విద్యాస్పర్థలు ఇంకెన్నాళ్లు! | Minister Jagadish Reddy , ganta srinivasa rao exclusive interviews | Sakshi
Sakshi News home page

విద్యాస్పర్థలు ఇంకెన్నాళ్లు!

Published Thu, Nov 13 2014 11:55 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Minister Jagadish Reddy , ganta srinivasa rao exclusive interviews

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత విద్యారంగం వివాదాలకు ఆలవాలమైంది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అడుగడుగునా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్, ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల మధ్య విభేదాలు-నిత్యం వివాదాలే. ఈ వైఖరులపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ముఖ్యాంశాలు...
 
తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి

ప్రశ్న: విభజన తరువాత విద్యా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలేమిటి?
జవాబు: పరీక్షలు, ప్రవేశాల కౌన్సెలింగ్, ఉన్నత విద్యామండలి, ఇంటర్ బోర్డు నిర్వ హణ అన్నీ సమస్యలే. ఉన్నత విద్యామండలి, బోర్డులు ఉమ్మడిగా ఉంటే ఏ ప్రభుత్వం మాట వినాలి? ఉద్యోగులు ప్రాంతాల వారీగా చీలిపోయారు. మా పరీక్షలు మేము నిర్వ హించుకుంటామంటే వారు వద్దంటారు. విభజన చట్టంలో పరీక్షలు ఉమ్మడిగా నిర్వ హించాలని లేదు. కొన్ని ప్రధాన విద్యాసంస్థల్లో నాలుగైదు సీట్లు పోతాయన్న ఉద్దే శంతో కేంద్రాన్ని ప్రభావితం చేసే వారు కొందరు 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉండా లని వీటిని పదో షెడ్యూల్‌లో చేర్పించారు.

పదో షెడ్యూల్‌లోని సంస్థలు పరస్పర అంగీకారంతో విడిపోయే వీలుంది కదా..
పరస్పర అంగీకారం అంటే.. మరొకరి అనుమతి అని కాదు. చట్టస్ఫూర్తిని వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకరు విడిపోవడానికి అసలు అంగీకరించమంటే ఎలా? అక్కడి నుంచి వచ్చే విద్యార్థులకు ఇక్కడ అడ్మిషన్లు ఇస్తాం. తప్పు చేస్తే కేంద్రం, కోర్టులు ఉన్నాయి. వాటి జోక్యం లేకుండా పరిష్కరించుకుందామంటే చంద్రబాబు ప్రతిదానిని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు.
 
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై వివాదం ఎందుకు?
ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ జరిగింది. కౌన్సెలింగ్ వేళకి రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కౌన్సెలింగ్ నిర్వహించాలంటే వృత్తి విద్యా కళాశాలల్లో నిబంధనల మేరకు జెఎన్‌టీయుహెచ్ నిర్వహించి వాటికి గుర్తింపు ఇవ్వాలి. కొత్త రాష్ట్రం.. తని ఖీల నిర్వహణకు సమయం కావాలి. అక్టోబర్ 31 నాటికి ప్రవేశాలు పూర్తి చేస్తామన్నాం. ఇదే సుప్రీంకోర్టుకు చెప్పాం. ఆంధ్రా ప్రభుత్వం అంగీకరించక, ఆగస్టు 31లోగా అడ్మిషన్లు పూర్తి చేస్తామని అఫిడవిట్ వేసింది. ఉమ్మడి ఉన్నత విద్యామండలి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో అఫిడవిట్ ఎలా దాఖలు చేస్తుంది? అందుకే మా ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసుకున్నాం.
 
కోర్టు తీర్పు మేరకు ఎందుకు కౌన్సెలింగ్ పూర్తి కాలేదు?
సాధ్యం కాదని మాకు తెలుసు. కోర్టు ఇచ్చిన గడువులో మొదటి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. రెండో కౌన్సెలింగ్ నిర్వహిస్తామంటూ వారు మళ్లీ కోర్టుకు వెళ్తే.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మొదట్లో మేము చెప్పినదానికి అంగీకరించి ఉంటే.. అక్టోబర్ చివరి నాటికి కౌన్సెలింగ్ జరిగి విద్యార్థులందరికీ అవకాశం దక్కేది. తొలి ఏడాదే అడ్మిషన్లలో ఉమ్మడిగా నిర్వహణ సాధ్యం కాదని తేలింది. ఇక ఉమ్మడి పరీక్షలు సాధ్యమా?
 
ఉమ్మడిగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇబ్బందేమిటీ?
ఇంటర్ పరీక్షలు ఎవరికి వారే నిర్వహించుకోవడం తక్షణ కర్తవ్యం. ఆంధ్రా లేదా తెలంగాణలో వేర్వేరుగా విపత్తులు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో పరీక్షలు వాయిదా వేసే పరిస్థితి వస్తే రెండో ప్రాంతం పరిస్థితి ఏమిటీ?  
 
ఎపీ ప్రభుత్వంతో వివాదం ఎందుకు?
మేము సామరస్యంగా వెళ్లాలని అనుకుంటున్నాం. ఇంటర్ పరీక్షల గురించి విద్యామంత్రుల సమావేశానికి ఆంధ్రా మంత్రే చొరవ తీసుకున్నారు. కాని చంద్రబాబు ఈ అంశాన్ని కోర్టుకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు.
 
ఆంధ్రా విద్యార్థులకు  సీట్లు దక్కవన్న భ యాలు ఉన్నాయి కదా?
అలాంటివేమీ అక్కర్లేదు. ఆంధ్రా విద్యార్థులకు 15 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీలో దక్కుతాయి. రాష్ట్ర పునర్య్వవస్థీకరణ చట్టం అదే చెప్పింది.
 
డీఎస్సీ ఎప్పుడు జరుగుతుంది?
ఉపాధ్యాయుల పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తయితే తప్ప.. ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉంటాయి.. ఎక్కడ ఎక్కువగా ఉన్నారన్న విషయం తెలియదు. అది తెలిస్తే తప్ప డీఎస్సీ నిర్వహించలేం. అందుకే హేతుబద్ధీకరణపై దృష్టిపెట్టాం. హేతుబద్ధీకరణ తరువాత ఉపాధ్యాయులకు శిక్షణ  కార్యక్రమాలు కూడా చేపడ్తాం.
 
పాఠ్యాంశాల మార్పు ఎంతవరకు వచ్చింది?
పాఠ్యాంశాలు మారుస్తున్నాం. ఇక్కడి చరిత్ర, చరిత్ర పురుషుల విశేషాలను చేరుస్తాం.
 
కేజీ టూ పీజీ ఉచిత విద్య అని ప్రకటించారు. ఎంత వరకు వచ్చింది?
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనిపై పట్టుదలతో ఉన్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభిస్తాం.    
 
ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు
 
ప్రశ్న: విభజన తరువాత విద్యావ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలేమిటి?
జవాబు: పదో షెడ్యూల్‌లోని ఉమ్మడి విద్యాసంస్థల మీద సమస్యలు వస్తున్నాయి. ఇరు ప్రాంతాల విద్యార్థుల సమానావకాశాల కోసం వాటిని పదో షెడ్యూల్‌లో చేర్చారు. ఈ స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలి. అలా జరగకనే ఈ సమస్యలన్నీ. ఏదైనా చర్చలతో పరిష్కరించువచ్చునని ఆశిస్తున్నాం.
 
రాష్ట్రం విడిపోయింది. వేర్వేరుగా పరీక్షలు నిర్వహించుకుంటే తప్పేమిటని తెలంగాణ అంటోంది!
ఎవరైనా చట్టం స్ఫూర్తిని గౌరవించాలి. పదో షెడ్యూల్‌తో వచ్చే ఇబ్బందుల గురించి  కేసీఆర్ నాడే చెప్పాల్సింది. ఇపుడు గౌరవించబోమంటే ఎలా? ఇప్పుడైనా కూర్చొని మాట్లాడుకోవాలి. కేసీఆర్ అందుకు భిన్నంగా వెళ్తున్నారు.
 
ఇంటర్మీడియెట్ పరీక్షలపై ప్రతిష్టంభన ఇంకెన్నాళ్లు?
ఈ పరీక్షలు ఉమ్మడిగానే జరగాలని చెబుతున్నాం. ఎంసెట్, జేఈఈ వంటి పరీక్షలలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ అమలవుతున్నందున కామన్ మెరిట్‌లిస్టు రూపొందించాలంటే ఉమ్మడిగానే పరీక్షలు జరగాలి. వేర్వేరుగా జరిగితే మార్కులు, ర్యాంకుల విషయంలో అపోహలొస్తాయి. మొదటి సంవత్సరం ఉమ్మడిగా పరీక్షలు రాయించి, రెండో ఏడాది వేర్వేరుగా నిర్వహిస్తామంటే ఎలా? దీని మీద వచ్చే ఏడాది నిర్ణయించుకోవచ్చని చెబుతున్నాం.
 
ఓపెన్‌కోటా సీట్ల కేటాయింపే పదో షెడ్యూల్ స్ఫూర్తి అని, ఉమ్మడి పరీక్షలు కాదని టి.నేతలు చెబుతున్నారు?
చట్టం ఉద్దేశం అదికాదు. కామన్ అడ్మిషన్లుండాలన్నారు. అయితే అడ్మిషన్లు వేరే, పరీక్షలు వేరే అని ఉండదు.  
 
ఈ ఏడాది ఇంటర్‌పరీక్షలు వేర్వేరుగానా?ఉమ్మడిగానా?
ఉమ్మడిగానే ఉండాలంటున్నాం. తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చించాం. వారి స్పందన రాలేదు. ఇది లక్షలాది మంది తెలుగు పిల్లల భవిష్యత్తుకు సంబంధించినది. కనుక విశాల దృక్పథంతో చూడాలి.
 
పరీక్షలు వేర్వేరుగానే నిర్వహించాలని తెలంగాణ చెబుతోంది! మార్గమేమిటి?
ఉమ్మడిగా పరీక్షలకు వెళ్లడమొక్కటే మార్గం. వరదలూ తుపాన్లవల్ల ఏపీలో పరీక్షలు వాయిదా పడితే, తెలంగాణకు ఇబ్బంది అనడం సరికాదు. తెలంగాణలో సమస్య వచ్చినా అంతే. ఈ ఇబ్బందులు ఉమ్మడి రాష్ర్టంలోనూ వచ్చాయి. అలాంటప్పుడు ఉమ్మడి బోర్డు కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది.  
 
ఎంసెట్ ఈసారి గందరగోళంగా జరిగింది. వచ్చే ఏడాది ఏం చేస్తారు?
ఎంసెట్ ఉమ్మడిగానే ఉండాలి. ఎంసెట్ ఉంచాలా? తీసేయాలా? ఎంసెట్  పెట్టినా ఇంటర్ మార్కులే ప్రధానంగా సీట్లు కేటాయించాలా? వంటి అంశాల గురించి ఆలోచన జరుగుతోంది. తెలంగాణలోనూ ఎంసెట్ తీసేయాలనే అభిప్రాయం ఉన్నట్లు సమాచారం. అలా అయితే ఇరుప్రాంతాలు ఒకే విధానంతో వెళ్లొచ్చు.
 
ఈ వివాదాలకు పరిష్కారమెలా?
చట్టం స్ఫూర్తిని గౌరవిస్తూ, విద్యార్థుల బాగుకు రెండు రాష్ట్రాలు సమన్వయంతో సాగాలి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలి, ఇంటర్ బోర్డును ఏర్పాటు చేయడంతో గందరగోళం తలెత్తింది. అందుకోసమే ఇటీవల నేనే  రెండు రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఇది తొలి అడుగే. మరికొన్ని భేటీలతో స్పష్టత వస్తుంది.
 
డీఎస్సీ ప్రకటన ఎప్పుడు?
బీఈడీ అభ్యర్థులకు కూడా ఎస్జీటీకి అవకాశమివ్వాలని సీఎం చెప్పారు. కేంద్రంతో మాట్లాడాం. వారి ఆదేశాల మేరకు చేస్తాం.
 
కొత్త రాష్ట్రంలో పాఠ్యప్రణాళికలో మార్పులు చేస్తారా?
ఇప్పటికివే. వచ్చే ఏడాది సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆపై మార్పులు తెస్తాం.
 
జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు ఎప్పుడు?
విశాఖలో ఐఐఎంకు, తిరుపతి సమీపంలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ల కోసం స్థలాలను ఎంపికచేశాం. ఎన్‌ఐటీకి తాడేపల్లిగూడెంలో రెండు ప్రాంతాలు ఎంపికచేశాం. సీఎం ఒక దానిని ఖరారు చేస్తారు. ట్రైబల్ వర్సిటీకి విశాఖపట్నం దగ్గర సబ్బవరం సమీపంలో స్థలాన్ని చూస్తున్నాం. సెంట్రల్ వర్సిటీ, ట్రిపుల్ ఐటీలపై కేంద్రం కమిటీని వేయాలి. వచ్చే ఏడాదినుంచి తాత్కాలిక భవనాల్లో ఐఐటీ, ఐఐఎంలను  ప్రారంభించాలనుకుంటున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement