గ్రామీణ ‘ప్రగతి’ వికృత హేల | rural development and tractor loans article | Sakshi
Sakshi News home page

గ్రామీణ ‘ప్రగతి’ వికృత హేల

Published Sat, Jun 18 2016 1:38 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM

గ్రామీణ ‘ప్రగతి’ వికృత హేల - Sakshi

గ్రామీణ ‘ప్రగతి’ వికృత హేల

ఔరంగాబాద్ రైతులు 15.9 శాతం వడ్డీకి తీసుకున్న ట్రాక్టర్ రుణం ఊబిలో కూరుకుపోయి ఉండగా... అదేసమయంలో విలాసవంతమైన మెర్సిడిస్ బెంజ్ కార్లు 7 శాతం వడ్డీకి లభిం చాయి. రెంటినీ గ్రామీణ పురోగతిగానే చూస్తున్నారు. 2004-14 మధ్య కాలంలోని రుణ చోదక ట్రాక్టర్ల అమ్మకాల పెరుగుదలనే గ్రామీణ ప్రగతికి సంకేతంగా చూడటం అంటే... ఒక్క రోజులో 150 మెర్సిడిస్ బెంజ్ కార్ల అమ్మకంతో ఔరంగాబాద్ ప్రపంచ పెట్టుబడుల పటంపైకి ఎక్కడంగా భావించడమంతే హాస్యాస్పదం.
 
బ్యాంకులు ‘ట్రాక్టర్ మేళా’ సందడిలో ఉన్న 2010లో హిరాబాయ్ ఫకీరా రాథోడ్‌ను ఒక కొత్త ట్రాక్టర్‌ను కొనేలా ఒప్పించారు. ‘‘ట్రాక్టర్ షాపు సేల్స్ మేన్ రుణం దొరకడం, తిరిగి చెల్లించడం చాలా తేలికని చెప్పాడు’’అని  ఆమె ఔరంగాబాద్ జిల్లా కన్నాడ్ తెహసీల్‌లోని శిథిలావస్థలోని తన ఇంట్లో చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) స్థానిక బ్రాంచి కూడా రుణాన్ని త్వరత్వరగా మంజూరు చేసేసింది. బంజారా ఆదివాసియైన హీరాబాయ్ భర్త ఫారెస్టు గార్డుగా పనిచేసి రిటైరయ్యాడు. ఆమె కుటుంబానికి అదే తెహసీల్‌లో 3.5 ఎకరాల భూమి ఉంది. ‘‘ఆ ట్రాక్టర్‌ను మా భూమిలో ఉపయోగించుకోవడంతో పాటూ ఇతరుల భూముల్లో కూడా ఉపయోగించి మరి కాస్త సంపాదించగలమని అనుకున్నాం’’ అంటూ చెప్పుకొచ్చిందామె. రూ. 6,35,000 ధర ఉన్న ఆ ట్రాక్టర్‌కుగానూ ఆమెకు రూ. 5,75,000 రుణంగా ఇచ్చారు. ఆ రుణాన్ని ఆమె 15.9 శాతం వడ్డీ రేటున ఏడేళ్లలోగా తిరిగి చెల్లించాలి. ‘‘అదే నా జీవితంలోని ఘోరమైన తప్పు’’ అని కోపంగా చెప్పింది. ఈ ఏడాది మార్చి వరకు రూ. 7.5 లక్షలు బ్యాంకుకు తిరిగి చెల్లించే సరికి హీరాబాయ్ ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. అప్పుడిక బ్యాంకు ‘ఒక్క దఫా రుణ పరిష్కారం’గా రూ. 1.25 లక్షలు ఇమ్మని కోరింది. బంధు వులనుంచి మరిన్ని అప్పులు చేసి ఆమె ఆ మొత్తం చెల్లించింది.

ట్రాక్టర్ రుణాల మాయాజాలం
సంపన్నవంతురాలు లేదా కాస్త ఆర్థికంగా స్థితిమంతురాలు కాని ఆ బంజారా రైతు మహిళ రూ. 5.75 లక్షలకుగానూ దాదాపు రూ. 9 లక్షలు చెల్లించింది. దుర్భిక్ష పీడిత ప్రాంతమైన ఈ మరఠ్వాడా ప్రాంతంలో వ్యవసాయం మూలనపడటంతో  ‘‘మా పొలానికి మించి మరెక్కడా మా ట్రాక్టర్‌కు పనే లేకుండా పోయింది.’’ ఔరంగాబాద్ జిల్లాలోనే కాదు, దేశ వ్యాప్తంగా కూడా ఇంకా ఎందరో హీరాబాయ్‌లున్నారు. ఆమెలాగా అంత అప్పును తిరిగి చెల్లించలేని వారే ఎక్కువ మంది ఉన్నారు. రుణం కారణంగా జరిగిన ఆత్మ హత్యలు అసంఖ్యాకంగా ఉన్న మహారాష్ట్రలో ఈ పరిణామం ముఖ్యమైనది. ఎస్‌బీహెచ్ ఒక్కటే 2005-06 నుంచి ప్రారంభించి అలాంటి 1,000 ట్రాక్టర్ రుణాలను ఇచ్చింది. ‘‘బ్యాంకులు అప్పుడు ట్రాక్టర్ రుణాల వ్యామోహంతో ఉన్నాయి’’ అంటారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగుల నేత దేవీదాస్ తుల్జాపుకార్.

‘‘వాళ్లు ‘ప్రాధాన్యతా రంగ’ (వ్యవసాయం) రుణ కోటాను పూర్తి చేయాల్సి ఉండేది... ట్రాక్టర్ రుణాలను వ్యవసాయ రుణాలుగా చూపించవచ్చు. కాబట్టి పూర్తిగా కుంగదీసే అధిక వడ్డీ రేట్లకు ఎన్నడూ ట్రాక్టర్ నడిపి ఎరగని వారికి వాటిని అంటకట్టారు. హీరాబాయ్‌కి భిన్నంగా చాలా మంది భారీ మొత్తంలో తిరిగి చెల్లించినా గానీ ఒక దఫా సెటిల్‌మెంట్ భాగ్యా నికి కూడా నోచుకోలేదు. పలువురు అసలేమీ చెల్లించలేకపోయారు.’’ ఒక్క కన్నాడ్  ఎస్‌బీహెచ్ బ్రాంచ్ ఒక్కదాని నుంచి కనీసం అలాంటి 45 మంది  వివరాలు మాకు లభ్యమయ్యాయి. వారు మొత్తంగా రూ. 2.7 కోట్లు ఆ బ్యాంకుకు ఇంకా బకాయిపడ్డారు. ఇది, ఒక చిన్న పట్టణంలోని ఒక బ్యాంకుకు చెందిన ఒక బ్రాంచి పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో బ్యాంకుల్లో అలాంటి లెక్కలేనన్ని వేల కొలది రుణాలున్నాయి.

హీరాబాయ్ 15.9 శాతం వడ్డీకి ట్రాక్టర్ రుణం తీసుకున్న సమయం లోనే... 65 కిలో మీటర్ల దూరంలోని ఔరంగాబాద్ పట్టణంలో ఇంతకు మించిన రుణ సంతర్పణ జరిగింది. ఆ నగరంలోని ఉన్నత వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌లు, డాక్టర్లు, లాయర్లు తదితరులు 2010 అక్టోబర్‌లో ఒక్క రోజులో 150 మెర్సిడిస్ బెంజ్ కార్లు కొన్నారు. ‘‘ఔరంగా బాద్ అభివృద్ధి పథంలోకి వచ్చేసింది’’, ‘‘ప్రపంచ పెట్టుబడుల పటంపైకి ఎక్కింది’’ అన్నారు. ఆరోజున అమ్ముడుపోయిన బెంజ్ కార్ల ధరలు మోడ ళ్లను బట్టి రూ. 30 నుంచి 70 లక్షల వరకు ఉన్నాయి. 24 గంటల్లో 150 విలా సవంతమైన కార్లను అమ్మేస్తున్నందున క ంపెనీ భారీ ధర తగ్గింపును ఇచ్చిం దని మీడియా తెలిపింది. ఔరంగాబాద్ ఎస్‌బీఐ కేవలం7 శాతం వడ్డీకి రూ. 65 కోట్ల సంతర్పణలో మూడింట రెండు వంతుల రుణాలను  ఇచ్చింది. మెర్సిడిస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ దేశంలోని రెండవ స్థాయి, మూడవ స్థాయి నగరాల అద్భుత ఆర్థిక శక్తికి జేజేలు పలికినట్టుగా మీడియా తెలిపింది. ‘‘ఒక్కరోజులో 150 మెర్సిడిస్ బెంజ్ కార్లు ఒక్కసారిగా అమ్ముడు పోవడం ద్వారా సాహసోపేతంగా, దూకుడుగా, చలనశీలంగా  అది బయట పడింది ’’ అని వ్యాఖ్యానించారు.  

ఔరంగాబాద్‌లోని చాలా మంది హీరాబాయ్‌లకు మరో విభిన్నమైన షాక్ తగిలింది. రెండు వర్గాలూ వాహనాల రుణాలను తీసుకున్నవే. రెండూ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే రుణాలను తీసుకున్నాయి. కాకపోతే హీరా బాయ్ నగరంలోని ఉన్నత వర్గాలవారు చెల్లించేదానికి రెండింతలు కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నారు అంతే. ఆమె ఔరంగాబాద్‌ను ప్రపంచ పెట్టు బడుల పటం మీదకు ఎక్కించలేకపోవడమే బహుశా అందుకు కారణం కావచ్చు. 12.5 నుంచి 15.9 శాతం వడ్డీకి ట్రాక్టర్ల రుణాలను తీసుకున్న వారిలో అత్యధికులు ఆదివాసులు, దళితులు. అలాంటి వారు బెంజ్ కార్ల కొనుగోలుదార్లలో కనిపించరు. అంబా తండా వాసి అమర్‌సింగ్ ముఖర్ర మమ్ రాథోడ్   బ్యాంకుకు రూ. 11.14 లక్షలు బకాయి పడ్డాడు... తీసుకున్న రుణం అందులో సగం కంటే తక్కువే. అతను దాదాపుగా ఏమీ తిరిగి చెల్లించలేకపోయాడు, బహుశా ఎప్పటికీ ఏమీ చెల్లించలేడు. మేమా తండాకు వెళ్లి మేం అతని ఇంటిని చూశాం. ఇంటిలో విలువైనవేమీ లేవు. ట్రాక్టర్ అసలుకే లేదు. కొన్ని సందర్భాల్లో పలుకుబడిగలవారు పేదల పేరు మీద ఆ రుణం తీసుకుంటారు. అదే ఇక్కడా జరిగి ఉండాలి. కన్నాడ్‌లోని 45 కేసులే గాక ఇతర తెహసీళ్లలోనూ, బ్రాంచ్‌లలోనూ అలాంటివి ఇంకెన్నో ఉన్నాయి.

బ్యాంకుల ప్రమాదకరమైన క్రీడ
‘‘ఈ రుణాలలో వేటినీ క్రియాశీలంగా లేని ఆస్తులు’’గా ప్రకటించలేదని తుల్జాపుర్కర్ తెలిపారు. ‘‘మొత్తంగా అది చాలా కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. వాటిని కాగితాల మీద క్రియాశీలంగా ఉన్న ఆస్తులుగా చూపడమే బ్యాంకులు ఎక్కువగా చేస్తాయి. తిరిగి చెల్లించాల్సిన గడువు దాటిపోయినా ఆ రుణాలను ప్రామాణికమైన క్రియాశీల ఆస్తుల జాబితాలోనే చూపవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ఈ వాస్తవాన్ని ముఖాముఖి ఎదుర్కోక తప్పదు.’’ కొన్ని సందర్భాల్లో కొనుగోలుదార్లు మధ్యవర్తులు, డీలర్ల చేతుల్లో మోసపోవడం జరిగి ఉంటుంది. ‘‘బ్యాంకు ఫైనాన్స్ ట్రాక్టర్, ట్రాలీ తదితర అనుబంధాలను కలుపుకుని ఉండవచ్చు. కానీ వాటిలో రైతుకూ కావాల్సింది ట్రాక్టర్ మాత్రమే, అదే తీసుకుంటాడు. మిగతాదంతా డీలర్ల జేబుల్లోకి చేరుతుంది.’’

భారత్‌లో ట్రాక్టర్ల అమ్మకాలు  2004-14 మధ్య మూడు రెట్లు పెరి గాయి. 2013లో దేశంలో 6,19,000 ట్రాక్టర్లు ఉత్పత్తి అయ్యాయని, అది దాదాపు మొత్తంగా ప్రపంచ ఉత్పత్తిలో మూడో వంతని ఆ పరిశ్రమ గణాం కాలు సూచిస్తున్నాయి. పలువురు దీన్ని ‘‘గ్రామీణ ప్రగతికి ప్రతిబింబం’’ లేదా గ్రామీణ భారతం ఎంత వేగంగా పురోగమిస్తోందనే దానికి ‘‘ముఖ్యై మెన బరోమీటరు’’గా చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఒక సెక్షన్ల ఆదా యాల్లోని పెరుగుదల ఈ ట్రాక్టర్ల డిమాండు పెరగడానికి కొంతవరకు కారణమైన మాట నిజమే. అయితే చేతికి అంటగట్టే వేలం వెర్రి రుణాలు కూడా అందుకు దోహదపడ్డాయి. గ్రామీణ కుటుంబాలలో కేవలం 8 శాతం మాత్రమే నెలకు రూ. 10,000కు మించిన ఆదాయాన్ని సంపాదిస్తున్నవని సామాజిక ఆర్థిక కుల జనాభా గణాంకాలు సూచిస్తున్నాయి (ట్రాక్టర్లున్న కుటుంబాలు ఆ 8 శాతం కంటే కూడా చాలా తక్కువే).

అయినా ట్రాక్టర్ల అమ్మకాల గణాంకాలు గ్రామీణ భారతం వృద్ధి చెందుతున్న తీరుకు నమ్మదగిన సూచిక అనే వాదనను చాలా మంది ఆర్థికవేత్తలు, కాలమిస్టులు పట్టుకుని వేలాడటం విశేషం. ఇప్పుడు ఔరంగాబాద్‌లో ట్రాక్టర్ల అమ్మకాలు 50 శాతం క్షీణించిపోయాయనే నివేదికే పడక కుర్చీ విశ్లేషకులకు ‘గ్రామీణ సంక్షోభానికి’ కచ్చితమైన సూచిక అవుతుంది. విలాసవంతమైన మెర్సిడిస్ బెంజ్ కారుకు భిన్నంగా ట్రాక్టర్ ఉత్పాదక సాధనం, నిజమే. కానీ 2004-14 మధ్య కాలంలో రుణ చోదక ట్రాక్టర్ల అమ్మకాల పెరుగుదలనే వేగవంతమైన గ్రామీణ ప్రగతికి సంకేతంగా చూడటం అంటే... ఒక్క రోజులో 150 బెంజ్‌లు అమ్ముడుపోతేనే ఔరంగాబాద్ ప్రపంచ పెట్టుబడుల పటంపైకి ఎక్కడంగా భావించడమంతే  హాస్యాస్పదం. రూ. 64,330 తలసరి ఆదాయంతో మర ఠ్వాడా మహారాష్ట్రలోకెల్లా అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం.

తలెత్తుతున్న మరో సంక్షోభం
ఈ ట్రాక్టర్ల సంక్షోభం ఇలా ఉండగా, మరో కొత్త సంక్షోభం తలె త్తుతోంది. ఇది ఎక్సకవేటర్లకు (తవ్వుడు యంత్రాలు) సంబంధించినది. శారీ రక శ్రమకు బదులుగా మరిన్ని యంత్రాలను ప్రవేశపెట్టాలని తాపత్రయపడే ప్రభుత్వాలున్న మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వాటి వాడకం బాగా పెరుగు తోంది. ‘‘రుణ వాయిదాను, భారీ నిర్వహణా వ్యయాలను చెల్లించాక ఇంకా మీకు ఏమైనా కాస్త మిగలాలంటే నెలకు లక్ష రూపాయల విలువైన పనిని చేయాల్సి ఉంటుంది. అది వానా కాలంలో సాధ్యం కావచ్చు. ఆ తర్వాత అది ముగిసిపోతుంది. ఈ పట్టణంలో ఉన్న 30 జేసీబీలకు కాదుగదా, మూడింటికి కూడా సరిపడేంత పని ఉండదు. ఇక మీరు చేసేది ఏముంది? ఈ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని వారు కూడా ప్రొక్లయిన్ హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లపై మదుపు పెడుతున్నారు. తిరిగి రుణాలు తీసుకోవడమే వారిని చితికి పోయేలా చేస్తోంది. ఇది ఈ ప్రాంతం అంతటికీ వర్తిస్తుందని అనుకుంటు న్నాను. సంబంధాలున్న కొద్ది మందికే కాంట్రాక్టులు దక్కుతాయి. వందకు పది మందే మనగలగవచ్చు. మిగతావారంతా దివాలా తీయాల్సిందే.’’

కన్నాడ్‌లోని హీరాబాయ్ కూడా మమ్మల్ని చూసి బ్యాంకు అధికారులమే మోనని ఆశ్చర్యపోయింది. ‘‘నన్ను ఇప్పుడు ఏం చేస్తారు?’’ అని అడిగింది. రూ. 6.35 లక్షల విలువైన (బహుశా అంతకంటే తక్కువే ఉంటుంది) ట్రాక్టర్ కోసం తీసుకున్న 5.75 లక్షలకుగానూ రూ. 9 లక్షలు చెల్లించాక కూడా ఆమె భయంగా వేసే ప్రశ్న ‘‘ఇంకా నేను ఏమైనా కట్టాలా?’’  లేదు, నువ్వు దాని ధరను పూర్తిగా చెల్లించడమే కాదు, ఇంకా చాలా ఎక్కువే కట్టావు అని మేం చెప్పాం.
 ‘పీపుల్స్ ఆర్కీవ్ ఆఫ్ రూరల్  ఇండియా’ సౌజన్యంతో

 పి. సాయినాథ్
 వ్యాసకర్త సుప్రసిద్ధ గ్రామీణ పాత్రికేయులు, రచయిత ః PSainath_org

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement