‘ఉగ్ర’ సోదరుల కోసం ఫ్రాన్స్ వేట | 'Fierce' brothers in France for the hunt | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ సోదరుల కోసం ఫ్రాన్స్ వేట

Published Fri, Jan 9 2015 4:05 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

‘ఉగ్ర’ సోదరుల కోసం ఫ్రాన్స్ వేట - Sakshi

‘ఉగ్ర’ సోదరుల కోసం ఫ్రాన్స్ వేట

  • ‘చార్లీ హెబ్డో’ పత్రికపై దాడికి పాల్పడింది వారే!
  • ఇద్దరి ఫొటోలను విడుదల చేసిన నిఘా వర్గాలు
  • వీరికి అల్‌కాయిదా నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు అనుమానం
  • పోలీసులకు లొంగిపోయిన మరో అనుమానితుడు
  • కలకలం సృష్టించిన మరో కాల్పుల ఘటన, మరోచోట పేలుడు
  • పారిస్: ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన వారి కోసం వేట మొదలైంది. పారిస్‌లోని వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపై జరిగిన దాడితో సంబంధమున్నట్లు భావిస్తున్న ఇద్దరు సోదరుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరిని ఫ్రాన్స్‌కే చెందిన సయీద్ కౌచీ, చెరిఫ్ కౌచీగా నిఘా వర్గాలు గుర్తించాయి. మరో అనుమానితుడైన 18 ఏళ్ల యువకుడు హమీద్ మౌరాద్ ఇప్పటికే లొంగిపోయినట్లు తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినట్లు భద్రతావర్గాల సమాచారం.

    పత్రికా కార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చి చంపిన ఉగ్రమూకకు యెమెన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అక్కడి అల్ కాయిదా గ్రూపే ఈ పని చేస్తున్నట్లు దాడి సందర్భంగా ఉగ్రవాదులు స్వయంగా చెప్పినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మరోవైపు ఉగ్ర సోదరుల ఫొటోలను భద్రతాధికారులు విడుదల చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిస్తే చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సోదరులిద్దరితో సంబంధాలున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బుధవారం జరిగిన దాడిలో 8 మంది జర్నలిస్టులు, ఇద్దరు పోలీస్ అధికారులు, మరో ఇద్దరు పౌరులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 11 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
     
    దేశవ్యాప్తంగా విషాదం

    ఉగ్రవాదుల దాడితో ఫ్రాన్స్‌లో విషాదం అలముకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మందిప్రజలు వీధుల్లోకి వచ్చి మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించారు. దాడిపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్..అత్యవసరంగా కేబినెట్‌ను సమావేశపరిచి తాజా పరిణామాలపై చర్చించారు. పలు నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడవచ్చునని ఫ్రాన్స్‌తో పాటు యూరప్‌వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీకి, అక్కడి సిబ్బందికి భద్రతను కట్టుదిట్టం చేశారు.  దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కిమూన్ ఖండించారు.
     
    మరింత ఆందోళన.. ప్రజల్లో నెలకొన్న భయాన్ని పెంచేలా ఫ్రాన్స్‌లో గురువారం మరో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. పారిస్ దక్షిణ ప్రాంతంలో ఓ పోలీస్ అధికారిని దుండగుడు కాల్చి చంపాడు. మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. ఈశాన్య పట్టణం విల్లేఫ్రాంచ్‌లోని ఓ మసీదు సమీపంలోని కబాబ్ దుకాణం వద్ద పేలుడు సంభవించింది. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రజల నుం మద్దతు లభిస్తుండటంతో ప్రత్యేక సంచికను విడుదల చేయాలని ‘చార్లీ హెబ్డో’ నిర్ణయించింది. ఈ నెల 14న పది లక్షల కాపీలతో స్పెషల్ ఎడిషన్‌ను ప్రచురించనున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ఈ పత్రిక వారానికి 60 వేల కాపీలనే ముద్రిస్తుంది.
     
    దాడిని సమర్థించిన యూపీ మాజీమంత్రి

    లక్నో:  చార్లీ హెబ్డోపై జరిగిన దాడి సమంజసమేనని ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి, బీఎస్పీ నేత హజీ యాకుబ్ ఖురేషీ అన్నారు.  శాంతి సందేశాన్నిచ్చిన మహమ్మద్ ప్రవక్తపై ఎవరైనా వ్యంగ్యంగా కార్టూన్లు చిత్రీకరిస్తే వారికి పారిస్‌లోని జర్నలిస్ట్‌లు, కార్టూనిస్ట్‌లకు పట్టిన గతే పడుతుందన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement