
న్యూఢిల్లీ/కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే పలు వర్గాలను ఆకర్షించడం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో కూడా కాషాయ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. బెంగాల్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందింది. ఎన్నికలకు ముందు అధికార తృణమూల్ పార్టీకి చెందిన నేతలు అధిక సంఖ్యలో కమలం గూటికి చేరుకున్నారు. తాజాగా రాజకీయ నాయకులతో పాటు దాదాపు 13 మంది బెంగాల్ ప్రముఖ నటీమణులు ఢిల్లీకి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్నారు. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆధ్వర్యంలో అధికారికంగా పార్టీలో చేరారు.
ఈ క్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ...రిషి కౌశిక్, పార్నో మిత్రా, కాంచన మెయిత్రా, రూపా భట్టాచార్య అంజనా బసు, కౌశిక్ చక్రవర్తి వంటి పలువురు టీవీ స్టార్లు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. బెంగాల్‌లో ప్రస్తుతం సీఎం మమతా బెనర్జీ ఉద్రిక్తతలు సృష్టిస్తున్న తరుణంలో వీరంతా సాహసం చేసి మరీ బీజేపీలో చేరారన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు వెరవక బీజేపీలో చేరిన నటీమణులకు శిరసు వహించి వందనం సమర్పించాలంటూ ప్రశంసలు కురిపించారు. కాగా సీఎం మమతా బెనర్జీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో సినిమా నటులకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. దీదీ అండలతో లోక్‌సభ బరిలో దిగిన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ అఖండ విజయం సాధించి పార్లమెంటులో తమ గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తారల చరిష్మాను వాడుకునేందుకు సమాయత్తమవుతోంది. ఇక 2021లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment