నిరుపేద కూలీ మల్లీశ్వరి తన పసికూనకు పాలివ్వడానికి కూడా కాం ట్రాక్టర్ అనుమతి ఇవ్వకపోవడంతో పసిపాప ఏడ్చి, ఏడ్చి ప్రాణాలు వదలడం యావత్ సమాజానికే తలవంపులు తెచ్చే ఘటన. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిచాల్సిందే. ఖండించడంతో సరిపెట్టుకోకుండా శక్తి మేరకు ఉద్యమించడం, బాధితుల పక్షం నిలిచి గొంతెత్తడం తక్షణ కర్త వ్యం. కానీ ఇంత దారుణం జరుగుతున్నా కమ్యూనిస్టులేం చేస్తున్నారు అని ఈ నెల 20న సాక్షి పత్రికలో ఎ. ప్రదీప్ రాసిన లేఖ ప్రశ్నించింది. అయితే అన్నిటికంటే ముందు ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చి, ప్రచురించిందీ, ప్రసారం చేసిందీ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని మీడియానే. పైగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఐటీయూ, సీపీఎం మహిళా సంఘం కార్యకర్తలు తహసీల్దారును అడ్డుకుని న్యాయవిచా రణ జరిపించాలని ధర్నా చేశారు.
సంఘటనపై కొనసాగింపు కార్య క్రమం చేసిందీ, చేస్తున్నదీ, అలాగే మల్లీశ్వరితో పోలీస్ కంప్లయింట్ చేయించి వారికి రక్షణ కల్పించింది కూడా వారే. కాగా ముఖ్యమంత్రి కదిలి న్యాయం చేయాలని అభ్యర్థించిన ఈ లేఖలో.. సమస్యను వెలు గులోకి తీసుకొచ్చిన వారిని విస్మరించడం సబబు కాదు. మల్లీశ్వరిని కడుపు కోతకు గురిచేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఆమె ముగ్గురు కూతుళ్లకూ చదువు చెప్పించాలని డిమాండ్ చేద్దాం. నేటికీ స్పందించని ప్రజాప్రతినిధులను, మంత్రులను నిలదీద్దాం.
నాగటి రవీంద్ర హైదరాబాద్