
నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను!
చంద్రబాబు నినాదం కోడి కూతై అనేక జంటల్ని నిద్రలేపింది. శుభప్రదమైన, సుఖప్రదమైన నినాదం! పైగా ఆకర్షణీయం, ఆచరణసాధ్యం. పూర్తిగా సొంతింటి పరిజ్ఞానంతో నడిచే ఈ కుటీర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రధాని మేకినిండియా పిలుపునకిది సరైన జవాబుగా నిలుస్తుంది.
పుష్కరం కిందట చంద్రబాబు స్లోగన్ ఇది. అప్పట్లో అధికార యంత్రాంగానికి ఇచ్చిన నినాదం ఇది. ఇప్పుడు సరిగ్గా ఎన్టీఆర్ వర్ధంతి రోజు చంద్రబాబుకి ‘మారు మన సు’ అయింది. జాతికి అన్న గారు, బాబుకి మామగారు అయిన ఎన్టీఆర్ పూనారు. కనండి! కనండి! పిల్లల్ని యథేచ్ఛగా కనండి! కరువు తీరా కనండి! కళకళలాడా కనండి! కేరింతలతో రాష్ట్రాన్ని బాలాంధ్రప్రదేశ్‌గా మార్చండి! దేశమంటే పిల్లలోయ్! తెలుగుదేశమంటే ఓటొచ్చిన పిల్లలోయ్- నూతనోత్సా హంతో ముఖ్యమంత్రి నినదించారు. అసలే చలి ఎక్కు వగా ఉన్న సంక్రాంతి వేళ నేత ఇచ్చిన పిలుపు సమర్థు లకు వెచ్చగా అనిపించింది.
ఆనాడు హైదరాబాద్ నగరానికి గడ్డ ఎత్తుతూ తొలి నవాబ్, ‘నా నగరంలో మనుషులు చెరువులో చేపల్లాగ కుప్పలు తెప్పలుగా పెరగాలి. ఆ విధంగా దీవించ’మని అల్లాని వేడుకున్నాడు. భాగ్యనగరం చేపల చెరువు కంటే ఎక్కువగా కిక్కిరిసింది అల్లా దయవల్ల. అన్నగారు కుటుంబ నియంత్రణకు ఎప్పుడూ వ్యతిరేకమే. ఎవరైనా తమకు పిల్లలు ఇద్దరనో ముగ్గురనో చెబితే చురుక్కున చూసి ‘‘ఏం బ్రదర్! వాట్ హ్యాపెండ్? ఏమైంది? దానికీ బద్ధకమేనా? నియంత్రణా? పశువుకీ పక్షికీ చెట్టుకీ చేమకీ లేని కంట్రోల్ మనకేల? పర్యావరణాన్ని పాడు చేయకండి!’’ అని హెచ్చరించేవారు. కనీసం పద మూడు, పద్నాలుగు మందిని కనాలి. అప్పుడే పరమ హంస స్టేటస్ వస్తుంది. మమ్మల్ని చూడండి! అనేవారు. ఇదే సందేశంతో తాతమ్మ కల సినిమాలో పాట కూడా పెట్టారు. లాల్‌బహదూర్ శాస్త్రి, రవీంద్రనాథ్ టాగూర్ అధిక సంతానం వద్దనుకుంటే పుట్టేవారే కారని చెప్పిం చారు. ఎంతైనా ఎన్టీఆర్ కార్యశూరుడు.
నిన్నటిదాకా ‘వన్ ఆర్ నన్’ అన్నారు. హద్దు మీరితే పదవులకి అనర్హులని నిఘా పెట్టారు. ఎమర్జెన్సీ లో అయితే యువరాజు సంజయ్‌బాబు ఆధ్వర్యంలో పదేళ్ల వాళ్లకి కూడా ఆపరేషన్లు చేసేశారు. జాతిని ఒక తరంపాటు నిర్వీర్యం చేసేశారు. ‘‘మొన్నటి దాకా క్రాప్ హాలిడే అని, ఇవాళ ఉన్నట్టుండి ‘స్టార్ ప్రొడక్షన్’అంటే- ఇది లాకులెత్తి నీళ్లొదిలినంత సులువా?’’ అంటున్నారు కొందరు. ఎంతైనా క్రియేటివ్ పనికి వేళావేళలూ, కళా కళలు ఉంటాయి కదా! పిచ్చి కుదిరింది, తలకి రోకలి చుట్టమంటే?!
ఇది చంద్రబాబు రాజకీయం అంటు న్నారు కొందరు మేధావులు. ఇప్పుడీ భరోసా మీద వచ్చే వారంతా ‘తెలుగుదేశం పిల్లలు’గా టీడీపీకి విధే యులై ఉంటారనీ, ఇరవయ్యేళ్ల తరువాత వారంతా లోకేష్ ఓటర్లు అవుతారనీ, ఇది బాబు విజన్ 2035 అనీ వాదిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నినాదం కోడి కూతై అనేక జంటల్ని నిద్ర లేపింది. శుభప్రదమైన, సుఖ ప్రదమైన నినాదం! పైగా ఆకర్షణీయం, ఆచరణ సాధ్యం. పూర్తిగా సొంతింటి పరిజ్ఞానంతో నడిచే ఈ కుటీర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థి ల్లుతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రధాని మేకినిం డియా పిలుపుకిది సరైన జవాబుగా నిలుస్తుంది. అసలే మన బాబు టెక్నాలజీ బాబు. అందుకని ఆర్నెల్లకే పంట కొచ్చే హైబ్రిడ్ పిల్లల కోసం; కవలలూ, క్వాడ్రుప్లేట్స్ కోసం వ్యాక్సిన్ చేయించినా ఆశ్చర్యం లేదు.
ఇదొక పోటీగా పరిణమిస్తే ప్రమాదం. మేం తక్కు వ తిన్నమా, మాకూ మగాళ్లున్నారు. మూడేళ్లలో జనా భాను డబుల్ చేస్తాం. కాస్కోండి దద్దమ్మల్లారా! అంటూ రంగప్రవేశం చేస్తే!? అవసరమైతే క్షేత్రస్థాయిలో బీజ స్థాయిలో అహరహం యుద్ధ ప్రాతిపదికన పనులు నడి పిస్తాం. రెండు తర్వాత సంక్రమించే గర్భాలకు అంటే ఆ తల్లులకు సంతానలక్ష్మి పథకం కింద పింఛన్ ఏర్పా టు చేస్తాం. ఎర్ర త్రికోణాన్ని తిరగేసి రంగు తగ్గిస్తాం. ఇం కానా, ఇకపై కుట్రలు సాగవ్. ప్రతివాడూ ఒక ఉగ్ర నర సింహుడై విజృంభిస్తాడు! ఖబడ్దార్!
శాంతిః శాంతిః శాంతిః
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
- శ్రీరమణ