Charlie Hebrew
-
ఉద్రిక్తతలు చల్లారాలి!
వంకర గీతల ధ్యేయం నవ్వించడం, ఆలోచింపచేయడం. కానీ ఆ వంకర గీతలతో తయారైన ఓ వ్యంగ్య చిత్రం ఇప్పుడు ప్రపంచంలో ఒక భాగాన్ని ఆగ్రహావేశాలతో మండిపడేటట్టు చేస్తోంది. ఇంకో భాగాన్ని దాడుల భయంతో నిద్రపోకుండా చేస్తోంది. ఫ్రెంచ్ వ్యంగ్య చిత్రాల పత్రిక చార్లీ హెబ్డో (చార్లీ వారపత్రిక) మీద జరిగిన దాడి ప్రపంచాన్ని పెద్ద సంక్షోభం వైపు నడుపుతోంది. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భంగా జరగడమే విషాదం. ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యంగ్యచిత్రాలు ప్రచురించడం చార్లీ పత్రికకు కొత్తకాదు. అందుకు గతంలోను దాడులను చవిచూసింది. కానీ ఇద్దరు సాయుధులు ఈ నెల 7వ తేదీన పత్రిక కార్యాలయంలోకి చొరబడి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు. ఇది సంచలనమైంది. రెండు మతాలకు ప్రాతినిధ్యం వహించే దేశాధినేతల మాటెలా ఉన్నా, పాశ్చాత్య దేశాల పత్రికలు, ముస్లిం దేశాలలో మత సంస్థలు కయ్యానికి కాలు దువ్వడం మొదలయింది. ప్రపంచ పత్రికా చరిత్రలో ఇలాంటి ఘటన అసాధారణమే. చార్లీ హెబ్డో ప్రతివారం 60,000 ప్రతులు అమ్ముడుపో యేది. దాడి దరిమిలా విడుదలైన మొదటి సంచిక యాభై లక్షల ప్రతులు అమ్ముడయింది. ‘జీ సుయి చార్లీ’ (నేనే చార్లీ) అనే నినాదంతో మళ్లీ మహమ్మద్‌ను చిత్రించి ఈ పత్రికను వెలువరించడం సంచలనమైంది. డెన్మార్క్ పత్రిక ‘బెలిన్స్కె’ చార్లీహెబ్డో పత్రిక తాజా చిత్రంతో పాటు గతంలో ఇస్లాంకు, ప్రవక్తకు వ్యతిరేకంగా ప్రచురించిన వ్యంగ్య చిత్రాలను కూడా తిరిగి ప్రచురించింది. ఇంగ్లండ్‌లో ‘ది గార్డియన్’, ‘టైమ్స్’, ‘ఇండిపెండెంట్’, ‘ఫైనాన్షియల్ టైమ్స్’, ‘బీబీసీ’; హాఫింగ్టన్ పోస్ట్ వంటి న్యూస్ సైట్లు జనవరి 14న వచ్చిన తాజా సంచిక ముఖచిత్రాన్ని యథాతథంగా ప్రచురించాయి. కానీ ఇంగ్లండ్ లోనే ‘డైలీ మెయిల్’, ‘టెలిగ్రాఫ్’, ‘సన్’, ‘మిర్రర్’ వంటి ఇం కొన్ని పత్రికలు ఆ తాజా సంచిక గురించి ప్రచురించరాదని నిర్ణయించాయి. ఇక తాజా సంచిక నేపథ్యంలో తాజాగా దాడు లు కూడా జరగవచ్చునని ఐరోపాలో చాలా చోట్ల గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. బెల్జియం శనివారం నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించి ఉగ్రవాదులను జల్లెడ పట్టే పనిని చేపట్టింది. తాజా చిత్రంతో ముస్లిం దేశాలు సహజంగానే మండిప డ్డాయి. 16వ తేదీ శుక్రవారం పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, సోమా లియా వంటి చోట్ల ఆగ్రహావేశాలు మిన్నంటాయి. నైగర్ (పశ్చి మ ఆఫ్రికా), పాకిస్థాన్లలో అల్లర్లు మరీ ఉధృతంగా సాగాయి. నైగర్‌లో నలుగురు మరణించారు. పెషావర్‌లో ఫ్రాన్స్ రాయ బారి కార్యాలయంలోకి చొరబడడానికి యత్నించిన నిరసన కారుల మీద భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగిం చాయి. చార్లీ హెబ్డో మీద దాడి చేసిన కౌచి సోదరులను పాకి స్తాన్ అల్‌కాయిదా ఒక ప్రకటనలో కీర్తించింది. అయితే పరిస్థితి అంతా ఒకేవిధంగా లేదు. ఈజిప్ట్‌లోని అల్ అజహర్ విశ్వ విద్యాలయం ‘ఇలాంటి వ్యంగ్య చిత్రాలను తీవ్రంగా పట్టించు కోవద్దని, ప్రాణాలు పోగొట్టుకోవద్ద’ని విజ్ఞపి చేసింది. పాశ్చాత్యులు చెప్పే భావ ప్రకటనా స్వేచ్ఛకూ, కొందరి మనోభావాలకూ మధ్య తలెత్తిన ఈ ఘర్షణకు బాధ్యులు ఎంత తొందరగా ముగింపు పలికితే అంత మంచిది. -
‘ఉగ్ర’ సోదరుల కోసం ఫ్రాన్స్ వేట
‘చార్లీ హెబ్డో’ పత్రికపై దాడికి పాల్పడింది వారే! ఇద్దరి ఫొటోలను విడుదల చేసిన నిఘా వర్గాలు వీరికి అల్‌కాయిదా నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు అనుమానం పోలీసులకు లొంగిపోయిన మరో అనుమానితుడు కలకలం సృష్టించిన మరో కాల్పుల ఘటన, మరోచోట పేలుడు పారిస్: ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన వారి కోసం వేట మొదలైంది. పారిస్‌లోని వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపై జరిగిన దాడితో సంబంధమున్నట్లు భావిస్తున్న ఇద్దరు సోదరుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరిని ఫ్రాన్స్‌కే చెందిన సయీద్ కౌచీ, చెరిఫ్ కౌచీగా నిఘా వర్గాలు గుర్తించాయి. మరో అనుమానితుడైన 18 ఏళ్ల యువకుడు హమీద్ మౌరాద్ ఇప్పటికే లొంగిపోయినట్లు తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినట్లు భద్రతావర్గాల సమాచారం. పత్రికా కార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చి చంపిన ఉగ్రమూకకు యెమెన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అక్కడి అల్ కాయిదా గ్రూపే ఈ పని చేస్తున్నట్లు దాడి సందర్భంగా ఉగ్రవాదులు స్వయంగా చెప్పినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మరోవైపు ఉగ్ర సోదరుల ఫొటోలను భద్రతాధికారులు విడుదల చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిస్తే చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సోదరులిద్దరితో సంబంధాలున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బుధవారం జరిగిన దాడిలో 8 మంది జర్నలిస్టులు, ఇద్దరు పోలీస్ అధికారులు, మరో ఇద్దరు పౌరులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 11 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దేశవ్యాప్తంగా విషాదం ఉగ్రవాదుల దాడితో ఫ్రాన్స్‌లో విషాదం అలముకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మందిప్రజలు వీధుల్లోకి వచ్చి మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించారు. దాడిపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్..అత్యవసరంగా కేబినెట్‌ను సమావేశపరిచి తాజా పరిణామాలపై చర్చించారు. పలు నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడవచ్చునని ఫ్రాన్స్‌తో పాటు యూరప్‌వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీకి, అక్కడి సిబ్బందికి భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కిమూన్ ఖండించారు. మరింత ఆందోళన.. ప్రజల్లో నెలకొన్న భయాన్ని పెంచేలా ఫ్రాన్స్‌లో గురువారం మరో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. పారిస్ దక్షిణ ప్రాంతంలో ఓ పోలీస్ అధికారిని దుండగుడు కాల్చి చంపాడు. మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. ఈశాన్య పట్టణం విల్లేఫ్రాంచ్లోని ఓ మసీదు సమీపంలోని కబాబ్ దుకాణం వద్ద పేలుడు సంభవించింది. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రజల నుం మద్దతు లభిస్తుండటంతో ప్రత్యేక సంచికను విడుదల చేయాలని ‘చార్లీ హెబ్డో’ నిర్ణయించింది. ఈ నెల 14న పది లక్షల కాపీలతో స్పెషల్ ఎడిషన్‌ను ప్రచురించనున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ఈ పత్రిక వారానికి 60 వేల కాపీలనే ముద్రిస్తుంది. దాడిని సమర్థించిన యూపీ మాజీమంత్రి లక్నో: చార్లీ హెబ్డోపై జరిగిన దాడి సమంజసమేనని ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి, బీఎస్పీ నేత హజీ యాకుబ్ ఖురేషీ అన్నారు. శాంతి సందేశాన్నిచ్చిన మహమ్మద్ ప్రవక్తపై ఎవరైనా వ్యంగ్యంగా కార్టూన్లు చిత్రీకరిస్తే వారికి పారిస్‌లోని జర్నలిస్ట్‌లు, కార్టూనిస్ట్‌లకు పట్టిన గతే పడుతుందన్నారు. -
ఒక అనుమానితుడు లొంగుబాటు: ఇద్దరు పరారీ
పారిస్: ప్రాన్స్ లో ఓ పత్రికా కార్యాలయంపై విధ్వంసం సృష్టించిన ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడు లొంగిపోగా, మరో ఇద్దరు పరారయ్యారు. గతంలో పలు దాడులతో ప్రమేయమున్న చెర్రిఫ్ కౌచీ(34), అతని సోదరుడు సయ్యద్ కౌచీ(34)లతో పాటు మరో యువకుడికి పోలీసులు గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అయితే ఒకరు లొంగిపోగా.. మరో ఇద్దరు అనుమానితులు పరారయ్యారు. ఆ ఇద్దరు సోదరులు కాల్పులు జరిపిన అనంతరం కారులో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఫోటోలను విడుదల చేసిన ఫ్రాన్స్ పోలీసులు వారి కోసం గాలింపు చర్యలను తీవ్ర చేశారు. నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై కొంతమంది ముష్కరుల దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఇద్దరు అనుమానితుల ఫోటోలు విడుదల
పారిస్: ప్రాన్స్ లో ఓ పత్రికా కార్యాలయంపై ముష్కరులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఇద్దరు అనుమానితులకు ఆ దేశ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. గతంలో పలు దాడులతో ప్రమేయమున్న చెర్రిఫ్ కౌచీ(34), సయ్యద్ కౌచీ(34) లకు గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి వారి ఫోటోలను తాజాగా విడుదల చేశారు. ప్రజా భద్రతలో భాగంగానే వారి ఫోటోలను విడుదల చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై కొంతమంది ముష్కరుల దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. -
కలంపై తూటా
* ‘ఫ్రాన్స్ పత్రిక’పై ఉగ్రవాదుల దాడి * 12 మంది మృతి, 10 మందికి గాయాలు * పారిస్‌లోని ‘చార్లీ హెబ్డో’ పత్రిక కార్యాలయంలో విచక్షణరహితంగా కాల్పులు * మృతుల్లో ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు * దేశమంతటా హై అలర్ట్.. ముష్కరులను వేటాడి పట్టుకుంటాం: ఫ్రాన్స్ అధ్యక్షుడు * దాడిని తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు ఉగ్రమూకల కర్కశత్వానికి నిదర్శనమీ చిత్రం. పత్రిక కార్యాలయం వద్ద గాయపడి నేలకొరిగిన పోలీసు అధికారి ఒకరు సరెండర్ అయినట్లుగా చేయి పెకైత్తినా.. ‘నన్నే చంపాలనుకుంటావా?’ అంటూ దగ్గరికొచ్చి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఇలా తూటాలు కురిపించి హతమార్చారు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఫ్రాన్స్‌పై ఉగ్రవాదులు పంజా విసిరారు. ప్రపంచ సంస్కృతుల రాజధానిగా పేరుగాంచిన పారిస్‌లో బీభత్సం సృష్టించారు. నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయ సిబ్బందిపై తూటాల వర్షం కురిపించిన ఉగ్రవాదులు ‘అల్లాహో అక్బర్’ అంటూ నినాదాలు చేస్తూ పారిపోయారు. ఈ ఘటనతో ఫ్రాన్స్‌లో హై అలర్ట్ ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఉగ్రవాదులు ఫ్రాన్స్‌లో ఇంతమందిని పొట్టనబెట్టుకోవడం ఇదే ప్రథమం. దాడిని అమెరికా, రష్యా, భారత్ తదితర దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. పారిస్: చేతిలో ఏకే-47 తుపాకులు.. భుజాలకు రాకెట్ లాంచర్లు.. ముఖాలకు ముసుగులు.. ఒక్కసారిగా దూసుకొచ్చారు.. విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు.. 12 మంది ప్రాణాలను బలిగొన్నారు.. ఏం జరుగుతుందో తెలిసేలోపే పరారయ్యారు.. వెళ్తూవెళ్తూ ‘ప్రవక్త పగదీర్చుకున్నాడు.. అల్లాహో అక్బర్..’ అంటూ నినాదాలు చేశారు! బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ‘చార్లీ హెబ్డో’ పత్రికా కార్యాలయంపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ స్టీఫెన్ చార్బోనియర్, ముగ్గురు కార్టూనిస్టులు కబూ, టింగోనస్, విలిన్స్కీ సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాడిలో పాల్గొన్నది ఎందరో కచ్చితంగా తెలియడం లేదు. ఇద్దరే ఉన్నారని కొందరు చెబుతుండగా.. నలుగురి దాకా ఉన్నారని మరికొందరు పేర్కొంటున్నారు. పారిపోయిన ఉగ్రవాదులు మరెక్కడైనా దాడికి పాల్పడే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. కాల్పులు చోటుచేసుకున్న కాసేపటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద దాడేనని, ముష్కరులను వేటాడి చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు. దాడిని ప్రపంచదేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ఎలా జరిగింది.. ముష్కరులు ముందుగా ఓ కారును హైజాక్ చేసి దాన్ని నేరుగా పత్రికా కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. కారులోంచి దిగుతూనే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడి సిబ్బందిపై తూటాల వర్షం కురిపించారు. అనంతరం అదే కారులో పారిపోయారు. పోతూపోతూ రోడ్డుపై కనిపించినవారిని కూడా కాల్చారు. ‘‘ఉదయం 11.30 గంటల సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరుపుతూ ఏవో నినాదాలు చేస్తూ పారిపోయారు. వారి భుజాలకు రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘‘డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నవారిని పోలీసులు వెంబడిస్తున్నారేమోనని అనుకున్నా. తర్వాత వారు ఉగ్రవాదులని తెలిసింది’’ అని మరో ప్రత్యక్ష సాక్షి వివరించారు. దాడి అందుకేనా..? వ్యంగ్య వారపత్రిక అయిన చార్లీ హెబ్డోకు వివాదాలు కొత్త కాదు. గతంలో అనేకసార్లు వివాదాస్పద కార్టూన్లు ప్రచురించింది. గతంలో డెన్మార్క్ పత్రిక జైలాండ్స్-పోస్ట్ ప్రచురించిన వివాదాస్పద మహమ్మద్ ప్రవక్త కార్టూన్‌ను 2006 ఫిబ్రవరిలో యథాతథంగా అచ్చేసింది. దీంతో ముస్లిం దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అప్పట్నుంచీ ముస్లిం ఛాందసవాదులకు ఈ పత్రిక టార్గెట్‌గా మారింది. అయినా తీరుమారని చార్లీ హెబ్డో 2011లో మరోసారి ప్రవక్త కార్టూన్‌ను ప్రచురించింది. ఆ సమయంలో పత్రికా కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. 2012లో అమెరికాలో కొందరు ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ పేరుతో ఓ వివాదాస్పద చిత్రాన్ని తీశారు. ముస్లింలను, ప్రవక్తను కించపరిచారంటూ ఈ చిత్రంపై ముస్లిం దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్న సమయంలోనే... చార్లీ హెబ్డో మరోసారి ప్రవక్త కార్టూన్‌ను ప్రచురించింది. దీంతో ఆ పత్రికపై మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చంపేస్తామంటూ పత్రిక ఎడిటర్‌కు అనేక బెదిరింపులు వచ్చాయి. చివరికి ఆయనకు ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఆ సమయంలో దాడులు జరగొచ్చన్న భయంతో ఫ్రాన్స్ ఏకంగా 20 ముస్లిం దేశాల్లో తమ ఎంబసీలను, కాన్సులేట్లను, సాంస్కృతిక కేంద్రాలను, స్కూళ్లను తాత్కాలికంగా మూసివేసింది. కొన్నేళ్లుగా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. దాడికి సరిగ్గా ఒక గంట ముందు.. చార్లీ హెబ్డో తన వెబ్సైట్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ కార్టూన్‌ను పోస్ట్ చేయడం గమనార్హం. దాడిని ఫ్రాన్స్ ముస్లిం మండలి తీవ్రంగా ఖండించింది. ‘‘ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం. కష్టకాలంలో ఉన్న ఫ్రాన్స్‌కు అవసరమైన సాయం చేస్తాం’’ - బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు ‘‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదు. ఈ దాడిని ఖండిస్తున్నాం. అన్ని చేతులు ఒక్కటైతేనే ఉగ్రవాదాన్ని సమర్థంగా ఓడించగలమని ఈ ఘటన నిరూపించింది’’ - వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు ‘‘ప్రపంచంలో ఉగ్రవాదానికి ఎక్కడా చోటు ఉండకూడదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందకు ప్రపంచదేశాలన్నీ ఏకం కావాలి. పారిస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం’’ - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘‘ఇది హేయమైన చర్య. తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతున్నాం’’ - ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ఇది పిరికిపందల చర్య. తీవ్రవాదం, అసహనం పత్రికా స్వేచ్ఛను హరించలేవు’’ - సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్