
అధికారం ఎక్కడ ఉంటే ఆయన అక్కడే మకాం వేస్తారు. నైతిక విలువలను ఏమాత్రం పట్టించుకోరు. దివంగత నేత వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనవద్దే ఉన్నారు. తరువాత టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన వైఎస్ జగన్‌ను కాదని చంద్రబాబు పంచన చేరారు. అధికారం పోయాక ఆయనను వదిలేందుకు వెనుకాడలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ఎలాగూ పార్టీలో చేర్చుకోరని ఇప్పుడు ఆయన కన్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పడింది. టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధ్దమయ్యారు. ఆయనే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.
సాక్షి ప్రతినిధి కడప: టీడీపీలో చేరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతపైనా.. ఆ పార్టీ నేతలపై అవాకులు చెవాకులు పేలిన ఆదినారాయణరెడ్డి గత ఎన్నికల్లో జమ్మలమడుగుతోపాటు కడప పార్లమెంట్ ఓటర్లు కొట్టిన దెబ్బకు బెంబేలెత్తారు. దీంతో ఎటూ పాలుపోక ఆయన చూపు బీజేపీ వైపు మళ్లింది. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతోనే బీజేపీలో చేరేందుకు సిద్ధ్దమయ్యారని తెలిసింది. అందుకు అనుగుణంగానే ఆయన ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయనేతతోనూ సంప్రదింపులు జరిపారు. బీజేపీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించిన ఆది బీజేపీ ముఖ్యనేతలను కలిసేందుకు గురువారం ఢిల్లీ వెళ్లారు. నేడోరేపో బీజేపీలో చేరనున్నారు. ఆది మినహా ఆయన అనుచరగణం నామమాత్రంగా కూడా ఆ బీజేపీలో చేరేందుకు సుముఖంగాలేరు. ముఖ్య అనుచరులు, సమీప బంధువులుకూడా ఆయనతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. ఆదినారాయణరెడ్డి అధికారంకోసమే బీజేపీలో చేరుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటినుండి ఆయనది నైజమని నైజమని మాజీమంత్రి వ్యవహార శైలి తెలిసిన వారు పేర్కొంటున్నారు. కొన్నాళ్లుఫ్యాక్షన్ రాజకీయాలను నడిపేందుకు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారన్న విమర్శలున్నాయి. కింద క్యాడర్ ఏమైపోయినా ఆయనకు పట్టలేదు.
ఎన్నో కుటుంబాలు రోడ్డున పడినా తీరు మారలేదు. ఆదినారాయణరెడ్డి కుటుంబం మొదటినుండి దివంగత నేత వైఎస్‌కు అనుకూలంగా ఉండేది. 2004,2009లో వైఎస్ అనుచరుడిగానే జమ్మలమడుగు నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. తరువాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీంలో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగు నియోజకవర్గంతో బలమైన అనుబంధం ఉంది. ఆ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్దేశించేది వైఎస్ కుటుంబ అభిమానులే. అందుకే వైఎస్ కుటుంబంతో ఉన్నన్నాళ్లూ ఎమ్మెల్యే గా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరగానే ఆ నియోజకవర్గంలో తాను మద్దతు పలికిన. ఎమ్మెల్యేతో పాటు స్వయంగా పోటీకి దిగిన కడప పార్లమెంట్ నుండి కూడా ఓటమి చెందాల్సి వచ్చింది. ఎన్నికల తరువాత తన బలమేమిటో ఆదికి అవగత మైంది. తాను నమ్ముకున్న టీడీపీ ఘోరపరాభవం చెందడం, రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేసినా భారీ ఓటమి చెందడంతో దిక్కు తోచలేదు. తనను కాపాడతాడనుకున్న చంద్రబాబు నిండా మునగడంతో ఆది దిగ్భ్రాంతి చెందారు. ఎన్నికల తరువాత ఆయన ఉనికి లేదు. టీడీపీపై వ్యతిరేకత కంటే æవైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడటంపై ఆగ్రహం పెంచుకున్న జనం ఆయనకు ఓటుతో బుద్ది చెప్పారని పరిశీలకుల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ దగ్గరకు రానిచ్చే అవకాశం లేకపోవడంతో ఆదినారాయణరెడ్డి టీడీపీ షెల్టర్ జోన్‌గా సెలక్ట్ చేసిన బీజేపీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన బీజేపీ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు.
బాబు మ్యాచ్ ఫిక్సింగ్ :
రాష్ట్రంలో ఓటమిపాలై మనుగడకోసం తంటాలు పడుతున్న టీడీపీనాయకులకు బీజేపీ షెల్టర్ జోన్‌గా మారింది. సాక్షాత్తూ చంద్రబాబే టీడీపీ కీలక నేతలందరినీ బీజేపీలోకి పంపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరేముందు టీడీపీ నేతలు చంద్రబాబును కలుస్తుండడమే ఇందుకు సాక్ష్యం. రాజ్యసభ సబ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఇలానే బీజేపీలో చేరారు. వారు పార్టీని వీడే ముందు చంద్రబాబు ను కలిశారు. ఆయనకు చెప్పే వెళుతున్నామని కూడా ప్రెస్ కు చెప్పడం గమనార్హం. ఆతరువాత టీజీ వెంకటేశ్ సైతం ఇదే చెప్పారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి కూడా ఇటీవలే చంద్రబాబును కలిశారు. ఆయన సూచనమేరకే బీజేపీలో చేరుతున్నారు. చంద్రబాబే దగ్గరుండి టీడీపీ కీలక నేతలను బీజేపీలోకి సాగనంపుతున్నట్లు అవగత మౌతోందనే విమర్శలున్నాయి. ఇన్నాళ్లు పార్టీలో పదవులు అనుభవించి, అన్నీ తామై నడిపించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీని వీడి వెలుతున్నా టీడీపీ నేతలెవరూ విమర్శిస్తున్న దాఖలాలు లేవు. అందుకే ఇదిమ్యాచ్ íఫిక్సింగ్ అని జనం వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment