
ప్రతీకాత్మక చిత్రం
పారిస్ : గత అక్టోబరులో హత్యకు గురైన భారత పౌరుడి మర్డర్ మిస్టరీలో పురోగతి సాధించామని ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. మృతుడి ప్యాంటు జేబులో లభించిన సిగరెట్ లైటర్ ఆధారంగా అతడి ఆచూకీ కనిపెట్టగలిగామని పేర్కొన్నారు. వివరాలు... గతేడాది ఫ్రాన్స్‌లోని బోర్బర్గ్‌లోని రోడ్డు పక్కన మిషన్ ఆపరేటర్‌కు మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే శవం పూర్తిగా విచ్ఛిన్నమైపోవడం, అతడికి సంబంధించిన ఎటువంటి కార్డులు లభించకపోవడంతో మృతుడిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అతడి వేలి ముద్రలు, డీఎన్‌ఏ ఆధారంగా విచారణ జరిపినా ప్రయోజనం లేకపోయింది.
ఈ క్రమంలో కేసును సవాలుగా తీసుకున్న పోలీసులకు.. అతడి జేబులో సిగరెట్ లైటర్ దొరికింది. దానిపై రాసి ఉన్న పేరు ద్వారా అతడి ఆచూకీ తెలుసుకునేందుకు మార్గం దొరికింది. ఈ నేపథ్యంలో బెల్జియంలో నివసిస్తున్న దర్శన్ సింగ్ అనే వ్యక్తి ఫ్రాన్స్‌లో హత్యకు గురై ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వెంటనే బెల్జియం ఫెడరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సిగరెట్ లైటర్‌పై ఉన్న క్రెగ్ కేఫ్(పబ్ పేరు) అనే అక్షరాల ఆధారంగా మృతుడి ఇంటికి వెళ్లి అతడి వివరాలు సేకరించారు. వాటి ఆధారంగా హంతకుడి జాడ కనిపెట్టే దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment