సాధారణంగా దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్)వంటి సంస్థ లకు సంబంధించి శిఖరాగ్ర సదస్సులకు తప్ప మంత్రుల స్థాయి సమావేశా లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. శిఖరాగ్ర సదస్సుల్లో తీసుకునే ప్రధాన నిర్ణయాలకు కొనసాగింపుగా లేదా అలాంటి సదస్సులకు అవసరమైన ప్రాతిపది కలను ఖరారు చేయడానికి వీటిని నిర్వహించడమే ఇందుకు కారణం. కానీ ఇస్లామా బాద్‌లో గురువారం జరిగిన సార్క్ హోంమంత్రుల ఒక రోజు సదస్సు చుట్టూ మాత్రం చాలా హడావుడి చోటు చేసుకుంది. మన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సదస్సునుద్దేశించి మాట్లాడిన ప్రసంగం ప్రసారాన్ని పాకిస్తాన్ నిలిపేసిందని వచ్చిన వార్త కాసేపు సంచలనం సృష్టించింది.
‘పిరికి పాకిస్తాన్ రాజ్‌నాథ్ ఉపన్యా సాన్ని బ్లాకవుట్ చేసింద’ని చానెళ్లు చాలాసేపు హడావుడి చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహ సందేశాలు వెల్లువెత్తాయి. సార్క్ సమావేశాల్లో ఆతిథ్య దేశం తరఫున చేసే ప్రసంగాన్ని మినహా మిగిలిన కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచటం మొదటినుంచీ పాటిస్తున్న సంప్రదాయమని మన విదేశాంగ శాఖ ప్రతి నిధి వివరణనిచ్చాక ఇదంతా సద్దుమణిగింది. అయితే ఇలాంటి అపోహలు తలెత్త డానికి ప్రధాన బాధ్యత పాకిస్తాన్‌దే. సదస్సు విశేషాలను అందించేందుకు వెళ్లాలను కున్న మన పాత్రికేయులకు ఆ దేశం అనుమతి నిరాకరించడం వల్లనే ఈ స్థితి ఏర్ప డింది. భారత్‌నుంచి పాత్రికేయులు రాకూడదనుకుంటే సార్క్ సమావేశాలను వేరే దేశంలో జరుపుకుందామని పాక్ ప్రతిపాదించాల్సింది. ఒకపక్క సమావేశాల నిర్వహణకు అంగీకరించి, మీడియాపై మాత్రం ఆంక్షలు విధిస్తామనడం దేనికి సంకేతం?
వాస్తవానికి సభ్య దేశాల మధ్య మరింత సమన్వయాన్ని, సహకారాన్ని పెం పొందించేందుకు...వాటిమధ్య అపోహలను, ఉద్రిక్తతలను తొలగించేందుకు ఇలాంటి సమావేశాలు దోహదపడాలి. 1985లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక తదితర ఏడు దేశాలు సభ్యులుగా అవతరించిన సార్క్‌లో ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ చేరింది. అమెరికా, యూరపియన్ యూనియన్(ఈయూ), జపాన్, చైనావంటివి పరిశీలక తీసుకున్నాయి. సార్క్ ప్రాంత దేశాల్లో ప్రపంచంలోని నాలుగోవంతు జనాభా నివ సిస్తోంది. సహజ వనరులకు లోటే లేదు. వీటిమధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందితే ఈ దేశాల రూపురేఖలే మారిపోతాయి. ఆర్ధికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. వీటిని పట్టిపీడిస్తున్న దారిద్య్రం, నిరుద్యోగం, శిశుమరణాలు చిత్తగిస్తాయి.
పిల్లల, మహిళల అక్రమ తరలింపులు అంతమవుతాయి. ఉగ్రవాద బెడద, మాదకద్రవ్యాల రవాణా, నకిలీ కరెన్సీ ప్రవాహం ఆగుతాయి. ప్రజల జీవనప్రమాణాలు పెరుగు తాయి. కానీ సార్క్ దురదృష్టమేమోగానీ అది మొదలయిననాటినుంచీ సమావే శాలు నిర్వహించుకోవడం, తీర్మానాలు చేసుకోవడమే తప్ప ఆచరణ అంతంత మాత్రమే. ఈ దేశాలమధ్య పరస్పర అనుమానాలు, అపనమ్మకాలు ఉన్నమాట వాస్తవమే అయినా...వాటన్నిటినీ మించి భారత్-పాక్‌ల మధ్య తరచు తలెత్తే వివాదాలు, ఉద్రిక్తతలు మొత్తంగా సార్క్ నడతను నిర్దేశిస్తున్నాయని చెప్పాలి. ఈ రెండు దేశాలమధ్యా ఏదో మేరకు సుహృద్భావ వాతావరణం ఏర్పడితేనే ఇదంతా సర్దుకుంటుందన్న భావన అందరిలో ఏర్పడింది. సార్క్ ఏర్పడేనాటితో పోలిస్తే కశ్మీర్ సమస్య మరింత ఉగ్రరూపం దాల్చింది. కశ్మీర్ కోసం పోరాటమనే పేరుతో పాక్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు ఇస్తోంది. చొరబాట్లను ప్రోత్సహిస్తోంది.
ద్వైపాక్షిక సమస్యలను ఇలాంటి ప్రాంతీయ వేదికలపై ప్రస్తావించరాదన్న నియమాన్ని గతంలో చాలాసార్లు ఉల్లంఘించినా ఈసారి మాత్రం పాక్ దాన్ని పాటించింది. కాకపోతే దాన్ని పరోక్షంగా ప్రస్తావించింది. భారత్‌కూడా ఆ దోవ లోనే జవాబిచ్చింది. సంఘటిత నేరాలనూ, ఉగ్రవాదాన్ని, అవినీతిని ఈ ప్రాంతం నుంచి పారదోలేందుకు మిగిలిన సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ప్రారంభోప న్యాసంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పినా...ఆ తర్వాత మాట్లాడిన ఆ దేశ హోంమంత్రి చౌధ్రి నిసార్ ‘అమాయకులైన పిల్లలను చిత్రహింసలకు గురిచేయడం, పౌరులపై హింసకు పూనుకోవడం ఉగ్రవాదం కిందకే వస్తుంద’ని చెప్పారు. ‘తీవ్ర వాద మనస్తత్వాన్ని విడనాడి ప్రాంతీయ సమస్యలను చర్చలతో పరిష్కరించాల’ని హితవు కూడా పలికారు. ఇదంతా ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్ అనంతర పరిణామాలపైనే అన్నది సుస్పష్టం.
కనుకే రాజ్‌నాథ్ కూడా ఉగ్రవాదుల్ని అమరవీ రులుగా చిత్రించే ధోరణిని వదులుకోవాలని తెలిపారు. అంతేకాదు...ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతోపాటు వారికి ప్రోత్సాహాన్నందించే వ్యక్తులు, సంస్థలు, దేశా లపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం అవసరమన్నారు. ఉగ్రవాదంపై ఉన్న అంత ర్జాతీయ ఒడంబడికలను గౌరవిద్దామన్నారు. ఇరు దేశాల హోంమంత్రుల మధ్య మర్యాదపూర్వక చర్చలు లేవు. నిసార్ ఇచ్చిన విందుకు రాజ్‌నాథ్ హాజరుకాలేదు. షరీఫ్‌తోనూ విడిగా సమావేశం లేదు. ఇరు దేశాలమధ్యా పరిష్కరించుకోవలసిన అంశాలు ఎన్నో ఉండగా ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఎంత దురదృష్టకరం!
రెండేళ్లక్రితం నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి మిగిలిన సార్క్ దేశాల అధినేతలతోపాటు నవాజ్ షరీఫ్ కూడా వచ్చారు. నిరుడు డిసెంబర్‌లో మోదీ రష్యా పర్యటన ముగించుకుని అఫ్ఘాన్ వెళ్లి అక్కడినుంచి తిరిగొస్తూ పాక్‌లో అడుగు పెట్టారు. అందరినీ సంభ్రమాశ్చర్యపరిచారు. అయినా పాక్‌తో సంబంధాలు అం తంతమాత్రంగానే మిగిలాయి. ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్‌లో వైమానిక దళ కేంద్రంపై ఉగ్రవాదుల దాడి ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించి సాక్ష్యాలిచ్చినా పాక్ స్పందన నామమాత్రం. అయితే ఇలాంటి సమస్యల కార ణంగా ఆ దేశంతో చర్చలకు తలుపులు మూసేయాలనడం సరిగాదు. సమస్యలు న్నాయి గనుకే చర్చల అవసరం మరింత ఉంటుంది. ఆ దేశం అనుసరిస్తున్న ధోరణులను ప్రపంచానికి వెల్లడించేందుకు అది దోహదపడుతుంది. పాక్‌లాంటి మొండి ఘటాన్ని దోవకు తీసుకురావడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు.
‘సహకారం’లేని సార్క్
Published Sat, Aug 6 2016 12:02 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement