శిష్‌ట్లాకి దీర్ఘమిస్తే శ్రీశ్రీ | Review article on Poet sri sri and sishtla | Sakshi
Sakshi News home page

శిష్‌ట్లాకి దీర్ఘమిస్తే శ్రీశ్రీ

Published Mon, Aug 8 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

శిష్‌ట్లాకి దీర్ఘమిస్తే శ్రీశ్రీ

శిష్‌ట్లాకి దీర్ఘమిస్తే శ్రీశ్రీ

సమీక్షా వ్యాసం
  నామిని
 మహాకవి పదవికి శ్రీశ్రీని వెనక్కి నెట్టి శిష్‌ట్లాను ముందుకు తోయాలని కుడా ఒక వర్గం అప్పట్లో విఫలయత్నం చేసిందంట. ఆ టైంలో కానీ నేను జీవించి వుంటే ఈ వర్గంలో నేను కూడా చేరిపోయి ఆ పనిని మరింత ముమ్మరం చేసుండేవాణ్ణి.

 
 
 ‘‘తెలుగులో మీ అభిమాన రచయిత ఎవరు? ’’ అని కొందరు నన్ను మాట సామెతగా అడుగుతుంటారు. నేను గమ్మనుంటే పాపం వాళ్లే, ‘‘రావిశాస్త్రా, కారా మాస్టారా, చాసోనా, మధురాంతకమా, ప్రతాప రవిశంకరా, ఎల్.ప్రఫుల్లచంద్ర ధర్మవరమా?’’ అని ఒక లిస్టు చదవతుంటారు. ఆ అడిగిన వాళ్లతో నేను ‘శిష్‌ట్లా ఉమామాహేశ్వరరావు’ అని చెప్తే ఈయనెవరో వాళ్లకి తెలవదు. ఇంకొక మాట ఏమంటే ఏ పుస్తకాన్ని గానీ నాకు దాచుకునే వాడిక లేదు. 1985లో కోడి బొమ్మతో వచ్చిన నా పచ్చనాకు సాక్షిగా... గూడా నా దగ్గిర లేదు. ఏదన్నా ఒక పుస్తకం భలేవుందనిపిస్తే దాన్ని చదివేసి వేరే ఎవురికైనా ఇచ్చి చదవమనే దాకా నాకు కాలే నిలవదు. నేను దాచుకున్న పుస్తకాలు రెండే రెండు. అవి: 1. సిపాయి కథలు.  2. విష్ణు ధనువు- నవమి చిలుక. రెంటినీ రాసింది శిష్‌ట్లా అనే ఈ మహన్నబావుడే. ఈ రెండూ కూడా సమ్మచ్చరంగా నా దగ్గిర లేవు. నాకు విశాలాంధ్ర జనరల్ మేనేజర్ హరినాథరెడ్డి బాగా తెలుసు.

మంచి పుస్తకాలు ఏవన్నా వుంటే చెప్తూ వుండు నామినీ అని ఆయన అన్నప్పుడు నేనాయన చేతుల్లో ఈ రెండు పుస్తకాల్నీ పెట్టి ‘విశాలాంధ్ర తరఫున శిష్‌ట్లా సమగ్ర సాహిత్యాన్ని వెయ్యండి, మిమ్మల్ని దేముడు మెచ్చతాడు’ అని చెప్పి ఇచ్చినాను. నాగ్గూడా ఒక ప్రచురణ ‘సంస్థ’ వుండాది ‘టామ్‌సాయర్ బుక్స్’ అని నా కొడుకు పేరిట. శిష్‌ట్లా ఉమామాహేశం పుస్తకాన్ని మా టామ్‌సాయర్ బుక్స్ కింద వెయ్యాలనేది నా ఆశ. అయితే ఆ కాపీరైట్స్ ఏవో ‘నవోదయ’ దగ్గిర వుండాయని తెలిసి నేను నీళ్ల్లొదిలేసి హరినాథరెడ్డి గుండా పని జరిపించుకోవాలని చూసినాను. మా టామ్‌సాయర్ బుక్స్ సంస్థ శిష్‌ట్లావీ, అంతకుముందు నామినివీ అచ్చువేసిందనీ, మరో రచయితవి వేయలేదనీ క్రీ.శ.7018వ సంవత్సరంలో కూడా ఒక పరిశోధకుడన్నా  చెప్పుకోవాలనీ... ఈ లెక్కన అయన పక్కన చోటు సంపాదించాలనీ నా గొప్ప. అది కాపీరైట్ సమస్య వల్ల తీరలా. అందువల్ల ఉమ్మాయ్‌ని ‘నవచేతన’ వారికి వొదులుకున్నా.

 1986లో శిష్‌ట్లా సిపాయి కథలు చదివినాను. అప్పటినుంచీ 2001లో నా వుజ్జోగం పొయ్యేదాకా నా నెల జీతాన్ని తెచ్చి సిపాయి కథల 120 పేజీల చిన్న పుస్తకంలోనే పెట్టేవాణ్ణి. మా చిన్న అలమారాలో వుండే గాడ్రేజీ బీరవా నాకీ సిపాయి కథలు. అంత ఉమాదం నాకు శిష్‌ట్లా మింద. 1984లో బాగ్‌లింగంపల్లిలో అబ్బూరి వరద రాజేశ్వరరావు ఇంట్లో రావిశాస్త్రి దిగి సోఫాలో కూచ్చుని పేపరు చదువుకుంటుంటే అప్పుడనంగా నేను వాళ్లింటికి పోతే, ‘‘మంచి టయానికి వచ్చావ్. ఆయన రావిశాస్త్రి గారు! పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో,’’ అనన్నాడు అబ్బూరి. పైకి నమస్తే చెప్పి మూగెద్దు మాదిరిగా బైటికొచ్చేసినా. ఇట్లానే పతంజలి వాళ్లింట్లో చాసోని పరిచయం చేసినప్పుడు గూడా నేను లెక్కలో వేసుకోలా. వరదగానీ, పతంజలిగానీ నాకంత పొగురు పనికి రాదని హితవు చెప్పినారు. అట్టాంటోడికి ఈ ఉమా అంటే ఎందుకంత లెక్కాజమ!

 దేనికంటే శిష్‌ట్లా అచ్చరాల్లో ఎంత మహిమ వుండాదో, అయన పదాల పోహళింపులో ఎంత కరెంటు ఉండాదో శ్రీశ్రీకి తెలిసినంతగా నాకు తెలుసు. శిష్‌ట్లా మింద శ్రీశ్రీకైతే ఎంత యిది ఉందో  చెప్పలేమసలికి. శ్రీశ్రీకి ఈ ఉమ్మడంటే బిత్తరొక పక్కా, గౌరవం ఒక పక్కా. శిష్‌ట్లా కవిత్వం వెనుక శ్రీశ్రీ కవిత్వం మడిజేతులు కట్టుకుని నడిచింది. ఉమా మారో మారో మారో అని కై గట్టి ఏదో ప్రయోగం చేసి ఆ కవితను యెంటికతో సమానంగా పోగొట్టుకుంటే శ్రీశ్రీ ఇంకొకడుగు ముందుకేసి ‘మరో ప్రపంచం మరో ప్రపంచం’ అని అరిచి పారేసినాడు. ఈ మహేశం ఎంతటివాడో తల్లావఝుల శివశంకర శాస్త్రికీ, కురుగంటి సీతారామ భట్టాచార్యులకీ, ఇంకా పిల్లలమర్రి వెంకట హనుమంతరావుకీ, ఆరుద్రకీ తెలవదా! అందరికీ అన్నీ తెలుసు. శిష్‌ట్లా ‘అతి నవీనుల్లో కడు ప్రాచీనుడు’ అనీ, ‘నవ్యులలో అతి నవ్యుడు’ అనీ తెలిసినా ప్రతి ఒక్కరూ ‘ఉన్మత్త భావశాలి’ అని ఆడిపోసుకున్నారు. నిజం చెప్పాలంటే తూకాలేసేవాడు కవిగాడు, ఉన్మత్త భావశీలతే కవికి వుండాల్సింది. శిష్‌ట్లా మింద వచ్చిన వ్యాసాలు అన్నీ నేను చదివినాను. ‘కవిత్వంలో రౌడీ వేషం’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు రాస్తూ శిష్‌ట్లా శ్రీశ్రీకి ఎలా  మార్గదర్శకుడైనాడో, శిష్‌ట్లా కవిత్వాన్ని శ్రీశ్రీ ఎంతగా అనుకరించినాడో చెప్పకుండా, చెప్పినా పైపైన ఒక మాట అనేసి, ‘శిష్‌ట్లాకు నోరు మంచిది గాద’నీ, ‘ఎవరిని పడితే వారిని అరే తురే అనే పాడు అలవాటు వుంద’నీ... ఇట్లా చెప్పుకు పోయినాడు.

ఉమాయ్ మింద రాసిన అందరూ కూడా ‘స్థిరమైన ఉద్యోగం లేదు, క్రమమైన జీవితం లేదు’ అని ఒకరూ! నిజానికి ఒక కవికి ఈ బూమండలం మింద అది మంచి లక్షణమే గదా. ఇంకా, కెవిఆర్ శిష్‌ట్లా కథలకి సంపాదకత్వం వహిస్తూనే ముందుమాటలో ఏమంటాడంటే, ‘శిష్‌ట్లా రాసిన కథల్లో ఏమాత్రం సాంఘిక ప్రాముఖ్యం వున్న వ్యక్తీ పాత్రగా కనిపించదు’ అని అన్నాడు. పాలూ కూడూ తినే నోటితో మీరు చెప్పండి, సాదా సీదా జనానికి సాంఘిక ప్రాముఖ్యం ఏముండి చస్తుంది? 1998లో ఏటుకూరి ప్రసాద్ శిష్‌ట్లా మింద ఒక వ్యాసం రాస్తూ ఏమన్నాడో చూడండి, ‘గుంటూరులో ఎస్‌విఎల్ నరసింహం ప్రముఖ అడ్వకేటు, శిష్‌ట్లాకు సోదర సమానుడు. ఉమా వ్యక్తిగత జీవితం గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది అని నరసింహం అంటాడు’- ఇదీ వాటం. విమర్శకులు ఆయన  రాసిందాని గురించి మాట్లాడాలగానీ ఇవన్నీ దేనికో అర్తం గాదు. శివలెంక శంభుప్రసాద్, ఉమా మహేశ్వరరావు ఎమ్మేలో క్లాస్‌మేట్స్. ఉమా ఆంధ్రపత్రికలో కొంత కాలం చేసి కూడా మానేసినాడంటే, పోనీ... ఆయన చావుకు ఒక తేదీ అంటూ లేదంటే... యీ జర్నలిస్టులకీ కవులకీ ఎంత దూరంగా బతికినట్టు! ఇదెంత సుగుణం. పుట్టిన తేదీగానీ చచ్చిన తేదీగానీ లేకపోవడంతో జయంతి వ్యాసాలూ, వర్ధంతి వ్యాసాలూ రాసే పని కూడా పత్రికలకు తప్పింది. కవిత్వాన్నే ప్లాన్ చెయ్యలేదు శిష్‌ట్లా కవి, ఇంక జీవితాన్ని ఏం చేసుకుంటాడు? గెలిచిన కోళ్లకు లోకాన్ని విడిచి పెట్టేసి ఆయన మానాన ఆయన చచ్చిపోతే ఇట్లా ఏవేవో రాసి సాధించడం!
 
శిష్‌ట్లా శ్రీశ్రీని ఏదో రైలుస్టేషన్‌లో చూసిన ఎమ్మటే, ‘‘ఒరే శ్రీనివాసరావూ నీకు కవిత్వంలో మంత్రం తంత్రం నేర్పిస్తాన్లేరా’’ అని అన్నాడంటే శిష్‌ట్లా వాయాడి అనుకోగూడదు. అదాయన నోటి దురుసనుకంటే ఎట్లా? కవిత్వ రహస్యం తెలిసిన వాడిగా గుండెకాయతో అ మాట అన్నాడేమో ఎవుడికి తెల్సు? ఇంకా ‘నువ్వేమి కవిరా’ అని శ్రీశ్రీని గడ్డివాములో విసిరేయబోయాడంటే- ఇట్లా ఏ నిమిసానికా నిమిసం బయట పడిపొయ్యే వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాలి నిజానికి! ఇట్లాంటి వాటిని ముచ్చటగా చెప్పుకొని పోవాల్నే గానీ అవలక్షణాలుగా చాటింపు వేస్తే ఎట్లా? మహాకవి పదవికి శ్రీశ్రీని వెనక్కి నెట్టి శిష్‌ట్లాను ముందుకు తోయాలని కుడా ఒక వర్గం అప్పట్లో విఫలయత్నం చేసిందంట. ఆ టైంలో కానీ నేను జీవించి వుంటే ఈ వర్గంలో నేను కూడా చేరిపోయి ఆ పనిని మరింత ముమ్మరం చేసుండేవాణ్ణి. ఈయన్ని చదివిన కొత్తల్లో హైద్రాబాద్‌లో జర్నలిస్టుగా ‘ఉదయం’ పేపరులో పని చేసేటప్పుడు అక్కడి కవిగుంపులో ఒకరిద్దరితో, ‘‘శ్రీశ్రీ ‘మహాప్రస్థానంలో’ అనువాద కవితలు కూడా బాగానే వున్నాయి గదా. శిష్‌ట్లా అట్లాగాదే! అన్నీ ఒరిజినల్ పొయెమ్స్. నిక్కమైన తెలుగు కవి’’ అని చూసి నిండా దొబ్బులు తిన్నాను గూడా. ఈయనవి కథలు కవితలు అంటూ విడివిడిగా ఏం వుండవు. మొత్తం కవిత్వమే. తిరిగీ తిరగనీ నోరూ, పేరీ పేరని పెరుగూ ఎంత రుచో అంత రుచి శిష్‌ట్లా అచ్చిరం.
 ఒక్క ముక్కలో - శిష్‌ట్లాకి దీర్ఘమిస్తే శ్రీశ్రీ. అంతటి శిష్‌ట్లాను మనం శ్రీశ్రీతో పాటు నెత్తిన పెట్టుకోవాలి. కొత్తగా శిష్‌ట్లా పుస్తకం వచ్చింది. మనందరం నట్టింల్లో పీటేసి ఆ పుస్తకాన్ని పెట్టుకోవాలి. (శిష్‌ట్లా పుస్తకం వెలుగులోకి తెచ్చినందుకు నవచేతనకు పడిపడి దండాలు పెట్టాలిగానీ తప్పులు ఎంచకూడదు గదా- అచ్చు తప్పులు.)

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement