ఈశాన్యవాసులకు ఊరట!
భారతదేశంలో ఈశాన్య ప్రాంతానికీ, మిగిలిన భారతావనికీ మధ్య అవాంఛనీయమైన శూన్యం నెలకొని ఉంది. సెవెన్ సిస్టర్స్‌గా పిలుచుకునే ఈశాన్య భారత రాష్ట్రాల ప్రజలతో మిగిలిన భారతీయుల సంబంధాలు గౌరవప్రదంగా లేవు. వారి రూపురేఖలను బట్టి, భాషా స్వరూపాన్ని బట్టి అవహేళన చేసే కుసంస్కారం ప్రదర్శిస్తున్న మనుషులు ఢిల్లీ సహా దేశంలో చాలా ప్రాంతాలలో కనిపిస్తున్నారు. ఏ విధంగా చూసినా మెట్రో నగరాలలో వారి రక్షణ గురించి తీవ్రంగా ఆలోచించవలసిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మొన్న శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనం.
ఈశాన్య భారతదేశవాసుల పట్ల చూపుతున్న వివక్షకు సంబంధించి నియమించిన బిజ్‌బారువా (పార్లమెంట్ సభ్యుడు) సంఘం గడచిన జూలైలో ఇచ్చిన నివేదిక గురించి తాజాగా శుక్రవారం ప్రస్తావనకు వచ్చిం ది. ఈ సందర్భంలోనే రాజ్‌నాథ్‌సింగ్, ఈశాన్య రాష్ట్రాల ప్రజల పట్ల అవమానకరంగా ప్రవర్తించినా, అదే తీరులో మాట్లాడినా ఇకపై నేరంగా పరిగణిస్తామని ప్రకటించారు. ఇందుకు ఐదేళ్ల వరకు కారాగార శిక్ష కూడా విధించవచ్చు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన నిడో తనియ అనే విద్యార్థిని దక్షిణ ఢిల్లీలో సంవత్సరం క్రితం కొందరు ఆకతా యిలు హత్య చేసిన తరువాత బిజ్‌బారువా సంఘాన్ని నియమించారు.
నిడో హత్య (జనవరి 29, 2014) జరిగిన తీరు అత్యంత హేయంగా కనిపిస్తుంది.
జలంధర్‌లో చదువుకుంటున్న ఇరవయ్యేళ్ల నిడో దక్షిణ ఢిల్లీ వెళ్లినపుడు అక్కడి లజపత్ నగర్‌లో ఒక చిరునామా కోసం వెతుకుతు న్నపుడు ఒక స్వీట్ షాపులోని అదే వయసు యువకులు అతడి ఆకారాన్ని చూసి హేళన చేశారు. దీనితో నిడో ఒక అద్దాన్ని పగలగొట్టడంతో చినికి చినికి గాలివానగా మారి, చివరికి అతడి హత్యకు దారి తీసింది. అతడు అరుణాచల్ ఎంఎల్‌ఏ నిడో పవిత్ర కుమారుడు. బెంగళూరులో జరిగిన లొలితామ్ రిచర్డ్, ఢిల్లీలోనే జరిగిన రామ్‌చాన్‌ఫీ హోంగేరే, గుర్గావ్‌లో దేనా సంగ్మా అనే ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థుల హత్యల వెనుక కారణాలు వెలికి రాలేదు. గూర్గావ్‌లోని ఎమిటీ విశ్వవిద్యాలయం వసతి గృహంలో దేనా ఉరేసుకుని మరణించింది. ఈ విద్యార్థులంతా ఒకే భౌగోళిక ప్రాంతానికి చెంది, ఒకే రూపురేఖలతో ఉంటారు. వారి విషాదాంతంలో ఈ రెండే కీలకపాత్ర వహించాయన్నది వాస్తవం. ఇది వివక్షా ధోరణిగానే పరిగణించక తప్పదు. వివక్ష అంటే ఆఫ్రికా, ఐరోపా ఖండాలకే పరిమితమన్న దృష్టితోనే ఉన్న భారతీయులకు దేశంలో ఉన్న వివక్ష గురించి అర్థం కావడం లేదనే అనిపిస్తుంది. కొన్ని దేశాలలో భారతీ యులు ఇలాంటి పరిస్థితులను గతంలోను, ఇప్పుడు కూడా ఎదుర్కొం టున్న అనుభవం ఉండి కూడా ఇక్కడ వివక్షా ధోరణి నెలకొని ఉండడం విషాదమే.
ఈ మధ్య ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగినపుడు నిరసనలకు దిగిన టిబెట్ శరణార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో ఈశాన్య భారత ప్రాంతం నుంచి ఢిల్లీ వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు కూడా అనేక ఇక్కట్లకు గురయ్యారు. టిబెటన్లు, ఈశాన్య భారతీయులకు మధ్య చాలా పోలికలు ఉండడమే ఇందుకు కారణం. ఆఖరికి ఆ ప్రాంతా నికే చెందిన ఇద్దరు న్యాయవాదులు కూడా ఇలాంటి వేధింపులకు గురికా వడంతో న్యాయస్థానం కలుగచేసుకోవలసి వచ్చింది. ఇలాంటి వాతావ రణం ఆ ప్రాంతవాసులలో ఎలాంటి తిరుగుబాటు భావాలను రగిలిస్తుం దో ఆలోచించడం అనివార్యం. ఈ నేపథ్యంలో వచ్చిన రాజ్‌నాథ్ ప్రకటన ఆహ్వానించతగినదే.