సంపాదకీయం: చూస్తుండగానే పాపం పెరిగినట్టు పెరిగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను అదుపు చేసేందుకంటూ సిరియాపై దండ యాత్రకు అమెరికా సన్నాహాలు ప్రారంభించింది. ఎప్పటిలానే భద్రతా మండలివంటి సంస్థలను విస్మరించి, అంతర్జాతీయ నియమాలను తోసిరాజని ఈ సన్నాహాలన్నీ సాగుతున్నాయి. యుద్ధ విమానాలిస్తామని, దళాలను తరలిస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇవన్నీ పుష్కరకాలంక్రితం ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధానికి చేసుకున్న ఏర్పాట్లను గుర్తు చేస్తున్నాయి. ఇందులో ఇరాన్ సాయాన్నీ, చివరకు తన బద్ధ శత్రువైన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తోడ్పాటునూ తీసుకుందామని అమెరికా అనుకున్నా అది ఫలించలేదు. ‘నెత్తురంటిన చేతులతో చేయికలపలేమ’ని ఇరాన్ మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.
తన నేతృత్వంలో పశ్చిమ దేశాల దళాలతో కూటమినేర్పరిచి ఇరాక్, సిరియా సరిహద్దుల్లో ‘విముక్తి ప్రాంతాల’ను ప్రకటించిన ఐఎస్ ఉగ్రవాదులపై యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించడం అమెరికా లక్ష్యం. ఐఎస్ మిలిటెంట్లు ఇప్పటికే ఇద్దరు అమెరికా బందీలను హతమార్చగా, నిరుడు సిరియాలో తమకు పట్టుబడ్డ బ్రిటన్ జాతీయుడు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్త డేవిడ్ హెయిన్స్‌ను రెండురోజులక్రితం చంపేశారు. ఇది పేరుకే సున్నీల ప్రాబల్యమున్న సంస్థగానీ ఏ తెగనూ, జాతినీ విడిచిపెట్టడం లేదు. సిరియా-ఇరాక్ సరిహద్దు ప్రాంతాల్లో లొంగిరానివారందరినీ ఆ మిలిటెంట్లు చిత్రహింసలు పెడుతున్నారు. ఊచకోత కోస్తున్నారు. ఇలా ఏడెనిమిది వేలమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలమంది ప్రాణాలరచేత బెట్టుకుని కొంపా,గోడూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రపంచవ్యాప్త ఉగ్రవాద సంస్థలను ఏకఛత్రం కిందకు తీసుకొస్తామని ఐఎస్ సంస్థ ప్రకటించగా...మన దేశంతోసహా చాలా దేశాలనుంచి దీపం పురుగుల్లా అటు ఆకర్షితులవుతున్నవారు కూడా లేకపోలేదు.
ఐఎస్ మిలిటెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే. మానవీయ విలువలనూ, నాగరిక సమాజ పునాదులనూ ధ్వంసం చేస్తున్న ఈ బాపతు ఉగ్ర ధోరణులను నియంత్రించాల్సిందే. కానీ, అందుకు ఎంచుకునే తోవ కూడా సరిగా ఉండాలి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికంటూ తీసుకునే చర్యలు దాన్ని మరింత పెంచి పోషించేవిగా మారకూడదు. ఈ విషయంలో అమెరికా ప్రతిసారీ చేసిన తప్పునే చేస్తున్నది. ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయంటూ ఆ దేశంపైకి 2003లో దండెత్తింది. అక్కడ సద్దాం హుస్సేన్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసి, తన అనుకూలురను ప్రతిష్టిస్తే అక్కడి చమురు నిక్షేపాలపై ఆధిపత్యం సాధ్యమవుతుందని తలపోసింది.
అది కాస్తా వికటించి ఎక్కడికక్కడ ఉగ్రవాద గ్రూపులు, బయల్దేరి ఆ దేశాన్ని వల్లకాడు చేశాయి. లిబియా, ఎమెన్, లిబియా వంటిచోట్ల కూడా ఈ వ్యూహమే అమలై అచ్చం ఇరాక్ తరహాలోనే ఉగ్రవాదం విస్తరించింది. ఇప్పుడు తాము పోరాడతామంటున్న ఐఎస్ మిలిటెంట్లు సిరియాలో అలా పుట్టుకొచ్చినవారే. తన చేతికి మట్టి అంటకుండా అసద్ సర్కారును కూల్చాలన్న అతి తెలివితో అక్కడి ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులకు మారణాయుధాలు, డబ్బు కుమ్మరించింది అమెరికా, మిత్రదేశాలే. ఇదంతా సాగుతున్నప్పుడే అంతర్జాతీయ నిపుణులు నెత్తీనోరూ బాదు కున్నారు. ఆ ఆయుధాలూ, డబ్బూ అల్ కాయిదా వంటి ఉగ్రవాదుల చేతుల్లోకి పోతున్నాయని హెచ్చరించారు. అలాగైతే మరీ మంచిది కదా అని అమెరికా లెక్కలేసుకున్నది. అల్ కాయిదావంటి మొండి ఘటాలైతే అసద్‌ను అధికార పీఠంనుంచి కూలదోసేవరకూ విశ్రమించబోవని అంచనా వేసింది. అసద్ రంగం నుంచి వైదొలగాక వారి సంగతి చూడవచ్చనుకున్నది. తానొకటి తలిస్తే మిలిటెంట్లు మరోలా ఆలోచిం చారు. ఈ ఆయుధాలు, డబ్బుతో అల్ కాయిదాకు దీటైన ఐఎస్‌ను స్థాపించారు. ఆ సంస్థ నాయకుడు అబూ బకర్ ఖలీఫాగా ప్రకటించుకుని, ముస్లిం ప్రపంచమంతా తన ఆధిపత్యాన్ని అంగీకరించాలని పిలుపు నిచ్చాడు. ఇప్పుడు ఐఎస్‌ను అంతమొందించడమనే అమెరికా లక్ష్యం... ఆ సంస్థను తలదన్నే మరో ఉగ్రవాద సంస్థకు పురుడుపోయదన్న గ్యారెంటీ ఏంలేదు.
ప్రపంచంలో ఏమూల ఎలాంటి అశాంతి తలెత్తినా సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికీ, అవసరమైతే పరిమిత బల ప్రయోగంతో దారికి తేవడానికీ ఐక్యరాజ్యసమితి, భద్రతామండలివంటి అంతర్జాతీయ సంస్థలు ఆవిర్భవించి ఉన్నాయి. రెండు ప్రపంచయుద్ధాలు మానవజాతికి పెనువిషాదం మిగిల్చాక, ఆ అనుభవాలనుంచి గుణపాఠాలు తీసుకుని ఏర్పరిచిన సంస్థలివి. ఈ సంస్థలకు పెద్దరికం ఇచ్చి, వాటి నిర్ణయాను సారం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తే నిజానికి ఐఎస్‌వంటి సంస్థలకు సమాజాల్లో చోటుండదు. కానీ, దురదృష్టవశాత్తూ అమెరికా దీన్నంతటినీ విస్మరిస్తున్నది. ఇప్పుడు పీటర్ హెయిన్స్ ఉసురుతీయడంపై భద్రతా మండలి స్పందించింది.
మిగిలిన బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదలచేయాలని ఐఎస్‌ను కోరింది. అంతకుమించి ఆ సంస్థను తుడిచిపెట్టేందుకు బాంబు దాడులకు దిగమని ఎవరికీ చెప్పలేదు. అందుకు సంబంధించిన తీర్మానమూ ఆ సంస్థ ముందుకు రాలేదు. పశ్చిమాసియా అట్టుడుకుతున్న వైనంపై ప్రపంచ పౌరుల్లో ఆందోళన ఉన్న మాట వాస్తవమే. అయితే, అమెరికాకు నాయకత్వం అప్పగించడం ద్వారా అది సమసిపోతుందన్న భ్రమలెవరికీ లేవు. మిలిటెంట్లను తుడిచిపెట్టే పేరిట పాకి స్థాన్, అఫ్ఘాన్ సరిహద్దుల్లోనూ, లిబియా, ఎమెన్‌వంటి దేశాల్లోనూ ఆ దేశం సాగించిన దాడులు ఎంత మంది సాధారణ ప్రజల ఉసురు తీశాయో అందరికీ తెలుసు. అందువల్లే అమెరికా ప్రస్తుత సమస్యను అంతర్జాతీయ సంస్థల చొరవకు వదలాలి. వాటి మార్గదర్శకత్వంలో పనిచేయాలి.
ఈ ధోరణి ప్రమాదకరంట
Published Tue, Sep 16 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement