నేడూ అదే సమధర్మ పథం | Mallepally laxmaiah writes on Buddha dhamma | Sakshi
Sakshi News home page

నేడూ అదే సమధర్మ పథం

Published Thu, May 19 2016 4:19 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

నేడూ అదే సమధర్మ పథం

నేడూ అదే సమధర్మ పథం

కొత్త కోణం

బౌద్ధం ప్రతిపాదించిన మానవ విలువలు, ఆర్థిక సామాజిక ధృక్పథాలను వెయ్యేళ్ల క్రితమే  భౌతికంగా నిర్మూలించే యత్నం సాగింది. దీంతో మరొక రూపం ధరించిన కుల వ్యవస్థ అసమానతలను, వివక్షను, అరాచకాలను, అత్యాచారాలను కొనసాగించింది, కొనసాగిస్తున్నది. కుల వివక్ష సహా అన్ని రకాల అసమానతలకు పరిష్కారం బుద్ధుడు ప్రవచించిన సమతా సిద్ధాంతమేననేది నిర్వివాదాంశం. అదే అసమానతలకు తావులేని, వివక్షారహిత భారతాన్ని నిర్మిస్తుందన్న ఆశాభావం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమౌతోంది.
 
గౌతమ బుద్ధుడు నైతిక, మత, ఆధ్యాత్మిక విషయాలను మాత్రమే ప్రబోధించాడని, ఆయన ప్రవచించిన బౌద్ధం కరుణ, ప్రేమ అనే జీవన సూత్రాలను అందించిందని విస్తృతంగానే ప్రచారంలో ఉంది. బౌద్ధంలోని, బుద్ధుని బోధనలలోని సంపూర్ణ సత్యాలను, సమగ్ర సారాన్ని అవి తెలుప లేవు. మరింత లోతైన విషయాలను పరిశోధనల ద్వారా వెలికితీయాల్సిన అవసరమున్నది. బుద్ధునిపైన, బౌద్ధంపైన శాస్త్రీయ, హేతువాద దృష్టితో శోధన జరగాల్సి ఉంది. అందుబాటులో ఉన్న అంశాలను ఒకసారి సమీక్షించు కుంటే బౌద్ధం తాత్విక, చారిత్రక ప్రాధాన్యం, లోతులు కొంతమేరకైనా అర్థం కాగలవు. బుద్ధుని కాలం నాటి సామాజిక, ఆర్థిక వాస్తవ పరిస్థితులపై దృష్టిని కేంద్రీకరించిన అధ్యయనాలు, రచనలు అతి తక్కువనే చెప్పాలి.

ఏ బోధన లైనా, ఏ తాత్విక సిద్ధాంతాలైనా మంచివా, చెడ్డవా? అనే విషయాన్ని తేల్చా ల్సింది ఆచరణలో అది సాధించే ఫలితాలను బట్టే. అందుకే బౌద్ధం సాధిం చిన విజయాలను, దాని వర్తమాన అవసరాలను మనం సమీక్షించుకోవాలి. ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై బౌద్ధం కలుగజేసిన ప్రభా వాన్ని చెప్పాలంటే.... అది మానవ జీవనయానానికి అవరోధంగా నిలిచిన అనేకానేక సనాతన సాంప్రదాయాలు, సాంస్కృతిక విచ్ఛిన్నతల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవస్థకు అది జీవం పోసింది.

బౌద్ధం సామాజిక ప్రగతి మార్గం
బుద్ధుడు రోహిణీ నది ఒడ్డున నివసించిన శాక్య తెగకు చెందినవాడు. నదికి అవతలివైపు కొలియ తెగ ప్రజలు నివసించేవారు. రోహిణీ నదీజలాల పంపిణీ విషయంలో ఇరు వర్గాల మధ్య నిరంతర ఘర్షణలు సాగుతుండేవి. జన పదాలతో కూడిన నాటి గణ వ్యవస్థలో గణ సంఘ నిర్ణయమే ప్రామా ణికం. నదీజలాల వివాదంపై జరిగిన ఒక సభలో శాక్య సంఘం కొలియలపై యుద్ధం చేయాలని నిర్ణయించగా... దాన్ని వ్యతిరేకించిన గౌతముడు  సంఘ నిర్ణయానుసారం దేశాన్ని వదిలిపోతాడు. ఆయన రోగిని, వృద్ధుణ్ణి, శవాన్ని చూసి చలించిపోయాడని, ఒక వ్రవణుడిని చూసి స్ఫూర్తి పొంది బిక్కుగా మారాడని కథలున్నాయి.

కానీ ఆయన దేశాన్ని వదిలిపెట్టడానికి కారణం తెగల మధ్య ఘర్షణే నని కోశాంబి, అంబేడ్కర్‌లు ఇద్దరూ అభిప్రాయపడ్డారు. నాడు ఇలా చాలా తెగల మధ్య నిరంతర ఘర్షణలు జరుగుతుండేవి. అవి ప్రజల సామాజిక, ఆర్థిక జీవన విధానాలను ధ్వంసం చేశాయి. అప్పటికే లిచ్ఛవి, వజ్జి, మల్ల తెగలు ప్రముఖ జనపదాలుగా పాలన సాగిస్తుండేవి. వీటిని మహాజనపదాలు అనేవారు. చిన్న జనపదాలు చాలానే ఉండేవి. ఉదాహరణకు వజ్జి మహా జనపదంలో 7,707 గణాలుండేవి. మల్ల మహాజన పదంలో 550 జనపదాలుండేవి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రాజు పరిపాలనలో ఉండేవి.

గౌతముడి తండ్రి శుద్ధోదనుడు కూడా అటువంటి వాళ్ళలో ఒకరై ఉండవచ్చు. ఉత్తర భారతంలో 16 మహా జనపదాలు ఉండేవి. బౌద్ధం ఉనికిలోకి వచ్చి ప్రజల మధ్య సంఘర్షణలను నివారించే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే కేంద్రీకృత పాలన వైపు వేగవంతమైన రాజకీయ మార్పులు జరిగాయి. కొన్ని జనపదాలు మగధ, కోసల, వంస, అవంతి లాంటి సామ్రాజ్యాలుగా రూపుదిద్దుకున్నాయి. అయితే క్రీ.పూ. 550 - 350 మధ్య ఆ నాలుగు సామ్రాజ్యాలు అదృశ్యమై మగధ సామ్రాజ్యం రూపుదిద్దుకున్నది. బుద్ధుని కాలంలో మగధ, కోసల రాజ్యాల మధ్య వైరుధ్యాలున్నా అవి యుద్ధాలకు దారితీయలేదు.

బుద్ధుడి బోధనలు, బౌద్ధ తాత్వికత రాజులను ఆకర్షించడం వల్ల ప్రజల పట్ల ప్రేమ, బాధ్యతలతో విధులను నిర్వహించే నూతన రాజకీయ వ్యవస్థకు పునాదులు పడ్డాయి. దాని ఫలితమే క్రీస్తు పూర్వం 350 ప్రాంతంనాటి అశోక చక్రవర్తి ఆదర్శ పాలన. ఆ తర్వాత క్రీస్తు శకం ఒకటవ శతాబ్దిలో కశ్మీర్ ప్రాంతాన్ని పాలించిన కనిష్కుడు బౌద్ధ అవలం బికుడై అశోకుడి మార్గంలోనే పాలన సాగించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దమ్మరాజుగా పేరొందిన నిలిందుడు, ఎంతో చైతన్యంతో నూతన వ్యవస్థలకు శ్రీకారం చుట్టిన హర్ష వర్ధనుడు బౌద్ధ తాత్విక చింతనకు ప్రతినిధులుగా నిలిచారు. హర్షుని కాలంలో కొన్ని వేల విద్యాసంస్థలు రూపు దిద్దుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నలందా విశ్వవిద్యాలయం ఆయన కాలంలోనే శాఖోపశాఖలుగా విస్తరించి వేలాది మందికి తాత్విక, శాస్త్ర, సాంకేతిక విద్యను అందించింది.

జనపదం నుంచి అభివృద్ధి పథానికి
సామాజిక, ఆర్థిక విధానాలలో కూడా వేగవంతమైన అభివృద్ధి చోటు చేసుకున్నది. నూతన వ్యాపార, వాణిజ్య వర్గాలు రూపుదిద్దుకోవడంతో పాటూ వ్యవసాయ రంగంలో కూడా ప్రగతిశీలమైన మార్పులు వచ్చాయి. వీటి వల్ల సంఘర్షణలు లేని, యుద్ధాలు లేని శాంతియుత వాతావరణం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ప్రారంభమైన అభివృద్ధి ఉత్పత్తి సాంకేతిక నిపుణులను తయారుచేసింది. బౌద్ధ సాహిత్యంలోని వివరాలను బట్టి, బుద్ధుడు, అజాతశత్రుల మధ్య జరిగిన సంభాషణలను బట్టి 18 రకాల వృత్తులు వృద్ధిలోకి వచ్చాయి.

అప్పటి వరకు జ్ఞానం, విజ్ఞానం, చదువు, విద్య బ్రాహ్మణ సామాజిక వర్గం సొత్తుగా ఉండేవి. ఆ గుత్తాధిపత్యాన్ని బౌద్ధం తుత్తునియలు చేసింది. మనుషులంతా ఒక్కటేనని, అందరూ తల్లి గర్భం నుంచే పుడతారని, మనుషుల్లో హెచ్చుతగ్గులు మనం సృష్టించినవే తప్ప వాటికి ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని ‘అగ్గన్నసుత్త’లో బుద్ధుడు సుస్పష్టం చేశాడు. తద్వారా నాటి ప్రాపంచిక ధృక్పథాన్ని తలకిందులు చేశాడు. గుత్తాధిపత్యం కింద ఉన్న భూమిని దున్నేవాడు అనుభవించే ప్రతిపాదనలు చేశాడు. నీటిపారుదలకు లభించిన ప్రాధాన్యం వ్యవసాయం పురోగమించడానికి తోడ్పడింది. అటు వ్యవ సాయం, ఇటు వృత్తి విద్యలు సనాతన సంప్రదాయాల నుంచి విముక్తిని సాధించి, ఆర్థిక రంగాన్ని సామాజిక పరం చేశాయి. వ్యవసాయానికి నాడు ప్రధానావసరంగా ఉన్న పశుసంపదను యజ్ఞయాగాలకు బలిచేయకుండా నిరోధించి బౌద్ధం పాడిపంటల సమగ్రాభివృద్ధికి దోహదపడింది.

వ్యవసాయాభివృద్ధితో అదనపు సంపద పోగుపడడం మొదలైంది. ఫలి తంగా ప్రజల అవసరాలు కూడా పెరిగాయి. దీంతో వస్తూత్పత్తిపై ఆసక్తి పెరిగి వస్త్ర పరిశ్రమ, గాజు పరిశ్రమ, నగలు, తోలు వస్తువులు, వంట పాత్రలు, కుండల ఉత్పత్తి ఊపందుకుంది. అదే సమయంలో వస్తువుల మారకం, ఎగుమతి, దిగుమతుల వ్యాపారం మొదలయ్యాయి. దీంతో పట్టణీ కరణ కూడా ప్రారంభమైంది. వ్యాపారాలు చేయడం, నదులు, సముద్రాలపై ప్రయాణాలు చేయడం వల్ల కుల భ్రష్టత్వం జరుగుతుందంటూ వాటిని నిషేధించారు. కులంపై బుద్ధుడు చేసిన పోరాటం వల్ల ఈ మూఢత్వం తొలగిపోయి వ్యాపార, వాణిజ్య రంగాలు వృద్ధి చెందడంతో ఉత్పత్తి మరింతగా పెరిగింది.

అదేక్రమంలో బౌద్ధం ఇతర ప్రాంతాలకు, దేశాలకు కూడా విస్తరించింది. వ్యవసాయ, వాణిజ్య వర్గాలతో పాటు నైపుణ్యంతో కూడిన వృత్తుల వారికి కూడా విలువ ఏర్పడింది. అప్పటివరకు బ్రాహ్మణ, క్షత్రియులకు మాత్రమే సమాజంలో ఉత్తమ స్థానం లభించేది. ఆర్థిక పురోగతి వృత్తికారులతో పాటు వైశ్యులను కూడా అగ్రగాములుగా నిలిపింది. అప్పట్లో వారిని శ్రేష్ఠి(అగ్రగామి) అనేవారు. అదే కాలక్రమంలో శెట్టిగా (వైశ్య) రూపాం తరం చెందింది. ఈ వాస్తవాలన్నీ బౌద్ధం నైతిక, ఆధ్యాత్మిక విలువలకే పరిమితం కాలేదనీ సంపూర్ణ సామాజిక విప్లవానికి తాత్విక, రాజకీయ పునాదినీ, ఆర్థిక, సామాజిక ప్రగతికి దోహదం చేసిందనీ స్పష్టం చేస్తున్నాయి. అందువల్లనే బౌద్ధం నాడు భారతావనికే కాదు దక్షిణాసియా దేశాలన్నిటికీ మార్గదర్శికాగలిగింది. జపాన్, చైనా, శ్రీలంక, బర్మా వంటి దేశాల్లో ఎంతో మంది రాజులు, చక్రవర్తులు బౌద్ధాన్ని అవలంబించి, ఆదరించారని, బౌద్ధం ప్రజాసంక్షేమానికి దోహదపడిందని బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి.

వివక్షకు విరగుడు బౌద్ధ ధర్మమే
సమకాలీన పరిస్థితులకు బౌద్ధం అవసరం ఏమిటనేది చాలా మంది ప్రశ్న. బౌద్ధం ప్రతిపాదించిన మానవ విలువలు, ఆర్థిక సామాజిక దృక్పథాలను వెయ్యేళ్ల క్రితమే కరుడుగట్టిన హైందవ సంప్రదాయం, ముస్లిం దండ యాత్రలు దెబ్బతీశాయి. లక్షలాదిగా బౌద్ధ గురువులను, బిక్కులను, బిక్కునిలను కిరాతకంగా హతమార్చి భౌతికంగా బౌద్ధాన్ని నిర్మూలించే ప్రయత్నం సాగింది. దీంతో మరొక రూపంలో కుల వ్యవస్థ రూపుదిద్దుకొని అసమానతలను, వివక్షను, అరాచకాలను, అత్యాచారాలను కొనసాగించింది. కొనసాగిస్తున్నది. ఈ అసమాన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు కూడా సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ పోరాటాలన్నింటి వ్యవస్థీకృత రూపమే బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగించిన పోరాటం. ఆ క్రమంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం యాదృచ్చికంగానో, ప్రయత్నపూర్వకంగానో బుద్ధుడి దమ్మచక్రానికి, అశోకుని రాజశాసనానికి మన జాతీయ పతాకంలో, రాజముద్రలో స్థానం కల్పించడాన్ని బౌద్ధపరంపర కొనసాగింపుగానే చూడాలి. బౌద్ధం కేవలం నైతిక, ఆధ్యాత్మిక విలువలకు పరిమితం కాదనే విషయాన్ని ఈ రెండు విషయాలూ స్పష్టం చేస్తున్నాయి.

మన దేశంలో కొనసాగుతున్న కుల వివక్షకు, ఇతర అన్ని రకాల అసమానతలకు పరిష్కారం బుద్ధుడు ప్రవచించిన సమతా సిద్ధాంతమేననేది నిర్వివాదాంశం. సత్యా న్వేషణలో భాగంగా బౌద్ధం అనేక నూతన తాత్విక చింతనలను ఆవిష్కరిం చడమే కాదు సనాతన సాంప్రదాయాల ముసుగును తొలగించి సమానత్వ భావనను చాటిచెప్పింది. అదే చింతన అసమానతలకు తావులేని, వివక్షా రహిత భవిష్యత్ భారతావనిని నిర్మిస్తుందన్న ఆశాభావం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమౌతోంది.

(మే 21 గౌతమ బుద్ధుని జయంతి)

- మల్లెపల్లి లక్ష్మయ్య
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement