హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్
తెలుసుకోదగ్గ పుస్తకం
మేజిక్ రియలిజం అన్న మాటకు స్పష్టమైన నిర్వచనం లేదు. వాస్తవికమైన కథనంతో అద్భుత (మేజిక్) అంశాలను జోడించే ధోరణి ఇది. 1920లలో post expressionist German Art ను విమర్శిస్తూ Franz Roh తొలిసారిగా ఈ మాట వాడాడు. ఆ తర్వాత సాహిత్య విమర్శకు కూడా దీన్ని అన్వయించారు. నిజానికి లాటిన్ అమెరికన్ రచయితలు అనేకులు- క్విరోగా, కార్టజార్, కార్లోస్, ఓనెట్ట్, మురియో రుబియావో, బోర్హెస్ వగైరాలు నిత్యజీవితంలో అద్భుత వాస్తవికతనూ, అద్భుతాలే నిత్యజీవితంగానూ చిత్రించి అనేక కథలు, నవలలు రాశారు. అయితే 1967లో మార్కెస్ఈ Hundred Years of Solitude నవల తర్వాత మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దీని గురించి తెలిసింది. మేజిక్ రియలిజం అంటే యిలా ఉంటుంది అని అంటున్నారంటే లక్షణాలన్నీ ఈ నవలలో ఉండటమే కారణం. ఉదాహరణకు ఈ నవలలో ప్రధానంగా పాఠకులను ఆకట్టుకునే విషయాలు.
1.ఫాంటసీ మిళితమైన వాస్తవిక కథనం 2. సంఘటనల్నీ హేతుబద్ధమే అనే భ్రమ కలిగిస్తాయిగాని లాజిక్‌కు అతీతం. 3. ఇంద్రియ జ్ఞాన పరమైన వర్ణనలు ఎక్కువగా ఉంటాయి. 4. కథలో కాలం సరళరేఖలా సాగదు. వర్తులాకార కాలచిత్రణ వల్ల ఏది ప్రారంభమో ఏది ముగింపో తెలియదు. 5. కార్యకారణ సంబంధాలు తారుమారు కావటం ప్రత్యేకత 6.జానపద కతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 7.ఏకకాలంలో అనేక దృక్కోణాల నుండి కథ నడుస్తుంది. ఏది వాస్తవమో ఏది కల్పనో తెలియదు.
అయితే ఇది అందరూ చదవగలిగినంత సరళమైన పుస్తకమేమీ కాదు. సంక్లిష్టత, శైలీ విన్యాసాలు పాఠకుల మేధస్సును ఏకాగ్రతను పరీక్షిస్తాయి. పైగా ఇది వందేళ్లు జరిగిన కథ. ‘మాకాండో’ అనబడే చిన్నపాటి నగరం గురించిన కథ అనిపిస్తుందిగాని అది లాటిన్ అమెరికన్ దేశాలన్నింటికీ ప్రతీక. ఓ మూలకు విసిరేసినట్టుగా ఉన్న దక్షిణ అమెరికా ఖండాన్ని సంపద కోసం ప్రకృతి వనరుల కోసం అమెరికా ఇతర యురోపియన్ దేశాలు నిర్దాక్షిణ్యంగా అమానుషంగా దోచుకున్న వైనాన్ని హృదయవిదారకంగా చిత్రిస్తుందీ నవల.
కథనం ఎంత గజిబిజిగా ఉన్నా కథను ఒక క్రమంలో చెప్పుకుందాం. హోసె ఆర్కాడియో బుయెండియా, అతడి కజిన్ ఉర్సులా పెద్దలకిష్టం లేని పెళ్లి చేసుకుంటారు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లి అవాంఛనీయమంటుంది ఉర్సులా. పంది తోకలతో పిల్లలు పుడతారని ఆమె భయం. అందువల్ల పెళ్లి తర్వాత కాపురం చెయ్యటానికి నిరాకరిస్తుంది. ఒకనాడు బుయెండియో కోడిపందాల్లో గెలిచి, ఓడినవాడు అవమానించడంతో వాణ్ణి చంపి, ఆ కోపంలోనే ఇంటికి వచ్చి భార్యను బలవంతంగా లొంగదీసుకుంటాడు. మరోవైపు ఆ చచ్చినవాడు ప్రేతంలా మారి దంపతులను వెంటాడి చివరికి వాళ్లు కొత్త నగరం ‘మాకాండో’ను ఏర్పరుచుకున్న దాకా వదలడు.
వీళ్లకిద్దరు కొడుకులు. పెద్దవాడు హోసె ఆర్కాడియో. చిన్నవాడు ఆరెలియానో. ఒకడు బలిష్టుడు. రెండోవాడు పుస్తకాల పురుగు. మేధావి. మాకాండోలోని ఒంటరి జీవితంతో విసుగెత్తిన ఆర్కాడియో సముద్రానికి దారి కనుగొనే ప్రయత్నంలో బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడతాయి. దాంతో ‘మాకాండో’ గురించి ప్రభుత్వానికి తెలిసి తన ప్రతినిధిని పంపుతుంది. పెద్ద కొడుకు ఒకమ్మాయితో సంబంధం పెట్టుకుని గర్భం చేస్తాడు. క్రమంగా కుటుంబం పెరుగుతుంది.
ఒకసారి నగరంలో మహమ్మారి వ్యాపిస్తుంది. నిద్రలేమి, మతిమరుపు దాని ప్రధాన లక్షణాలు. ఈ సమయంలోనే గతంలో వేధించిన ప్రేతం ఆర్కాడియోను వెతుక్కుంటూ వస్తుంది. అతడు రాత్రంతా ప్రేతంతో గడిపి తెల్లవారేసరికి మతిభ్రమించి ఉన్మాదిగా మారతాడు. ఆ గోల భరించలేక అతణ్ణో చెట్టుకు కట్టేస్తారు. ఎవరికీ అర్థంకాని కొత్తభాష మాట్లాడతాడు ఆర్కాడియో.
దూరదేశాలకు వెళ్లిన పెద్దకొడుకు తిరిగి వచ్చి రెబెకాతో ప్రేమలో పడి వెంటనే పెళ్లి చేసుకుంటాడు. చిన్నకొడుకు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ ప్రతినిధికి వ్యతిరేకంగా లిబరల్ రెబెల్స్‌తో జతగడతాడు. వరుస యుద్ధాలు చెలరేగుతాయి. ఫైరింగ్ స్క్వాడ్ ముందు మరణించేవాడేగాని తండ్రి అతణ్ణి రక్షిస్తాడు.
‘ఆధునికత... అభివృద్ధి’ ముసుగు కప్పుకొని వచ్చిన సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు మాకాండోలోని అరటితోటల్ని స్వాధీనం చేసుకుని స్థానిక రైతుల్ని కూలీలుగా బానిసలుగా మార్చివేస్తారు. రైతులు సమ్మె చేస్తారు. కొత్త యజమానుల పక్షం వహించిన ప్రభుత్వం వేలాది మంది రైతుల్ని ఊచకోత కోస్తుంది. కుళ్లిన వాసన భరించలేక ఆ శవాల్ని సముద్రంలోకి విసిరేస్తారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. మాకాండోకు వరదలు వస్తాయి. నగరంతో పాటే బుయెండియా కుటుంబ పతనం ప్రారంభమవుతుంది. దోపిడీ తర్వాత ప్రకృతి బీభత్సానికి నాశనమైన మాకాండో నిర్మానుష్యమవుతుంది. ఇప్పుడక్కడికెవరూ రారు. చివరకు మిగిలిన ఒక్క బుయెండియా ‘ఇదంతా ఇలా జరుగుతుందని ముందే జోస్యం చెప్పారు’ అంటాడు.
కథలో మనకు కనిపించేవి వరుసయుద్ధాలు, వలసవాదుల దోపిడీ, కుట్రలు, స్థానికుల ప్రతిఘటనలు. శతాబ్దాల లాటిన్ అమెరికన్ దేశాల రక్తచరిత్రకు కథారూపం ఈ నవల- ఒన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్.
- ముక్తవరం పార్థసారథి
గేబో
కొలంబియాలో పర్వతాలకూ కరీబియన్ సముద్రానికీ మధ్యనున్న అరకాటకాలో జన్మించాడు గేబ్రియల్ గార్సియా మార్కెస్ (గేబో). తండ్రి టెలిగ్రాఫ్ ఆపరేటర్. పేద సంసారం. పన్నెండు మంది పిల్లల్లో పెద్దవాడు గేబో. 1955లో తొలికథాసంకలనం ‘లీఫ్‌స్టార్మ్ అండ్ అదర్ స్టోరీస్’ ప్రచురించాడు. ఆ తర్వాత పారిస్‌లో అయిదేళ్లున్నా క్యూబన్ విప్లవం తర్వాత లాటిన్ అమెరికాకు తిరిగొచ్చి జర్నలిస్టుగా పని చేశాడు. లాటిన్ అమెరికన్ డిక్టేటర్ల గురించి రాసిన ‘లవ్ ఇన్ టైం ఆఫ్ కలరా’ ఈయన ముఖ్య నవల. పలు సినిమాలకు స్క్రిప్ట్ రచయితగా కూడా పని చేశాడు గేబో.
‘అయిడియాలు, ఇతివృత్తం ఆధారంగా నేను కథలు రాయలేదు. రచనకు స్పందన మనసులో ఏర్పడిన దృశ్యం నుండి వస్తుంది. అది క్రమంగా పెరిగి ఒక కాన్వాసులూ ఒక సినిమా రీలులా నా కళ్ల ముందు కదులుతుంది. అదే కథ’ అంటాడు గేబో. 1950లోనే ఒన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ రాయాలనుకున్నాడట. తన అమ్మమ్మ కథలు చెప్పడం విని నవలకు అదే టోన్ బాగుంటుదనుకున్నాడు. ‘ఆమె దెయ్యాలు భూతాల గురించి చెప్పినా అదంతా నిజమేనని నమ్మించేది’ అంటాడు. చివరకి 1965లో ఈనవలా రచన ప్రారంభించి పద్దెనిమిది నెలల అవిశ్రాంత కృషితో అప్పుల మీద అప్పులు చేసి రాతప్రతిని పబ్లిషర్‌కు పంపటానికి పోస్టేజి కూడా కొనలేని దశలో ముగించాడు. మొత్తం మీద అచ్చయిన వెంటనే చరిత్ర సృష్టించింది ఒన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్. నవలా రచనలో కొత్తశకం ప్రారంభమైంది అన్నారు.