ఈత లాంటిదే రాత కూడా!
రచనాప్రక్రియ
సాహిత్యం గురించిన విమర్శలు చదవటం వల్ల రచయితలకు ప్రయోజనం వుండదంటుంది అమెరికన్ రచయిత్రి యుడోరా వెల్టీ(1909-2001). The Optimist's Daughter నవలకుగానూ పులిట్జర్ పురస్కారం పొందిన వెల్టీ కేవలం రాయడం ద్వారానే రాయడం నేర్చుకోవచ్చంటుంది:
‘రచనా ప్రక్రియనుగాక, అచ్చయిన రచన ఎలా వుందో విశ్లేషిస్తాయవి. నా కథల్ని గురించి రాసింది చదివి ఆశ్చర్యమేసింది. అన్ని విషయాలు నేనెప్పుడూ ఆలోచించలేదు. వాళ్లు నా రచనల్ని ముక్కలు చేసి మాట్లాడుతుంటే, ‘‘అయ్యో, బోసి నవ్వుల పాపాయి లాంటి కథను డిసెక్ట్ చెయ్యటానికి వీళ్లకు మనసెలా వచ్చింది?’’ అంటూ గిలగిలలాడాను. వాళ్లు రాసింది నూటికి నూరుపాళ్లు నిజమే కావచ్చు కాని రచనాప్రక్రియకూ దానికీ ఏమాత్రం సంబంధం లేదు. విమర్శ అంటే కథను దుర్భిణీకి అటువైపు నుండి చూడటం. రచనా క్రమం ఏకదిశలో ఎపుడూ ముందుకే సాగుతుంది. కథను ఆనందించే క్షణంలో మాత్రమే మనం రచయితతో మమేకం కాగలం.
మనుషులకున్నట్టే కథలకూ వ్యక్తిత్వం వుంటుంది. అందువల్ల ఏ రెండు కథలకూ పూర్తి సారూప్యం వుండదు. కథను పోలిన కథ వుంటుంది, అది వేరే విషయం. కథల్ని అర్థం చేసుకోవడమంటే మనుషుల్ని అర్థం చేసుకోవడమే.
మీకు నచ్చిన కథల్ని, నవలల్ని చదవండి. రాయాలనే కోరిక వున్నవాళ్లకు వాటివల్ల లోపల కదలిక వస్తుంది. క్రమంగా అది కూడా రచనకు సహాయం చెయ్యవచ్చు.
సహజంగా చెయ్యటమే నిజమైన నేర్పు. ఈత నేర్చుకున్నట్టే యిది కూడా. ట్రెయినింగ్, టెక్నిక్కుల సంగతి దేవుడెరుగు! నీళ్లలో పడినప్పుడు మొదట మునగకుండా వుండడానికి ప్రయత్నిస్తాం. అందరికీ వర్తించే నియమం ఒక్కటే. రచయిత కావాలనుకున్నవాడికి రాయడం తప్ప గత్యంతరం లేదు.’
ముక్తవరం పార్థసారథి; 9177618708