
నాలుగు నెలల వైవాహిక చీకటి
కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, కార్యకర్త అయిన మీనా కందసామి గతంలో రెండు కవితా సంకలనాలూ, ‘ద జిప్సీ గాడెస్’ అన్న నవలా రాశారు. ఆమె కొత్త నవల When I Hit You చాలామట్టుకు ఆమె స్వీయచరిత్రే! కథకురాలికి పెళ్ళయి, భర్తతో ఒక కొత్త పట్టణానికి మారినప్పుడు ఆమె జీవితం పీడకలగా మారుతుంది. ‘‘నీ ఫేస్‌బుక్ ఖాతాను డీయాక్టివేట్ చేస్తావా, లేదా?’’ అని పంతంగా అగ్గిపుల్లలు ముట్టించి మోచేతి వెంట్రుకల మీద రుద్దుతూ ఆర్పేస్తున్న భర్తకుగానీ, ప్రధాన పాత్ర అయిన యువతికిగానీ దీన్లో పేర్లుండవు.
‘‘నేనొక రేపిస్టును పెళ్లి చేసుకున్నాను. అతను నన్ను కొట్టేవాడు. అతణ్ని వదిలిపెట్టినా, నేనింకా బతికేవున్నాను,’’ అంటుందామె.
కొట్టడానికి కారణాలు అమితమైనవి. కొట్టే పరికరాలకూ కొదవుండదు. మెలితిప్పిన కంప్యూటర్ వైర్లు, లెదర్ బెల్టులు, పీక పిసకడాలు...
ఇంటర్నెట్/ఫోన్ వాడకం మాన్పించినప్పుడు, కాల్పనిక బాయ్‌ఫ్రెండ్సుకు ఉత్తరాలు రాస్తూ, భర్త ఇంటికి రాకముందే, వాటిని డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ‘‘నీ పాస్‌వర్డ్స్ అన్నీ నాకియ్య’’మని భర్త అడిగినప్పుడు వాదించలేక, ఓడిపోతుంది.
పెళ్ళయిన నెల తిరగకుండానే, అతను తన మెయిల్స్‌కు సమాధానాలిస్తున్నాడని గ్రహిస్తుంది. తన జీమెయిల్ ఖాతా నుండి 25,000 మెయిల్స్ డిలీట్ చేసినప్పుడు, ఉనికినే కోల్పోయాననుకుంటుంది. రూపకాలతోనూ, నిజ జీవిత సంఘటనలతోనూ నిండి ఉన్న పుస్తకం ఇది. దీని గురించి రచయిత్రి ఔట్‌లుక్ పత్రికకు అయిదేళ్ళ కిందట, ఒక వ్యాసం రాశారు.
పుస్తకం చదువుతున్నంతసేపూ, ‘ఇంత చదువుకుని, ప్రపంచం చూసిన యువతి– గృహహింసను తట్టుకోవలసిన అవసరం ఏమిటా!’ అని వేధించే ప్రశ్నలకు సమాధానం, చివరి పుటల్లో దొరుకుతుంది. ‘‘ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, ఆశ నన్ను అడ్డగిస్తుంది. నా మనస్సులో మిగిలున్న ఈ ఆశే, పారిపోవడాన్ని నిషేధించేది. ఈ వివాహబంధానికి నన్ను కట్టిపడేసినది విశ్వాసఘాతకి అయిన ఈ ఆశే. రేపటికల్లా అంతా సర్దుకుంటుందన్న ఆశ’’. తమ ఎంపికవల్ల ఎదురయ్యే పరిణామాలతో రాజీపడే ప్రతి స్త్రీకీ ఈ యువతి ప్రతినిధి. సమాన హక్కులు అన్నవి కేవలం కలలే తప్ప, నిజ జీవితంలో ఉండవని నేర్చుకుంటుంది.
మన దేశంలో, వైవాహిక మానభంగాలు లెక్కలోకి తీసుకోబడవు. జీవితంలో భౌతిక, భావోద్వేగ అవమానం హెచ్చవుతూ ఉండటంతో– మిగతా చాలామంది స్త్రీలలాకాక, ‘పీపాలతో నిండిన నిరంతర విచారణ’ను భరించలేక, ‘‘నా కాళి చంపుతుంది. నా ద్రౌపది దిగంబరి అవుతుంది. నా సీత పరాయిపురుషుడి ఒళ్ళో కూర్చుంటుంది. నా స్త్రీలందరూ తిరగబడతారు. బాంబులను ఎదుర్కొంటారు. రాజులను కించపరుస్తారు. నాలా ఉంటారు’’ అంటూ, నాలుగు నెలల్లోపే తన పరిష్కారాన్ని తానే వెతుక్కుని, ఇంట్లోంచి బయటపడగలుగుతుంది. కథనంలో ప్రతీ వాక్యం వ్యంగ్యం నుంచి విషాదానికి మారుతూ చమత్కారంగా ఉన్నప్పటికీ కూడా వాటి నుండి తొంగి చూసే వ్య«థను మనం నిర్లక్ష్యపెట్టలేం. అక్కడక్కడా ఉన్న తవికలు మాత్రం కథ చదవడానికి అడ్డం పడతాయి.
క్రిష్ణవేణి