
రాజధాని అంటే రియల్ ఎస్టేటా?
మనసులో మాట
► కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రజా నటుడు ఆర్ నారాయణమూర్తి
రాజధాని అంటే వేల ఎకరాల భూసేకరణతో సాగించే రియల్ ఎస్టేట్ వ్యవహారం కాదని తెలుగు చిత్రపరిశ్రమలో ప్రజానటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరుపొందిన ఆర్. నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలనే ఆశయం గొప్పదే కావచ్చు కానీ భూమితో వ్యాపారం చేయాలనుకునే ధోరణితో అది ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మారుతోందన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే ఇన్ని వేల ఎకరాలు సేకరించారు అనే అపప్రథ ఏదయితే ఉందో అది పాలకుడిగా చంద్రబాబుకూ, రాష్ట్రానికి కూడా ప్రమాదకరమే అవుతుందన్నారు. కేంద్రంతో అఫెన్స్ కాకుండా డిఫెన్స్ ఆడటం ద్వారా ప్రత్యేక హోదాను బాబు అటకెక్కిం చడం చాలా తప్పు అంటున్న ఆర్. నారాయణమూర్తి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
ముప్ఫై ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు. మొదట్లో వచ్చిన ఆదరణ ఇప్పుడు లేదుగా?
దానికి కారణం కూడా నేను చెబుతాను. 31 ఏళ్లనుంచి సినిమాలు తీస్తున్నాను అర్ధరాత్రి స్వతంత్రం నుంచి నా పయనం ఇలా సాగుతోంది. 20 ఏళ్లు నా సినిమాలు చాలా బాగా ఆడాయి. నా సినిమాలు ఎప్పుడైతే బీభత్సంగా ఆడటం మొదలెట్టాయో.. అనేకమంది ఇలాంటి సినిమాలే తీయాలని ముందుకొచ్చారు. అది నాకు గొప్ప సక్సెస్ కింద లెక్క. మావో మహానుభావుడు ఏమన్నాడు? వెయ్యి పుష్పాలను వికసింప చేయండి అన్నాడు. విప్లవం నా సొత్తు కాదు. ప్రజల సినిమా నా సొత్తు కాదు. నేను ఆద్యుడినీ కాదు. చివరి వాడినీ కాదు. అనేకమందిలో నేనొకడిని. అందరూ ఈ ట్రెండ్‌లోకి రావడంతో ఒక మొనాటినీ వచ్చేసింది. ఎవరి రూట్లో వారు తీసారు కానీ పదేపదే తీయడం అనే మొనాటినీ వల్ల నేను దెబ్బతిన్నాను. వాళ్లంతా మానేసారు. నేను మాత్రమే సముద్రం ఈదుతున్నా. జనం దయవల్ల ఈదుతున్నా.
కమ్యూనిజం వైపు ఎలా మళ్లారు?
చిన్నప్పటినుంచి ప్రజల సమస్యలతో గడిపాను. మా ప్రాంతంలో ఉద్యమంకోసం ప్రాణత్యాగాలు చేసినవారిని చూశాను. ఇక చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులను అతి దగ్గరనుంచి చూశాను. వారన్నా వారి ఆచరణ అన్నా వీరారాధన. ఇక శ్రీశ్రీ గీతాలు అయితే యుద్ధనాదాలు. ఒక్క పదం అర్థం కాకున్నా పదండి పదండి పోదాం. పోదాం పోదా పైపైకి అంటూ పాడుతుంటే ఆవేశం, ఉత్తేజం. ఇక కొసరాజు జానపద పాటలన్నా అదే పీలింగ్. ఇలాంటి బాల్యం నాది. అంతే కానీ ఏరోజు నేను కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని పనిచేయలేదు. ప్రజల కోసం వారు చేసే పోరాటాలు, త్యాగాలు అవే నన్ను ప్రేరేపించాయి. తమ జీవితాలనే త్యాగం చేశారు వారు. అందుకే నా సినిమాలు వారి ప్రేరణతోనే సాగుతాయి. కానీ చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి అంటే వీరారాధనతో చూసిన నాకు వారిద్దరు విడిపోవడం, వేరు పార్టీలు పెట్టుకోవడంతో ఏడుపొచ్చింది. ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటున్నారు. మరి మీరెం దుకు విడిపోయారు. ఎందుకు విడిపోయారో, ఆ విభేదాలు ఏమిటో ఈరోజుకీ నాకు తెలీదు. ఆ విడిపోవడం సిపీఐ, సీపీఎం, సీపీఐ ఎం–ఎల్ పార్టీలు ఎర్రజెండా అనేక పీలికలుగా ఇవ్వాళ చీలిపోవడం అన్నది భారత దేశ పీడిత ప్రజానీకానికి పెద్ద దెబ్బ అని నా అభిప్రాయం.
రాజధాని నిర్మాణంలో చంద్రబాబు వైఖరిని మీరేమనుకుంటున్నారు?
రాజధాని కోసం దాదాపు 50 వేల ఎకరాల భూమి అవసరం లేదనుకుంటున్నాను. తుళ్లూరు రైతుల దగ్గర సేకరించిన 33 వేల ఎకరాలు కానీ, గ్రామ కంఠాలనుంచి సేకరించిన భూమి కానీ, అటవీ భూములు కానీ మొత్తంగా 50 వేల ఎకరాల భూమి రాజధానికి అవసరం లేదు. ప్రపంచంలోనే గొప్ప రాజధాని అనే ఆశయం గొప్పదే కావచ్చు. కానీ అది ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ కోసమే ఇన్ని వేల ఎకరాలు సేకరించారా అనే అపప్రథ ఏదయితే ఉందో అది పాలకుడిగా చంద్రబాబుకూ, రాష్ట్రానికి కూడా హానికరమే అవుతుంది.
ఏపీలో సోషల్ మీడియాపై జరుగుతున్న దాడులు, అరెస్టులపై మీ అభిప్రాయం?
ఒక్క ఏపీలోనే కాదు దేశంలో ప్రపంచమంతటా సోషల్ మీడియాపై దాడి జరుగుతోంది ఎందుకు? ఇవ్వాళ రాజ్యాన్ని ప్రశ్నించడమే పెద్ద నేరం అయిపోతోంది కదా. నరేంద్రమోదీ గత మూడేళ్లలో బీభత్సంగా పాలన చేశాడని మీడియా అంటోది. అది అంగీకారమేనా? మీడియా మీద దాడి కాదు. మీడియానే ప్రజలపై రుద్దుతోంది. బాహుబలి సినిమా చూడకపోతే వాడు ప్రేక్షకుడు కాదు. మోదీకి ఓటేయకపోతే నేను ఓటర్ని కాను. రాజమౌళి నభూతో నభవిష్యత్ లాగా బాహుబలి తీశారు. ఒకే. ఒప్పుకుంటున్నా. కానీ నేను ఆ సినిమా చూడవచ్చు, చూడకపోవచ్చు. కానీ చూడకపోతే నువ్వు పాపాత్ముడివి అని మీడియా ఇంపోజ్ చేస్తుందనుకో. అది తప్పు కదా. మోదీ మూడేళ్ల పాలనలో అంత బీభత్సం చేశారా? నరేంద్రమోదీ నిజాయితీ పరుడు, అవినీతి మరక అంటనివాడు అంటే ఒకే. ఒప్పుకుందాం. కానీ ఆయన చుట్టుపక్కల చేరిన మూక అంతా అంబానీలు, అదానీలు మొత్తం పారిశ్రామిక వేత్తలు ఇదీ బీభత్సం కాగా మీడియా దీన్ని పక్కనపెట్టి పొగడటం ఏంటి? వాస్తవాలను పక్కనబెట్టి మీరు ప్రజలమీద భావాలను రుద్దడం మొదలు పెడితే అది ప్రజలమీద దాడే కదా. రాజ్యాన్ని ప్రశ్నిస్తున్న మీడియా మీద ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి. అదే సమయంలో మీడియా కూడా ప్రజా వ్యతిరేక విధానాలను, భావాలను ప్రజలపై రుద్దతూ వారిపై దాడి చేస్తున్నాయి.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు?
ఆ విషయంలో చంద్రబాబు వైఖరి తప్పు. యూపీఏ ప్రభుత్వం, సోనియా సైతం ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేశారు. ఆ ప్రకటనలను వారు గౌరవించాలి. ఆమోదిం చాలి. కాని ఇవ్వాళ జరుగుతున్నదేమిటి? రాజ్యవ్యవహారాల్లో అపెన్స్, డిఫెన్స్ రెండూ ఉంటాయి. దాడి చేయాలి, కాచుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం మూడేళ్ల తర్వాత కూడా కేంద్రంతో వ్యవహారంలో డిఫెన్స్ తోనే వెళుతున్నారు. ఆయన అఫెన్స్‌లో వెళ్లి టీడీపీ ఎంపీలందరిచేత పూర్తిగా రాజీ నామా చేయించి మాకు మంత్రిపదవులు వద్దు ఏమొద్దు. ప్రత్యేక హోదా కావాలి అని పట్టుబడితే ప్రత్యేక హోదా రాదా? నిజంగా ప్రత్యేక హోదానే వస్తే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. గతంలో కూడా ఎన్నో సభల్లో చంద్రబాబును ఫైట్ చేయమని కోరాను. ఇప్పుడు సాక్షి ద్వారా కూడా ఇదే చెబుతున్నాను. ప్రత్యేక హోదా కోసం డిఫెన్స్ కాదు. ఫైట్ చేయండి. అదే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం.
రాజ్య వ్యవహారాల్లో అపెన్స్, డిఫెన్స్ రెండూ ఉంటాయి. దాడి చేయాలి, కాచుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం మూడేళ్ల తర్వాత కూడా కేంద్రంపట్ల డిఫెన్స్‌తోనే వెళుతున్నారు. ఆయన అఫెన్స్‌లో వెళ్లి టీడీపీ ఎంపీలందరిచేత పూర్తిగా రాజీనామా చేయించి, మాకు మంత్రిపదవులు వద్దు.. ఏమొద్దు. ప్రత్యేక హోదా కావాలి అని పట్టుబడితే ప్రత్యేక హోదా రాదా? నిజంగా ప్రత్యేక హోదానే వస్తే ఏపీలో దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. ప్రత్యేక హోదా కోసం డిఫెన్స్ కాదు. ఫైట్ చేయండి. అదే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం.
(నారాయణమూర్తితో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/R6B5HT
https://goo.gl/RlVkiG