
గత వర్తమానాల వారధి స్వామి వివేకానంద
గత వర్తమానాల వారధి స్వామి వివేకానంద
భారత ప్రాచీన నాగరికతా గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించే విధంగా ప్రదర్శించిన తొలి వ్యక్తి స్వామి వివేకానంద. జవహర్‌లాల్ నెహ్రూ మాటల్లో ఆయన మనదేశ గతానికి, వర్తమానానికి వారధిలా ఉండేవారు. ఆయన చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. బెంగాల్ ప్రెసిడెన్సీలోని కలకత్తాలో 1863, జనవరి 12న జన్మించారు. తల్లిదండ్రులు భువనేశ్వరీ దేవి, బిశ్వనాథ్‌దత్త. తండ్రి ద్వారా హేతువాదం, ప్రశ్నించే తత్వా న్ని, తల్లి ద్వారా దైవభక్తిని నేర్చుకున్నారు.
బీఏ జనరల్ ఇనిస్టిట్యూట్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆయనలోని ఆధ్యాత్మిక దృష్టి ప్రిన్సిపాల్ విలియం హేస్టీని ఆకర్షించింది. ఒకరోజు తత్తశాస్త్రం పాఠం చెబుతూ హేస్టీ ‘ట్రాన్స్’ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి కలకత్తాలోని రామ కృష్ణుని కలవాలని నరేన్‌కు సలహా ఇచ్చారు. 1881 నవంబర్‌లో నరేన్, రామకృష్ణుల తొలి సమావేశం జరిగింది. నరేన్, రామకృష్ణుని అసాధారణ వ్యక్తిగా గ్రహించి ఆయన శిష్యుడయ్యాడు. రామకృష్ణులను నరేన్ అమితంగా ప్రేమించిన ప్పటికీ తన భావ ప్రకటన స్వతంత్రాన్ని మాత్రం కోల్పోలేదు.
1885లో రామకృష్ణుడు నిర్వికల్ప సమాధిస్థితిని పొందిన తర్వాత ఆయన అభి మతం ప్రకారం 8మంది శిష్యులతో నరేన్ 1887 జనవరిలో సన్యాసం స్వీకరించారు. కలకత్తాలోని బారానగర్‌లో మఠం స్థాపించి పవిత్ర భిక్ష ద్వారా డబ్బులు సేకరించే సమయంలో తన పేరును స్వామి వివేకానందగా మార్చుకున్నారు. 1888లో కాలినడకన దేశపర్యటన ప్రారంభించారు. పర్యటనలో తను కలుసుకున్న రాకుమా రులు, లాయర్లు, టీచర్లు, ప్రభుత్వాధికారులను దేశంలోని సామాన్యులకు సహాయం చేయాలని కోరేవారు.
రూపం, వాగ్ధాటి, విషయ స్పష్టతతో అందరినీ ఆకట్టుకున్న వివేకానంద పశ్చిమదేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రహించి మన వనరుల తో అభివృద్ధి చెందాలని, అదే సమయంలో మన నైతిక ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ క్రమంలోనే చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనానికి వెళ్లి విశిష్ట ప్రసంగం చేశారు. పాశ్చాత్య పత్రికలు ఆయన ప్రసంగాలను పతాక శీర్షికల్లో ప్రచురించాయి. తిలక్ వంటి నాయకులు ఆయన నుంచి స్ఫూర్తి పొందారు. 1897లో ఆయన రామకృష్ణ మిషన్ స్థాపించారు.
ఖాళీ కడుపులకు మతం వద్దు, దేవుడిని చూడాలంటే మనిషికి సేవ చేయి అనే రెండు నియమాలు 117 ఏళ్లుగా సంస్థకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక రాజకీయ స్వాతంత్య్రంతోపాటు నైతిక, మేధాపరమైన వారసత్వం ఉండాలని చెప్పారు. నా తర్వాత వందలాది వివేకానందులు జన్మిస్తారు. వారిలో ప్రతీఒక్కరూ నాకంటే వందరెట్లు గొప్ప అవుతారని అని చెప్పిన ఆయన 1902 జూలై 4న 39 ఏళ్ల వయసులో బేలూరు మఠంలో పరమపదించారు.
(నేడు వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం)
- తండ ప్రభాకర్ గౌడ్ తొర్రూరు, వరంగల్