
బ్యాంకుల విలీనం ప్రమాదకరం!
సందర్భం
ఇవాళ విలీనం సమస్య ఎస్‌బీహెచ్‌కు ఎదురవ్వొచ్చు. రేపు అది ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులకు కూడా జరిగే ప్రమాదముంది. ఒక పెద్ద బ్యాంకు నష్టపోయిం దంటే కోట్లాది కస్టమర్లు ఉన్నఫళాన కుప్పకూలిపోతారు.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) తోపాటు మరో నాలుగు ఇతర అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో విలీనం చెయ్యాలనే ప్రతిపాదన గత కొన్ని సంవత్సరాలుగా చర్చనీయాం శంగా ఉంటోంది. అయితే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగులు దాన్ని వాయిదా పడేలా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఉన్నట్లుండి మే 17న ముంబైలో అయిదు బ్యాంకుల బోర్డు సమావేశా లకు పిలుపునివ్వడమే కాకుండా ఎస్‌బీఐలో విలీనం కావడా నికి ఒక ‘అభ్యర్థన’ను వాటిచేత ఆమోదింపజేసింది. కంపెనీ తరఫున బోర్డు డెరైక్టర్లు దీన్ని వ్యతిరేకించగా, ప్రభుత్వం నామినేట్ చేసిన బోర్డ్ డెరైక్టర్లు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని తమ బాస్ ఆదేశానుసారం ఆ అభ్యర్థనను ఆమోదించారు.
బ్యాంకు విలీనాల్లో కొత్త అంశమేదీ లేదు. అయితే సాధారణంగా వ్యాపారాన్ని సరిగా నిర్వహించని లేదా దివాలా తీసిన బ్యాంకులను కాపాడటానికి ఆర్థిక పటిష్టత ఉన్న బ్యాంకులోకి విలీనం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.
దాదాపు 2 వేల బ్రాంచీ లను కలిగి ఉన్న ఎస్‌బీహెచ్ ప్రతి సంవత్సరం రూ. 2,50,000 కోట్ల బిజినెస్ చేస్తోంది, ఈ సంవత్సరం బ్యాంకు రూ. 1,065 కోట్ల లాభాన్ని ఆర్జించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్- కొచ్చిన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ - బికనూర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాదీ ఇదే పరిస్థితే. ఈ బ్యాంకులన్నీ లాభాల్తో ఉన్నాయి. పైగా రైతులకు, స్వయంఉపాధి కలవారికి, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ఇవి ముందస్తు రుణాలు కల్పించడం ద్వారా సామాజిక బాధ్య తను కూడా నెరవేరుస్తున్నాయి.
బడా కార్పొరేట్ కంపెనీలకు ఒకటి నుంచి పది లక్షల కోట్ల రుణాలను అందించగలిగే ప్రపంచ బ్యాంకు స్థాయి బ్యాంకులను భారత్ కలిగి ఉండాలన్నది కొందరు ఆర్థిక సలహాదారులు, వాణిజ్య సంస్థల భావన. అందుకే ఇదొక ఆర్థిక భావనకూడా అయింది. ప్రపంచంలోని పదిమంది అగ్రశ్రేణి సంపన్నులలో నలుగురు భారత్‌కి చెందినవారు ఉన్నట్లయితే ఆ స్థాయిని చూసి సంతోషపడేవారు కూడా ఉన్నారు. మీరు నిండు దారిద్య్రంతో ఉన్నా సరే సంపదను చూసి గర్విస్తుంటారంతే. జాతీయ సంపద పెరుగుతు న్నట్లయితే ఏ బ్యాంకు అయినా సరే పెద్ద బ్యాంకుగా మారుతుంది. పెద్ద చేప చిన్న చేపను మింగేలా ఇతర చిన్న చిన్న బ్యాంకులను మింగడం ద్వారా కాకుండా ఎస్‌బీఐ తన సొంత వ్యాపారం ద్వారానే పెద్ద బ్యాంకు కావాలి. విషాద మేమిటంటే, అన్ని అనుబంధ బ్యాంకులను విలీనం చేసు కున్నప్పటికీ మన ఎస్‌బీఐ ప్రపంచంలోని 100 అగ్రశ్రేణి బ్యాంకుల్లో కూడా ఒకటి కాలేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇతర అనుబంధ బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు. వీటిని మునుపటి నవాబులు, సంస్థానాధిపతులు స్థాపించారు. ఇవి ప్రాం తీయ బ్యాంకులుగా ఆవిర్భవించాయి. నిజాం నవాబు 19 41లో నిజాం స్టేట్ రైల్వేస్, రోడ్‌వేస్, అజాంజాహి మిల్స్ వంటి కొన్ని పరిశ్రమలు, ఉస్మానియా యూనివర్సిటీ వగైరా లతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను కూడా స్థాపిం చారు. మొదట హైదరాబాద్ స్టేట్ బ్యాంకుగా, తర్వాత తెలంగాణ గర్వించే ఆర్థిక చిహ్నంగా ఎస్‌బీహెచ్ విజయ వంతమైన బ్యాంకుగా అద్వితీయ వృద్ధితో పెరుగుతూ వచ్చింది. ఉద్యోగులు చెమట కష్టంతో, కస్టమర్ల సహకా రంతో ఇది బడా ఆర్థిక సంస్థగా మారింది. చార్మినార్‌లాగే ఎస్‌బీహెచ్ తెలంగాణా చిహ్నంగా ఉంది. ప్రాంతీయ సొబ గులతో హైదరాబాద్ వారసత్వాన్ని గర్వింపజేసే ప్రతీకగా ఉంటోంది. అలాంటి ఎస్‌బీహెచ్‌ను ఎస్‌బీఐలో విలీనం చేస్తే మూడు పెద్ద సమస్యలు ఎదురవుతాయి.
1. మునుపటి ఏపీలో ఆంధ్రా బ్యాంకు లాగే, తెలంగాణలో ఎస్‌బీహెచ్ ప్రధానమైన బ్యాంకు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సీజన్లలో రైతులకు రుణ సౌక ర్యాలను కల్పించాలని ప్రతిపాదించింది. ప్రధాన బ్యాం కులు వీటిని అనుసరిస్తాయి కూడా. స్థానిక వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందిన వారికి కూడా ఎస్‌బీహెచ్ ప్రాధాన్యమిస్తుంటుంది, కానీ విలీనం తర్వాత ఇది పూర్తిగా కనుమరుగై పోతుంది. తెలంగాణ ప్రజల అవసరాలను నెరవేర్చవలసిన బాధ్యత ఎస్‌బీఐకి లేదు. ప్రజలు, పాల కులు తమ సొంత బ్యాంకు ఉండాలని కోరుకుని దాన్ని స్థాపించారు. అలాంటి బ్యాం కును మింగేయడానికి అసలు మీరెవ్వరు?
2. ప్రాంతీయ బ్యాంకులు తమ లాభాల్లోని కొంత శాతం వాటాను వాటిని స్థాపించిన రాష్ట్రాలకు అందిస్తుంటాయి. ఎస్‌బీఐ రిజిస్టర్డ్ ఆఫీసు ముంబైలో ఉంది కాబట్టి ఎస్‌బీ హెచ్ విలీనం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన వాటాను కోల్పోనుంది. తెలంగాణకు రావ లసిన వాటా ఇక నుంచి మహారాష్ట్రకు వెళ్లనుంది.
3. విలీనం తర్వాత ఎస్‌బీహెచ్ ఉద్యోగులకు కూడా కొన్ని సర్వీస్ ప్రయోజనాలు లభించవు. పీఎఫ్, ఎస్‌బిఐ పెన్షన్ స్కీమ్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఎస్‌బీహెచ్ ఉద్యోగులకు వర్తించవు. వారు ఇకనుంచి ఎస్‌బీఐలో రెండో తరగతి ఉద్యోగులుగా ఉండాల్సి ఉంటుంది.
ఈ కారణాల వల్లే ఏ పరిస్థితుల్లోనూ ఎస్‌బీహెచ్‌ను ఎస్‌బీఐలో విలీనం చేయడాన్ని మనం వ్యతిరేకించాలి. ఇది ఉద్యోగులు, అధికారుల సమస్య కాదు. ఇది ప్రమాదంలో పడిన తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన సమస్య. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్య.
ఇవాళ విలీనం సమస్య ఎస్‌బీహెచ్‌కు ఎదురవ్వొచ్చు. రేపు అది ఆంధ్రాబ్యాంకు, తదితర బ్యాంకులకు కూడా జరిగే ప్రమాదముంది. దేశంలోని అన్ని బ్యాంకులను 5 పెద్ద బ్యాంకులుగా మార్చాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒక పెద్ద బ్యాంకు నష్టపోయిం దంటే కోట్లాది కస్టమర్లు కుప్పగూలిపోతారు. రాష్ట్రం మరిన్ని జిల్లాలుగా, మండలాలుగా కానున్న సందర్భంలో ఇప్పుడు జరగాల్సింది బ్యాంకుల కేంద్రీకరణ కాదు, మరింత వికేంద్రీ కరణ కావాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తోపాటు మరో నాలుగు ఇతర అనుబంధ బ్యాంకులకు చెందిన 50 వేలమంది ఉద్యోగులు బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా మే 20న సమ్మె చేశారు. జూలై 28, 29 తేదీల్లో మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు, వ్యాపారస్తులకు, ఎస్‌బీహెచ్ కస్టమర్లకు, తెలంగాణ ప్రజ లకు కూడా మేము విన్నవిస్తున్నదొక్కటే-ఎస్‌బీహెచ్ ఉద్యో గుల పక్షాన నిలిచి, ఎస్‌బీహెచ్‌ని అన్యాయంగా విలీనం చేయడానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఈ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చండి.
సురవరం సుధాకరరెడ్డి
వ్యాసకర్త గౌరవాధ్యక్షులు
ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య
మొబైల్ : 94400 66066