అవును... అమ్ముడుపోయారు
సందర్భం
అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసన సభ్యులు
తెలుగు జాతి మానమర్యాదల ను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన సీమాంధ్ర ప్రాం త మంత్రులు ఇప్పుడు కొత్తగా అవిశ్వాస డ్రామా ఆడిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా కేంద్ర మంత్రి మండలిలో ఏదో ఒక స్థాయిలో అధికారం అనుభవిస్తున్న ఈ మంత్రుల వల్ల ఆంధ్ర ప్రాంతా నికి ఏమైనా ఒరిగిందా? ఒక్క కొత్త ప్రాజెక్టు తీసుకురాగలిగారా! సోనియా గాంధీ వెంట తిరుగుతూ ఆమె ప్రసంగాలను అనువదించిన వారికి కూడా ఆమె ఎటువంటి వాగ్దానాలు ఎక్కడెక్కడ చేసిందో గుర్తులేదా. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణ నలోకి తీసుకుంటాం’ అన్నదే నాడు సోనియా చెప్పిన మాట.
ఆ సమావేశం వెంటనే విజయవాడలో మరో సభ జరిగింది. ఆ సభలో బందరు పోర్టును అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చింది. 2004లో స్పష్టంగా ఇవ్వని తెలం గాణ హామీ కోసం ఆ ప్రాంత నాయకులు అంతగా ఒత్తిడి తెచ్చి సాధించుకుంటే, ఈ ప్రాంతానికి చేసిన వాగ్దానం సంగతే మిటని విజయవాడ ఎంపీ ఎందుకు అడగడు? ఎన్టీఆర్, ఆయన ఆశయాల గురించి మాట్లాడే పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదనను తన తండ్రి అంగీ కరించేవాడా! అని ఒక్కసారి ఆయినా ఆలోచించారా? తెలుగు జాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పాటు పడిన తీరు ఏ మాత్రం గుర్తున్నా సీడబ్ల్యూసీ తీర్మానం జరిగిన మరు క్షణమే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సింది.
కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చెల్లని రూపాయికే గీతలెక్కువ అన్నాడు ఒక సినీ కవి. అది సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవికి చక్కగా అబ్బుతుంది. చిరంజీవికి మంత్రి పదవి మీదున్న మక్కువ తెలుగు గడ్డమీద లేదని అర్థమవుతున్నది. మంత్రి పదవి రానంతవరకు కావూరి సాంబశివరావు నోటి వెంట వచ్చిన మాటలు, చివరికి తన కులానికి కాంగ్రెస్‌లో అన్యా యం జరుగుతున్న వైనం గురించి బహిరంగంగా కన్నీరు కార్చిన సంఘటనలు ఆయన మానసిక స్థితి మీద అను మానం కలిగించేవిగా ఉన్నాయి. అదే కావూరి కేంద్ర మంత్రి అవగానే ‘అపరిచితుడు’గా మారిపోయాడు.
సీమాంధ్ర ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న వా రికి ఆంధ్రప్రదేశ్ విభజన గురించి ముందుగా తెలియ దంటే నమ్మేంత అమాయకులు కారు ఆంధ్రులు. కొత్త రాష్ట్రం ఏర్పడగానే దానికి తొలి ముఖ్యమంత్రిగా నన్ను చేస్తే ఉద్యమాలను సర్దుబాటు చేయగలనని బొత్స సత్తి బాబు చల్లగా చెప్పివచ్చాడు. ఇక వయసు మళ్లిన కావూరికి గవర్నర్ పదవి, ఈ ప్రాంతంలో రెండు ప్రముఖ సామాజిక వర్గాల నేతలుగా చిరంజీవి, పురంధేశ్వరిలకు కేబినెట్ మంత్రి పదవిని మాట్లాడుకున్నారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ నాటికి కొత్త హోదాలలో వీరంతా సీమాంధ్ర వీధుల్లో తిరుగుతుండేవారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు ఆధారం ఏమిటన్న ఒక్క ప్రశ్నను కేంద్ర మంత్రి వెయ్యలేరా? సెంటిమెంట్ ఆధా రంగా రాష్ట్రాలు ఇచ్చిన సందర్భం ఉందా? తెలంగాణ ఉద్యమం అరవయ్యేళ్లదైతే, వందేళ్ల గూర్ఖాల్యాండ్ సంగతే మిటని ఎదురు ప్రశ్న వేయలేరా? అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఎందుకు విభజించాలి? ఒకవేళ విభజించాల్సి వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్‌నే ఎందుకు విభజిస్తున్నారని నిల దీయలేరా! తెలుగు జాతిని చీల్చే బాధ్యతను చుట్టూ ఉన్న తమిళ (చిదంబరం, నారాయణస్వామి), కన్నడ (జయ రామ్ రమేష్, మెయిలీ), మలయాళ (ఏకే ఆంటోనీ), మరాఠీ (షిండే)ల చేతిలో పెడితే, ఇదేమిటని ఒక్కసారైనా అడిగారా! హైకమాండ్ నిర్ణయం తీసుకుంది, విభజన ఆపలేం, ఆర్టికల్-3 ప్రకారం ఆ హక్కు పార్లమెంట్‌ది అం టూ ప్రకటనలు చేస్తున్న కేంద్రమంత్రులు జేడీ శీలం, పన బాక లక్ష్మి, చిరంజీవి, కిషోర్ చంద్రదేవ్‌లకు తెలుగు వారి ఆక్రందనలు వినబడటం లేదా! తెలంగాణ ప్రాంతంలో 15 సీట్ల కోసం ఒక భాషా జాతిని చీలుస్తున్నా కూడా పార్టీని ప్రశ్నించలేని అశక్తులా? కేంద్రం భారీ ప్యాకేజీ సీమాంధ్రకు ఇచ్చేలా పట్టుపడతాం అని మరో కేంద్ర మం త్రి అంటాడు. నాలుగు నెలలు ఆగితే ఈ ప్రధాని ఉం డడు, కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదు. వంద రోజులకు మించి అధికారంలో ఉండని పార్టీ రాబోయే పదేళ్లలో ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఇచ్చి రాజధానిని నిర్మిస్తామని వాగ్దానం చేయడం ఎవరిని మోసగించేందుకు? ఇవి వ్యక్తిగత కక్షతో అంటున్న మాటలు కాదు. తెలుగుజాతికి జరుగుతున్న అవమానం చూసి తట్టుకోలేక వస్తున్న మాటలు. ఇది చాలా సున్నితమైన భాష. ఇంత కన్నా కటువైన పదాలతో తిట్టాలి. కాని తెలుగు జాతిని అవమానించడంలో మీరు దిగజారినంతగా తెలుగు ప్రజలు దిగజారదలుచుకోలేదు. ఇప్పటికైనా మేల్కొనండి. నిద్రా నాటకం నుండి బయటకు రండి. హైకమాండ్‌ని ధిక్కరించండి. తెలుగు జాతి ప్రతిష్ట కోసం తిరగబడితే, మీ చేతికి పార్టీ వేసిన సంకెళ్లు పోతా యే తప్ప మరే నష్టం జరగదు.