vinod mehta
-
'వినోద్ మెహతాను ఆదర్శంగా తీసుకోండి'
ఢిల్లీ: నేటితరం జర్నలిస్టులకు దివంగత జర్నలిస్టు వినోద్ మెహతా ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. శనివారం జీకే రెడ్డి స్మారక అవార్డును వినోద్ మెహతా భార్య సునీత మెహతాకు సోనియా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నిబద్ధత, సమర్ధతకు మరోపేరే వినోద్ మెహతా అని కొనియాడారు. కాంగ్రెస్ పై ఆయన చేసే విమర్శలను నిర్మాణాత్మకంగా తీసుకునేవాళ్లమని సోనియా గాంధీ అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువల కోసం వినోద్ మెహతా తన కలాన్ని ఝుళిపించేవారన్నారు. -
ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతా కన్నుమూత
న్యూఢిల్లీ: కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత వినోద్ మెహతా(73) ఇక లేరు. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఇక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. మెహతా అంత్యక్రియలను లోడీ రోడ్డు శ్మశానవాటికలో నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, బీజేపీ నేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆంగ్ల వార్తాపత్రిక ‘ఔట్లుక్’ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ చైర్మన్ అయిన మెహతా సాహసోపేత జర్నలిజానికి మారుపేరు. సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ద పయనీర్(ఢిల్లీ ఎడిషన్) వంటి విజయవంతమైన పత్రికలను ఆయన ప్రారంభించారు. మెహతా 1942లో ఇప్పటి పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జన్మించారు. ఆయన కుటుంబం దేశ విభజన తర్వాత లక్నోలో స్థిరపడింది. మెహతా బీఏ చదివాక భారత్, బ్రిటన్లలో చిన్నచితకా పనులు చేశారు. 1974లో ‘డెబోనేర్’ అనే పురుషుల పత్రికలో ఎడిటర్‌గా చేరారు. ‘ద పయనీర్’ ప్రారంభించారు. ఆయన ఆత్మకథ ‘లక్నో బాయ్’ పాఠకాదరణ పొందింది. ఆయన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు. మెహతా భార్య సుమితా పాల్ కూడా జర్నలిస్టే. మెహతా మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన ఉత్తమ జర్నలిస్టు, రచయితగా గుర్తిండిపోతారని పేర్కొన్నారు. ఎపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. -
సంపాదక శిఖరం వినోద్ మెహతా
సృజనకూ, సాహసానికీ, సత్యనిష్ఠకూ, సంచలన పాత్రికేయానికీ మారుపేరుగా దశాబ్దాలపాటు ఆంగ్ల పత్రికాప్రపంచంలో జైత్రయాత్ర చేసిన అసాధారణ సంపాదకుడు వినోద్ మెహతా. రావల్పిండిలో పుట్టి లక్నోకు వలస వచ్చి ఇంగ్లండ్‌లో రకరకాల ఉద్యోగాలు చేసి అడ్వర్టయిజ్మెంట్ రంగం నుంచి నేరుగా సంపాదకుడుగా అడుగు పెట్టిన అక్షరయాత్రికుడు మెహతా. ఆదివారంనాడు ఢిల్లీలో కన్ను మూసిన 72 ఏళ్ళ మెహతాకు పాఠకుల అభిరుచి తెలుసు. ఎట్లా చదివించాలో, ఆకట్టుకోవాలో తెలిసిన సంపాదక మాంత్రికుడు. 1974లో డెబునేర్ పత్రిక సంపాదకుడిగా చేరి ఆ పత్రిక పుటలను నేత్రపర్వంగా తీర్చిదిద్దటమే కాకుండా పాఠకుడి మనసుకు హత్తుకొనే, మెదడుకు పని చెప్పే రచనలు రాసి, రాయించి ప్రచురించిన దక్షుడు. 1981లో మెహతా సంపాదకత్వంలో వ చ్చిన ఆదివారం వార్తాపత్రిక ‘సండే ఆబ్జర్వర్’ ఒకానొక అద్భుత సృష్టి. అనంతరం ఇండిపెండెంట్ దిన పత్రికనూ, ఇండియన్ పోస్ట్ డైలీనీ స్థాపించి సంపాదకత్వం నెరపారు. ముంబయ్‌లో దాదాపు రెండు దశాబ్దాలు పని చేసిన తర్వాత ‘ఢిల్లీ పయనీర్’ ప్రధాన సంపాదకుడుగా ఢిల్లీ వెళ్ళారు. అప్పటి నుంచి ఢిల్లీ సంపాదకులలో ప్రముఖుడుగా, ప్రయోగాలు చేయడంలో అద్వితీయుడుగా, పరిశోధనాత్మక కథనాలు ప్రచురించి ప్రమాదాలు కొనితెచ్చుకోవడంలో సాటిలేని మేటిగా వెలిగారు. పదిహేడేళ్ళ కిందట అవుట్‌లుక్ వారపత్రికను స్థాపించి సంపాదకుడుగా దానికి రూపురేఖలు దిద్దిన తీరు నాకు ఇప్పటికీ గుర్తు. మొదటి రెండు సంచికలలో రెండు సంచలనాత్మకమైన ప్రధాన కథనాలు ప్రచురించారు. ఒకటి, కశ్మీర్లో నూటికి ఎనభై శాతం మందికి పైగా ప్రజలు దేశం నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారనే వార్త. మెహతా ప్రత్యేకంగా కశ్మీర్ లోయలో జనాభి ప్రాయ సేకరణ జరిపించి తయారు చేయించిన కథనం అది. కశ్మీర్ ప్రజల మనోగతం ఏమిటో చాలా మంది సంపాదకులకు తెలుసు. కానీ అటువంటి కథనాన్ని ప్రచురించే గుండె ధైర్యం మెహతా ప్రత్యేకం. రెండో కథనం అప్పటికి రెండేళ్ళ కిందటే ప్రధాని పదవి నుంచి దిగిపోయిన పివి నరసింహారావు ఆత్మకథాత్మక నవల (ఇన్సైడర్-లోపలిమనిషి) రాస్తున్నారన్నది. ఈ సంగతి లోకానికి తెలిసింది మెహతా ద్వారానే. సంచలన వార్తకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో మెహతా ఇండిపెండెంట్ దినపత్రికను స్థాపించిన 29 రోజులకే సంపాదక బాధ్యతల నుంచి తప్పుకోవలసి వచ్చింది. రా (ప్రభుత్వ గూఢచర్య సంస్థ) నివేదిక అంటూ తనకు అందిన ఒక బూటకపు సమాచారాన్ని విశ్వసించి మొత్తం ఎనిమిది కాలాల ప్రధాన శీర్షిక గా పరిచారు. మహారాష్ట్రలో అత్యంత గౌరవనీయుడైన వై.బి. చవాన్‌ను గూఢచారిగా నిర్ధారిస్తూ రాసిన కథనం అది. కానీ, అది తప్పని తేలడంతో మెహతా సంపాదకుడిగా వైదొలగవలసి వచ్చింది. ఆ చేదు అనుభవం సైతం మెహతా దూకుడుకు కళ్ళెం వేయలేదు. ఇటీవల రాడియా టేపు ఉదంతానికి సంబంధించిన కథనం ప్రచురించడానికి ఏ పత్రికా సిద్ధంగా లేని సమయంలో మెహతా చొరవ తీసుకున్నారు. అందులో రాడియా మాయాజాలంలో రతన్ తాతా కూడా పడినట్టు వెల్లడించే అంశాలు ఉండటంతో ‘అవుట్‌లుక్’కు తాతా సంస్థల ప్రకటనలు నిలిచి పోయాయి. పత్రిక యజమానికీ, మెహతాకీ మధ్య విభేదాలు వచ్చాయి. ఫలితంగా 2012లో సంపాదక పదవి నుంచి తప్పుకొని సంపాదక మండలి అధ్యక్ష పదవితో సరిపుచ్చుకోవలసి వచ్చింది - యజమాని మంచి వాడు కావడం వల్ల. అంతకు ముందు వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతోనూ సున్నం వేసుకున్న సంపాదకుడు మెహతా. అధికారం ముందు వినయంగా చేతులు కట్టుకునే సంపాదకుడు కాడాయన. ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా, ధైర్యంగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా కుండ బద్దలు కొట్టడం మెహతా నైజం. తన జీవిత చరిత్ర ‘లక్నో బోయ్’ విశేషంగా అమ్మడానికి కారణం వినోద్ మెహతా వృత్తిజీవితంలో ఉన్న వైవిధ్యంతోపాటు దాపరికం లేకుండా వాస్తవా లను వెల్లడించడం కూడా కారణం. మెహతా రాసిన రెండో పుస్తకం ‘ఎడిటర్ అన్ప్లగ్డ్’ విడుదల సమయంలో ఆయన అస్పత్రిలో ఉన్నారు. రాజీలేని పాతతరం సంపాదకుల శ్రేణిలో బహుశా చివరి శిఖరం కూలిపోయింది. - కె. రామచంద్రమూర్తి -
సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా మృతి
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఏయిమ్స్‌లో చేరారు. ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ వినోద్ మెహత ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పైనీర్, ఔట్లుక్ మ్యాగజైన్లకు వినోద్ మహతా సంపాదకుడిగా పనిచేశారు. ఐదు దశాబ్ధాల పాటు జర్నలిజంలో విశేష కృషి చేశారు. 1942 మే 31న వినోద్ మెహతా జన్మించారు. నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురిస్తారని దేశవ్యాప్తంగా మెహతాకు పేరుంది. వినోద్ మెహతా మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. -
వెండి తెరపై... విషాద జీవితం..!
అలనాటి అందాల తార మీనాకుమారి జీవితం వెండితెరకు రానుందనే వార్త హిందీ చిత్రసీమలో ప్రస్తుతం హాట్ టాపిక్. 39 ఏళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఈ అందాల అభినేత్రి జీవితం ఆధారంగా సినిమా చేయడానికి దర్శకుడు తిగ్మాన్షు ధూలియా సన్నాహాలు చేస్తున్నారట. పాత్రికేయుడు వినోద్ మెహతా రాసిన ‘మీనాకుమార్: ది క్లాసిక్ బయోగ్రఫీ’ ఆధారంగా ఈ చిత్రం చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారు. -
మీడియాను మార్చిన ‘టేపులు’
రాడియా టేపుల ఉదంతం పత్రికా రచయితల పట్ల ప్రజానీకంలో ఉన్న భ్రమ లను పటాపంచలు చేసిందని ‘ఔట్లుక్’ ఆంగ్లపత్రిక సంపాదక మండలి చైర్మన్ వినోద్ మెహతా చెబుతున్నారు. టేపులు బయటపడిన తరువాత మీడియాలో గణనీయమైన మార్పులు వచ్చాయని కూడా అంటున్నారు. ‘ఎడిటర్ అన్ప్లగ్డ్: మీడియా, మేగ్నెట్స్, నేతాస్, అండ్ మీ’ పేరుతో మెహతాజ్ఞాపకాల రెండో సంకలనం ఇటీవల విడుదలవుతున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సీనియర్ జర్నలిస్ట్ ఎన్నో చేదునిజాలను ఆవిష్కరించారు. కొన్ని భాగాలు: ప్ర: రాడియా టేపుల వార్తాకథనం ప్రచురించాలని ఎప్పుడు నిర్ణయించారు? దాని పర్యవసానాలు ‘ఔట్ లుక్’ పత్రిక మీద ఏ విధంగా ఉంటాయని ఊహించారు? జ: కథనం చాలా మంది వ్యక్తుల, సంస్థల ప్రతిష్టకు గురిపెడుతుందని అంచనా వేశాను. అందులో రతన్ టాటా పేరొకటి. ఆయన అసాధారణమైన పలుకుబడి కలిగినవారు మాత్రమే కాదు, ఆయన సంస్థ వ్యాపార ప్రకటనా రంగాన్ని శాసిస్తోంది. ఆ సంస్థకు ఎంతో ప్రఖ్యాతి ఉంది. కానీ, టేపులలో ఉన్న విషయం ప్రజా ప్రయోజనం దృష్ట్యా వెలువరించక తప్పనిస్థాయిలో ఉంది. అయినా ఆ పేరు లేకుండా ప్రచురిస్తే మోసగించడమే కూడా. కానీ ఈ కథనంతో నేను ప్రస్తావించిన జర్నలిస్టుల పేర్లతో ఇబ్బంది పడ్డాను. ఆ ఇద్దరు-బర్కా (దత్), వీర్(సింఘ్వీ) నా మిత్రులే. ఇప్పటికీ మిత్రులేనా? నన్ను ఎన్డీటీవీ నుంచి బహిష్కరించారు. అంతక్రితం వారానికి రెండు సార్ల యినా కనపడుతూ ఉండేవాడిని. కానీ టేపుల కథనం తరువాత నన్ను ఎప్పు డూ పిలవలేదు. ఈ పుస్తకంలో ‘టీవీ, నేను’ అనే అధ్యాయం ఉంది. బుల్లితెర మీద చిన్నపాటి టీవీ స్టార్‌ని కావడం మీద, నిత్యం రాత్రివేళ సాగే పిడివాదాల మీద భిన్నాభిప్రాయాలను నమోదు చేశాను. నిజానికి టీవీని ఏమీ పట్టించుకోని పత్రికా రచయితల తరం నాది. బర్కా, వీర్లతో సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించారా? ఎన్డీటీవీ ఒక కార్యక్రమం ప్రసారం (ఆ టేపులలో బర్కాదత్ చెప్పిన దానికి వివరణ ఇవ్వడానికీ, సమర్థించుకోవడానికీ)చేసింది. ‘ఈ కార్యక్రమానికి రావడానికి వినోద్ మెహతా నిరాకరించారు’ అంటూ అప్పుడు స్క్రోలింగ్ వేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఇది పత్రికా విలువలకు పూర్తిగా విరుద్ధమని బర్కాదత్‌కు చెప్పడానికి నేనెవరిని అన్నది నా భావన. నాకు హితబోధలు ఇష్టం ఉండదు. ‘జర్నలిస్టుగా నేను నీ కంటే ఎన్నో ఏళ్లు ఎక్కువ అనుభవం కలిగినవాడిని. వృత్తిపరంగా నీవు చేసింది తప్పు’ అని ఆమెకు చెప్పాలనీ అనుకోలేదు. ప్రణయ్‌రాయ్ (ఎన్డీటీవీ అధిపతి) నాకు ఫోన్ చేసి ఆ కార్యక్రమానికి రమ్మన్నారు. రానని చెప్పాను. మీరు మా జర్నలిస్టులను విమర్శించారు కాబట్టి రావాలన్నారాయన. మీ కార్యక్రమంలో విమర్శించలేదు కదా అన్నాను. నేను ఆమెను విమర్శించానంటే, అది ‘ఔట్లుక్’లో జరిగింది. దానికి ఆమె స్పందించవచ్చు. అయితే బర్కా తన వివరణను బుధవారానికి పంపవలసి ఉంది. కానీ పంపలేదు. నేను ప్రణయ్‌కి ఫోన్ చేసి, మిత్రమా! ఆమె వివరణ పంపలేదు. నేను పేజీలు (అచ్చుకు పంపకుండా) ఆపి ఉంచలేను అని ప్రణయ్‌కి చెప్పాను. ఆయన మరో పదినిమిషాల సమయం కోరారు. వెంటనే బర్కా తన స్పందనను పంపారు. ఒక్క అక్షరం కూడా మార్చకుండా అచ్చు వేశాం. వీర్ సింఘ్వి విషయంలోనూ ఇదే జరిగింది. ఆయనైతే ఏడాది తరువాత రాశారు. తాను ఎక్కడో టేపులు సంపాదించాననీ, అవి నకిలీవని తేలిందని రాశారు. అది మీ ఉద్యోగానికి ముప్పు తెచ్చిందని అనుకోవచ్చా? ప్రకటనకర్తలతో ఇబ్బందులు వచ్చాయి. టాటాలు ‘ఔట్లుక్’ను బహిష్క రించారు. కానీ దీనితోనే నా పదవి పోయిందని చెప్పలేను. అప్పటికి నేను ఎడి టర్గా వచ్చి 17 ఏళ్లయింది. రహేజాలు (అధిపతులు) నాతో సఖ్యంగానే ఉన్నా రు. కానీ వాళ్లు ఎడిటర్ మార్పును సూచించినప్పుడు నేను సరేనన్నాను. టేపులు ఒకరిద్దరు జర్నలిస్టులనే కాదు, మొత్తం మీడియానే ఎత్తిచూపాయి కదా! ఇది మొత్తం జర్నలిస్టుల ప్రతిష్టనే దిగజార్చింది. అవినీతి మీద జరిగిన ఒపీనియన్ పోల్స్‌లో జర్నలిస్టులు టాప్ టెన్‌లో రావడం మొదలైంది. సేవకు సంబంధించి వేరొక పోల్స్‌లో చూస్తే జర్నలిస్టుల పేరే లేదు. జర్నలిస్టులతో పాటు ఉపాధ్యాయులు, శాస్త్రజ్ఞుల వర్గం కూడా వచ్చి చేరింది. ఇప్పుడున్న వారిలో గొప్ప ఎడిటర్ అని మీరు ఎవరి పేరైనా చెబుతారా? లేదు. నేను ఆఖరిగా ప్రశంసించినది కుష్వంత్సింగ్నే. కొత్త ఎడిటర్లు బహు ముఖ ప్రజ్ఞాశాలురు. కానీ వారి నుంచి నేను నేర్చుకోవలసిందేమీ లేదు. (స్క్రోల్.ఇన్ వెబ్సైట్ సౌజన్యంతో) -
వినోద్ మెహతాకి జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, ది ఔట్లుక్ గ్రూప్ ఎడిటోరియల్ చైర్మన్ వినోద్ మెహతా ప్రతిష్టాత్మక ‘జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు’కు ఎంపికయ్యారు. జర్నలిజంలో మెహతా చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ని ఎంపిక చేసినట్టు ఈ అవార్డు వ్యవస్థాపకులు, టీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఓ కార్యక్రమంలో అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు బహుమతి, బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని మెహతాకు అందజేయనున్నట్టు తెలిపారు. సుప్రసిద్ధ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏటా పాత్రికేయ రంగానికి చెందిన ఒకరిని ఈ అవార్డుతో టీఎస్ఆర్ ఫౌండేషన్ సత్కరిస్తోంది.