2.25 మీటర్లు ఫ్రాన్స్ భూభాగంలోకి చేరిన సరిహద్దు రాయి
బ్రుసెల్స్ : ట్రాక్టర్‌తో పొలం పనులు చేసుకోవటానికి అడ్డుగా ఉందని ఏకంగా రెండు దేశాల మధ్య సరిహద్దు రాయిని జరిపాడో రైతు. తనకు తెలియకుండా చేసినా పెద్ద పొరపాటే చేశాడు. వివరాలు. బ్రెజిల్‌కు చెందిన ఓ రైతు కొద్ది రోజుల క్రితం తన పొలంలో పని చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పొలం పనులు చేసుకోవటానికి తరచుగా ట్రాక్టర్‌కు అడ్డు వస్తున్న రాయిపై అతడి కోపం వచ్చింది. ఆ రాయి ఏంటి? అదెందుకు అక్కడ ఉంది? అన్నదేమీ ఆలోచించకుండా 2.25 మీటర్లు వెనక్కు జరిపి, తన పని చేసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత కొందరు చరిత్రకారులు అటు వైపు వచ్చారు. 1819లో పాతిన ఫ్రాన్స్-బెల్జియం దేశాలకు సంబంధించిన ఆ సరిహద్దు రాయి ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా వెనక్కు ఫ్రాన్స్ భూభాగంలోకి జరిగి ఉండటాన్ని గుర్తించారు.
దీనిపై చరిత్రకారుడు డేవిడ్ లావాక్స్ మాట్లాడుతూ.. ‘‘ ఆ రైతు రాయిని జరపటం ద్వారా బెల్జియం పెద్దదైంది.. ఫ్రాన్స్ చిన్నదైంది. నాకు సంతోషం వేసింది. ఎందుకంటే మా టౌన్ పెద్దదైంది కాబట్టి. అయినప్పటికి అది మంచి ఐడియా కాదు. ఫ్రాన్స్‌లోని భౌసిగ్నీస్ మేయర్ సర్ రాక్ దీనికి ఒప్పుకోలేదు. అందుకే దాన్ని యధా స్థానంలో పెట్టడానికి నిర్ణయించాము’’ అని చెప్పాడు. మామూలుగా అయితే ఈ సంఘటన రెండు దేశాల మధ్య గొడవకు దారి తీసేదే. కానీ, ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండటంతో.. స్థానిక అధికారులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. చిరు నవ్వులతో ఏం చేయాలో నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment