త్రివేణీ సంగమం!
ఇప్పడీ గోష్ణ జలాలని తాగినవారు ఎలా తయారవుతారన్నది పెద్ద ప్రశ్న. గోదారి విద్వత్తు, కృష్ణా రాజకీయం సమపాళ్లలో కలసి అంటుకుంటుందా! లేక ఈ కలయికలో మరో చిత్రమైన గుణం ఆవరిస్తుందో వేచి చూడాలి. మహానదుల సంగమం! మ హత్తర సన్నివేశం! దశాబ్దాల కల! గలగలా గోదారి వచ్చి, బిరబిరా పరుగు లిడే కృష్ణమ్మను హత్తు కుంది. ఇంకేముంది, రెండు గొప్ప రుచులు, సంస్కృతులు కలసిపో యాయి- అని కొందరు అనుకుంటున్నారు. ‘‘అం తేంలేదు. ఏదో కబుర్లు’’ అంటూ చప్పరించేస్తు న్నారు కొందరు. ‘‘మళ్లించింది గోదావరిని కాదు, ప్రజల దృష్టిని’’ అన్నారు ఆంధ్రా మేధావులు. చంద్రబాబు అపర భగీరథుడన్నారు క్యాబినెట్ అను చరులు. ‘‘గోంగూర కాదూ!’’ అంటూ తేలిగ్గా తీసుకున్నారు ప్రతి పక్షులు.
ఇంతకీ నిజంగా నదు ల అనుసంధానం జరిగినట్టేనా అంటే, ఎవరికి వారే ప్రశ్నార్థకంగా చూస్తున్నారు గాని పెదవి విప్పడం లేదు. కానీ, అక్కడ పెద్ద పెద్ద గొట్టాలు నిజం, గోదారి నీటిని తోడిపోస్తున్న మోటార్లు నిజం, ఆ నీటిని తెచ్చి కృష్ణలో వదులుతున్న కాలవ నిజం. ఈ ప్రక్రియని నదు ల అనుసంధానమనీ, మానవ విజయానికి పరాకాష్టనీ అంటే నాకేమీ అభ్యంతరంలేదు. పాండిచ్చేరి, యానాం వెళ్లొచ్చి కొన్ని విదేశీ పర్యటనలు కూడా చేశారన్నట్టుగా ఉంటుంది.
ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ నడిబొడ్డున అమరావతీ మహానగర తీరాన ఒక వినూత్న ‘‘జలసంధి’’ ఏర్పడిం ది- రెండు పుణ్యనదులు ఏకీకృతమై ప్రవహించడం. గోదావరి నీళ్లకు మహత్తు ఉందనీ, ఆ నీళ్లు తాగిన వారికి విద్వత్తుకు కరువుండదనీ చెబుతారు. కృష్ణాజలాలు సేవించిన వారికి గొప్ప రాజకీయం అబ్బుతుందని పెద్ద లు చెబుతూ ఉంటారు. అందుకు ఉదాహరణలు కూడా ఇస్తుంటారు. ఇప్పడీ గోష్ణ జలాలని తాగినవారు ఎలా తయారవుతారన్నది పెద్ద ప్రశ్న. గోదారి విద్వత్తు, కృష్ణా రాజకీయం సమపాళ్లలో కలసి అంటుకుంటుందా! లేక ఈ కలయికలో మరో చిత్రమైన గుణం ఆవరిస్తుందో వేచిచూడాలి. పర్యవసానం ఎలా ఉన్నా చంద్రబాబు ఒక గొప్ప జలసంధిని రూపొందించి, ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. ఇదొక పుణ్యతీర్థంగా మారు తుంది. మనమే కాదు, జపాన్, సింగపూర్ వాసులు కూడా ఇక్కడకొచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ తీర్థ స్థలానికి తెలుగుదేశం నేత ఎన్టీఆర్ పేరు ఖాయం చెయ్యాలి. చంద్రబాబు ఉక్కు సంకల్పానికి దర్పణంగా, అక్కడ మహానేత ఉక్కు విగ్రహాన్ని ప్రతిష్టించాలి. నవ్యాంధ్రలో ఏ మూల నిలబడి చూసినా ఆ విగ్రహం కనిపించే పరిమాణంలో ఉండాలి. అప్పుడే ఈ విశ్వవిఖ్యాత బృహత్తర ప్రయత్నానికి సమగ్రత ఏర్పడుతుంది. యావత్ తెలుగు జాతిపక్షాన నేనీ డిమాండ్‌కు ఒడిగడుతున్నాను.
పెద్దపెద్ద వాళ్లు కె.ఎల్.రావు, వి.వి.గిరి లాం టి వాళ్లు నదుల అనుసంధానం గురించి ఉత్తుత్తి కలలుగన్నారు. కానీ చంద్రబాబు క్షణాల్లో వాటిని సాకారం చేసి పడేశారు. ఎంతైనా వజ్రసంకల్పు డు. ఈ ఒరవడిని శ్రద్ధగా పాటించి మిగతా రాష్ట్రా ల వారు కూడా కాంబినేషన్లకు కృషి చేయాలి. గంగా కావేరీ, నర్మద తపతీ, బ్రహ్మపుత్ర ఇంకోటి కలుపుకుంటూ వెళ్లడమే. తలచుకుంటే పెద్ద కష్ట మేమీ కాదు. ఒక శాంపిల్ ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకుపోవచ్చు. ఈయన ఇంతటితో ఆగడు.
గోదావరి కృష్ణలను అనుసంధించిన బాబు గం గని కూడా దింపుతాడు. నవ్యాంధ్రలో మరో త్రివేణీ సం గమాన్ని ఆవిర్భవింపచేస్తాడని బెజవాడ కృష్ణలంక లోకల్ లీడర్ ఆవేశంగా అన్నాడు. ‘‘అదెంతపని, రేపు వచ్చేప్పుడు మోదీని నాలుగు కాశీ చెంబుల్లో గంగతీర్థం తెమ్మంటేసరి. త్రివేణి అయిపోతుంది.’’ అంటూ వ్యాఖ్యానించాడు
- శ్రీరమణ, స్థానిక వామపక్షి.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)