మీ విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తారా? లేదా?
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూటిప్రశ్న
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని నెపం నెడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజల ను మోసం చేస్తున్నారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రుణమాఫీ నుంచి అక్కడి ప్రజల దృష్టిని మళ్లించేందుకే దొంగ నాటకాలాడుతున్నారని, దీనిని ఆంధ్రా ప్రజలు ఆలోచించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తారా? లేదా? అనేది తేల్చకుండా నిందలను తమపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పేరుతో ఫీజులు చెల్లిస్తామని ప్రకటించామని, అదే చంద్రబాబు మాత్రం పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? పేరు మార్చుకొని అమలు చేస్తారా? అనేది తేల్చడం లేదన్నారు. అక్కడి మం త్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు మొదట్లో తమ విద్యార్థుల ఫీజులను చెల్లిస్తామని చెప్పి, నాలుగు రోజులకే మాట మార్చారని విమర్శించారు. ఫీజుల చెల్లింపునకు స్థానికత అనేది తెలంగాణ అంతర్గత వ్యవహారమని, దానితో చంద్రబాబుకు సంబంధమేమిటని మంత్రి ప్రశ్నిం చారు.
నిధులు, నీళ్లు, నియామకాల విషయాల్లోనే ఉద్య మం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాము తెలంగాణ విద్యార్థులకే ఫీజులను ఇస్తామని పునరుద్ఘాటించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను బాబు ఇచ్చినప్పుడే అక్కడి ఇతర పార్టీలు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పాయని, అయినా తనకు విస్‌డమ్ ఆఫ్ ఎకానమీ ఉందంటూ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని రుణాలను మాఫీ చేస్తామని దొంగ మాటలు చెప్పిన ఆయన.. ఇప్పుడు షరతులు పెడుతూ ఇంటికి ఒకటే రుణం మెలిక పెట్టడం మోసం కాదా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మోసాలను అక్కడి ప్రజలు గ్రహించి దాడి చేస్తారనే భయంతోనే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పడమే మీ విస్‌డమ్ ఆఫ్ ఎకాన మా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టులో ఉన్న వారిలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సరిచేస్తామన్నారు. నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.