ఉద్రిక్తతలు చల్లారాలి!
వంకర గీతల ధ్యేయం నవ్వించడం, ఆలోచింపచేయడం. కానీ ఆ వంకర గీతలతో తయారైన ఓ వ్యంగ్య చిత్రం ఇప్పుడు ప్రపంచంలో ఒక భాగాన్ని ఆగ్రహావేశాలతో మండిపడేటట్టు చేస్తోంది. ఇంకో భాగాన్ని దాడుల భయంతో నిద్రపోకుండా చేస్తోంది. ఫ్రెంచ్ వ్యంగ్య చిత్రాల పత్రిక చార్లీ హెబ్డో (చార్లీ వారపత్రిక) మీద జరిగిన దాడి ప్రపంచాన్ని పెద్ద సంక్షోభం వైపు నడుపుతోంది. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భంగా జరగడమే విషాదం. ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యంగ్యచిత్రాలు ప్రచురించడం చార్లీ పత్రికకు కొత్తకాదు. అందుకు గతంలోను దాడులను చవిచూసింది. కానీ ఇద్దరు సాయుధులు ఈ నెల 7వ తేదీన పత్రిక కార్యాలయంలోకి చొరబడి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు. ఇది సంచలనమైంది. రెండు మతాలకు ప్రాతినిధ్యం వహించే దేశాధినేతల మాటెలా ఉన్నా, పాశ్చాత్య దేశాల పత్రికలు, ముస్లిం దేశాలలో మత సంస్థలు కయ్యానికి కాలు దువ్వడం మొదలయింది. ప్రపంచ పత్రికా చరిత్రలో ఇలాంటి ఘటన అసాధారణమే.
చార్లీ హెబ్డో ప్రతివారం 60,000 ప్రతులు అమ్ముడుపో యేది. దాడి దరిమిలా విడుదలైన మొదటి సంచిక యాభై లక్షల ప్రతులు అమ్ముడయింది. ‘జీ సుయి చార్లీ’ (నేనే చార్లీ) అనే నినాదంతో మళ్లీ మహమ్మద్‌ను చిత్రించి ఈ పత్రికను వెలువరించడం సంచలనమైంది. డెన్మార్క్ పత్రిక ‘బెలిన్‌స్కె’ చార్లీహెబ్డో పత్రిక తాజా చిత్రంతో పాటు గతంలో ఇస్లాంకు, ప్రవక్తకు వ్యతిరేకంగా ప్రచురించిన వ్యంగ్య చిత్రాలను కూడా తిరిగి ప్రచురించింది.
ఇంగ్లండ్‌లో ‘ది గార్డియన్’, ‘టైమ్స్’, ‘ఇండిపెండెంట్’, ‘ఫైనాన్షియల్ టైమ్స్’, ‘బీబీసీ’; హాఫింగ్టన్ పోస్ట్ వంటి న్యూస్ సైట్లు జనవరి 14న వచ్చిన తాజా సంచిక ముఖచిత్రాన్ని యథాతథంగా ప్రచురించాయి. కానీ ఇంగ్లండ్ లోనే ‘డైలీ మెయిల్’, ‘టెలిగ్రాఫ్’, ‘సన్’, ‘మిర్రర్’ వంటి ఇం కొన్ని పత్రికలు ఆ తాజా సంచిక గురించి ప్రచురించరాదని నిర్ణయించాయి. ఇక తాజా సంచిక నేపథ్యంలో తాజాగా దాడు లు కూడా జరగవచ్చునని ఐరోపాలో చాలా చోట్ల గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. బెల్జియం శనివారం నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించి ఉగ్రవాదులను జల్లెడ పట్టే పనిని చేపట్టింది.
తాజా చిత్రంతో ముస్లిం దేశాలు సహజంగానే మండిప డ్డాయి. 16వ తేదీ శుక్రవారం పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, సోమా లియా వంటి చోట్ల ఆగ్రహావేశాలు మిన్నంటాయి. నైగర్ (పశ్చి మ ఆఫ్రికా), పాకిస్థాన్‌లలో అల్లర్లు మరీ ఉధృతంగా సాగాయి. నైగర్‌లో నలుగురు మరణించారు. పెషావర్‌లో ఫ్రాన్స్ రాయ బారి కార్యాలయంలోకి చొరబడడానికి యత్నించిన నిరసన కారుల మీద భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగిం చాయి. చార్లీ హెబ్డో మీద దాడి చేసిన కౌచి సోదరులను పాకి స్తాన్ అల్‌కాయిదా ఒక ప్రకటనలో కీర్తించింది. అయితే పరిస్థితి అంతా ఒకేవిధంగా లేదు. ఈజిప్ట్‌లోని అల్ అజహర్ విశ్వ విద్యాలయం ‘ఇలాంటి వ్యంగ్య చిత్రాలను తీవ్రంగా పట్టించు కోవద్దని, ప్రాణాలు పోగొట్టుకోవద్ద’ని విజ్ఞపి చేసింది. పాశ్చాత్యులు చెప్పే భావ ప్రకటనా స్వేచ్ఛకూ, కొందరి మనోభావాలకూ మధ్య తలెత్తిన ఈ ఘర్షణకు బాధ్యులు ఎంత తొందరగా ముగింపు పలికితే అంత మంచిది.