
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల అధికారాలను, రైతులకు భూమిపై హక్కును హరించేవిధంగా ఉన్న 39, 42 జీవోలను ఉపసంహరించుకోవాలని అఖిలపక్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రైతు జేఏసీ హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(టీపీసీసీ అధ్యక్షుడు), ఎం.కోదండరాం(టీజేఏసీ చైర్మన్), వెంకటరెడ్డి(సీపీఐ), గోలి మధుసూ దన్‌రెడ్డి(బీజేపీ), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), కె.గోవర్ధన్ (న్యూ డెమొక్రసీ), రచనారెడ్డి(హైకోర్టు న్యాయవాది), వివిధ రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల హక్కులను కాలరాసేవిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
‘రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అబ్బ సొత్తు, జాగీరు కాదు’ అని అన్నారు. భూవివా దాల్లో రైతు సమన్వయ సమితులు ఎలా జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు. భూ రికార్డుల సవరణకు అధికారం ఇవ్వడం వల్ల రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుం దన్నారు. స్థానికసంస్థల అధికారాల కోసం అక్టోబర్ 3న అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్ర మాలు చేపడతామని చెప్పారు. పట్టాదారులతో పాటు కౌలు రైతులందరికీ పెట్టుబడి కోసం రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే మార్కెట్ ఇంటర్‌వెన్షన్ కోసం 1,000 కోట్లు కేటాయిస్తామని హామీ నిచ్చి అమలు చేయలేదని ఉత్తమ్ విమర్శిం చారు.
కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థకు తూట్లు పొడిచే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. గ్రామ పెత్తం దార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థలకు జీవంపోసి, వాటి ద్వారా గ్రామాల్లో దొరల పాలన తీసుకురావాలని కుట్రలు చేస్తు న్నారని విమర్శించారు. జీవో 39కి వ్యతిరేకంగా అక్టోబర్ 3న గ్రామ స్థానిక సంస్థల అధికారాల కోసం వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. భూసమస్యను పరిష్కా రంæచేయాలంటే సమగ్ర భూసర్వే చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.
రావుల చంద్రశే ఖర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుసమన్వయ సమితి పేరుతో స్థానిక సంస్థల అధికారాలను హరించే కుట్రకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల సమ స్యల నుంచి దృష్టిని మళ్లించడానికి కొత్త సమస్యలను తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. భూరికార్డుల సవరణ పేరుతో రెవెన్యూశాఖ ఆధీనంలో ఉండే భూములను టీఆర్‌ఎస్ కార్యకర్తల చేతుల్లో పెట్టే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ సమస్యలపై గవర్నరుకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కార్య క్రమానికి గవర్నర్ వెళ్లడాన్ని ఖండించారు.