పట్టిసీమ జపం మానండి బాబూ..!
నేడు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు విడుదల చేయనున్నారు. అయితే సిద్ధేశ్వరం ద్వారానే పోతిరెడ్డిపాడు తూముల నుంచి రాయలసీమకు నీరందుతుందనే నిజాన్ని గ్రహించి, పట్టిసీమ జపం మాని, సీమకు నీరందించే మార్గం వైపు సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలి. లేదంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టుగా మరో సీమ ఉద్యమాన్ని చవిచూడక తప్పదు.
ఈనెల 6వ తేదీన పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు విడుదల చేస్తున్నట్టు చంద్ర బాబు ప్రకటించారు. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణకు మళ్లించి రాయలసీమకు మేలు చేస్తు న్నామని పదే పదే తెలుగు దేశం ప్రభుత్వం ఊదరగొడు తున్నది. పట్టిసీమ ప్రభుత్వ ఉత్తర్వులో రాయలసీమకు నీళ్లు ఇస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు. కానీ, రాయల సీమకు పట్టిసీమ ద్వారా నీరందిస్తామని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. శుష్క వాగ్దానాలతో రాయలసీమ వాసుల్ని వంచించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడడం లేదు.
రాయలసీమకు కృష్ణా జలాలను తరలించేందుకు ఉన్న ఏకైక మార్గం పోతిరెడ్డిపాడు. ఈ పోతిరెడ్డిపాడు తూముల ద్వారా నీరు విడుదల చేయాలంటే శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 841 అడుగులపైన ఉండాలి. అయితే, శ్రీశైలం జలాశయంలో 854 అడుగు లకు పైన ఉంటేనే రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే నిబం ధన ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1996లో జీవో నంబరు 69 ద్వారా శ్రీశైలం కనీస నీటి మట్టపు స్థాయిని 834 అడుగులకు కుదించింది.
ఈ 69వ నంబరు జీవోను రద్దుచేసి తిరిగి 854 అడుగుల కనీస నీటిమట్టం స్థాయిని ఉంచితే తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందవు. 1996కు ముందు కనీస నీటి మట్టపు స్థాయి 854 అడుగులు ఉండేది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటిమట్టం స్థాయి ఉండేలా జీవో తీసుకువస్తే, టీడీపీ వర్గం తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి తిరిగి 834 అడుగుల స్థాయిలో ఉండేట్టుగా జీవోను తీసుకు వచ్చింది.
రాయలసీమ ప్రాంతానికి నీరు అందించే చాలా పథకాలకు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు తూముల ద్వారా మాత్రమే నీరు తీసుకోవాల్సి ఉంటుంది.
రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కొన్ని నికర జలాల మీద, మరికొన్ని మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నీళ్లయినా పోతిరెడ్డిపాడు తూముల ద్వారానే రావాల్సి ఉంటుంది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండినప్పుడు దాని పూర్తి స్థాయి 885 అడుగులు ఉంటుంది. జీవో 69 ప్రకారం జలాశయం కనీస నీటి విడుదల మట్టం (మినిమం డ్రాడౌన్ లెవెల్) 834 అడుగులు. శ్రీశైలం జలాశయం ఎగువ భాగంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అడుగు భాగం మట్టం (సిల్ లెవెల్) 842 అడుగులు.
రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా నీరందా లంటే క్యారీ ఓవర్ రిజర్వాయర్‌గా శ్రీశైలం రిజర్వాయరు లోనే పైభాగంలో కృష్ణానదిపై 860 అడుగుల సిల్ లెవెల్‌తో ఒక అలుగు నిర్మించాలి. ఇదే సిద్దేశ్వరం అలుగు. ఈ అలుగు శ్రీశైలం డ్యాంకు సుమారు 90 కిలోమీటర్ల పై భాగాన ఉంటుంది. ఈ అలుగు 600 మీటర్లకు మించి లేదు. ఖర్చు 600 కోట్ల రూపాయలు కూడా కాదు. ఈ అలుగు వల్ల 50 టీఎంసీల నీళ్లు నిలువ చేయవచ్చు. దీనివల్ల పోతిరెడ్డిపాడు ద్వారా రాయల సీమకు నీళ్లందివ్వడం తేలిక. తెలంగాణ ప్రాంతానికి 90 రోజులపాటు నీరు తీసుకుపోయే అవకాశం జీవో నంబర్ 69 ఇస్తున్నది. 825, 802 సిల్ లెవెల్ గల శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ), కల్వకుర్తిలకు ఏ ఇబ్బందీ లేదు. నాగా ర్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఉన్న కోస్తా ప్రాంతానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు.
కృష్ణానది పోటెత్తి ప్రవహించినప్పుడు సీమకు నీరు తీసుకెళ్లడంలో విఫలమైన బాబు ప్రభుత్వం.. గోదావరి నీటిని మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమలో వినియోగించుకుంటామని చెప్పడం విడ్డూరం. దీనికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు ప్రజ లను మభ్యపెడుతోంది. నిజానికి గోదావరి, కృష్ణా నదులు రెండింటిలో దాదాపు ఒకే సమయంలో వరద లొస్తాయి. కృష్ణాలో వరదలు ఉన్నప్పుడు గోదావరి నీటిని లిఫ్ట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే కృష్ణా డెల్టాకు నీటి అవసరం ఉన్నప్పుడు గోదావరిలో వరద లేకపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశమూ ఉండదు. అంటే కృష్ణా డెల్టాకే గోదావరి నీటి తరలింపుపై గ్యారంటీ లేదు. కానీ గోదావరి నీటిని కృష్ణా డెల్టా అవసరాలకు వాడి, అక్కడ మిగిలే కృష్ణా నికరజలాలను శ్రీశైలం నుంచి సీమకు నీళ్లిస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యా స్పదం. సీమపై నిజంగానేబాబుకు చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా సామర్థ్యానికి అనుగు ణంగా కాలువలను సిద్ధం చేయాలి. దీన్ని విస్మరించి పట్టిసీమతో సీమకు నీళ్లిస్తామంటే అంతకు మించిన నయవంచన మరొకటి లేదు.
పట్టిసీమ, పట్టిసీమ అని రాయలసీమ వాసులను మోసగించవద్దు. రాయలసీమ వాసులకు వాస్తవాలు తెలుసు. తమకు నీళ్లు ఎట్లా వస్తాయో తెలుసు గనుకనే ‘సిద్ధేశ్వరం అలుగు - రాయలసీమకు వెలుగు’ అనే నినా దంతో దాదాపు 30 వేల మంది రైతులు ఇటీవలే కృష్ణా నదిలో కవాతు చేసిన సంగతి తెలుగుదేశం ప్రభుత్వం మరవద్దు. అటు తెలంగాణకుగాని, ఇటు కోస్తా ప్రాంతా నికిగాని ఏ ఇబ్బందీ లేని జీవో నంబరు 69 రద్దు చేయడంతోపాటు, సిద్ధేశ్వరం ద్వారానే పోతిరెడ్డిపాడు తూముల నుంచి రాయలసీమకు నీరందుతుందనే నిజాన్ని గ్రహించి, పట్టిసీమ జపం మాని రాయల సీమకు నీరందించే అంశంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. లేదంటే శ్రీకృష్ణ కమిటీ కరాఖండిగా చెప్పినట్టుగా మరో రాయలసీమ ఉద్యమాన్ని చవిచూడక తప్పదు.
వ్యాసకర్త అధ్యక్షుడు, రాయలసీమ
- భూమన్, అధ్యయనాల సంస్థ 90107 44999