
ఇచ్చి పుచ్చుకునేది గౌరవం
ఆహారాన్ని సమకూర్చుకోవడం, యోగ్య మైన నివాసాన్ని ఏర్పరుచుకోవడం అన్ని ప్రాణులు చేసే పనే. అయితే వివేకం వల్ల, విజ్ఞానం వల్ల మానవుడు ఇతర ప్రాణుల కంటె విశిష్టుడయ్యాడు. సకల ప్రాణులలో విశిష్టులైన, విజ్ఞానవంతులైన మానవులు అందరూ ముందుగా కోరుకునేది గౌరవాన్నే. ప్రతివ్యక్తిగౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని భావిస్తాడు. ఇంటా బయటా అదే కోరుకుంటాడు. గొప్ప పదవి కలవాడైనా, కోటీశ్వరుడైనా గౌరవం లేకపోతే ఏ ఒక్క క్షణం మనశ్శాంతితో జీవించలేడు.
సమాజంలో గౌరవం కోల్పోయినవారు, అప్రతిష్ఠపాలు అవుతామనే సందేహం కలవారు, అకారణంగా అభియోగాలను మోస్తున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒక్కసారి గౌరవం పొందినవాడికి చెడ్డ పేరు రావడం, పరువు పోవడం వంటివి మరణం కంటెను ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తాయి అని గీతాచార్యులైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ‘సంభావితస్య చాకీర్తిః మరణాదతి రిచ్యతే’ అని ఉద్బోధించారు.
ఈ భావాన్నే భర్తృహరి మహాకవి కూడా ‘‘అపయశో యద్వస్తి కిం మృత్యునా’’ అనే శ్లోకపాదంలో వివరించారు.
మానవ జీవితంలో ఇంతటి ప్రముఖమైన గౌరవాన్ని పొందే మార్గాన్ని ఆవిష్కరిస్తోంది ఈ క్రింది శ్లోకం: వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ
వకారైః పంచభిర్లుప్తో నాప్నోతి గౌరవమ్॥
వస్త్రం, వపువు (శరీరం), వాక్కు, విద్య, వినయములు అనే ఈ అయిదు ‘వ’కారాలు లేకపోతే ఏ మనిషీ గౌరవాన్ని పొందడు అని పై శ్లోకానికి అర్థం. పరిశుభ్రమైన, ఆకర్షణీయమైన వస్త్రాల ద్వారా, శారీరక పుష్టి, సౌందర్యాదుల వలన, మృదుమధురమైన ప్రియ హిత వాక్కుల ద్వారా, తనకు, తోటివారికి ఇహపర సాధకంగా నిలిచే విద్యను అభ్యసించడం వల్ల, వినయ స్వభావం కలిగి ఉండడం వల్ల ఏ మనిషైనా గౌరవాన్ని పొందగలడని పై శ్లోకం వ్యక్తపరుస్తోంది.
ఒక్కరిలోనే సముచిత వస్త్రధారణ, ఆకర్షణీయమైన దేహపుష్టి, వాక్చాతుర్యం, విద్య, వినయం అను ఐదూ ఉండకపోయినా వీటిలో ఏ ఒక్కటో ఉంటే కొంతవరకైనా గౌరవపాత్రుడవు తాడు. కానీ అయిదింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సమాజంలో నిరాదరణకు గురవ్వడమే కాకుండా, నామమాత్రంగా మిగిలిపోతాడు.
ప్రతి వ్యక్తీ తాను ఇతరులచేత గౌరవం పొందాలని కోరుకున్నట్లే తాను కూడా ఇతరులను గౌరవించాలి. అందుకే మన పూర్వులు ‘‘పెద్దలను గౌరవింపుము, చిన్నలను ప్రేమింపుము’’ అని చెప్పా రు. ఈ భావనే కార్యరూపం దాలిస్తే సమాజంలో కలతలు, కలహాలు తొలగి, నేరప్రవృత్తి తగ్గిపోతుం దనడంలో సందేహం లేదు.
- సముద్రాల శఠగోపాచార్యులు