Muktavaram Parthasarathy
-
క్రిస్మస్ కానుక
క్లాసిక్ కథ మనిషంటే ప్రకృతికి కోపమేమో, శీతాకాలం తన వెంట శిశిరాన్ని కూడా తీసుకుని మరీ వచ్చింది మమ్మల్ని వణికించటానికి... మంచు వర్షం, నల్లటి మబ్బులతో చీకటిగా మారిన పట్టపగలు. కిటికీకి ఎక్కడన్నా రంధ్రముంటే రివ్వుమంటూ లోపలికి దూసుకువచ్చే గాలి, ఇళ్ల కప్పులు ఎగిరిపోతాయేమో నన్నంత బలంగా వీచిన తుఫాను. పైపు గొట్టాల్లో నిరంతరంగా వినిపించే రొద. ఎక్కడి వాళ్లను అక్కడ కట్టిపడేసే చెప్పలేని బాధ. ప్రళయం ఇంతకన్న భయంకరంగా ఉంటుందేమో తెలియదు. 1882. తెల్లారితే క్రిస్మస్. అప్పటికి నాకింకా శిక్ష పడలేదు. వస్తువులు తాకట్టు పెట్టుకునే టుపాయెవ్ వద్ద నౌకరీ. తాకట్టుకు వచ్చే వస్తువుల వెల కట్టి దేనికెంత ఇవ్వాలో చెప్పటం నా పని. నడిరాత్రి వస్తువులకు కాపలా ఉండమని పురమాయించాడు యజమాని. ఊదారంగు మంటతో వెలుగుతోంది కొవ్వొత్తి. విశాలమైన గది నిండా కుప్పలు తెప్పలుగా వస్తువులు... ట్రంకు పెట్టెల్లో, షెల్ఫుల నిండా. కుందేలు వెంట్రుకలతో తయారుచేసిన కోట్లు. మగాళ్ల లాంగ్ కోట్లు, రైఫిళ్లు, చిత్రపటాలు, అలంకరణ వస్తువులు, పెచ్చులూడిన గోడకు వేలాడుతున్న గిటారు. వీటికి నేను నిఘా. నగల షో కేసును చూస్తూ ఎర్ర ట్రంకుపెట్టె మీద పడుకున్నాను. కొవ్వొత్తి మీదే ఉంది నా దృష్టి. ఎందుకో భయమేసింది. ప్రేతాల్లాంటి తాకట్టు వస్తువులు... రాత్రివేళ వాటికి ప్రాణం వచ్చి మసక వెలుగులో స్వైర విహారం చేస్తున్నట్టుగా, కిటికీ తలుపుల మీద చినుకుల చప్పుడు, రోదిస్తున్న గాలి. సమోవార్ (రష్యన్ స్టవ్) లోంచి, చూరులోంచి దాడి చేస్తున్న చలి. వస్తువులు ఎలుగెత్తి ఏడుస్తున్నాయి. అన్నీ నేను విలువ గట్టినవే. ఒక్కొక్క దాని చరిత్ర నాకు తెలుసు. ఆ గిటారు డబ్బుల్తో రోగికి మందులు కొన్నారు. ఈ రైఫిల్‌తో ఒక తాగుబోతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య పోలీసుల కంటపడకుండా దాన్ని దాచిపెట్టింది. తరువాత ఇక్కడ తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బుల్తో శవపేటిక చేయించింది. ఈ బ్రేస్లెట్ ఎవరిదో, దొంగిలించినవాడు మాకమ్మాడు. ‘178’ నంబరున్న రెండు డ్రెస్సులు ఓ పిల్ల అత్యవసర స్థితిలో ఇక్కడికి తెచ్చింది. ఒక్కొక్క వస్తువు వెనకా ఒక విషాద గాథ, రోగాలు, రొష్టులు, పూటకు గతిలేని రోజులు. పోలీసులు నమోదు చెయ్యని నేరాలు. క్రిస్మస్ వాతావరణంలో ఇవన్నీ తమ కథలు చెప్పుకుంటున్నాయి. ‘పండగ పూట కొట్టులో ఎందుకు, ఇళ్లకు పోదాం’ అంటున్నాయి. అయితే నన్ను భయ పెట్టింది ప్రాణం లేని వస్తువులు మాత్రమే కాదు. అట్టలు అట్టలుగా పేరుకుపోయిన గాజు కిటికీల గుండా ఆశగా లోపలికి చూస్తున్న మొహాలు కూడా. ‘నాన్సెన్స్’ అంటూ తల విదిలించాను. అంతా నా భ్రమ. అసలు విషయమేమిటంటే వస్తువులకు వెలకట్టే నాలాంటి వాడికి, క్రిస్మస్ వచ్చిందంటే పీకుతుంటుంది. అంతరాత్మ ఘోషిస్తుంది. నిష్కృతిలేని పాపం, తాకట్టు కొట్టులో పని చేయటం! అంతరాత్మను తాకట్టు పెట్టుకునే చోటు కూడా ఇదే. బోర్డు రాసి పెట్టుకోవచ్చు. ‘అంతరాత్మలు అమ్మబడును, కొనబడును’. అది నిరాకారమైంది కాదిక్కడ. ఒక వస్తువు రూపంలో ఉంటుంది. దానికున్న మిగతా లక్షణాలతో మాకు సంబంధం లేదు. ఇంతకూ నాకు అంతరాత్మ ఉందనే భ్రమ ఎందుకు కలిగింది? ఇలాంటి ఆలోచనల చిక్కుముడి నా గొంతుకెందుకు బిగుసుకుంటోంది? విదిలించుకోవటానికి ప్రయత్నించాను. బహుశా ఇది రోజంతా పనిచేసి అలసి నిద్రపోవడం వల్ల కలిగిన మనో విభ్రమం. క్రిస్మస్ వచ్చిందంటే చాలు పేదవాళ్లు మాకొట్టు ముందర బారులు తీరి నిలబడతారు. ఇలాంటి చలిలో పేదరికం కేవలం దురదృష్టం మాత్రమే కాదు... ప్రత్యక్ష నరకాన్ని అనుభవంలోకి తెస్తుంది. కనీసం పండగ నాడన్నా కాస్త సంతోషంగా గడపాలంటే మునుగుతున్న వాడికి గడ్డిపోచలా కనిపిస్తుంది తాకట్టుకొట్టు. కానీ నిజానికది బండరాయిలా మెడకు తగులుకుంటుంది. గుంపులు గుంపులుగా వచ్చారు జనం. వస్తువులతో గదంతా నిండి పోయింది. కొన్ని వెనకాల వరండాలో పెట్టాం. తెల్లారి నుండి అర్ధరాత్రి దాకా క్షణం విరామం లేదు. ఎందుకంటే అది ఇవ్వటం ఎంతిస్తే అంత పట్టుకుపోవడం. వాళ్లను పీల్చి పిప్పి చెయ్యటానికి ఇంతకన్నా మంచి రోజు మరొకటుండదు. తాకట్టు పెట్టటానికే వచ్చారు. కానీ, వాళ్ల పరిస్థితి ముష్ఠి వాళ్లకన్నా అధ్వాన్నం. పనితో ఎంత అలసిపోయానంటే నిద్ర కూడా రావటం లేదు. ఎవరో తలుపు తట్టారు. యజమాని గొంతు వినిపించింది. ‘‘నిద్రపోతున్నావా?’’ ‘‘లేదు... ఏం కావాలి?’’ ‘‘రేపు కాస్త పెందలాడే తెరవాలి కొట్టు. తేనె మీద ఈగల్లా వచ్చి వాలతారు జనం. చర్చికి తరువాత వెళ్లొచ్చు. కౌంటర్ దగ్గర కూర్చో. గుడ్‌నైట్.’’ కొవ్వొత్తి మంట వణుకుతోంది. భయంగా ఉంది. ఆర్పేసి పడుకోవాలి. దీపం దగ్గరగా వెళ్లాను. మసక వెలుతురు. గాజు తలుపుల్లోంచి రెండు మొహాలు నా వేపే చూస్తున్నాయి. ‘‘ఎవరూ లేరు. అంతా నా ఊహ’’ అని ధైర్యం చెప్పుకున్నాను. దీపం ఆర్పి తిరిగి వస్తుంటే అనుకోనిదొకటి జరిగింది. నా గొంతుకతో మరెవరో అరుస్తున్నారు. ఎక్కడో ఏదో విరిగిన, పగిలిన శబ్దం. గిటారు తీగ తెగింది. భరించలేని బాధ. బిగ్గరగా అరిచాను. ఒళ్లంతా చెమట పట్టింది. కళ్లు మూసుకుని పరిగెత్తాను. ఎదురుగా ఫర్నిచర్ డబ్బాలు. ఊపిరి బిగపట్టి, బిక్కచచ్చి వింత గొంతుకల నాలకించాను. ‘పద’ అంటూ తొందర పెట్టింది ఈదురు గాలి. ‘‘ఇది క్రిస్మస్ పర్వదినం. నువ్వూ పేదవాడివే. గడ్డ కట్టే చలిలో, ఆకలితో నకనకలాడే పేదవాళ్ల కష్టాలేమిటో నీకూ తెలుసు. ఈ వస్తువులన్నీ వాళ్లవే గదా?’’ అవును. నేను కూడా నిరుపేదనే. ఇక్కట్లు నాకు కొత్త కాదు. చలికి గజగజ వణికిన రోజులింకా జ్ఞాపకమే. దుర్భర దారిద్య్రమే నేనీ వడ్డీ వ్యాపారి వద్ద పనిచెయ్యక తప్పని పరిస్థితి కల్పించింది. రోజూ నాలాంటి ఇతర్లను పీల్చి పిప్పి చేస్తే తప్ప నా కడుపు నిండదు మరి. ఆకలిని తట్టుకోగలిగిన సత్తా నాకుంటే ఎదుటి మనుషుల జీవితాల్ని, ఆప్యాయతల్ని, అవసరాల్ని అణా పైసల్తో లెక్కగట్టగలిగేవాడినా? మరి, ఈ గాలికి నా మీదెందుకు కోపం? అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోందా? ఒకవైపు బాధ, పశ్చాత్తాపం, నామీద నాకు కోపం. మరోవైపు అలసట. నిద్ర ముంచుకొచ్చింది. మళ్లీ యజమాని తలుపు తట్టిన చప్పుడు. అర్ధరాత్రి చర్చి గంటలతో క్రిస్మస్కు స్వాగతం. ఇంటి కప్పు మీద వాన చప్పుడు. సుడిగాలి రొద. గది నిండా షోకేసుల్లో, వస్తువులు. కిటికీ తలుపునకు యేసు ప్రభువు బొమ్మ. తాకట్టుకు వచ్చిన వస్తువులన్నీ తమ తమ ఇళ్లకు వెళ్లనివ్వమని అర్థిస్తున్నాయి. గిటారు తీగలు క్రమం తప్పక తెగిపోతున్నాయి. ముష్టివాళ్లు, వృద్ధ స్త్రీలు ముడతలు పడిన మొహాలతో కిటికీలోంచి నన్నే చూస్తున్నారు. తలుపులు తీసి తమ వస్తువులు వాపసు చెయ్యమంటున్నారు. కలలో ఎలుకలు కిచకిచ మంటున్నట్టుగా వినిపించింది. తలుపును కొరుకుతున్నది. చలికి బ్లాంకెట్ కప్పుకుని లేచాను. అర్థం కావటం లేదు గానీ, ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పీడకలలాగ ఉంది. మెలకువ వచ్చినా బాగుండును. గాజు పగిలింది. షోకేస్ మీద లైట్ పడింది. ‘‘మాట్లాడొద్దు, నిశ్శబ్దం, యముడు లేస్తాడు, బూట్లు కూడా విప్పి నడువు.’’ షోకేస్ వద్దకు వచ్చి తాళం లాగి చూశాడు. మొహం పాలిపోయి ఉంది. గడ్డం పెరిగింది. చిరిగిన కోటూ, రంధ్రాలు పడ్డ బూట్లూ, పొడుగ్గా ఉన్న మరొకడు వాడి వెనకే వచ్చాడు. ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. ‘‘దొంగలు’’ అనుకున్నాను. నిద్రలో ఉన్నాను. అయినా జ్ఞాపకం వచ్చింది. నా దిండు కింద ఎప్పుడూ ఒక పిస్తోలుంటుంది. ‘‘వాడు లేస్తాడు జాగ్రత్త’’ అనుకుంటున్నారు వాళ్లు. ‘‘హ్యాండ్సప్’’ అంటూ అరిచాను. భయంతో గోడకంటుకు పోయారిద్దరూ. కన్నీళ్ల పర్యంతమై, వదిలెయ్యమని ప్రాధేయపడ్డారు. పగిలిన కిటికీ అద్దం గుండా వచ్చిన శీతగాలికి చేతులు వణుకుతున్నాయి. దొంగలు వెలిగించిన కొవ్వొత్తి దీనంగా వెలుగుతోంది. ‘‘నువ్వే దిక్కు రక్షించు’’ అంటూ కాళ్ల మీద పడ్డారు. కిటికీలో, వర్షంలో తడిసిన ముసిల్దాని మొహం. ‘‘వాళ్లనేం చెయ్యక వదిలెయ్. దరిద్రం మమ్మల్ని శాసిస్తోంది’’ అని అంది. ‘‘అవును... దరిద్రం’’ అన్నాడు ముసలాడు. ‘‘దరిద్రమే... దరిద్రమే’’ వంత పాడింది ఈదురుగాలి. గుండెలో బాకులు దించే దరిద్రం. నిద్రా? నిద్రలో కలా? లేచి, షోకేస్లోంచి నగలు తీసి దొంగల జేబుల్లో కుక్కాను. ‘‘తీసికెళ్లండి. రేపు క్రిస్మస్. సరదాగా గడపండి.’’ మిగతా నగలు మూటగట్టి ముసల్దానికిచ్చాను. ఫర్ కోట్, మరో బ్లాక్ సూట్, లేసులల్లిన డ్రెస్సులు, గిటారు. అన్నీ అందరికీ. ఇలాంటి వింత కలలు కూడా వస్తాయి మరి. ఆ తరువాత తలుపు తెరుచుకుంది. పోలీసువాళ్లను వెంటపెట్టుకుని యజమాని ప్రవేశించాడు. ఇంత అకస్మాత్తుగా వీళ్లు ఎక్కణ్నుంచి ఊడిపడ్డారు? యజమాని చూస్తుండగానే వస్తువులు అందరికీ పంచిపెట్టాను. ‘‘దుర్మార్గుడా... ఏం చేస్తున్నావురా?’’ ‘‘రేపు క్రిస్మస్. అందరూ ఆనందంగా గడపాలి.’’ ఈ అంకానికి ఇక్కడితో ముగింపు. కొత్త అంకం ప్రారంభం. ఇప్పుడు నేను కొట్టులో లేను. సంకెళ్లతో నడుస్తున్నాను. వెంట పోలీసులు. ‘‘ఎందుకిలా చేశావు?’’ మెలకువ వచ్చేసరికి తెల్లవారింది. వర్షం ఆగింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వెచ్చగా నీరెండ. పోలీసులే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. నెల తర్వాత విచారణ ప్రారంభమైంది. ‘‘జరిగిందంతా కల’’ అని చెప్పాను జడ్జిగారికి. కలలో చేసిన పనులకు శిక్షలు వెయ్యటం అన్యాయం. వాళ్లకు చెందని వస్తువులు దొంగకెందుకిస్తానసలు? పైగా, డబ్బులు తీసుకోక ఎందుకు దానం చేస్తాను? కానీ నాకు వచ్చిన కల వాస్తవమని ధ్రువీకరించింది న్యాయ స్థానం. శిక్ష కూడా వేసింది. నా తరఫున వాదిస్తారా మీరు? అయాం నాట్ గిల్టీ. అనువాదం: ముక్తవరం పార్థసారథి చెహోవ్ : మూల రచయిత -
ఒక్క బైబిల్... వంద రచనలకు స్ఫూర్తి!
వరల్డ్ లిటరేచర్ బైబిల్ కథలు, జీసస్ జీవితం, బోధనల ఆధారంగా క్రైస్తవమతం తొలినాళ్లనుండే పశ్చిమ దేశాలలో కథలూ కావ్యాలూ రాస్తూ ఉన్నారు. ఈ రచయితల్లో కొందరిది మతదృష్టి అయితే మరి కొందరిది సామాజిక స్ఫూర్తి. తల్లిదండ్రుల్ని ఆదరించాలి, హత్య చెయ్యకూడదు, వ్యభిచారమూ దొంగతనమూ నిషిద్ధం, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, పరస్త్రీనీ పరుల ఆస్తినీ కాంక్షించకూడదు అని ఆ దేవుడే స్వయంగా శాసించినా, నిజ జీవితంలో, నిత్యజీవితంలో జనం వాటిని ఏనాడూ తు.చ. తప్పకుండా ఆచరించలేదు. ఇలా చెయ్యడం పాపమని తెలిసినా, చట్టవ్యతిరేకమని భయపెట్టినా, దుష్టబుద్ధులకు ఇవేమీ అడ్డురాలేదు. సమాజ కల్యాణాన్ని కోరిన రచయితలు ఈ సమస్యలకే స్పందించారు. తమ కావ్యాలలో నిరసన తెలిపారు. ఉదాహరణకు, ఇటాలియన్ మహాకవి దాంతె అలిహెయిర్ (1265-1325) రాసిన డివైన్ కామెడీ, సమకాలీన అధి కారాల వర్గాల అవినీతిని ఎండగట్టడానికి సంధించిన వజ్రాయుధం. సెవెన్ డెడ్లీ సిన్స్ గురించీ, ఈ పాపాలు చేసిన ఆ నాటి ప్రముఖుల గురించీ ఇందులో ప్రస్తా విస్తాడు దాంతె. నరకం, పాపప్రక్షాళన జరిగే లోకం, స్వర్గం అనబడే మూడు లోకాలలో కవి ప్రయాణిస్తాడు. పాపులు నరకంలో అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తాడు. జీవితకాలంలో వీళ్లందరూ అష్టయిశ్వర్యా లనూ అనుభవించినవాళ్లే. ఇప్పుడేమయింది వీళ్ల పరిస్థితి అని అన్యాపదేశంగా ప్రశ్నిస్తాడు. అలాగే మరో మూడు వందల ఏళ్ల తర్వాత, ఇంగ్లిష్ కవి జాన్ మిల్టన్ (1608-1674) ప్యారడైజ్ లాస్ట్ రాశాడు. ఈడెన్ ఉద్యానవనంలో ఆడమ్, ఈవ్లు నిషేధింపబడిన ఆపిల్ తిని, తమ అమరత్వాన్ని కోల్పోయిన వైనాన్ని చిత్రిస్తుందిది. భగవదాజ్ఞను ఉల్లంఘించకూడదంటాడు కవి. మిల్టన్ సమకాలీనుడే జాన్ బర్డన్ (1628-1682). మత విశ్వాసమే మనిషికి సంస్కృతి అంటాడు. 1678లో తొలిసారి అచ్చయిన ‘ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్’ అనే ఈయన పుస్తకం కేవలం క్రైస్తవ ప్రచార గ్రంథంగానే గాక, సత్ప్రవర్తన, సచ్ఛీలత ఎంత ముఖ్యమో వివరిస్తుంది. భాష కూడా సరళంగా ఉండడంతో ఇంగ్లిష్ భాషలోనే అత్యంత ప్రాచుర్యం చెందిన పుస్తకంగా కూడా పేరు గాంచింది. ఇప్పటి దాకా ఇది ఎప్పుడూ ఔటాఫ్ ప్రింట్లో లేదట. 200 భాషల్లోకి అనువాదమైన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ గాంధీజీని బాగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. ఈ క్లాసిక్స్ మాత్రమేగాక బైబిల్‌తో ప్రేరణ పొంది లేదా దాన్ని వ్యాఖ్యానిస్తూ (కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తూ కూడా) అనేకమంది నవలలు ప్రచురించారు. ఈ శతాబ్దపు తొలి రోజుల్లో హెవెన్, ఈడెన్, ఫ్లడ్‌ల గురించి మార్క్ ట్వెయిన్ రాసిన హాస్య, వ్యంగ్య వ్యాసాలన్నీ కలిపి ‘ద బైబిల్ ఎకార్డింగ్ టు మార్క్ ట్వెయిన్’ పేరుతో వచ్చిన ప్పుడు అది పెద్ద సంచలనం సృష్టించింది. డి.హెచ్.లారె న్స్ (ద మ్యాన్ హూ డైడ్); జాన్ శరమాగో(కాయిన్; ద గాస్పెల్ ఎకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్) నార్మల్ మైలర్ (ద గాస్పెల్ ఎకార్డింగ్ టు ద సన్)లు తమ రచనలతో దుమారం లేపారు. ఇంకా పలు పాపులర్ నవలలు, బెస్ట్ సెల్లర్స్ కూడా బైబిల్ ప్రేరణతోనే వెలువడ్డాయి. ఉదాహరణకు హ్యారీపాటర్ చివరి పుస్తకంలో, కథానాయకుడు లోకకల్యాణం కోసం ఆత్మత్యాగం చేసి పునరుత్థానం పొందుతాడు. జోషస్టర్ సృష్టించిన సూపర్ మ్యాన్ ఏకైక లక్ష్యం దుష్టశిక్షణ- శిష్టరక్షణ. డాన్ బ్రాన్ రాసిన డావిన్సీ కోడ్‌కు మూలాలు బైబిల్లో ఉన్నాయని ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. మతగ్రంథాలు ఇష్టపడని వాళ్లకోసం, బైబిల్‌ను బుక్ ఆఫ్ గాడ్ (1996)పేరుతో వాల్టర్ వాంగెరిన్ ఒక నవలగా కూడా ప్రచురించాడు. ప్రస్తుతానికి ఇదో బెస్ట్ సెల్లర్. - ముక్తవరం పార్థసారథి -
ఈత లాంటిదే రాత కూడా!
రచనాప్రక్రియ సాహిత్యం గురించిన విమర్శలు చదవటం వల్ల రచయితలకు ప్రయోజనం వుండదంటుంది అమెరికన్ రచయిత్రి యుడోరా వెల్టీ(1909-2001). The Optimist's Daughter నవలకుగానూ పులిట్జర్ పురస్కారం పొందిన వెల్టీ కేవలం రాయడం ద్వారానే రాయడం నేర్చుకోవచ్చంటుంది: ‘రచనా ప్రక్రియనుగాక, అచ్చయిన రచన ఎలా వుందో విశ్లేషిస్తాయవి. నా కథల్ని గురించి రాసింది చదివి ఆశ్చర్యమేసింది. అన్ని విషయాలు నేనెప్పుడూ ఆలోచించలేదు. వాళ్లు నా రచనల్ని ముక్కలు చేసి మాట్లాడుతుంటే, ‘‘అయ్యో, బోసి నవ్వుల పాపాయి లాంటి కథను డిసెక్ట్ చెయ్యటానికి వీళ్లకు మనసెలా వచ్చింది?’’ అంటూ గిలగిలలాడాను. వాళ్లు రాసింది నూటికి నూరుపాళ్లు నిజమే కావచ్చు కాని రచనాప్రక్రియకూ దానికీ ఏమాత్రం సంబంధం లేదు. విమర్శ అంటే కథను దుర్భిణీకి అటువైపు నుండి చూడటం. రచనా క్రమం ఏకదిశలో ఎపుడూ ముందుకే సాగుతుంది. కథను ఆనందించే క్షణంలో మాత్రమే మనం రచయితతో మమేకం కాగలం. మనుషులకున్నట్టే కథలకూ వ్యక్తిత్వం వుంటుంది. అందువల్ల ఏ రెండు కథలకూ పూర్తి సారూప్యం వుండదు. కథను పోలిన కథ వుంటుంది, అది వేరే విషయం. కథల్ని అర్థం చేసుకోవడమంటే మనుషుల్ని అర్థం చేసుకోవడమే. మీకు నచ్చిన కథల్ని, నవలల్ని చదవండి. రాయాలనే కోరిక వున్నవాళ్లకు వాటివల్ల లోపల కదలిక వస్తుంది. క్రమంగా అది కూడా రచనకు సహాయం చెయ్యవచ్చు. సహజంగా చెయ్యటమే నిజమైన నేర్పు. ఈత నేర్చుకున్నట్టే యిది కూడా. ట్రెయినింగ్, టెక్నిక్కుల సంగతి దేవుడెరుగు! నీళ్లలో పడినప్పుడు మొదట మునగకుండా వుండడానికి ప్రయత్నిస్తాం. అందరికీ వర్తించే నియమం ఒక్కటే. రచయిత కావాలనుకున్నవాడికి రాయడం తప్ప గత్యంతరం లేదు.’ ముక్తవరం పార్థసారథి; 9177618708 -
ఆంట్వన్ బ్లోయి
Antoine Bloye ఒక ఫ్రెంచి నవల. 1933లో అచ్చయింది. రచయిత పాల్ నైజాన్ (1905-40). ఇతడు జా పాల్ సార్త్‌క్రు సహాధ్యాయి. డన్కిర్క్ వద్ద జరిగిన యుద్ధంలో మరణించాడు. 1973లో మంత్లీ రివ్యూ ప్రెస్ వాళ్లు పునర్ముద్రించిన ఈ నవలను ఒక ఫర్గాటెన్ మాస్టర్‌పీస్ అంటారు మార్క్సిస్టు సాహిత్యకారులు. ఇది రాసినప్పుడు నైజాన్ ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడేగానీ నవలలో ఎక్కడా ప్రచారార్భాటమూ సైద్ధాంతిక చర్చా ఉండదు. ముక్కుకు మూదాడేసి (కనీసం నాకు) చదివించే కథనం పాఠకుడిని సుడిగుండంలా తనలోకి లాక్కుంటుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో కార్మికులు పరాయీకరణ చెందుతారన్నాడు మార్క్స్. సాధారణ రైల్వే ఉద్యోగి ఆంట్వన్ బ్లోయి తన తోటివారి నుండి క్రమంగా పరాయీకరణ చెందిన క్రమాన్ని అద్భుతంగా చిత్రించాడు పాల్ నైజాన్. తనలో మార్పు వచ్చిన విషయాన్ని కథానాయకుడు గుర్తించను కూడా లేడు. కానీ జీవితం నిస్సారమైందని తెలుస్తుందొకనాడు. మనుషుల్ని ప్రేమించే శక్తి తగ్గిపోతుంది. గుజ్జు తీసిన పండులాగవుతుంది బతుకు. ఎందుకు ఉద్యోగంలో కొనసాగుతున్నాడో తెలియదు. కానీ ఇష్టంలేని ఉద్యోగం చెయ్యకుండా ఉండలేడు.నవలలో భాష గణితమంత కచ్చితంగా ఉంటుంది. ‘‘రోజు తర్వాత రోజు, రాత్రి తర్వాత రాత్రి తన జీవితం కొనసాగించాడు ఆంట్వన్. రసం తీసిన పిప్పిగా మారతాడు. కానీ అందులో ఒక సుఖమున్నది. సాంత్వననూ అనుభవించాడు. అందువల్ల ఎప్పుడూ ప్రతిఘటించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ‘‘ఇల్లున్నది. చక్కటి లావుపాటి భార్యున్నది. పిల్లలు ఎదిగారు. త్వరలో వాళ్లూ ఓ ఇంటివాళ్లవుతారు. వృద్ధాప్యంలో జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది’’ అని తనను తాను నమ్మించుకుంటాడతను. కార్మికుడిగా ప్రారంభించిన బ్లోయి పెటీ బూర్జువాగా పరిణామం చెందుతాడు. మేనేజిమెంటుతో లాలూచీ పడతాడు. యజమాని కూతుర్ని పెళ్లి చేసుకొని తాను అధికారవర్గంలో చేరిపోయాననుకుంటాడు. ‘‘బ్లోయి మరెవరో కాదు. నువ్వే’’ అని పలుమార్లు పాఠకుడ్ని హెచ్చరిస్తాడు నైజాన్. రచయిత కొన్ని సార్లు అతడి గురించి వ్యంగ్యంగా రాసినా, జీవితానందాన్ని ఆవిరి చేసుకున్న బ్లోయిని చూస్తే మనకు విషాదనాయకుడే గుర్తుకువస్తాడు. నిస్సందేహంగా ఇది మార్క్సిస్టు నవలే. వ్యాఖ్యానించినప్పుడు మార్క్సిస్టు పరిభాష కూడా కనిపిస్తుంది. ‘‘తాత్వికత అంటే జీవితాన్ని యథాతథంగా అంగీకరించడం కాదు. దాన్ని మార్చే ప్రయత్నం చేయటమని బ్లోయి గ్రహించలేదు’’ అంటాడు నైజాన్.ఈ పుస్తకం నాకు దొరకడం కేవలం యాదృచ్ఛికం. కొన్నాళ్ల క్రితం దేశంకాని దేశంలో పుస్తకాల వేట కొనసాగిస్తున్నప్పుడు, పాత పుస్తకాల షాపులో ఓ మూలన నక్కివుంది. అప్పటికి నాకు రచయిత గురించిగానీ, పుస్తకం గురించిగానీ ఏమీ తెలియదు. మంత్లీ రివ్యూ ప్రెస్ వాళ్ల ప్రచురణ కావడం వల్ల హస్తభూషణంగా ఉంటుందనీ, చవకగా వచ్చిందనీ తీసుకున్నాను. కానీ చదవడం ప్రారంభించాక మధ్యలో ఆపలేకపోయాను. మన జీవితాల్ని మైక్రోస్కోపు కింద పెట్టి పరీక్షించాడీ రచయిత అనిపించింది.డాన్ కిహోటీ, మృతజీవులు, అన్నా కరేనినా, హకల్ బెరీఫిన్, సింగర్ కథలు వగైరా పుస్తకాలను ఎప్పుడైనా, ఎక్కడైనా చదవడానికి అనువుగా ఉంటాయని అందుబాటులో పెట్టుకుంటాను. ఇప్పుడు వాటి సరసన చేరింది ఆంట్వన్ బ్లోయి. ముక్తవరం పార్థసారథి -
హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్
తెలుసుకోదగ్గ పుస్తకం మేజిక్ రియలిజం అన్న మాటకు స్పష్టమైన నిర్వచనం లేదు. వాస్తవికమైన కథనంతో అద్భుత (మేజిక్) అంశాలను జోడించే ధోరణి ఇది. 1920లలో post expressionist German Art ను విమర్శిస్తూ Franz Roh తొలిసారిగా ఈ మాట వాడాడు. ఆ తర్వాత సాహిత్య విమర్శకు కూడా దీన్ని అన్వయించారు. నిజానికి లాటిన్ అమెరికన్ రచయితలు అనేకులు- క్విరోగా, కార్టజార్, కార్లోస్, ఓనెట్ట్, మురియో రుబియావో, బోర్హెస్ వగైరాలు నిత్యజీవితంలో అద్భుత వాస్తవికతనూ, అద్భుతాలే నిత్యజీవితంగానూ చిత్రించి అనేక కథలు, నవలలు రాశారు. అయితే 1967లో మార్కెస్ఈ Hundred Years of Solitude నవల తర్వాత మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దీని గురించి తెలిసింది. మేజిక్ రియలిజం అంటే యిలా ఉంటుంది అని అంటున్నారంటే లక్షణాలన్నీ ఈ నవలలో ఉండటమే కారణం. ఉదాహరణకు ఈ నవలలో ప్రధానంగా పాఠకులను ఆకట్టుకునే విషయాలు. 1.ఫాంటసీ మిళితమైన వాస్తవిక కథనం 2. సంఘటనల్నీ హేతుబద్ధమే అనే భ్రమ కలిగిస్తాయిగాని లాజిక్కు అతీతం. 3. ఇంద్రియ జ్ఞాన పరమైన వర్ణనలు ఎక్కువగా ఉంటాయి. 4. కథలో కాలం సరళరేఖలా సాగదు. వర్తులాకార కాలచిత్రణ వల్ల ఏది ప్రారంభమో ఏది ముగింపో తెలియదు. 5. కార్యకారణ సంబంధాలు తారుమారు కావటం ప్రత్యేకత 6.జానపద కతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 7.ఏకకాలంలో అనేక దృక్కోణాల నుండి కథ నడుస్తుంది. ఏది వాస్తవమో ఏది కల్పనో తెలియదు. అయితే ఇది అందరూ చదవగలిగినంత సరళమైన పుస్తకమేమీ కాదు. సంక్లిష్టత, శైలీ విన్యాసాలు పాఠకుల మేధస్సును ఏకాగ్రతను పరీక్షిస్తాయి. పైగా ఇది వందేళ్లు జరిగిన కథ. ‘మాకాండో’ అనబడే చిన్నపాటి నగరం గురించిన కథ అనిపిస్తుందిగాని అది లాటిన్ అమెరికన్ దేశాలన్నింటికీ ప్రతీక. ఓ మూలకు విసిరేసినట్టుగా ఉన్న దక్షిణ అమెరికా ఖండాన్ని సంపద కోసం ప్రకృతి వనరుల కోసం అమెరికా ఇతర యురోపియన్ దేశాలు నిర్దాక్షిణ్యంగా అమానుషంగా దోచుకున్న వైనాన్ని హృదయవిదారకంగా చిత్రిస్తుందీ నవల. కథనం ఎంత గజిబిజిగా ఉన్నా కథను ఒక క్రమంలో చెప్పుకుందాం. హోసె ఆర్కాడియో బుయెండియా, అతడి కజిన్ ఉర్సులా పెద్దలకిష్టం లేని పెళ్లి చేసుకుంటారు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లి అవాంఛనీయమంటుంది ఉర్సులా. పంది తోకలతో పిల్లలు పుడతారని ఆమె భయం. అందువల్ల పెళ్లి తర్వాత కాపురం చెయ్యటానికి నిరాకరిస్తుంది. ఒకనాడు బుయెండియో కోడిపందాల్లో గెలిచి, ఓడినవాడు అవమానించడంతో వాణ్ణి చంపి, ఆ కోపంలోనే ఇంటికి వచ్చి భార్యను బలవంతంగా లొంగదీసుకుంటాడు. మరోవైపు ఆ చచ్చినవాడు ప్రేతంలా మారి దంపతులను వెంటాడి చివరికి వాళ్లు కొత్త నగరం ‘మాకాండో’ను ఏర్పరుచుకున్న దాకా వదలడు. వీళ్లకిద్దరు కొడుకులు. పెద్దవాడు హోసె ఆర్కాడియో. చిన్నవాడు ఆరెలియానో. ఒకడు బలిష్టుడు. రెండోవాడు పుస్తకాల పురుగు. మేధావి. మాకాండోలోని ఒంటరి జీవితంతో విసుగెత్తిన ఆర్కాడియో సముద్రానికి దారి కనుగొనే ప్రయత్నంలో బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడతాయి. దాంతో ‘మాకాండో’ గురించి ప్రభుత్వానికి తెలిసి తన ప్రతినిధిని పంపుతుంది. పెద్ద కొడుకు ఒకమ్మాయితో సంబంధం పెట్టుకుని గర్భం చేస్తాడు. క్రమంగా కుటుంబం పెరుగుతుంది. ఒకసారి నగరంలో మహమ్మారి వ్యాపిస్తుంది. నిద్రలేమి, మతిమరుపు దాని ప్రధాన లక్షణాలు. ఈ సమయంలోనే గతంలో వేధించిన ప్రేతం ఆర్కాడియోను వెతుక్కుంటూ వస్తుంది. అతడు రాత్రంతా ప్రేతంతో గడిపి తెల్లవారేసరికి మతిభ్రమించి ఉన్మాదిగా మారతాడు. ఆ గోల భరించలేక అతణ్ణో చెట్టుకు కట్టేస్తారు. ఎవరికీ అర్థంకాని కొత్తభాష మాట్లాడతాడు ఆర్కాడియో. దూరదేశాలకు వెళ్లిన పెద్దకొడుకు తిరిగి వచ్చి రెబెకాతో ప్రేమలో పడి వెంటనే పెళ్లి చేసుకుంటాడు. చిన్నకొడుకు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ ప్రతినిధికి వ్యతిరేకంగా లిబరల్ రెబెల్స్‌తో జతగడతాడు. వరుస యుద్ధాలు చెలరేగుతాయి. ఫైరింగ్ స్క్వాడ్ ముందు మరణించేవాడేగాని తండ్రి అతణ్ణి రక్షిస్తాడు. ‘ఆధునికత... అభివృద్ధి’ ముసుగు కప్పుకొని వచ్చిన సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు మాకాండోలోని అరటితోటల్ని స్వాధీనం చేసుకుని స్థానిక రైతుల్ని కూలీలుగా బానిసలుగా మార్చివేస్తారు. రైతులు సమ్మె చేస్తారు. కొత్త యజమానుల పక్షం వహించిన ప్రభుత్వం వేలాది మంది రైతుల్ని ఊచకోత కోస్తుంది. కుళ్లిన వాసన భరించలేక ఆ శవాల్ని సముద్రంలోకి విసిరేస్తారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. మాకాండోకు వరదలు వస్తాయి. నగరంతో పాటే బుయెండియా కుటుంబ పతనం ప్రారంభమవుతుంది. దోపిడీ తర్వాత ప్రకృతి బీభత్సానికి నాశనమైన మాకాండో నిర్మానుష్యమవుతుంది. ఇప్పుడక్కడికెవరూ రారు. చివరకు మిగిలిన ఒక్క బుయెండియా ‘ఇదంతా ఇలా జరుగుతుందని ముందే జోస్యం చెప్పారు’ అంటాడు. కథలో మనకు కనిపించేవి వరుసయుద్ధాలు, వలసవాదుల దోపిడీ, కుట్రలు, స్థానికుల ప్రతిఘటనలు. శతాబ్దాల లాటిన్ అమెరికన్ దేశాల రక్తచరిత్రకు కథారూపం ఈ నవల- ఒన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్. - ముక్తవరం పార్థసారథి గేబో కొలంబియాలో పర్వతాలకూ కరీబియన్ సముద్రానికీ మధ్యనున్న అరకాటకాలో జన్మించాడు గేబ్రియల్ గార్సియా మార్కెస్ (గేబో). తండ్రి టెలిగ్రాఫ్ ఆపరేటర్. పేద సంసారం. పన్నెండు మంది పిల్లల్లో పెద్దవాడు గేబో. 1955లో తొలికథాసంకలనం ‘లీఫ్స్టార్మ్ అండ్ అదర్ స్టోరీస్’ ప్రచురించాడు. ఆ తర్వాత పారిస్‌లో అయిదేళ్లున్నా క్యూబన్ విప్లవం తర్వాత లాటిన్ అమెరికాకు తిరిగొచ్చి జర్నలిస్టుగా పని చేశాడు. లాటిన్ అమెరికన్ డిక్టేటర్ల గురించి రాసిన ‘లవ్ ఇన్ టైం ఆఫ్ కలరా’ ఈయన ముఖ్య నవల. పలు సినిమాలకు స్క్రిప్ట్ రచయితగా కూడా పని చేశాడు గేబో. ‘అయిడియాలు, ఇతివృత్తం ఆధారంగా నేను కథలు రాయలేదు. రచనకు స్పందన మనసులో ఏర్పడిన దృశ్యం నుండి వస్తుంది. అది క్రమంగా పెరిగి ఒక కాన్వాసులూ ఒక సినిమా రీలులా నా కళ్ల ముందు కదులుతుంది. అదే కథ’ అంటాడు గేబో. 1950లోనే ఒన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ రాయాలనుకున్నాడట. తన అమ్మమ్మ కథలు చెప్పడం విని నవలకు అదే టోన్ బాగుంటుదనుకున్నాడు. ‘ఆమె దెయ్యాలు భూతాల గురించి చెప్పినా అదంతా నిజమేనని నమ్మించేది’ అంటాడు. చివరకి 1965లో ఈనవలా రచన ప్రారంభించి పద్దెనిమిది నెలల అవిశ్రాంత కృషితో అప్పుల మీద అప్పులు చేసి రాతప్రతిని పబ్లిషర్‌కు పంపటానికి పోస్టేజి కూడా కొనలేని దశలో ముగించాడు. మొత్తం మీద అచ్చయిన వెంటనే చరిత్ర సృష్టించింది ఒన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్. నవలా రచనలో కొత్తశకం ప్రారంభమైంది అన్నారు. -
తెలుసుకోవాల్సిన పుస్తకం
డెడ్ సోల్స్ Voice of the voicelessV గా ఉండాలి రచయిత అన్నాడు నికొలాయ్ వాసిలీలిచ్ గొగోల్ (1809 - 1852). అంతేగాదు. ‘అధికార మదాంధుల్ని, నియంతల్ని, మన మీద సవారీ చేస్తున్న, మనల్ని దోపిడీ చేస్తున్న దుర్మార్గుల్ని ఎద్దేవా చెయ్యి’ అని తనను తాను నిరంతరం హెచ్చరించుకున్నాడు. అలాగ ఆనాడు రష్యాలో అమలులో ఉన్న అర్ధబానిస విధానం (సెర్ఫ్‌డమ్) లో రైతు కూలీల్ని భూస్వాములు వినియోగ వస్తువుల్లా కొనుక్కోవటాన్ని వ్యంగ్యంగా చిత్రించి పాఠకుల చేత కన్నీరు పెట్టించాడు గొగోల్. ఇందులో చిచికోవ్ అనబడేవాడు ప్రతి భూస్వామి దగ్గరకూ వెళ్లి అతడి వద్ద చచ్చిన కూలీల్ని కొనుక్కుని బ్యాంకులకు తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంటాడు. ఆనాటి రైతుల దుర్భర,దయనీయ పరిస్థితులు రాతిబండలను కూడా కరిగిస్తాయి. వాళ్ల బతుకులు పశువుల కన్నా అధ్వాన్నం. భూలోక నరకాన్ని మన కళ్ల ముందు దర్శింప చేసిన రచయిత- ‘వ్యవస్థ మారాలి’ అని ప్రత్యేకంగా వ్యాఖ్యానం చేయనవసరం లేదు. దీనిని ‘మృతజీవులు’ అనే పేరుతో కొ.కు. తెలుగు అనువాదం చేశారు. ఇటీవల సంక్షిప్తరూపంలో పీకాక్ క్లాసిక్స్ ఎడిటర్ గాంధీ అనువాదం చేశారు. మార్కెట్లో ఉంది. డాన్ క్విక్సాట్ షేక్స్పియర్కు సమకాలీనుడైన స్పానిష్ రచయిత మిగ్వెల్ ది సెర్వాంటెస్ (1547-1616), తన వృద్ధాప్యంలో రాసిన పెద్ద నవల ఇది. (ఖఠజీౌ్ఠ్ట్ఛను ‘కియోటీ’గా ఉచ్ఛరిస్తారు). మొదటి భాగం 1605లో వెలువడింది. అడ్వెంచర్ పుస్తకాలు చదివి. బుర్ర పాడుచేసుకొని తనూ అడ్వెంచర్లు చెయ్యటానికి బయల్దేరిన అమాయకుడి ‘సాహస’ యాత్రలు చదవలేక పొట్ట చేత పట్టుకుని నవ్వని పాఠకులుండరు. రెండవ భాగం మరో పదేళ్ల తర్వాత వెలువడింది. ఇది చదివినవాళ్లు దీన్నో గొప్ప తాత్విక నవలగా బైబిల్ ఆఫ్ హ్యుమానిటీగా అభివర్ణించారు. ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ప్రతి పాఠకుడూ దీన్ని కనీసం మూడుసార్లు- యవ్వనంలో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో చదవాలంటారు. అస్తిత్వవాద సిద్ధాంతాన్ని (ఎగ్జిస్టెన్షియలిజం) ప్రతిపాదించిన జాన్ పాల్ సార్త్ ్రలాంటి తత్త్వవేత్తలకు ప్రేరణ డాన్ కియోటీ. - ముక్తవరం పార్థసారథి కథాసంధి: సాహిత్య అకాడెమీ ఫిబ్రవరి 7 సాయంత్రం ఐదున్నరకి కడప సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘కథాసంధి’ కార్యక్రమం నిర్వహించనుంది. సుంకోజి దేవేంద్రాచారి తన కథను పఠనం చేసి పాఠకులతో సంభాషిస్తారు. ఫిబ్రవరి 8న అదే ప్రాంగణంలో దళిత రచయిత పాలా వెంకట సుబ్బయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వివరాలకు: 9440222117