కఠోపనిషత్తు | Kathopanisattu | Sakshi
Sakshi News home page

కఠోపనిషత్తు

Published Sat, Nov 15 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

కఠోపనిషత్తు

కఠోపనిషత్తు

అన్ని ఉపనిషత్తులలో కఠోపనిషత్తుకు ఉండే స్థానం ప్రత్యేకమైంది. ఇందులో యోగం గురించి, ముఖ్యమైన వేదాంత భావాల గురించి చర్చ ఉంటుంది. అత్యంత రమణీయమైన కవిత్వం ఉంటుంది. ఇదంతా కథా రూపంగా చెప్పటం ఉంటుంది. ప్రాచ్య, పాశ్చాత్య పండితుల్ని విశేషంగా ఆకర్షించిన ఉపనిషత్తు ఇది. స్వామి వివేకానందుడు తరచు ప్రబోధించే ‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ నిబోధత’ ఈ ఉపనిషత్తు నుంచి గ్రహించిందే. నచికేతుడు అనే బాలుడు మృత్యుదేవత అయిన యముడి దగ్గరకు వెళ్లి చావు పుట్టుకల మర్మం అడిగి తెలుసుకోవటం సూక్ష్మంగా ఇందులోని కథ.  ఉపనిషత్తులోని కొన్ని ముఖ్యమైన శ్లోకాల సారాంశం.

ఆత్మజ్ఞానం కలిగించేదీ, శుభం ప్రసాదించేదీ శ్రేయోమార్గం. అందుకు భిన్నమైం ది ప్రేయోమార్గం. బుద్ధిమంతుడు చక్కగా రెండింటినీ బేరీజు వేసి మేలనుకొన్న మొదటి దాన్ని ఎన్ను కుంటాడు. లోభాసక్తులకు లొంగి పోయిన బుద్ధిహీనుడు రెండో దానికి మొగ్గుతాడు.{శేయోమార్గం గురించి వినటానిక్కూడా చాలా మం ది నోచుకోరు. వినిన వాళ్లకు అర్థం చేసుకొనే ఓపిక ఉండదు. అట్లాంటిది, దాన్ని గురించి ఉపదేశించే ఆచార్యుడు నిజంగా అద్భుతమైన వాడు. దాన్ని గ్రహించగలిగిన శిష్యుడూ అంతే అద్భుతమైనవాడు.   వేదాలు చదివీ, బుద్ధికి పదును పెట్టీ, పుస్తక పాం డిత్యం పెంచుకొనీ, ఆత్మ దక్కుతుందనుకోవటం అజ్ఞానం. స్వయంగా ఆత్మ ఎవరిని వరిస్తే, వారికి అది దక్కుతుంది. తనకు తానుగా తన తనువును ఆవిష్కరించుకొంటుంది.

జ్ఞానికి జాతి మతకుల భేదాలుండవు. వాటన్నింటినీ ముద్దగా చేసి నమిలి మింగేస్తాడు. అతడికి మృత్యు భయం ఉండదు. దాన్ని బాగా నూరి పచ్చడిలా నంజుకుంటాడు. ఒకే ఒక అగ్ని అది మండించే పదార్థాల రూపాలను పొందినట్లు, ఒకే ఒక ఆత్మ అది ప్రవేశించిన వస్తు వుల రూపాలను పొందుతుంది.   {పపంచానికంతటికీ కన్ను వంటివాడైన సూర్యుడికి చూసేవాళ్ల కళ్ల మాలిన్యం ఎలా అంటదో, సకల జీవుల హృదయాల్లో ఉన్న ఆత్మకు ఆ జీవుల దుఃఖం అలా అంటదు.   సంసారమనే ఈ సనాతన అశ్వత్థ వృక్షానికి వేర్లు పైకి వ్యాపించి ఉన్నాయి. కొమ్మలు కిందికి విస్తరిం చి ఉన్నాయి. అదే శుద్ధం అదే బ్రహ్మం అదే అమరం. అన్ని లోకాలూ అందులోనే ఉన్నాయి.హృదయంలో ఉన్న అంతరాత్మ అయిన పురుషుడు బొటనవేలంత వాడు. గడ్డి నుండి లోపలికి పోచను విడదీసినట్లు పట్టుబట్టి అతణ్ణి శరీరం నుంచి వేరుచేయాలి. అతడు పరిశుద్ధుడు, అమరుడు అని తెలుసుకోవాలి.

దీవి సుబ్బారావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement