Samudhrala shata gopala charyulu
-
సద్గుణ భూషణాలు
మానవుడిలో ఉండే సత్గుణాలే అతణ్ని ఒక మహనీయుడిగా చరిత్రపుటల్లో సుస్థిర స్థానా న్ని కలిగివుండే వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. వివే కగుణసంపన్నుడైన మానవుడే తనలో దాగి ఉన్న బుద్ధి సంపదను గుర్తించి తన జన్మ సార్థకమయ్యేందుకు కావలసిన సద్గుణాలు అనే భూషణాలను ధరించగలుగుతాడు. శరీరానికి, గుణాలకు భేదం చాలా ఉన్నది. శరీరమేమో అశాశ్వతమైనది. యుగయుగాల వరకు శాశ్వతంగా చరిత్రలో నిలిచేవి సద్గుణాలే అనే విషయాన్ని శరీరస్య గుణానంచ దూరమత్యంత మంతరమ్ శరీరం క్షణవిధ్వంసి కల్పాంతస్థాయినో గుణాః॥ అనే శ్లోకం ధ్రువపరుస్తున్నది. సద్గుణాలను అలవరచుకోవలసిన అవసరాన్ని పెద్దలు చెప్పా రు. అధిక విలువ కలిగిన మణి తల పైన, కంఠంలో, భుజాలకు దరించే అభరణాలలో, చివరకు పాదపీఠంపై కూడా ప్రకాశి స్తుంది. అట్లే సద్గుణవంతులు అన్ని చోట్ల పేరు ప్రతిష్టలను గౌర వాభిమా నాలను పొందగలుగుతారు అనే విషయం ‘‘సర్వత్ర గుణవానేవ చకాస్థి ప్రథితో నరః మణిర్మూర్ధ్ని గలే బహౌ పాదపీఠే పి శోభతే॥ అనే సూక్తి ద్వారా వెల్లడవుతున్నది. ఏ మనిషికైనా గుణాలను బట్టి గౌరవం, ఆత్మయత లభిస్తాయి. ఎత్తయిన ఆసనం మీద కూర్చోవడం వల్ల లభించవు. ఎత్తయిన భవన శిఖరంపైకి వెళ్లి వాలినంత మాత్రాన కాకి గరుత్మంతుడితో సమానమైన ప్రతిష్టను పొందజాలదు. ఉన్నతాస నంపై కూర్చోగానే నిర్గుణుడు గుణశేఖరుడు కాలేడని గుణాల వల్లనే ఒక వ్యక్తి మహోన్నతుడిగా పరిగణింపబడతాడని ‘‘గుణైరుత్తుంగతాం యాతి నోచ్చై రాసనసంస్థితః ప్రాసాద శిఖరస్థోకపి కాకః గరుడాయతే॥ అనే శ్లోకం చెబుతోంది. అలాగే పుట్టుకనుబట్టి గొప్పతనం సిద్ధించదు. ఒక ఎతైన పర్వతంపైకి పెద్ద బండరాయిని తీసుకపోవడం ఎట్లా కఠోరమైన పరిశ్రమతోనే సాధ్యమవుతుందో, అట్లే విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న గుణాలను అలవరచుకోవడం సులభ సాధ్యం కాదు. పెద్ద బండరాయిని కొండపై నుంచి క్రిందకు పడదోయడం ఎంత సులభమో దోషాలను అలవరచుకొనడం అంతసులభమైన పని అని తెలిపే ఈ సూక్తి సారాన్ని ఒంటబట్టించుకుందాం. ఆరోప్యతే యథా శైలే యత్నేన మహతా శిలా క్షిప్యతే చ క్షణేనైవ తథాత్మ గుణదోషయోః॥ మనలో ఉండే వివేకాన్ని తట్టి లేపుదాం. సువర్ణాభరణా లకన్న, రత్నహారాలకన్న మనిషిని ప్రకాశింపచేసే అసలు సిసలైన అభరణాలు సద్గుణాలే అనే విషయాన్ని గుర్తిద్దాం. సమున్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సోపానాలు సద్గుణా లేనని, సద్గుణాలే ప్రగతి కారకాలనే విషయాన్ని దృఢంగా విశ్వ సిద్దాం. సద్గుణ ప్రాప్తికై త్రికరణ శుద్ధితో సాధన చేద్దాం. సత్ఫలితాలను పొందుదాం. - సముద్రాల శఠగోపాచార్యులు -
జ్ఞానసంపద
మానవులు వికాసవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి, తమ జన్మను చరితా ర్ధం చేసుకోవడానికి అవసరమైన ప్రధాన సంపద జ్ఞాన సంపదే. ఈ జ్ఞానసంపద గలవారు ధన, ధాన్య, గృహ, ధైర్య, వస్తు, వస్త్ర, వాహనాది సంపదల్లో కొన్నిటిని లేదా అన్నిటినీ ప్రయత్నంతో సమకూర్చుకొనగలుగుతా రు. కానీ, ధనధాన్యాది ఇతర సంపదలు గలవారు సులభంగా జ్ఞానసంపదను చేజిక్కించుకోలేరు. ఇ తర సంపదలెన్ని ఉన్నా శ్రద్ధాసక్తులు, పట్టుదల, తగిన ప్రయత్నం లేకుండా జ్ఞానసంపద దరిచేరదు. లోకంలో ఎన్ని సంపదలున్నా అవేవీ జ్ఞానధనంతో సమానం కాలేవు. జ్ఞానధనమే ధనాలన్నిటిలోనూ ప్రధానమైనది. చాలా గొప్ప నైపుణ్యం కలిగిన దొంగలు కూడా దొంగిలించలేనిది, రక్తం పంచుకుని పుట్టిన ఒకే తల్లీ పిల్లలు కూడా స్థిర చరాస్తులను భాగాలను చేసుకున్నట్టు పంచుకోవడానికి వీల్లేనిది, ఎంత విస్తృతస్థాయిలో జ్ఞానధనాన్ని సంపాదించుకున్ననూ ఎన్నటికీ భారంగా మారదు ఈ జ్ఞానసంపద. పైగా ఇతర వస్తువులను, ఇతర సంపదలను ఉపయోగిస్తున్నకొద్దీ అవి అరిగిపోతుంటాయి. జ్ఞానధనాన్ని తన కోసం లేదా ఇతరుల కోసం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తుంటే అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా, ప్రతినిత్యం వృద్ధి పొందుతుంది. అలాంటి అపూర్వ జ్ఞానసంపదయే సర్వసంపదలలోకెల్లా ప్రధానమైనదని ‘న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ బారకారి వ్యయేకృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానమ్’ అనే శ్లోకం తెలుపుతున్నది. ఈ జ్ఞానసంపద తల్లిలాగా రక్షించేది, తండ్రిలాగ హితాన్ని కలిగించేది. కాంతవలె దుఃఖాన్ని దూరం చేస్తూ, ప్రియాన్ని సమకూర్చేది. సకల సంపదలను పొందింపజేసేది, అలాగే దశదిశలా కీర్తిప్రతిష్టలను వ్యాపింపజేసేది, కల్పలత వంటి జ్ఞానసంపద మాత్రమే. అలాంటి జ్ఞానసంపదను కలిగివున్న వ్యక్తి సాధించలేనిది ఏదీ ఉండదని ‘మాతేవ రక్షతి పితేవ నియుంక్తే కాంతేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్ లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా’అనే సూక్తి వెల్లడిస్తున్నది. జ్ఞానులకు జ్ఞానసంపద రహస్యంగా దాచివుం చిన ధనంలా ఉపకరిస్తుంది. సమస్త భోగాలను సాధించి పెడుతుంది. గొప్ప యశస్సును, సుఖపరంపరను కలిగిస్తుంది. విదేశాలకు వెళ్లినప్పుడు దగ్గరి బంధువులా ఉపకరిస్తుంది. ఒక పరదేవతలాగ సమస్త కామనలను నెరవేరుస్తుంది. సమాజంలో గొప్ప కీర్తిప్రతిష్టలను సాధించి పెడుతుంది. ఈ జ్ఞానసంపద లేకపోతే మానవుడుని వింత జంతువుగా చూస్తారు. ఈ జ్ఞానసంపదను చేజిక్కించుకోవడం అంత సులభం కాదని, శ్రద్ధగలవారికే జ్ఞానం అబ్బుతుందని ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అనే గీతావాక్యం బోధిస్తుంది. జ్ఞానంతో సమానమైన, పవిత్రమైన మరొక సంపద ఏదీ లేదని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే’ అనే వాక్యంతో ఉపదేశించాడు. జ్ఞానం లేకపోతే ముక్తి కూడా లభించదని ‘రుతే జ్ఞానాన్న ముక్తిః’ అనే వాక్యం ఉద్బోధిస్తుంది. జ్ఞానసంపద భౌతిక సుఖాలను, వివిధ సంపదలను సాధించిపెట్టడమే కాక ఆధ్యాత్మిక ప్రగతికి కూడా కారణమవుతుంది. ఐహిక ఆముష్మిక శ్రేయస్సును సాధించిపెట్టే జ్ఞానసంపదను పొందుదాం. ఈ మానవజన్మను చరితార్ధం చేసుకుందాం. - సముద్రాల శఠగోపాచార్యులు -
ఇచ్చి పుచ్చుకునేది గౌరవం
ఆహారాన్ని సమకూర్చుకోవడం, యోగ్య మైన నివాసాన్ని ఏర్పరుచుకోవడం అన్ని ప్రాణులు చేసే పనే. అయితే వివేకం వల్ల, విజ్ఞానం వల్ల మానవుడు ఇతర ప్రాణుల కంటె విశిష్టుడయ్యాడు. సకల ప్రాణులలో విశిష్టులైన, విజ్ఞానవంతులైన మానవులు అందరూ ముందుగా కోరుకునేది గౌరవాన్నే. ప్రతివ్యక్తిగౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని భావిస్తాడు. ఇంటా బయటా అదే కోరుకుంటాడు. గొప్ప పదవి కలవాడైనా, కోటీశ్వరుడైనా గౌరవం లేకపోతే ఏ ఒక్క క్షణం మనశ్శాంతితో జీవించలేడు. సమాజంలో గౌరవం కోల్పోయినవారు, అప్రతిష్ఠపాలు అవుతామనే సందేహం కలవారు, అకారణంగా అభియోగాలను మోస్తున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒక్కసారి గౌరవం పొందినవాడికి చెడ్డ పేరు రావడం, పరువు పోవడం వంటివి మరణం కంటెను ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తాయి అని గీతాచార్యులైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ‘సంభావితస్య చాకీర్తిః మరణాదతి రిచ్యతే’ అని ఉద్బోధించారు. ఈ భావాన్నే భర్తృహరి మహాకవి కూడా ‘‘అపయశో యద్వస్తి కిం మృత్యునా’’ అనే శ్లోకపాదంలో వివరించారు. మానవ జీవితంలో ఇంతటి ప్రముఖమైన గౌరవాన్ని పొందే మార్గాన్ని ఆవిష్కరిస్తోంది ఈ క్రింది శ్లోకం: వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ వకారైః పంచభిర్లుప్తో నాప్నోతి గౌరవమ్॥ వస్త్రం, వపువు (శరీరం), వాక్కు, విద్య, వినయములు అనే ఈ అయిదు ‘వ’కారాలు లేకపోతే ఏ మనిషీ గౌరవాన్ని పొందడు అని పై శ్లోకానికి అర్థం. పరిశుభ్రమైన, ఆకర్షణీయమైన వస్త్రాల ద్వారా, శారీరక పుష్టి, సౌందర్యాదుల వలన, మృదుమధురమైన ప్రియ హిత వాక్కుల ద్వారా, తనకు, తోటివారికి ఇహపర సాధకంగా నిలిచే విద్యను అభ్యసించడం వల్ల, వినయ స్వభావం కలిగి ఉండడం వల్ల ఏ మనిషైనా గౌరవాన్ని పొందగలడని పై శ్లోకం వ్యక్తపరుస్తోంది. ఒక్కరిలోనే సముచిత వస్త్రధారణ, ఆకర్షణీయమైన దేహపుష్టి, వాక్చాతుర్యం, విద్య, వినయం అను ఐదూ ఉండకపోయినా వీటిలో ఏ ఒక్కటో ఉంటే కొంతవరకైనా గౌరవపాత్రుడవు తాడు. కానీ అయిదింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సమాజంలో నిరాదరణకు గురవ్వడమే కాకుండా, నామమాత్రంగా మిగిలిపోతాడు. ప్రతి వ్యక్తీ తాను ఇతరులచేత గౌరవం పొందాలని కోరుకున్నట్లే తాను కూడా ఇతరులను గౌరవించాలి. అందుకే మన పూర్వులు ‘‘పెద్దలను గౌరవింపుము, చిన్నలను ప్రేమింపుము’’ అని చెప్పా రు. ఈ భావనే కార్యరూపం దాలిస్తే సమాజంలో కలతలు, కలహాలు తొలగి, నేరప్రవృత్తి తగ్గిపోతుం దనడంలో సందేహం లేదు. - సముద్రాల శఠగోపాచార్యులు -
వాగ్భూషణం భూషణం
మనిషికి తరగని అభరణం మాటే. ఇతర సంపదలు అన్నీ క్షణికమైనవే. ఒక మాటే మనిషిని చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. అందుకే భర్తృహరి ‘‘వాగ్భూషణం భూషణమ్’’ అన్నాడు. మాట మానవుని మహనీయునిగా తీర్చిదిద్దుతుంది. రుషి వాక్కే బోయవాణ్ణి అదికవిగా మార్చింది. మాటకు కట్టుబడే రాముడు అరణ్యవాసం చేశాడు. మాటకు కట్టుబడే పాండవులు వనవాసాన్నీ, అజ్ఞాతవాసాన్నీ చేశారు. మాట రుషి నోట మంత్రమౌతుంది. గురువు నోట సదుపదేశమౌతుంది. ప్రభువునోట శాసనమౌతుంది. గాయకుని నోట గానమౌతుంది. మహనీయుల మాటలే మనవాళికి ప్రగతిబాటలై నిలుస్తాయి. అందుకే ఒక కవి మానవజీవితం ఆనందభరితం కావాలంటే మంచివాక్కు అవసరం అని ఈ పద్యంలో తెలుపుతున్నాడు - ‘‘మాటలచేత దేవతలు మన్ననజేసి వరంబు లిత్తురున్ మాటలచేత భూపతులు మన్ననజేసి పురంబులిత్తురున్ మాటలచేత కామినులు మన్ననజేసి సుఖమ్ము లిత్తురున్ మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్’’ మంచి మాటలు చంద్రునికన్న, చందనరసం కన్న, చల్లని నీటికన్న, చెట్టునీడకన్న, మనిషిని మనసును ఆహ్లాదపరుస్తాయనేది నిత్యజీవితంలో సత్యమై నిలిచేదే. ఈ విషయాన్నే పూర్వకవి వాక్కు కూడా ధ్రువపరుస్తున్నది. ‘‘న తథా శశీ సలిలం న చందనరసో న శీతలచ్ఛాయా ప్రహ్లాదయతి చ పురుషం యథా మధురభాషిణీ వాణీ॥ మాటలకుండే అపారశక్తిని, మాటలకుండే వైభవాన్ని భవభూతి మహాకవి ఉత్తరరామచరిత నాటకంలోని ఈ శ్లోకంలో తెలిపాడు. ‘‘మ్లానస్య జీవ కుసుమస్య వికాసకాని సంతర్పణాని సకలేంద్రియ మోహనాని ఏతాని తే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మానసశ్చ రసాయనాని॥ రామచంద్రుడు సీతమ్మతో నీ మాటలు నాకు కర్ణామృతాలు. మనస్సుకు ప్రీతి కలిగించు రసాయనాలు. నీ మాటలే వాడిపోయిన నా జీవకుసుమాన్ని వికసింపజేస్తాయి. సంతోషాన్ని, సంతృప్తిని కలుగజేస్తాయి. నీ పలుకులు నా సకలేంద్రియాలను సమ్మోహింపజేస్తూ నా హృదయాన్నాకర్షిస్తాయి అని పేర్కొన్నాడు. అందరికి ఆమోదకరమైన, శ్రేయస్కరమైన పలుకులను పలకాలి అనే భావనతో మహనీయులు తక్కువగా మాట్లాడతారన్న భావాన్ని ఆవిష్కరించే ‘‘మహీయాంసః ప్రకృత్యా మితభాషిణః’’ అనే మాఘకవి సూక్తిసారాన్ని మనం ఆచరణలో నిలుపుకోవాలి. మనం సందర్భానికి తగినట్లుగా మాట్లాడాలి. ఇతరుల మనస్సును మాటల తూటాలతో గాయపరచవద్దు. అందుకే మన పెద్దలు ప్రియమైన మాటనే పలుకాలని, ప్రియవాక్యం వల్ల అందరూ సంతృప్తి చెందుతారని పేర్కొన్నారు - సముద్రాల శఠగోపాచార్యులు