
వాగ్భూషణం భూషణం
మనిషికి తరగని అభరణం మాటే. ఇతర సంపదలు అన్నీ క్షణికమైనవే. ఒక మాటే మనిషిని చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. అందుకే భర్తృహరి ‘‘వాగ్భూషణం భూషణమ్’’ అన్నాడు.
మనిషికి తరగని అభరణం మాటే. ఇతర సంపదలు అన్నీ క్షణికమైనవే. ఒక మాటే మనిషిని చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. అందుకే భర్తృహరి ‘‘వాగ్భూషణం భూషణమ్’’ అన్నాడు. మాట మానవుని మహనీయునిగా తీర్చిదిద్దుతుంది. రుషి వాక్కే బోయవాణ్ణి అదికవిగా మార్చింది. మాటకు కట్టుబడే రాముడు అరణ్యవాసం చేశాడు. మాటకు కట్టుబడే పాండవులు వనవాసాన్నీ, అజ్ఞాతవాసాన్నీ చేశారు. మాట రుషి నోట మంత్రమౌతుంది. గురువు నోట సదుపదేశమౌతుంది. ప్రభువునోట శాసనమౌతుంది. గాయకుని నోట గానమౌతుంది. మహనీయుల మాటలే మనవాళికి ప్రగతిబాటలై నిలుస్తాయి. అందుకే ఒక కవి మానవజీవితం ఆనందభరితం కావాలంటే మంచివాక్కు అవసరం అని ఈ పద్యంలో తెలుపుతున్నాడు - ‘‘మాటలచేత దేవతలు మన్ననజేసి వరంబు లిత్తురున్
మాటలచేత భూపతులు మన్ననజేసి పురంబులిత్తురున్
మాటలచేత కామినులు మన్ననజేసి సుఖమ్ము లిత్తురున్
మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్’’
మంచి మాటలు చంద్రునికన్న, చందనరసం కన్న, చల్లని నీటికన్న, చెట్టునీడకన్న, మనిషిని మనసును ఆహ్లాదపరుస్తాయనేది నిత్యజీవితంలో సత్యమై నిలిచేదే. ఈ విషయాన్నే పూర్వకవి వాక్కు కూడా ధ్రువపరుస్తున్నది.
‘‘న తథా శశీ సలిలం న చందనరసో న శీతలచ్ఛాయా
ప్రహ్లాదయతి చ పురుషం యథా మధురభాషిణీ వాణీ॥
మాటలకుండే అపారశక్తిని, మాటలకుండే వైభవాన్ని భవభూతి మహాకవి ఉత్తరరామచరిత నాటకంలోని ఈ శ్లోకంలో తెలిపాడు.
‘‘మ్లానస్య జీవ కుసుమస్య వికాసకాని
సంతర్పణాని సకలేంద్రియ మోహనాని
ఏతాని తే సువచనాని సరోరుహాక్షి
కర్ణామృతాని మానసశ్చ రసాయనాని॥
రామచంద్రుడు సీతమ్మతో నీ మాటలు నాకు కర్ణామృతాలు. మనస్సుకు ప్రీతి కలిగించు రసాయనాలు. నీ మాటలే వాడిపోయిన నా జీవకుసుమాన్ని వికసింపజేస్తాయి. సంతోషాన్ని, సంతృప్తిని కలుగజేస్తాయి. నీ పలుకులు నా సకలేంద్రియాలను సమ్మోహింపజేస్తూ నా హృదయాన్నాకర్షిస్తాయి అని పేర్కొన్నాడు. అందరికి ఆమోదకరమైన, శ్రేయస్కరమైన పలుకులను పలకాలి అనే భావనతో మహనీయులు తక్కువగా మాట్లాడతారన్న భావాన్ని ఆవిష్కరించే ‘‘మహీయాంసః ప్రకృత్యా మితభాషిణః’’ అనే మాఘకవి సూక్తిసారాన్ని మనం ఆచరణలో నిలుపుకోవాలి. మనం సందర్భానికి తగినట్లుగా మాట్లాడాలి. ఇతరుల మనస్సును మాటల తూటాలతో గాయపరచవద్దు. అందుకే మన పెద్దలు ప్రియమైన మాటనే పలుకాలని, ప్రియవాక్యం వల్ల అందరూ సంతృప్తి చెందుతారని పేర్కొన్నారు
- సముద్రాల శఠగోపాచార్యులు