండోమాట
సుప్రీంకోర్టు న్యాయవాది ధనంజయ ఈ వ్యాసకర్తతో (అధికార భాషా సంఘం అధ్యక్షునిగా) జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలలో (2008-09) ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు. అది తెలుగు వారంతా సిగ్గుతో తల దించుకోవలసిన అంశం. తెలుగుకు భాషా ప్రతిపత్తి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న తమిళుడు ఆర్.కె. గాంధీతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఒక  తెలుగు లాయరే చేతులు కలిపాడు! అందుకు ఉపకరించే
లేఖను / అఫిడవిట్‌ను సమర్పించి గాంధీ వాదనకు తోడూ నీడై నిలిచాడు!

 మూడు వేల ఏళ్ల చరిత్ర ఉన్న లిపి; శాసన, పురావస్తు ఆధారాలు, సంప్ర దాయాలు పూర్వరంగంగా దీపిస్తున్న భాష -తెలుగు. ఆరేళ్ల క్రితమే భారత ప్రభుత్వం శిష్టభాషగా, ప్రాచీన ప్రామాణిక భాషగా తెలుగుకు గుర్తింపు ఇచ్చింది. అయినా, ఆ ప్రతిపత్తిని గౌరవించడానికి నిరాకరిస్తున్న దుష్టశక్తుల నుంచి, లిటిగెంట్ల నుంచి, కోర్టు పక్షుల నుంచి మాత్రం ఈ భాషకు విమోచన కలగలేదని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.  

ఇప్పటికీ త్రిశంకు స్వర్గమేనా?

అవిభక్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కృషి, భాషాభిమానుల ఉద్య మాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక శిష్టభాషా ప్రతిపత్తి లభించింది. కానీ, అక్కసు కొద్దీ ఈ ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ ఆర్.కె. గాంధీ అనే తమిళుడు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ మాత్రమే కాక, ఇలాంటి ఇతర అనుబంధ దరఖాస్తులను ఈ రోజుకు కూడా ఉపసంహరించుకోలేదు. మద్రాసు హైకోర్టు వాటిని విచారించి తుది తీర్పు ఏదీ ప్రకటించనూ లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు భాషా ద్వేషి అయిన ఆ పిటిషన్‌దారుడే (న్యాయవాది హోదాలో) మిగిలిన దక్షిణ భారత ప్రాంత భాషలు కన్నడం, మలయాళాలను విశిష్ట భాషలుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ, ఆ భాషలకు ఇచ్చిన గుర్తింపు కూడా చెల్లదని మరో రిట్‌ను దాఖలు చేశారు. దురదృష్టకరమైన ఈ ఓర్వలేనితనం కారణంగా తెలుగు ప్రతిపత్తి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇంకా చెప్పాలంటే, భాష ఒకటైనా, మన ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోవడం పొరుగువాడికి మరింత అలుసైంది. అందివచ్చిన తెలుగు శిష్టభాషా ప్రతిపత్తి హోదాను కూడా ప్రభుత్వాలు కాపాడుకోలేని దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తెలుగు భాషా ప్రతిపత్తిని సవాలు చేస్తూ వచ్చిన రిట్ పిటిషన్లను సత్వరం విచారణకు స్వీకరించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న ఆ రిట్‌లను కొట్టివేయా లని, చిరకాలంగా మూలుగుతున్న ఈ సమస్యను తేల్చాలని నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధారాలతో సహా కోర్టుకు పత్రాలను సమర్పించింది. దీనితో పాటు నాటి అధికార భాషా సంఘం అధ్యక్ష హోదాలో ఈ వ్యాసకర్త కూడా విశిష్ట సమాచారాన్నీ, సమాధాన పత్రాలనూ మద్రాసు హైకోర్టుకు సమర్పించడం జరిగింది (రిట్ నం.18810/ 2008). కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడినప్పటికీ, తమిళుడి రిట్‌తో ముదిరిన వివాదం నేపథ్యంలో, కర్ణాటక న్యాయవాదితో కలసి ఈ చర్య తీసుకున్నాం. అయినప్పటికీ సమస్య ఇంకా నానుతూనే ఉంది.

సమస్య పట్టని తెలుగు ప్రభుత్వాలు

దరిమిలా ఈ స్తబ్దతను ఛేదించడానికే మద్రాసుకు చెందిన తెలుగు పండి తుడు, భాషావేత్త టి. సంజీవరావుగారు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ప్రత్యేకంగా మరొక రిట్‌ను (2014, సెప్టెంబర్) దాఖలుచేశారు. అంతకుముందు అధికార భాషా సంఘం వేసిన రిట్ ప్రాతిపదికగా నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎస్. చెల్లప్ప వేసిన రిట్‌కు సంజీవ రావు రిట్ (28334/2008) అనుబంధంగా మారింది. ఈ దశలో హైకోర్టు జాప్యం లేకుండా నివారించడం కోసం అటు కేంద్రానికీ, ఇటు రెండుగా చీలిన తెలుగు ప్రాంత ప్రభుత్వాలకూ సమాధానాలు కోరుతూ సుమోటోగా నోటీ సులు జారీ చేసింది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాధి నేతలకు పదవుల బాధ తప్ప, భాషా ప్రతిపత్తి సమస్య పట్టలేదు. కోర్టుకు సమాధానాలు ఇవ్వకుండా ఈ రెండు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం ఇచ్చింది. కథ ఇక్కడితో ముగియలేదు. ఈ వ్యాజ్యానికి సంబంధించిన పత్రాలను సంజీవరావు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కూ, మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పంపారు (ఆగస్ట్/సెప్టెంబర్ 2014). అలాగే తెలం గాణలో డాక్టర్ రమణాచారికీ, డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్‌కూ పంపారు. ఫోన్‌లో మాట్లాడారు. ఇంత జరిగినా రెండు ప్రభుత్వాలు ఈరోజు వరకు స్పందించలేదని మద్రాస్ నుంచి అందుతున్న సమాచారం వల్ల తెలుస్తున్నది.

ఇదేం వెన్నుపోటు?

కన్నడ భాషా ప్రతిపత్తి కోసం కృషి చేస్తూ మద్రాసు హైకోర్టులో రిట్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది ధనంజయ ఈ వ్యాసకర్తతో (అధికార భాషా సంఘం అధ్యక్షునిగా) జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలలో (2008-09) ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు. అది తెలుగు వారంతా సిగ్గుతో తల దించుకోవల సిన అంశం. తెలుగుకు భాషా ప్రతిపత్తి (క్లాసికల్ లాంగ్వేజ్) ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న తమిళుడు ఆర్.కె.గాంధీతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఒక స్థానిక తెలుగు లాయరే చేతులు కలిపాడు! అందుకు ఉపకరించే లేఖను / అఫిడవిట్‌ను సమర్పించి గాంధీ వాదనకు తోడూ నీడై నిలిచాడు! ఈ ‘తెలుగు మా తెలుగు కాద’ని సిగ్గూ శరమూ విడిచి పరాయివాడికి వంత పాడాడు ఆ తెలుగువాడు! చివరికి నేడు మన తెలుగు పాలకులు ఏ స్థితికి దిగజారిపోయారంటే - తెలుగు ప్రాంతాలలోని అన్ని రకాల మాండలికాల సొగసులని కలుపుకుని సాగేదే తెలుగు భాష అనీ, ఆ సోయగాలు లేకుండా తెలుగు భాష లేదనీ, ఉండబోదనీ గుర్తించలేని వాజమ్మలైపోయారు!

పెద్దల మాట గుర్తు చేసుకుందాం!

ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతటి ‘కోమా’లోకి జారుకు న్నారంటే - తెలంగాణ పాఠ్యపుస్తకాల నుంచి ఆంధ్రుల చరిత్రను, ఆంధ్ర ప్రదేశ్ పాఠ్య పుస్తకాల నుంచి తెలంగాణ చరిత్రను, ఉద్యమాల చరిత్రనూ ఎత్తివేయాలనీ, లేదా కనుమరుగు చేయాలనీ పోటాపోటీగా అడుగులు వేస్తున్నారు! ఉభయులూ జారుడు బండ మీద ఆసీనులై ఉన్నారన్న సంగతి మరచిపోరాదు! తెలంగాణ సాంస్కృతికోద్యమ వైతాళికుడూ, తెలంగాణ ఆంధ్ర మహాసభ వ్యవస్థాపకాచార్యులలో ఒకరూ, ‘‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’’ను హృద్యంగా ఆవిష్కరించిన తెలుగు పండితుడూ సురవరం ప్రతాపరెడ్డి నీతి వాక్యాలే ఈ ఉభయులకూ సమాధానం. ‘‘ఆంధ్ర’’ అనే పదాన్ని తెలుగు జాతి నుంచి వేరు పరచి చూపే తప్పుడు సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని ‘‘గోల్కొండ’’ సంపాదకులుగా సురవరం చేసిన హెచ్చరిక తెలుగు వారి మధ్య గండిగొట్ట జూసే పెడ బుద్ధులకు దీటైన సమాధానం:
 ఆంధ్ర అను పదము కులమును తెలుపదు, వర్ణమునకు వర్తించదు, మతమునకు సంబంధించదు, ఆంధ్రులు అంటే తెలుగు మాట్లాడేవారు. అట్టి ఆంధ్ర పదమునకు మనము కొత్త అర్థమునిచ్చుటకు ఏ మాత్రమును అధికారము లేనివారము. ఆంధ్ర అను పదము అది పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక భాష అను అర్థమునే యిచ్చుచూ ఉన్నది’’ (తెలంగాణ మహాసభ: 23-06-1941)! అంతేగాదు, భౌతిక విజ్ఞానశాస్త్రవేత్త నోబెల్ పురస్కార గ్రహీత సర్ సి.వి.రామన్ మన తెలుగు వారి ఆంధ్ర (తెలుగు) భాషను ఇలా వర్ణించారు: ‘‘ఆంధ్ర (తెలుగు) భాష సౌందర్యం, దాని కవిత, దాని మనోహరమైన సంగీతం విషయమై ఎవరికీ ఎలాంటి సందేహం ఉండరాదు. తన గానమాధుర్యం ఒక్కటే ‘ఆంధ్ర’ పద నిర్వచనంతో కన్యాకుమారి నుంచి తపతీ నదీ తీరం దాకా పరివ్యాప్తమై ఉన్న ప్రజలందరినీ దగ్గరికి చేర్చడానికి వీలు కల్పించింది. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు కూడా ఈ విలక్షణమైన ఆంధ్ర భాష గానమాధుర్యం వల్ల ఆంధ్రులే అవుతారు. ‘త్యాగరాజు గానం చేసింది ఆంధ్ర భాషలోనే. అందుకే తెలుగునకు ప్రాచ్య ఖండపు ఇటలీ భాష అన్న బిరుదు న్యాయంగానే అమరింది’’ (నిజాం కళాశాలలో రామన్ ఉపన్యాసం: 21-2-1922). ఆ గాన మాధుర్యం అన్ని మాండలికాలతో ప్రాదేశికాలతో దీపిస్తున్న భాషే తెలుగు అయింది.


 రెండు సర్కార్లకు అగ్నిపరీక్ష
వ్యావహారికంలో ఉన్న ఏ మాండలికమయినా ప్రామాణిక భాషేనని గురజాడ అన్నాడు! కేవల మాండలికంతో కథలు నడపవచ్చు, కవితలు అల్లవచ్చు గాని కేవల మాండలికవాదులైన కొమ్ములు తిరిగిన ప్రసిద్ధ రచయితలు పూర్తిగా ‘డొర్సెట్’ మాండలికంలో పత్రికలు నడపడానికి ప్రయత్నించి విఫలమయ్యా రు. బహుశా అందుకేనేమో తెలుగు నాట ప్రజాకవి కాళోజి కూడా, ఇతర భాషలు నేర్చి మాతృభాష ఆంధ్రం (తెలుగు) మాత్రం నాది కాదనే తెలుగు వాడిని ముఖం వాచేలా పెట్టాడు: ఇంతకూ ‘నీదే భాషరా? నాటి ఆంధ్రం కాదంటూ సకిలిస్తావెందుకురా? నీదేమి వేషంరా? ఈ భాష, ఈ వేషం ఎవరి కోసం రా’ భడవా అని ఎద్దేవ చేయాల్సివచ్చింది! ‘‘ఆంధ్రులెవరు, మేం ఆం ధ్రులం కాదు’’ అంటూనే తెలుగు జాతికి, తెలుగు భాషకు వ్యతిరేకంగా ఉద్య మాలు నడిపేవారు నాలుకలు కరుచుకోవలసిన ఘడియలివి! ఎందుకంటే ప్రాచీన (శిష్ట) భాషా ప్రతిపత్తి మొత్తం తెలుగు (ఆంధ్ర) భాషకుగాని, కేవల మాండలికాలకు, యాసలకూ కాదని ఇప్పటికైనా గుర్తించి, మద్రాసు హైకోర్టు నోటీసులకు రెండు రాష్ర్ట ప్రభుత్వాలూ సకాలంలో సజావుగా సమాధానాలు సంధించాలి? ఇదే వారి భాషాభిమానానికి అగ్నిపరీక్ష! ‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’’ అన్న మాటను కాస్తా ఇద్దరూ మడిచి గోదావరిలోకి ఒకడు, మూసీలోకి ఒకడూ నెట్టేశారు!

(వ్యాసకర్త మొబైల్: 9848318414)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement