ఆయన జీవితమే ‘గానకళా’ యజ్ఞం
సంగీత సభను నడపడం, సంగీతం కోసం ఒక మాసప త్రికను నడపడం - రెండూ కష్టసాధ్యమైన విషయాలే..! ఆర్థికబలం, అంగబలం- ఈ రెండూ చెప్పుకోతగినంతగా లేకపోయినా, కొన్ని దశాబ్దా లుగా కాకినాడలో ‘శ్రీరామ సమాజం’ ఆధ్వర్యంలో సంగీత కచ్చేరీలు నిర్వహిస్తూ, ఆంధ్రదేశంలో ఒక మంచి సం గీత వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నంలో నూటికి నూరుపాళ్ళూ కృతకృత్యుడైన వ్యక్తి- మునుగంటి శ్రీరామమూర్తి.
తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో 1962 జూన్ లో ప్రారంభించిన ‘గానకళ’ సంగీత మాసపత్రిక సం గీత విద్వాంసులకూ, రసికులకూ, ఔత్సాహిక గాయనీ గాయకులకూ కొంగుబంగారంగా విలసిల్లుతున్నది. సంగీతజ్ఞులకు ఒక నిఘంటువులా ‘గానకళ’ను రూపొం దించిన మహనీయుడు - శ్రీరామమూర్తి. తొమ్మిది పదు ల వయస్సులో కూడా సంప్రదాయ సంగీతానికి గౌర వాన్ని ఇనుమడింపజేసే ప్రయత్నంలో ‘గానకళ’ పాఠ కుల సంఖ్యను పెంచేందుకు ఎంతో కృషి చేశారాయన. సుభద్రమ్మ, వెంకటరావు పంతులు దంపతులకు 1925 మార్చి 25లో కాకినాడలో ఆయన జన్మించారు. తండ్రి ‘గాయక సమ్రాట్’ వెంకటరావు పంతులు. సంప్రదాయ సంగీతం, సంగీత విద్వాంసుల చరిత్రలను విస్తృతమైన పరిశో ధనావ్యాసాలతో అలరిస్తూ 53 ఏళ్ళుగా సాగుతున్న ఏకైక తెలుగు మాసపత్రిక ‘గాన కళ’. ‘పద్మవిభూషణ్’ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ దీనికి గౌరవ సలహాదారు.
సంగీత మూర్తిత్రయంతో పాటు, అనేక మంది వాగ్గేయకారుల రచనలను ప్రాచీన విద్వాంసులు తాము పాడి, తమ శిష్య ప్రశి ష్యుల చేత పాడించి, మహారాజ పోషణ తోడై రాగా, ఈ కళకు ఎంతో ప్రచారం తెచ్చారు. ఈ ప్రచారమంతా ఎప్పుడూ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే ఎక్కు వగా జరుగుతోంది. అయితే, గత రెండు, మూడు తరా లలో తాడిగడప శేషయ్య, పిరాట్ల శంకరశాస్త్రి, రామసు బ్బయ్య (చీరాల), సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, బలిజేపల్లి సీతారామయ్య వంటి ప్రసిద్ధ ఆంధ్ర సంగీత విద్వాంసులు దక్షిణాది బాణీని తెలుగుదేశంలో ప్రచారం చేసే ప్రయత్నం చేయ లేకపోలేదు. తెలుగు ప్రాంతంలో కూడా పదిమంది విద్వాంసులు తయారవ్వాలన్నది శ్రీరామమూర్తిగారి ఆకాంక్ష. ఈ సంకల్పంతోనే ‘గానకళ’ను నిరాటంకంగా ప్రచురించారు. తండ్రికి తగ్గ తనయుడిగా చిరంజీవి వెం కటరావు ఇప్పటి దాకా తండ్రితో పాటు పత్రిక కోసం పాటుపడుతున్నారు.
సంగీత వ్యాప్తి కోసం శ్రీరామమూర్తిగారు చేసిన కృషి సామాన్యమైనది కాదు. దాదాపు 115 ఏళ్ళుగా ఉచిత సంగీత కళాశాలను నడుపుతున్న ‘శ్రీరామ సమాజం’కి ఆయనే కార్యదర్శి. త్యాగరాజస్వామికి సాక్షాత్తూ 5వ తరం ప్రశిష్యులైన తమ తాతగారు మునుగంటి వెంకట శ్రీరాములు పంతులుగారి బాటలో ఏటా పది రోజులు గణపతి నవరాత్రులకు సంగీతోత్సవం నడుపుతూ వచ్చారు. అం దులో ఐదు రోజులు హరికథలకే కేటాయిం చేవారు. ‘త్యాగరాజ సేవాసమితి’ని మిత్రు లతో కలసి స్థాపించి, ప్రతినెలా సంగీత సభా నిర్వహణ ద్వారా ఇంటింటికీ సంగీతాన్ని చేర్చేం దుకు శ్రమించారు. ‘సంగీత విద్వత్ సభ’ను స్థాపించి, గత 64 ఏళ్ళుగా ప్రతియేటా క్రమం తప్పకుండా సంక్రాంతికి కాకినాడలో సంగీతోత్సవం నిర్వహించారు.
కానీ, మునుగంటి శ్రీరామమూర్తిగారు ఈసారి సంక్రాంతి సంగీత సభల్లో లేరు. 12వ తేదీ సాయంత్రం అకస్మాత్తుగా కన్నుమూశారు. ప్రచారార్భాటం లేకుండా సంప్రదాయ సంగీత వ్యాప్తి కోసం కృషి చేసిన శ్రీరామ మూర్తి భౌతికంగా దూరమవడం సంగీతానికీ తీరనిలో టే! ఆయన స్ఫూర్తిని అందుకొని, ‘గానకళ’ను చిరకాలం నిలబెట్టుకొని, సంగీత యజ్ఞంలో పాలుపంచుకోవడమే ఆ సంగీతయాజికి మనమివ్వగలిగిన నివాళి!
మల్లాది సూరిబాబు - ఆకాశవాణి, విజయవాడ (9052765490)
- మల్లాది సూరిబాబు