సంపాదక శిఖరం వినోద్ మెహతా
సృజనకూ, సాహసానికీ, సత్యనిష్ఠకూ, సంచలన పాత్రికేయానికీ మారుపేరుగా దశాబ్దాలపాటు ఆంగ్ల పత్రికాప్రపంచంలో జైత్రయాత్ర చేసిన అసాధారణ సంపాదకుడు వినోద్ మెహతా. రావల్పిండిలో పుట్టి లక్నోకు వలస వచ్చి ఇంగ్లండ్‌లో రకరకాల ఉద్యోగాలు చేసి అడ్వర్టయిజ్‌మెంట్ రంగం నుంచి నేరుగా సంపాదకుడుగా అడుగు పెట్టిన అక్షరయాత్రికుడు మెహతా. ఆదివారంనాడు ఢిల్లీలో కన్ను మూసిన 72 ఏళ్ళ మెహతాకు పాఠకుల అభిరుచి తెలుసు. ఎట్లా చదివించాలో, ఆకట్టుకోవాలో తెలిసిన సంపాదక మాంత్రికుడు. 1974లో డెబునేర్ పత్రిక సంపాదకుడిగా చేరి ఆ పత్రిక పుటలను నేత్రపర్వంగా తీర్చిదిద్దటమే కాకుండా పాఠకుడి మనసుకు హత్తుకొనే, మెదడుకు పని చెప్పే రచనలు రాసి, రాయించి ప్రచురించిన దక్షుడు. 1981లో మెహతా సంపాదకత్వంలో వ చ్చిన ఆదివారం వార్తాపత్రిక ‘సండే ఆబ్జర్వర్’ ఒకానొక అద్భుత సృష్టి.
అనంతరం ఇండిపెండెంట్ దిన పత్రికనూ, ఇండియన్ పోస్ట్ డైలీనీ స్థాపించి సంపాదకత్వం నెరపారు. ముంబయ్‌లో దాదాపు రెండు దశాబ్దాలు పని చేసిన తర్వాత ‘ఢిల్లీ పయనీర్’ ప్రధాన సంపాదకుడుగా ఢిల్లీ వెళ్ళారు. అప్పటి నుంచి ఢిల్లీ సంపాదకులలో ప్రముఖుడుగా, ప్రయోగాలు చేయడంలో అద్వితీయుడుగా, పరిశోధనాత్మక కథనాలు ప్రచురించి ప్రమాదాలు కొనితెచ్చుకోవడంలో సాటిలేని మేటిగా వెలిగారు. పదిహేడేళ్ళ కిందట అవుట్‌లుక్ వారపత్రికను స్థాపించి సంపాదకుడుగా దానికి రూపురేఖలు దిద్దిన తీరు నాకు ఇప్పటికీ గుర్తు. మొదటి రెండు సంచికలలో రెండు సంచలనాత్మకమైన ప్రధాన కథనాలు ప్రచురించారు.
ఒకటి, కశ్మీర్‌లో నూటికి ఎనభై శాతం మందికి పైగా ప్రజలు దేశం నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారనే వార్త. మెహతా ప్రత్యేకంగా కశ్మీర్ లోయలో జనాభి ప్రాయ సేకరణ జరిపించి తయారు చేయించిన కథనం అది. కశ్మీర్ ప్రజల మనోగతం ఏమిటో చాలా మంది సంపాదకులకు తెలుసు. కానీ అటువంటి కథనాన్ని ప్రచురించే గుండె ధైర్యం మెహతా ప్రత్యేకం. రెండో కథనం అప్పటికి రెండేళ్ళ కిందటే ప్రధాని పదవి నుంచి దిగిపోయిన పివి నరసింహారావు ఆత్మకథాత్మక నవల (ఇన్‌సైడర్-లోపలిమనిషి) రాస్తున్నారన్నది. ఈ సంగతి లోకానికి తెలిసింది మెహతా ద్వారానే. సంచలన వార్తకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో మెహతా ఇండిపెండెంట్ దినపత్రికను స్థాపించిన 29 రోజులకే సంపాదక బాధ్యతల నుంచి తప్పుకోవలసి వచ్చింది. రా (ప్రభుత్వ గూఢచర్య సంస్థ) నివేదిక అంటూ తనకు అందిన ఒక బూటకపు సమాచారాన్ని విశ్వసించి మొత్తం ఎనిమిది కాలాల ప్రధాన శీర్షిక గా పరిచారు. మహారాష్ట్రలో అత్యంత గౌరవనీయుడైన వై.బి. చవాన్‌ను గూఢచారిగా నిర్ధారిస్తూ రాసిన కథనం అది. కానీ, అది తప్పని తేలడంతో మెహతా సంపాదకుడిగా వైదొలగవలసి వచ్చింది. ఆ చేదు అనుభవం సైతం మెహతా దూకుడుకు కళ్ళెం వేయలేదు. ఇటీవల రాడియా టేపు ఉదంతానికి సంబంధించిన కథనం ప్రచురించడానికి ఏ పత్రికా సిద్ధంగా లేని సమయంలో మెహతా చొరవ తీసుకున్నారు. అందులో రాడియా మాయాజాలంలో రతన్ తాతా కూడా పడినట్టు వెల్లడించే అంశాలు ఉండటంతో ‘అవుట్‌లుక్’కు తాతా సంస్థల ప్రకటనలు నిలిచి పోయాయి. పత్రిక యజమానికీ, మెహతాకీ మధ్య విభేదాలు వచ్చాయి. ఫలితంగా 2012లో సంపాదక పదవి నుంచి తప్పుకొని సంపాదక మండలి అధ్యక్ష పదవితో సరిపుచ్చుకోవలసి వచ్చింది - యజమాని మంచి వాడు కావడం వల్ల. అంతకు ముందు వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంతోనూ సున్నం వేసుకున్న సంపాదకుడు మెహతా. అధికారం ముందు వినయంగా చేతులు కట్టుకునే సంపాదకుడు కాడాయన. ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా, ధైర్యంగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా కుండ బద్దలు కొట్టడం మెహతా నైజం. తన జీవిత చరిత్ర ‘లక్నో బోయ్’ విశేషంగా అమ్మడానికి కారణం వినోద్ మెహతా వృత్తిజీవితంలో ఉన్న వైవిధ్యంతోపాటు దాపరికం లేకుండా వాస్తవా లను వెల్లడించడం కూడా కారణం. మెహతా రాసిన రెండో పుస్తకం ‘ఎడిటర్ అన్‌ప్లగ్డ్’ విడుదల సమయంలో ఆయన అస్పత్రిలో ఉన్నారు. రాజీలేని పాతతరం సంపాదకుల శ్రేణిలో బహుశా చివరి శిఖరం కూలిపోయింది.
- కె. రామచంద్రమూర్తి